Tuesday, 22 September 2026

మానవత్వ సరిహద్దుల్లో…

 

 హాన్ కాంగ్ దక్షిణ కొరియాలో గ్వాంగ్జు ప్రాంతంలో జనించింది. తనకు పది ఏళ్ళ వయసులో రాజధాని సోల్ కు  వలస వెళ్లింది. ఆమె తండ్రి కూడా ఒక రచయిత. మొదట కొన్ని కవితలు “లిటరేచర్ అండ్ సొసైటీ “ పత్రికలో వచ్చాయి.

ఆమె రచనలలో “ది వెజిటేరియన్”, “ది  వైట్ బుక్” , “హ్యూమన్ యాక్ట్స్” , “వి డు నాట్ పార్ట్”, “గ్రీక్ లెసన్స్”, “ ది విండ్ బ్లోస్, గో” అనేవి ముఖ్యమైనవి .హాన్ కాంగ్ 2024 లో   సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని పొందారు.

 ఆమె రచనలు చారిత్రకంగా బాధాకర పరిస్థితులు , అదృశ్య నియమాలతో ఘర్షించి మానవ జీవిత సున్నితత్వాన్ని బయటపెడతాయని నోబెల్ కమిటీ ప్రశంసించింది. 

దక్షిణ కొరియా గతంలో  1961 నుంచి 1987  దాకా సైనిక నియంతల అమానుష చర్యలలో నలిగిపోయింది. దేశాన్ని ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మార్చే పేరుతో మొదట పార్క్ చున్గ్  హి,  తర్వాత వచ్చిన చున్ దు హాన్ లు తమ నిరంకుశ పాలన సాగించారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, పత్రికా స్వేచ్ఛను హరించి విశ్వవిద్యాలయాలను మూసివేసి ,రాజకీయ కార్యకలాపాలను నిషేధించారు .ఈ నేపథ్యంలో 1980లో గ్వాంగ్జు ప్రాంతంలో  తలెత్తిన తిరుగుబాటులో ఎందరో విద్యార్థులు, సామాన్య పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు.

హాన్ కాంగ్ నవల “హ్యూమన్ యాక్ట్స్” శీర్షికలోనే ఎంతో అర్థముంది. ఆలోచనారహిత మనుష్యులు తమ తోటి దేశ వాసుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తారనేది రచయిత్రి గుండెను నలిపివేసే,  కవితాత్మక శైలిలో రచించారు. నవలలో కథనం  పలు పాత్రలు -  ఒక విద్యార్థి నిరసనకారుడు, ఒక శవం ,ఒక పాత్రికేయులు, ఒక ఖైదీ, ఒక తల్లి, చివరగా రచయిత్రి స్వరాల నుంచి సాగుతుంది, గత జ్ఞాపకాలు ,వర్తమానం,  కలలు , కవితలు,  కవితాత్మక వర్ణనల ద్వారా నవల ముందుకు సాగుతుంది. భీకర సంఘటనలను రచయిత్రి వర్ణించిన తీరు   పాఠకులను పూర్తిగా  కుదిపివేసి ,ఒక చారిత్రక తాత్విక ఆలోచన విషాద సాగరంలో ముంచుతుంది. అయినా చివరకు జీవితం ఆగదు అనే భావన కలుగుతుంది.

    కొరియన్ సంస్కృతిలో భౌతిక కాయానికి హింస జరిగితే దాని లోని ఆత్మకు కూడా భంగం జరిగినట్లే. రచయిత్రి తన నవలలో  నిరసనకారుల భౌతిక కాయాల పట్ల సైనికుల నిర్లక్ష్యం, నిరాదరణలను  కళ్లకు కట్టినట్లు  వర్ణిస్తుంది.

    నవలలో డాంగ్ హో అనే హైస్కూల్ విద్యార్థి నిరసనకారుల  శవాలను వారి వారికి అప్పగించేంతవరకు కాపలాగా ఒక జిమ్నాజియంలో ఉంటాడు. తనకు తెలిసిన, తన ఇంట్లోనే కొంతకాలం నివసించిన జాంగ్ డే, బుల్లెట్ దెబ్బకు కూలిపోవడం, తాను భయంతో కొయ్యబారి పోవటం ,అతని సోదరి జాంగ్ మీ ఒక శ్రామిక మహిళ గా తన తమ్ముడి చదువు కోసం సంపాదించడం, తాను కూడా చదువుకోవడానికి కష్టపడటం ,  తన తల్లి సోదరుడు ఇద్దరు వచ్చి ఇంటికి రమ్మనీ కోరినా  డాంగ్ హో వెళ్లడు. తోటి విద్యార్థి నిరసనకారుల  శరీరాలపై బాయినెట్ గాయాలు చూసి కలవరపడతాడు. జాంగ్ డే నీ కాపాడలేకపోవటంలోని పిరికితనానికి తన్నుతాను నిందించుకుంటాడు .అయితే తర్వాత డాంగ్ హో కూడా మరణించిన  విషయం మనకు తెలుస్తుంది.

   శవాలకు , ఆత్మలకు మాటలు వస్తె  అవి కూడా కథను వర్ణిస్తాయి . జాంగ్  డే ఆత్మ శవాల కుప్పలను, పురుగులు పట్టిన వారి  దేహాలను గుర్తు చేసుకుంటుంది. శవాలగుట్ట అట్టడుగున పడి ఉండి మధనపడుతుంది. తనను, తన సోదరిని ఎందుకు చంపావు అని ప్రశ్నిస్తుంది. కడిగిన శవాన్ని చూసి మురికి శవం సిగ్గుపడుతుంది . ఆ ఆత్మకు  తన అక్కతో గడిపిన పాత రోజుల జ్ఞాపకాలు,తను పెరగటం, పెళ్ళి , అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం లాంటి ఊహలు .   జాతీయగీతం పాడుతూ విరిగిన వారి  శవాల గుట్టను  సైనికులు దహనం చేయగానే జాంగ్ డే ఆత్మ తన ఇంటికి ఎగిరిపోదామనుకుంటుంది .కానీ అక్కడ అక్క లేదు .  డాంగ్ హో శరీరం నుంచి ఆత్మ వేరైనట్లు కూడా దానికి తెలిసి వెళ్లాలనుకుంటుంది. కానీ కదలలేక పోతుంది.

థనం ముందు ముందుకు సాగినప్పుడు ఓ పాత్రికేయురాలు తాను తిన్న చెంప దెబ్బలని గుర్తు చేసుకుంటుంది .అది 1985 వ సంవత్సరం. ఒక అజ్ఞాత అనువాదకుడిని కలిసినందుకు కానీ కిమ్ యూన్ సోక్  చెంప దెబ్బలు తింటుంది .అంతకు ముందు యూనివర్సిటీ క్యాంటీన్లో మఫ్టీ పోలీసులు ఆమె చేతిలో పోస్టర్ను చూసి జుట్టుబట్టి ఈడ్చినపుడు, సెన్సార్ ఆఫీసులో రచయితకు  ప్రచురించకుండా పారితోషికం ఇవ్వటం, పత్రికలపై సెన్సార్షిప్, అధికారుల దౌర్జన్యం పుస్తక ప్రచురణకు అడ్డంకులు ,సంపాదకుల లౌక్యం, విద్యార్థుల వీరోచిత పోరాటం,  వారి సంక్షేమానికై కుటుంబ సభ్యుల ఆరాటం ,శవాలను చెత్త బండ్లలో తరలింపులో సైనికులు ప్రదర్శించే ఉదాసీనత కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని చూసిన పాత్రికేయురాలి మదిలో మానవత్వం పై సందేహాలు చెలరేగుతాయి. నాటికను చూస్తున్న ఆమెకు డాంగ్ హో గుర్తుకొస్తాడు. కాల్చే కన్నీరు ఆమె బుగ్గల పై నుంచి  కారుతుంది.

 

తరువాత చిత్రహింసల పాలైన ఖైదీ ద్వారా కథనం సాగుతుంది. విద్యార్థులు పడిన చిత్ర హింసలు,  తాను కిమ్ జిన్ సూ ఇద్దరూ ఇరుకు గదిలో పిడికెడు ఆహారం కోసం పరస్పరం ఆబగా చూసుకోవడం , కోర్టులో సైతం ఖైదీలు తల దించుకొని ఉండటం,   కిమ్ యాంగ్ చే అనే బాలుడు పిచ్చివాడు అవుతాడు. మనిషి ప్రాధమికంగా క్రూరుడా, ఆత్మగౌరవం ఒక మిధ్యనా,మనిషి ఒక కీటకమా, మృగమా లేక మాంసం ముద్ద అనే ప్రశ్న . తన సొంత మానవత కోసం సత్యంతో పోరాటం. చావు ఒకటే విముక్తి మార్గమా?

   లిమ్ సోన్ జూ అనే వనిత డాక్యుమెంట్ రక్షణ ఉద్యోగంలో ఉంటుంది. గత చేదు అనుభవాల.వల్ల  ఆమెది  ముభావ స్వభావం .ఒక పరిశోధనా గ్రంథంలో ఎనిమిదవ  సాక్షిగా ఉండమని ఒక పరిశోధకుడు ఆమెను అడుగుతాడు .ఆమె అయస్టంగానే అంగీకరించి ఆ గ్రంథంలో అదివరకే నమోదైన సాక్షాలను చదువుకతుంది.వాటిలో నిరసనకారులపై జరిగిన దౌర్జన్యాల సాక్ష్యం , కార్మిక హక్కుల కోసం పోరాడే బాలికలపై జరిగిన దాడి గురించిన సమాచారం కూడా ఉంటుంది.

 గ్వాంగ్జూ ప్రాంతంలో  తిరుగుబాటు జరిగిన మూడు దశాబ్దాల తరువాత ఒక తల్లి కళ్ళ ద్వారా,  రచయిత్రి ద్వారా  ఆనాటి సైనికుల  గురించి ,కాలం అడుగుజాడల్లో ఇంకిన రక్త చారికలను, హింసా కాండను  కవితాత్మక శైలిలో హాన్ కాంగ్ రచించారు.

 కొడుకు కోసం మార్కెట్  సందుల్లో అలుపెరగకుండా తిరిగిన అమ్మ. అతన్ని  పూడ్చి వేసే ముందు తర్వాత తట్టుకోలేక అక్కడి గడ్డి తిని కక్కేసిన అమ్మ . పాలి పోయిన  తమ్ముడి మోము చూసి పగతో రగిలిన అన్న. పర్యవసానం గురించి భీతితో తల్లి.  తమ్ముడిని రక్షించలేదని అపరాధ భావనతో  తన్నుకునే సోదరులు. చూసినా చలించని  తల్లి . ప్రాంతీయ ఆఫీసు ముందు  చావుకు తెగించి నిలిచిన విద్యార్థులు. కనిపించని పిల్లల కోసం , వారిని పూడ్చిన  స్థలం కోసం విరామ మెరుగక తిరిగే తండ్రి. గ్వాంగ్జూ ప్రతి దేశంలో ఉంది.చనిపోయిన పిల్లల కోసం తల్లుల ధిక్కారం. వారిని బంధించి ఊరికి దూరంగా వదిలేసే అధికార మదం. తన పాలు తాగిన కుర్రాడి మాటలు వచ్చిన, నడక నేర్చిన జ్ఞాపకాలు. దూరం నడకలో ఎండలోనే ఉందామని మారాం చేసే బాలుడు డాంగ్ హో. ఒక తల్లి  అనంత శోకాన్ని  అక్షరాలలో  అందించిన  ఈ నవల కళాత్మక వలకు చిక్కని పాఠకులు ఎవరూ ఉండరు!

  రచయిత్రి హాన్ కాంగ్ మానవత సరిహద్దుల్లో వడలి రాలిపోయిన కుసుమాల గురించి, దౌర్జన్యాల పట్ల  కొందరు సైనికుల అయిష్టత  గురించి కూడా రాశారు. ఈ బాధామయ జ్ఞాపకాల వల్ల ఒక తల్లికి కాలం ఆగింది. మరొకరికి కాలం సాగుతూనే ఉంది .బాధితులు నిరంకుశ పాలనకు ఎదురుగా నిలబడ్డారు వారి కళ్ళు చివరి క్షణాల్లో చూసాయి దాడులు చేసే వారిని. క్షణాలు కళ్ళు తెరిస్తే హింస పుట్టింది.ఒకేసారి పోయినవారిది అదృష్టం. నవల  చివరలో రచయిత్రి మంచులో కూరుకుపోయిన సమాధుల  ముందర  కొవ్వొత్తులు వెలిగిస్తుంది. నవల లో చివరి వాక్యం: “ నేను చూశాను మూగగా చరిస్తున్న  జ్వాల అంచుల వైపు,  ఒక పక్షి కాంతిమయ రెక్కల్లా వెలుగుతున్న దాని వైపు.”

 హాన్ కాంగ్ తన నోబెల్ ఉపన్యాసంలో ప్రేమ, హింసల గురించి తనలో సదా రేకెత్తిన ప్రశ్నలు గురించి చెప్పారు. ప్రేమ మన హృదయాల్ని కలిపే బంగారు దారమని చెప్పారు.తాను రాసేటపుడు మొత్తం శరీర భావనలు, అనుభూతుల తో తాదాత్మ్యం చెంది రాస్తానని , ఆ విద్యుత్ తరంగం పాఠకులను తాకినపుడు తాను  కదిలిపోతానని  హాన్ కాంగ్ చెప్పటం ఆమె విశిష్ట రచనా శైలి రహస్యం చెబుతుంది.

 (published on 27/04/26  in aneka page in Telugu Prabha daily) 


    

ప్రకృతి మాత కోసం ఘన పోరాటం

 

                          

అమితవ్ ఘోష్  గొప్ప నవలాకారుడు, వ్యాస రచయిత, పర్యావరణ పరిరక్షణ కంకణాబద్ధుడు. 2018 లో భారత దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును తొలి సారి  గెలుచుకున్న భారతీయ ఆంగ్ల రచయిత. సాహితీ రంగంలో సాహిత్య అకాడమీ, ఆర్థర్ సీ క్లార్క్ అవార్డులతో పాటు, పద్మశ్రీ అవార్డు సైతం సాధించారు. 2009లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఫెలో గా ఎంపిక అయ్యారు.

 అమితవ్ ఘోష్ ప్రఖ్యాత నవలలు , ది షాడో లైన్స్, ది హంగ్రీ టైడ్, ది కలకత్తా క్రోమోజోమ్, ది సర్కిల్ ఆఫ్ రీజన్ వంటివి ఉన్నాయి. ఆయన నాన్ ఫిక్షన్ రచనల్లో ది నట్మేగ్స్ కర్స్, స్మోక్ అండ్ యాషెస్, వైల్డ్ ఫిక్షన్స్ తదితర రచనలు ఉన్నాయి. అతని శైలి అగ్ని సరస్సులో వికసించిన వజ్రంలా , హృదయాన్ని కదిలిస్తూ , అద్భుతమైన భాషా పటిమతో పాఠకుని అజ్ఞానాన్ని  వదిలిస్తూ  వారిని కార్యోన్ముఖం చేస్తుంది. నల్లమందు వ్యాపారం, వలసవాద చరిత్ర గురించిన నవలాత్రయం సీ ఆఫ్  పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ మొదలగునవి ఆయన ఐతిహాసిక  రచనా స్థాయికి సాక్ష్యంగా నిలుస్తాయి. అతని సంక్లిష్టమైన కథన రీతులు  భారత్, ఇతర దక్షిణాసియా దేశాల్లోని వ్యక్తిగత, జాతీయ అస్తిత్వాలను పరిశోధనాత్మకంగా ప్రదర్శిస్తాయి.ఆయన రచన “మహా అస్తవ్యస్తత” ( The Great Derangement ,2016)పర్యావరణ విధ్వంసం గురించి , భూమాత రక్షణకై సామాన్యులు, మాన్యులకు కావలసిన నిబద్ధత గురించి చెబుతుంది.

 ప్రపంచ పర్యావరణ సంక్షోభంలో ఎక్కువ బాధ పడేది ఆసియా దేశాలు, మరీ ముఖ్యంగా వాటిల్లోని పేద ప్రజానీకం. బంగ్లాదేశ్ లో 1991లో భోలా తుఫాను మూడు  లక్షల మందిని మింగేసి పదిహేను లక్షల మందినీ నిర్వాసితులను చేసింది.అదే ఏడాది మరో తుఫానులో ఒక లక్షా ముప్పై ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 90 శాతం మహిళలే.

సముద్ర మట్టంలో గణనీయమైన పెరుగుదల వల్ల భారత్ లో ఐదు కోట్ల మంది, బంగ్లాదేశ్ లో 7.5 కోట్ల మంది, వియత్న్ జనాభాలో పది శాతం మంది నిర్వాసితులయ్యే అవకాశముంది. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశంలో 24 శాతం భూభాగం, పాకిస్తాన్లో ఒక లక్ష ఎకరాలు నిర్జన ప్రదేశాలు అవుతుండగా చైనాలో 2016 నాటికి  ఏటా 65 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

 హిమాలయ పర్వతం కరిగి వచ్చే మంచు నదుల వల్ల  2008లో బీహార్లో కోసీ  నదికి , 2010లో సింధు నదికి వరదలు వచ్చాయి. భవిష్యత్తు లో ఈ మంచు నదుల వల్ల నీటి కొరత ఏర్పడి దక్షిణ, సౌత్ఈస్ట్ ఆసియాలో యాభై కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ముప్పు ఏర్పడవచ్చు. ఆసియా దేశాల్లో ఆధునిక  జీవన శైలి అల్ప సంఖ్యాకులకి మాత్రమే పనికొచ్చేది. ఐరోపా, ఆసియా మధ్య పరస్పర చర్య ఫలితమే ఈ ఆధునికత.17 వ శతాబ్దిలో భారత్లో ముసిం, జైన, హిందూ మేధావులు ఎంతో మేధో  కృషి చేశారు.

 చైనాలో సహజ వాయువు, మయన్మార్ లో ఆయిల్ పరిశ్రమల చారిత్రక అభివృద్ధి గురించి చెబుతూ అమితవ్ ఘోష్ రాస్తూ పాశ్చాత్య దేశాల ఏకైక ఆధునికతను విమర్శించి బహుళ ఆధునికతలు ఉన్నాయని రాస్తాడు. ప్రపంచంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి, కార్బన్ ఆర్థిక వ్యవస్థ ప్రారంభానికి భారత దేశ పాత్రను వివరిస్తాడు. బొంబాయికి చెందిన వాడియా కుటుంబం ఐరోపా, అమెరికాల్లోని నౌకా నిర్మాణ పరిశ్రమ తో గొప్పగా పోటీ పడగలిగింది. బ్రిటీషు వారి 1835 చట్టం.వాల్ భారత్ నౌకా నిర్మాణ పరిశ్రమ ప్రగతి కుంటువడి పోయింది.  సామ్రాజ్య వాద పాశవిక బలం మూలాన ఆసియా సంపద, అధికారం పోగొట్టుకుని వలస ప్రజలకు సోమరితనం బిరుదు వచ్చి చేరింది. భారత్ దేశంలో పారిశ్రామికీకరణ ముందుగా జరిగుంటే సంక్షోభం కూడా ముందుగానే వచ్చేది. ఇక్కడ మహాత్మా గాంధీ, చైనాలో తావోయిస్టులు,  బౌద్ధులు, కన్ఫ్యూషియస్ మత అనుయాయులు, మయన్మార్ లో యూ థాంట్ ( 1961- 71) ల మధ్య ఐ రా స ప్రధాన కార్యదర్శి) మొదలగువారు పారిశ్రామికీకరణ, వినియోగవాదాలను వ్యతిరేకించారు. ఈ నాడు ఆసియా వాతావరణ సంక్షోభాన్ని నిర్లక్ష్యం చేసే స్థితి ఏ మాత్రం లేదు.

 వాతావరణ మార్పులు స్వేచ్ఛా భావానికి తీవ్ర అడ్డంకిగా మారాయి. జ్ఞానోదయ యుగం(ఎన్లైటెన్మెంట్ era)లో ప్రకృతిని జయించని దేశాలు చరిత్ర ప్రాంగణం చేరలేదని లేదా ఆవల ఉన్నాయని అనుకునేవారు.ఆసియా దేశాలు సైతం పాశ్చాత్య నమూనాను అనుసరిస్తూ,  ఈ దేశాల రచయితలు రాజకీయ నిబద్ధత తో , పురోగతిపై మక్కువతో  సర్రియలిజం, ఎక్స్ప్రెషనిజం, పోస్ట్ కలోనియల్, పోస్ట్ మోడర్న్ వాదాలు స్వీకరించారు. దక్షిణాసియా శక్తి సామర్థ్యాలు అస్తిత్వం, మతం, కులం, జాయిన్, భాషా, లైంగిక హక్కులపై కేంద్రీకరించారు.సాహిత్యం, రాజకీయాలు ఆత్మ ఆవిష్కరణ మార్గాలుగా చూశారు కానీ నూతన భవిష్యత్తు దర్శించలేకపోయారు.

 బొగ్గు స్థానంలో ఆయిల్ వచ్చి అమెరికా, బ్రిటన్ దేశాల శిష్ట వర్గాలకు అదృశ్య శక్తి వచ్చింది. ఇంటర్నెట్లో భావాల ఘర్షణ ఉన్నా నిజమైన అధికారం డీప్ స్టేట్ ( కార్పేటు, పాలనా వ్యవస్థల మిశ్రమానికి ) హస్త గతం అయింది. ప్రత్యామ్నాయ రాజకీయ భావి మాయమై  మార్కెట్ శక్తుల దురాక్రమణ , హింసలకు దారి తీసింది. వ్యక్తిగత ఊహ నుంచి రాజకీయవేత్తలు, కళాకారులు బయట పడని పక్షంలో భావి తరాల నిందార్హత కు గురవుతాయి.

 ఆంగ్లో ప్రాంత దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా లాంటివి వాతావరణ  సంక్షోభాన్ని రాజకీయంగా కాదన్నా  సైనిక రంగంలో అంగీకరిస్తున్నాయి. ఈ సమస్య దేశీయ మరియు అంతర్జాతీయ సమస్య కూడా.అలా కాదంటే అది జాతీయ రాజ్య పరిణామ పథాన్ని తిరస్కరించడమే కానీ మరొకటి కాదు.

  ప్రపంచంలో ఆధిపత్య దేశాలు  నేటివ్ ప్రపంచ వ్యవస్థను నిలబెట్టాలని సైనిక దురాక్రమణ, సరిహద్దుల మూసివేత, రాజకీయ, వాతావరణ శరణార్థుల ను రానీయక పోవడం చేస్తున్నాయి. అధికారాన్ని తిరిగి పంపిణీ చేసే భాష కూడా అదృశ్యమైంది. నిజానికి  ఈ సంక్షోభ పరిష్కారం లో అభివృద్ధి చెందిన దేశాలకు మన కన్నా మరింత బాధ్యత ఉంది.

ఈ సంక్షోభ వ్యతిరేక పోరులో జనించే నవ తరం ప్రకృతి, ఇతర ప్రాణులతో తన సాన్నిహిత్యం గుర్తిస్తుంది. పాత కొత్తల మేలు కలయిక తో నూతన కళా సాహిత్యాలను సృష్టిస్తుంది. జాతీయ రాజ్యాలు వాతావరణ వ్యతిరేక ప్రజా ఉద్యమాలను జాతీయ భద్రతా కోణంలో చూస్తుంటే  భూమాతని రక్షించే పోరాటంలో జీవిత పవిత్రతను  గుర్తించే శక్తులను అన్నింటినీ కలుపుకుని ముందుకు సాగాలి.

( published in June 5,2026 in aneka page  in Telugu Prabha daily) 


 

 

 

 

 

 

చివరి బహుమతి లో వలస జీవిత చిత్రం

 

             “చివరి బహుమతి” లో వలస జీవిత చిత్రం

 

    అబ్దుల్ రజాక్ గుర్నా(1948 -)  బ్రిటిష్ వలస పాలనలోనీ టాంజానియా జాంజీబార్ లో 1948లో  జన్మించాడు. 1964లో  బ్రిటన్ కు శరణార్థిగా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ కెంట్ లో చదివి  అక్కడే ప్రొఫెసర్ గా  ‘పోస్ట్ కలోనియల్ స్టడీస్’ విభాగంలో   పని చేశారు.  ఆయన పది నవలలు , ఎన్నో కథలు  తన మాతృభాష స్వాహిలిలో కాక   ఇంగ్లీషులోనే రాశారు అరబిక్, పర్షియన్ కవిత్వం , ఖురాన్ లోని సురాలు , షేక్స్పియర్ నుంచి వి ఎస్  నాయిపాల్ దాకా ఉన్న ఇంగ్లీష్ సాహిత్య  సంప్రదాయ ప్రభావం ఆయన రచనల మీద ఉంది.

 

 

    అబ్దుల్ రజాక్ గుర్నా రచనల్లో చిత్రించిన  ఆఫ్రికాలోని  నూతన స్వతంత్ర దేశాల్లో అధికారం , అవినీతి మధ్య సంబంధంలో  వలసవాద వారసత్వ పాత్ర  ఉందని  గుర్నా భావించారు.వలసవాదులు నూతన స్వతంత్ర దేశాల్లో అవినీతి నేతలను ప్రోత్సహించి , తమకు అనుకూల నియంతలను గద్దె నెక్కించి తిరిగి మళ్ళా అవినీతి  అనేది ఆఫ్రికన్ దేశాల ప్రజల అనివార్య విధిగా చిత్రించారు. తోటి ఆఫ్రికన్ రచయితలైన చినువా అచేబీ,  గూగీ ,  సోయింకాల రచనల్లో కూడా వలసవాద  వ్యతిరేకం  నిరసన  ఉంది. అయితే గూగీ ఒక దశలో  పూర్తిగా వలసవాద ప్రభావం తిరస్కరించి సొంత భాషలో రాశారు. అచేబీ, గుర్నా లు మాత్రం  ఇంగ్లీషు భాషలోనే  రాసినా, ఆ సంప్రదాయానికి కట్టుబడినా గత స్మృతులు, స్థానిక సత్యాలకు దూరం కాలేదు.

 

          

       అబ్దుల్  రజాక్ గుర్నా నవల "చివరి బహుమతి"  ఒక వలస కుటుంబం కథను చిత్రీకరిస్తుంది. నవలలో కథనం అబ్బాస్ స్మృతుల ద్వారా ముందుకు, వెనక్కు సాగుతుంది. తమకు నచ్చిన జీవితం సాధించడం కోసం పిల్లలు ఎదుర్కొనే కష్టాలు, బిన్న  జాతులు , తరాల మధ్య అంతరాలు , జాతి అపోహలు, శరణార్థుల ఇక్కట్లు  ఈ నవలలో వర్ణించబడ్డాయి .మూడో వ్యక్తి గొంతు ద్వారా , స్మృతులు, కలలు,  ఉత్తరాల ద్వారా వలస జనుల సున్నితమైన,దయనీయ ,రహస్య,

పోరాట భరిత జీవిత చిత్రణ ఈ నవలలో  కనిపిస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వలసజీవులు గతంతో, వర్తమానంతో  పడాల్సిన  రాజీలో   ఆవేదన కూడా ఆసక్తికర శైలిలో రచయిత  అబ్దుల్ రజాక్ గుర్నా రాశాడు.

 

   అబ్బాస్ గతంలో ఒక నావికుడు, ఫిట్టర్, ఇంజనీర్ గా పనిచేశాడు .అతని భార్య మర్యామ్   ఒక అనాధ. తన పెంపుడు తల్లిదండ్రులు ఫిరూజ్, విజయ్ లను వదిలి వచ్చేస్తుంది. ఆమె ఒక హాస్పటల్లో క్లీనర్ గా పని చేస్తుంటుంది. ఒకరోజు డయాబెటిస్ తో తీవ్ర అస్వస్థతకు గురైన అబ్బాస్ ను చూసేందుకు వారి ఇద్దరు పిల్లలు హన్నా , జమాల్  తమ ఇంటికి వస్తారు. అన్నాకి స్వతంత్ర జీవితం అంటే ఇష్టం. జమాల్ కు సృజనాత్మక జీవన విధానం పై మక్కువ.

 

   జాంజిబార్ లో జన్మించిన అబ్బాస్ గత జీవితంలో బాల్యం లో పేదరికం ,తన తండ్రి పిసినారితనం ,తోబుట్టువుల సాయంతో చదువు,  కాలేజీ రోజుల్లో ప్రేమ వివాదం,  పెళ్లి తరువాత  భార్య షరీఫా కుటుంబం చేతిలో  అవమానాల  వల్ల భార్యా,బిడ్డలను వదిలి పలు దేశాల్లో పర్యటించడం ,  చివరికి లండన్  చేరి  మర్యామ్ తో వివాహం జరుగుతాయి.

 

   రెండో తరానికి చెందిన హన్నా తన స్నేహితుడు నిక్ కోసం తన ఉద్యోగాన్ని వదిలి అతడి కోసం యూనివర్సిటీకి వెళుతుంది.  ఆమె కలలు  అభద్రతకు లేదా అపరాధ భావనకు ప్రతీక అయి ఉండవచ్చు  అని నిక్ ఆమెతో చెబుతాడు. నిక్ తో పెళ్లి అయిన తర్వాత ఆమెలో అనుమానాలు రేకెత్తుతాయి. కాల క్రమంలో నిక్ కు జూలియాతో సంబంధం గూర్చి హన్నా అతడ్ని నిలదీస్తుంది.అతడి ఆధిపత్య స్వభావం గుర్తించిన హన్నా   తన సొంత జీవితాన్ని వెతుక్కుంటుంది.

 

    ఇక అన్నా సోదరుడు జమాల్ తొలుత అవిశ్వాసిగా ఉంటాడు .కానీ 9 /11 సంఘటనల తర్వాత విశ్వాసిగా మారి పోతాడు .పాలస్తీనా, కాంగో,  చెచెన్యా లలో ముస్లిం ప్రజల మనోస్థితిని అర్థం చేసుకుంటాడు. ఇంకా ఈ నవలలో జమాల్  ద్వారా రచయిత 1968 విద్యార్థి ఉద్యమాలు ,ఇరాక్ యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చూపిస్తాడు. తమ తండ్రి అబ్బాస్ ప్రగాఢమైన మౌనం పిల్లలకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

   అబ్బాస్ భార్య మర్యామ్  జబ్బు పడిన తన భర్తను చూసుకుంటూ ఉంటుంది. తన ఉద్యోగం పోయిన తర్వాత ఆమె శరణార్థుల కేంద్రంలో చేరి వారి బాగోగులకు అంకితం అవుతుంది. భర్త గత జీవితంలో  జరిగిన వైవాహిక  రహస్యం తెలిసి మర్యామ్ నిశ్శబ్దంలో మునిగిపోతుంది ఒక దశలో ఆమె తన పిల్లలతో తన గతాన్ని చెబుతుంది . భర్త పోయిన తరువాత మర్యామ్ తన పెంపుడు  తల్లిదండ్రులను కలుస్తుంది .తాను ఓ  పోలిష్ వనితకు,  రంగుజాతీయుడైన బ్రిటిష్ సైనికునికి  పుట్టిన సంతానం అనే నిజం ఆమెకు తెలుస్తుంది .మర్యామ్ ఒక యూదు తండ్రికి పుడితే ఆమె పేరు మిరియాముగా మారేది . పేరులో ఒక అచ్చు మారితే ఆమె జాతి కూడా  మారుతుంది.హన్నా పేరును కూడా రచయిత ' అన్నా' అని ఆమె ఇంట్లో లేదా బయట ఉండే ప్రదేశాన్ని బట్టి మారుస్తూ ఉపయోగిస్తాడు.

 

  ఈ నవలలో కుటుంబ సభ్యుల మధ్య నిశ్శబ్దాలు, గత జీవితం వల్ల కలిగే అపరాధ భావన, అనుమానాలు మానవ సంబంధాల్ని దెబ్బతీయటం చూస్తాం. రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా వలస కుటుంబాల రక్షణాత్మక ప్రవర్తన ,గతంతో వారి ఘర్షణ ,   దానిని వక్రీకరణ చేయవలసిన స్థితిలో వారిలో కలిగే ఒత్తిడి,  తమ అశాంతిని దాచుకునే ప్రయత్నాలు ఇవన్నీ చిత్రిస్తాడు.

 

    నవల చివరలో హన్నా తన స్వేచ్ఛ జీవితానికి సిద్ధమవడం, వారి తల్లి తిరిగి  చురుకైన జీవితం ప్రారంభించటం ,జమాల్ తాను రాయబోయే కథను గురించి ప్రస్తావన  తెలుస్తుంది. అబ్బాస్ తన కథ చరిత్రను  టేప్ చేసి తాను చనిపోయే  ముందు పంపడంతో  కూతురుకు  తన తండ్రి నిజాయితీ,  ఒంటరితనం తెలిసి అతని పట్ల సానుభూతి కలుగుతుంది . ఇదే అతడు ఆమెకి ఇచ్చిన “చివరి బహుమతి”.

 

అబ్దుల్ రజాక్ గుర్నా నవలల్లో   “డిసర్షన్”, “మెమరీ ఆఫ్ డిపార్చర్”,  “పిలిగ్రీమ్స్ వే”, “పారడైజ్” ,”‘అడ్మైరింగ్ సైలెన్స్” ,” బై ది సీ” ,” గ్రావెల్ హార్ట్”, “ది లాస్ట్ గిఫ్ట్” ప్రఖ్యాతి పొందాయి.

 

 2021 లో నోబెల్ బహుమతి గ్రహీత గుర్నా తన నోబెల్  ఉపన్యాసంలో సద్గుణాలు,  వికారాలు రెండింటినీ చెప్పే సత్యం రాయటంలో మనిషి సాదాగా,  నమూనా గా కనపడడు అని అన్నారు. మంచి రచనలో అందం ఉందని ,దాని వల్ల సున్నితత్వం , బలహీనతలకు,  క్రూరత్వం మధ్య ఆర్ద్రత కు, కరుణకు చోటు ఉన్నందున  సాహిత్య నిబద్ధుడ్ని అయ్యానని తెలిపారు.

 (Published on 21/09.26 in Darwaja page in  Navatelangana daily)

 

    

 

 

Sunday, 20 September 2026

ఇహలోక రాజ్యం లోనే మానవ ఘనత

                                             “


     అలెహో కార్పెంటియా (1904-80) క్యూబన్ నవలాకారుడు ,వ్యాస, నాటక, ఓపెరా, లిబ్రెటో   సృష్టికర్త గా, సంగీత శాస్త్రజ్ఞుడుగా  విఖ్యాతి చెందాడు. తాను ఒక ఫ్రెంచ్ వాస్తుశిల్పి   జూలియన్ జార్జ్ కార్పెంటియా  కి  , రష్యన్  భాష ఉపాధ్యాయురాలు లేనా వెల్మోంట్ కు స్విట్జర్లాండ్ లోనీ లోజాన్ లో జన్మించాడు.  తర్వాత  కుటుంబంతో అంతా తరలి పోయిన క్యూబా   రాజధాని హవానాలో  పెరిగాడు .ఫ్రాన్స్, దక్షిణ అమెరికా, హైతీ, వెనిజులా ,మెక్సికోల్లో విస్తృతంగా పర్యటించాడు . క్యూబన్  సంగీతం ,ఆఫ్రో క్యూబనిజంపై  విస్తృత అధ్యయనం చేశాడు . నియంత    మొరాలెస్ పై వ్యతిరేకత వల్ల 1927లో జైలు పాలయ్యాడు.1959 లో జరిగిన క్యూబా విప్లవానికి ,

 ఫిడెల్ కాస్ట్రో కుమద్దతు ఇచ్చాడు. 1966లో క్యూబా రాయబారి గా ఫ్రాన్స్ లో ఉన్నాడు


    కార్పెంటియా పారిస్ లో ఉన్నపుడు సర్రియలిజం ప్రభావంలో పడ్డాడు. కార్పెంటియా రచనల్లో  మ్యూజిక్ ఇన్ క్యూబా,ది కింగ్డమ్ ఆఫ్ దిస్ వల్డ్, ది లాస్ట్ స్టెప్స్, ఎక్స్ప్లోజన్ ఇన్ ది క్యాతెడ్రల్, రీజన్స్ ఆఫ్ ది స్టేట్, ది హార్ప్ అండ్ ది షాడో ముఖ్యమైనవి. ఆయన రచనా శైలి ప్రభావం గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ ,  మారియో వర్గాస్ లోసా, కార్లోస్ ఫ్యూంటెస్,  ఇసాబెల్ అల్లెండ్ తదితరులపై కూడా ఉంది. కార్పెంటియా తన రచనల్లో ’బరోక్’ (  క్లిష్టమైన భాష, సంస్కృతుల సమ్మేళనం ,నాటకీయ, అలంకారిక )  శైలి ఉపయోగించాడు. స్థానిక యాసలను కవితాత్మకంగా , ఐరోపా,ఆఫ్రికా, క్యూబా సంగీత  మిశ్రమాన్ని  ఉపయోగించాడు. అతని రచనలో “రియల్ మార్వలిసో” తర్వాత  మ్యాజిక్ రియలిజం ధోరణికి   దారి వేసింది.  గెరార్డ్ మార్టిన్  రాసినట్లు తాను నల్లజాతి అనుభవాన్ని క్యూబా జాతీయవాద వ్యక్తీకరణలో భాగంగా చేయ యత్నించాడు.


   హైతీ కరేబియన్ సముద్రంలో నేడు దాదాపు కోటి మంది ప్రజలు ఉన్న దేశం. దాని రాజధానీ పోర్ట్- ఓ- ప్రిన్స్. దాని పేరు పర్వత ప్రాంత భూమి అనే అర్థం ఉన్న ఆదిమ ఆరాక్  పదమైన “అయితి” నుంచి వచ్చింది. దాని సంస్కృతి లో ఆఫ్రికన్ , స్థానిక టైనో తెగల తో పాటు ఫ్రెంచ్, స్పానిష్  మిశ్రమ ప్రభావం ఉంది. స్వాతంత్ర్యం ముందు సెయింట్ డొమినిగ్ పేరుతో ఫ్రెంచ్ వలస గా ఉంది.  ఇక్కడ 1791-1804 ల మధ్య లూవెర్త్యూర్ , డెస్సాలీన్ ల  నేతృత్వంలో బానిసలుగా బాధ పడే హైతియన్లు, మిశ్రమ జాతులు కలిసి  ఫ్రెంచ్ వలస వ్యతిరేక పోరాటం చేశారు. 1804 లో  దేశం విముక్తి పొందింది.  గత శతాబ్దిలో అమెరికా  సైనిక జోక్యానికి వ్యతిరేకంగా 1915-34 ల మధ్య  పెరాల్ట్ , తర్వాత బాట్రావిల్ ల నాయకత్వంలో  గెరిల్లా   యుద్ధాలు జరిగాయి. అమెరికా కుట్రల వల్ల నేతలు అమర వీరులై ప్రజల దేశభక్తి పెరిగింది.  1929  లో పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థలో అమెరికా శైలికి వ్యతిరేక పోరు సాగింది. అమెరికా దన్నుతో అధికారం చేపట్టిన ఫ్రాంకోయిస్ డువాలియర్ ప్రజలను క్రూరంగా అణచివేసాడు. ఎన్నికల లేమి, ముఠా హింస ,ఆకలి కేకలు, మానవతా సంక్షోభం తో హైతీ బాధ పడుతోంది.ఈ నాటికీ అమెరికా రాజకీయ, ఆర్థిక పెత్తనం పై ప్రజలు పోరాడుతున్నారు

   

 విమర్శకుడు  పాబ్లో మెడినా ఈ నవల “ది కింగ్డమ్ ఆఫ్ దిస్ వల్డ్”  లో  “చరిత్ర ,గమ్యం ,ప్రకృతిలో పాత్రల ఆలోచనలను తీర్చిదిద్దుతాయ”ని చెప్పారు.ఈ నవల ప్రధానంగా హైతీ , కొంత క్యూబా నేపథ్యం లో సాగింది.ఈ నవల   ప్రారంభంలో బానిస టినోయెల్ తన యజమాని లెనోర్మాన్  డే మేజ్ తో  కలిసి ఒక   మంగలి షాపుకు వెళ్తాడు . అక్కడి మైనపు తలలు, పక్కన కసాయి  అంగడి 

లోని చర్మం వలచిన దూడల తలల సన్నివేశాలు చూసిన బానిసలోని తిరుగుబాటు భావాల సంచలనం.


    టినోయెల్ తన తోటి బానిస , పశ్చిమ ఆఫ్రికాకు చెందిన  మండింగో   జాతీయుడు అయిన మకాండల్ చెప్పే కథలు , వలసలు, యుద్ధాలు ,ఆఫ్రికా రాజుల వీరోచిత గాథలు తో ప్రభావితం అవుతాడు. మకాండల్  ఒక ప్రమాదంలో తన చేయి కోల్పోగా యజమాని అతనిని పశువుల కాపరిగా 


పంపుతాడు .టినోయెల్  అతడ్ని  రోజు కలుస్తూ ఎంతో నేర్చుకుంటాడు.  యజమాని నుంచి పారిపోయిన మకాండల్ తన అనుచర గణాన్ని తయారు చేసుకొని విప్లవానికి సిద్ధమవుతాడు. విషము తయారుచేసి టి నోయెల్ సాయంతో అంతటా వ్యాపింప చేస్తాడు. ఫలితంగా జంతువులు  మనుషులు అందరూ మరణిస్తుంటారు.  వెర్రెత్తిన ప్లాంటేషన్ యజమానులు బానిసలను చిత్రహింసలు పెడతారు . మకాండల్ ఒక  బల్లి, శీతాకోకచిలుక ఊర కుక్క, కీటకం ఇలా బహురూపధారణతో చాలా కాలం తప్పించుకుంటాడు. చివరకు యజమానులు అతన్ని  పట్టుకొని సజీవ దహనం చేస్తారు. లెనోర్మాన్  భార్య చనిపోగా విచారం లేకుండా పారిస్ లో  విలాసాలు సాగిస్తూ  ఒక నటి  ఫ్లోరిడార్ ను తన ప్లాంటేషన్ కు తీసుకుని వస్తాడు.  అతని కామ వాంఛలుకు, బానిసలను శిక్షించడానికి  హద్దులు ఉండవు.



    టినోయెల్    తన పిల్లలకు మకాండల్ కథలు,  అతని కీర్తి పాటలు వినిపిస్తాడు .ఏదో నాటికి అతను తిరిగి వస్తాడని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా  ఉండగా  బౌక్మాన్ నేతృత్వంలో  బ్వా  కేయిమాన్ అడవుల్లో అగ్గి రాజుకుంటుంది . అనామక బానిసలు పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు . వారికి ఒక  వోల్టేర్ వాది, మరో    ప్రీస్ట్ సాయం చేస్తారు.నల్లజాతి  తిరుగుబాటులో యజమాని వర్గం లో వారు అంతం అవుతారు. టినోయెల్  మేడం ఫ్లోరిడార్ను బలాత్కరించడానికి  పరిగెత్తుతాడు. యజమాని లెనోర్మాన్  నల్ల బానిస తిరుగుబాటుదారుల  నిర్మూలనకు గవర్నర్ సాయం కోరుతాడు. లెనోర్మాన్ తన సమయాన్ని పేకాట లో  గడుపుతూ   తన బానిసలని  ఒకరొకర్ని అమ్మేసి జాదం,  వ్యభిచారంలో మునుగుతాడు. నల్లజాతి   తిరుగుబాటు నేత బౌక్మాన్     తెగిన తల ముందు  నిలిచి తిట్టిపోసి ఒక సత్రం కి వెళ్తాడు.అతనితో మిగిలింది  టినోయల్ ఒక్కడే.


    ఇదిలా ఉండగా వంటవాడు  హెన్రీ  క్రిస్టోఫే తన వ్యాపారం మాని సైన్యంలో చేరి చివరకు నల్ల జాతి రాజుగా మారతాడు. తిరుగుబాటు సమయంలో యజమాని వర్గం విలాసాలలో మునిగితేలుతుంది. కొందరు న్యూ ఓర్లీన్స్ ,క్యూబా లో ప్లాంటేషన్ యజమానులుగా పోతారు. పారిస్  యువతి పాలిన్  క్యాప్ సిటీ, ప్లెయిన్ డు నార్డ్  వస్తుంది.  తన వొళ్ళు పట్టే బానిస సోలిమాన్ ను  కనికరించినట్టు తన కాళ్ళను ముద్దాడేలా చేయటం ఆమెకు సరదా. ఇంతలో మహమ్మారి. ఆమె భర్త లీ క్లర్క్  మరణంతో ఆమె  హేతువును మరిచి   ఆఫ్రికన్ దేవతలను పూజిస్తూ , సోలిమన్ తో కలిసి ఆదిమ నృత్యాలు  చేస్తుంది.పాలిన్ నిష్క్రమణ తర్వాత ప్లాంటేషన్ యజమానులు  స్వైర విహారం చేస్తారు. నల్లవారిపై  కుక్కల్ని,  మార్టినిక్ నుంచి తెచ్చిన పాముల్ని  వదులుతారు. నల్లజాతీయులు వారి దేవత  వోగన్ బదాగ్రీ  సాయంతో హేతువు పై పోరాటం చేస్తారు. 


   టినోయెల్  స్వేచ్ఛను సంపాదించి తిరుగుతూ  మీలో పట్నం చేరి నల్లజాతీయుల సామ్రాజ్యాన్ని చూస్తాడు. తాను రాజ భవనం  సాన్స్ సౌసి  చేరానని గ్రహిస్తాడు. తనకు రాజుహెన్రీ తెలుసని అన్నా ఎవరూ పట్టించుకోరు .తాను ముందు ఖైదీగా  తరువాత ఇటుకలు మోసే బానిసగా మారుతాడు .నల్ల బానిసల ప్రాణాలకు లెక్కలేదు. పన్నెండు  ఏళ్ల పాటు బానిసలతో  రాజు కొండమీద  ప్రసిద్ధ కోట  నిర్మాణం చేస్తాడు.  నిర్మాణం పూర్తయే సమయానికి టినోయల్ని విడిచిపెడతారు. అతడు తన పాత యజమాని   శిథిల గృహంలో నెలలపాటు దాక్కుని  బయటికి వస్తే మరల బానిస అవుతానని భయపడతాడు.


    రాజు హెన్రీ క్రిస్టోఫే  కార్నెర్ బ్రేవిల్  వ్యక్తిని సజీవ సమాధి చేస్తాడు. చివరకు తిరుగుబాటులో తన పరివారం అంతా పారిపోతే ,   ఆఫ్రికా నుంచి  సేవకులుగా తెచ్చిన ఐదుగురు నల్లజాతీయులు మాత్రమే మిగులుతారు.  హైతీ కి స్వాతంత్రం రాగానే ఆఫ్రికన్ మార్మిక వాదాన్ని కాదని యూరోపియన్ తరహాలో  తన ఆస్థానం ఉండాలని చూసిన హెన్రీ ఆత్మ హత్యకు పాల్పడతాడు. 


అంతిమగడియలో సత్య దర్శనం అవుతుంది.  టినోయెల్  పాత యజమాని ఇంటిని మృత రాజు హెన్రీ క్రిస్టోఫే సౌధం నుంచి దోచుకున్న వస్తువులతో అలంకరించి తానే రాజు లాగా భావిస్తాడు .ఒకరోజు  ఫ్రెంచ్ మాట్లాడే సర్వేయర్లు వచ్చి అతన్ని, అతని ఆజ్ఞలను  తీసివేసి ఆ ప్రాంతమంతా కొలతలు తీస్తారు. రిపబ్లికన్ మూలట్టో ల చేతిలోకి కొరడా వచ్చింది. 

  

    ముసలి టినోయెల్ రూపాలు మార్చి  చివరికి బాతుగా మారుతాడు. అయితే ఆ బాతుల సమాజంలో ఎవరూ ఎవరిని గొప్పగా చూడరు. ఆ బాతులు  ఇతడ్ని తన గుంపులో చేర్చుకోవు ఇది తన  పిరికితనానికి శిక్ష    అని టినోయెల్ భావిస్తాడు.టినోయెల్ లేచి బల్లమీద నిలబడి   మూలట్టో ల పై తిరుగుబాటుకు ఆదేశాలిస్తాడు .ఇంతలో వచ్చిన  పెనుగాలి.  అతడి జాడ  రాబందుకు మాత్రమే తెలిసింది.


  బానిసగా బ్రతికిన  టినోయెల్ కు  మనిషి ఎవరికోసం బాధపడతాడు అనేది తెలియదని, ఎప్పుడు అతను ఆనందానికి వెంపర్లాడతాడని సత్యం తెలిసి వచ్చింది. అయితే శ్రమించి అభివృద్ధి చేయడంలోనే గొప్పతనం ఉంది .మనిషి అంతా బాగా స్పష్టత ,  ఆనందం ఉండే  స్వర్గంలో కాక ఈతి బాధలు, శ్రమ ఉన్న ఇహలోక రాజ్యంలోనే గొప్పతనం కనుగొనగలడు.

(29 June,2026 , Maha Daily)

వలస సత్యం తెలిపే “ప్రవాసంలో ప్రతిఘటన”

                           

ఒక జాతి తన అస్తిత్వాన్ని ప్రకటించడం,  వలసపోవటమే ఒక నేరంగా,పాపం గా  పరిణమించిన ఆధునిక అనాగరిక కాలం ఇది. యుద్ధాల పేరిట పౌరుల ప్రాణాలు నిర్లజ్జగా హరించే అగ్రరాజ్యం అమెరికా,  దానిని సమర్ధించే విశ్లేషకులు కొల్లలుగా తయారైన కల్ల కాలం ఇది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తల్లి గర్భం నుంచి బయటపడటమే వలసగా,  తన రక్తంలోనే  వలస వేదన మూలాన కవి ముకుంద రామారావు గారు తన ఆవేదనను "ప్రవాసంలో ప్రతిఘటన : సమకాలీన టిబెట్ కవిత్వం" పుస్తకంలో వర్ణించారు.

ముకుంద రామారావు గారు  తెలుగులో తొమ్మిది  కవిత్వ పుస్తకాలు ,  పదిహేను తెలుగు  అనువాదాలు , రెండు ఇంగ్లీషులో,ఒకటి కన్నడంలోకి , ఆరు  కథలు/ వ్యాసాల పుస్తకాలు రాశారు. ఐదు పుస్తకాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. వివిధ గ్రంథాలలో పదకొండు  పరిచయ వ్యాసాలు వచ్చాయి. అగ్ర రాజ్య వలసవాద చరితలో భారతీయ వలస కార్మికుల  దోపిడీని  బయట పెట్టిన “అగమ్య గమ్యాలు”  2025 లో వెలువడింది. అజో- విభో- కందాళం  ఫౌండేషన్ వారి 2024- ప్రతిభామూర్తి జీవిత కాల సాధన పురస్కారంతో పాటు ఎన్నో ఇతర  పురస్కారాలు  పొందారు. ఆయన అనువాద గ్రంథాలు–అదే ఆకాశం, అదే గాలి, అదే నేల,అదే కాంతి, అదే నీరు, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ బహుమతి గ్రహీతల కవిత్వం, భరత వర్షం, చర్యా పదాలు, మిణుగురులు, ఇసుక నురగ, మియా కవిత్వం, బెంగాలీ బౌల్ కవిత్వం, వలస హోద మందహాస, The Smile That Migrated and Other Poems  మొదలగునవి.


టిబెట్లో ప్రకృతి, కుటుంబం,  బౌద్ధమత సంప్రదాయాలకు చారిత్రకంగా ఎంతో విలువ ఉంది. చైనా  తన అవసరాల రీత్యా టిబెట్ ను ఆక్రమించడంతో 1959 మార్చిలో లాసా లోని బౌద్ధ  మఠాలు దెబ్బతిని, వేలాదిమంది సన్యాసులు మరణించారు. దలైలామా , ఆతని అనుచరులు భారతదేశానికి

 పారిపోయి వచ్చారు .1960లో   Khampa  తిరుగుబాటుదారులు హింస వదిలి బౌద్ధ బోధనలకు అనుగుణంగా శాంతి మార్గం పట్టారు. టిబెట్ దేశం  ఇతర నేపాల్,  ఆఫ్ఘనిస్తాన్లలాగా  "ల్యాండ్ లాక్డ్ " దేశం.  


టిబెట్  ప్రవాస కవిత్వం కవితాత్మక రాజకీయ సాధనం. తరాలు గడిచినా తమ దేశం స్వేచ్ఛకు నోచుకోనందున కవుల కలాలు అనే మేఘాల నుంచి జారిన కన్నీటి  కవితలు ప్రజలను ఆలోచింపచేస్తాయి. ఒక జాతి సమస్యను లేదా సంప్రదాయం పట్టును అర్థం చేసుకోవడంలో మార్క్సిజం వెనుకబడితే అది అమెరికా లాంటి అగ్రరాజ్యానికి వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. తరాల జగడం, ప్రవాస  కష్టాల తరువాత నేడు టిబెట్ ప్రవాసులు కోరుతూ ఉంది స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి ,తమ అస్తిత్వానికి గుర్తింపు మాత్రమే.


ప్రవాసంలోని టిబెట్ జాతి కవుల్లో మూడు తరాలు ఉన్నాయి. అక్కడే పుట్టి చాలాకాలం ఉండి 1959 తర్వాత వలస  వచ్చినవారు మొదటి తరం. ఇక  రెండవ తరంలో మొదట  ఉన్న ఉత్సాహం స్థానంలో ప్రవాస వాస్తవాలతో సర్దుబాటు చేసుకున్న కవులు ఉన్నారు. మూడోతరం కవులు తిరిగి వెళ్ళే కలలు  పట్ల నిరాసక్తత , చేదు వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. వీరందరి కవిత్వంలో తమ మూలాల పట్ల ఆకాంక్ష, స్వేచ్ఛ పట్ల ఉద్వేగం, జన్మభూమి పట్ల మమకారం ఉన్నాయి. 

మొదటి తరం కవుల్లో ఒకరైన  రబ్ గై భసంగ్  మాతృభూమి కౌగిలింత తీయదనం ప్రపంచంలో దేనికి లేదని రాస్తే , మరో కవి  చోగ్యాం ట్రున్గ్ పా  "ధ్యానంలో అనుభవ శూన్యుడు / చెడు కల కన్నా / వేట కుక్కని  పోలి  ఉంటాడ”ని  ఒక హైకూ రాశాడు. శాంతి, కరుణ ల కోసం దలైలామా  హృదయాభివృద్ధిని ఎప్పుడు వదులుకోవద్దని సందేశం ఇచ్చారు. మరొక కవి Dondhup  Gyal   తన కవిత 'యువ జలపాతం ' లో  అద్భుతమైన ఇమేజరీ ఇచ్చారు. స్వచ్ఛమైన , తెల్ల కిరణాలు  " జరీ పట్టు మీద/  నామీద/ చిలుక రెక్కల నమూనాల / నెమలి పింజంలా విచ్చుకొని ” ఉన్నాయని రాశారు.


రెండవ తరం కవుల్లో చరిత్రకారుడు,  రాజనీతిజ్ఞుడు అయిన  సోల్టిమ్ షకబ్బా తన కవితల్లో  ఒక దేశం కీర్తి ప్రజల్లో , దాని నాశనం పాలకుల్లో,  సంపద దాని విలువలలో, జాతి హృదయం వీధుల్లో, నమ్మకాలు నిశ్శబ్ద ప్రార్ధనలో ,భవిష్యత్తు దాని సంకల్పంలో చూడవచ్చు అని అంటారు.  మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన "ఐ హావ్ ఎ  డ్రీమ్" లో రాసినట్లు  చైనీయుల, టిబెట్ పిల్లలు  ఒక స్నేహ బల్ల దగ్గర కూర్చోవడం చూడాలని అనుకుంటారు. మరో కవితలో ఏడవటానికి సిగ్గు  వలదని, చనిపోవటానికి భయపడద్దని చెబుతారు. మరో కవిత ‘నా టిబెట్’ లో  తన దేశాన్ని "ఆకాశంలో వజ్రాల్లా/మంచులో మెరుస్తుంది అంటూ దలైలామాను  ప్రశంసిస్తారు. తన  ఆత్మ అజేయమని  

 పదునైన మాటల్లో రాశారు. 


బౌద్ధ సన్యాసిగా , టిబెట్ అధ్యయనాల సహాయ ఆచార్యుడిగా ఉన్న మరొక కవి   పాల్జోర్  ‘ప్రపంచ మార్గాలు’  కవితలో   " నా వెదురు వేణువు  ధ్వని /గాఢంగా ఉన్నప్పుడు/ ఆహ్వానం లేకుండా/ పక్షులు నా చుట్టూ తిరిగాయి/ ఈ విరిగిన వేణువు నిస్సార ధ్వని ఇప్పుడు /సముద్ర కాకుల దృష్టినైన ఆకర్షించడం లేదు” అన్నారు . ఇంకో కవి   స్వాతంత్రం కోసం వేచి ఉండటం శరణార్థ స్త్రీ కి తప్పదని , ఒంటరితనం గురించి రాస్తూ  శరీరం ఎక్కడ ఉంది అని కాక "మన హృదయం, మనసు ఎక్కడ లేవో / నిజమైన ఒంటరితనమదే" అని అంటారు. కే .  తొండప్  అనే  చరిత్రకారుడు మరియు పాత్రికేయుడు రాస్తూ " జీవన సాగరంలో తుఫానులో ఒంటరి ఓడ  కోసం "గొప్ప వాగ్గేయ కారుని ఖజానాలో /  ఏ స్వర సమ్మేళనం ఎవరికి తెలుసు"  అంటారు.


మూడవ తరం కవుల్లో జైలు పక్షిగా మారిన టెన్జిన్ సుండూ తన  ధిక్కార స్వరం వినిపించారు .తాను  పుట్టు కాందిశీకున్ని అంటూ , టిబెట్ను చూడకుండా కలలు కంటాను అక్కడే చనిపోదామని అని రాశారు. అహింస కోసం శత్రువులను క్షమించానని, కానీ తన ఇంటిని కాచేందుకు చనిపోయిన నాన్నకు ద్రోహం చేశానని కొన్ని సార్లు అనుకుంటాను అని పలికారు. నా ‘"టిబెటనత్వం’ కవిత లో "ఒక లక్ష,  అనేక వేల వివిధ సమ్మేళన సాంస్కృతిక ఆధిపత్యాలలో/ చక్కగా కలిసిపోయి నానిన టిబెటన్లమ్/ప్రపంచ సానుభూతి రాశులం" అని రాశారు.


మరో కవి చక్రిషర్ తన కవితలో మాతృభూమి కోసం "ప్రపంచ చట్టాలలో బంధించబడిన / పనికిరాని నా చేతులు నరకండి /మా అమ్మ దగ్గరికి నడవలేని/ సంకెళ్లు వేసున్న నా  కాళ్ళను నరకండి"  అని ఎంతో ఆవేదనతో, ఆగ్రహంతో రాశారు.  భచుంగ్ డుమ్రా సోనం  తన కవితల్లో తాను సాలీడు , తేనెటీగ నిశ్శబ్దంగా ‘ఏకాంతపు మడుగు’ ను  పంచుకుంటారు .కవికి నిశ్శబ్ద విశ్రాంతి కావాలి. గమ్యం లేని గాలికి ఎగిరే అడవి పూల చెట్టులా కవి. అదృశ్యమైన  గాయకుడు మోక్షం   సాధించాడో లేదో తెలీదు కానీ మంటలు మండుతూనే ఉన్నాయి. మరో కవితలో  ‘నేను ఎప్పుడు పుట్టాను’ అని తన తల్లిని అడిగితే , ఆమె అతడు  పుట్టిన ఏడాది పంటలు పండక , ఆకలితో ఇల్లు, పశువులు పోయాయని, మతం హతమయిందని, తాతను జైలులో హీనమైన పనులకు వాడుకున్నారని, చౌరస్తాలో పవిత్ర గ్రంధాలు  ఆహుతి ,  పొరుగు వారు శ్రమ  శిక్షకు  పోయిన ఏడాది అని,  ఒకరి తర్వాత మరొకరు అదృశ్యమైన ఏడాది అని చెబుతుంది . 

తొలి మహిళా కవయిత్రి  వాంగ్మో  ధోంపా బాగా అజ్ఞానంలో స్వేచ్ఛగా ఉండటం సాధ్యం కాదు అని పలికితే ,మరో కవయిత్రి లీడ్కర్ "అసాధ్యం ఎదురైనప్పుడు/ ఆచరించే సమయం ఆసన్నమవుతుంది/ అక్కడ సిద్ధాంతానికి ఎక్కువ సమయం ఏదీ ఉండదు "  అని ,  ఆ క్షణంలో ప్రియమైన వారిని  రక్షించాలి. ప్రార్థించాలి. పరిగెత్తాలి అని రాశారు.

 కవయిత్రి డోల్కర్ ‘నీడలు' అనే కవితలో  " రాత్రి చాలాసేపు ఉంటుంది.../ కానీ ఎలా పాడాలో మీరు మర్చిపోకూడదు/ పాటలు ఇలాంటి సమయాల కోసమే రూపొందాయి" అని రాశారు.

తన తల్లి మరణించిన "18వ రోజు"  కవితలో  సోనం అనే కవయిత్రి  కుండపోత వర్షం గురించి ప్రస్తావిస్తూ "కన్నీళ్ళ నాపుకోకుండా భారంగా అలా/ బాధాకర కష్టాల భారీ మేఘాలను ఖాళీ చేసుకోవడం/ నన్ను క్షణికమైనా తేలిక పరుస్తుంది" అన్నారు. 

మరో అజ్ఞాత కవి  'పీఠభూమి నా ఇల్లు' పర్యావరణ పరిరక్షణ కోసం రాస్తూ ఖనిజాల కోసం ఆమ్ని మాచక్ పర్వతాన్ని తొలగిస్తూ భూమిని నిర్వీర్యం చేసి, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తుంటే లక్షలాది ఏళ్ళు దాన్ని కాపాడిన జనం మౌనంగా , నిస్సహాయంగా ఉంటే  "ఇకమీదట, మన పవిత్రమైన ఆమ్నీ మాచెన్ మీద/ తెల్లటి గొర్రెల మందలు మళ్లీ కనపడవు/

పశువుల కాపరుల మాట మళ్ళీ వినపడదు/ ఆ మురికి అత్యాశా పరులు త్వరలో నిన్ను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారు" అని రాయటం హృదయం కరిగిస్తుంది. 

ముకుంద రామారావు గారి పరిశోధనాత్మక  “ప్రవాసంలో ప్రతిఘటన" జాతి అస్తిత్వం గురించి, వలస సత్యం గురించి, వలస ప్రజలను, ముఖ్యంగా  శ్రమ జీవులను   అన్ని దేశాల వారు అనుమానంతో 

కాకుండా ఆదరణతో చూడాలని కోరే  హృదయ గీతం.

( Appeared on 6 April, 2026 in Maha Daily)



చరిత్ర ఉక్కు కౌగిలిలో …

          


     రష్యా, యుక్రెయిన్ల మధ్య దాదాపు నాలుగేళ్లుగా  సంకుల సమరం సాగుతోంది.లక్షలాది మంది సైనికులు, ప్రజలు రెండు వైపులా ప్రాణాలు కోల్పోతున్నారు. 1991 వరకు సోవియెట్ యూనియన్లో అంతర్భాగంగా ఉన్న యుక్రెయిన్ రిపబ్లిక్ నేడు చారిత్రక అనుభవాల రాపిడిలో రష్యాను ధిక్కరిస్తూ ఉంది. స్టాలిన్ చేపట్టిన సమష్టి వ్యవసాయం దశలో బలవంతంగా ధాన్య సేకరణ వల్ల లక్షలాది  యుక్రెయిన్ ప్రజలు ఆకలి చావులకు గురయ్యారని చరిత్ర. కులక్కుల విప్లవ వ్యతిరేక కుట్ర ను అంతం చేయడానికే నిర్బంధ చర్యలు అవసరమయ్యాయని  సోవియెట్ యూనియన్ అనుకూల చరిత్రకారుల వాదన. పైగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుక్రెయిన్ ప్రజల్లో నాజీ అనుకూల ధోరణి నడిచిందని , దీనిని ఏ ప్రభుత్వం సహించలేదని వాదించారు.ఈ సంక్లిష్టమైన 

 చారిత్రక యుగంలో కోట్లాది  సోవియెట్ ప్రజలు ఫాసిస్టు వ్యతిరేక దేశభక్తియుత యుద్ధంలో అసువులు కోల్పోవటం కాదనలేని సత్యం. యుద్ధానంతర కాలంలో అప్పటిదాకా అంతర్లీనంగా ఉంటూ పెరిగిన యూదు వ్యతిరేకతను సోవియట్  రచయితలు గుర్తించారు.  మరో వైపు సోవియెట్ యూనియన్ లో పెరిగిన  బ్యూరోక్రాట్ నిరంకుశత్వం మేధావుల, వారి రచనల  అణచివేతకు దారితీసింది. నాటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో  పాశ్చాత్య దేశాలు సోవియట్ వ్యతిరేకత, యుద్ధ ఉన్మాదం చూపించాయి. పాస్టర్నాక్ ,సోల్జేనిట్సిన్ లాంటి సోవియట్ వ్యతిరేక రచయితలకు నోబెల్ బహుమతులిచ్చాయి. వ్యక్తివాదానికి పట్టం కట్టి సమష్టి వాదాన్ని దుయ్యబట్టాయి.


 ప్రచ్ఛన్న యుద్ధం ముగియగానే పాశ్చాత్య దేశాల చూపు దిక్కు మారింది. గతంలో చేసిన చైనా, కొరియా ,వియత్నాం, క్యూబా లాంటి దేశాల్లో జోక్యం నుంచి లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో ఆక్రమణ నుంచి ఇటీవలి యుక్రెయిన్ - రష్యా యుద్ధం,  ఇజ్రాయెల్ కు మద్దతుగా పాలస్తీనీయుల ఊచకోత దాకా సామ్రాజ్యవాదుల గమనం మనకు విదితమే.ఇలాంటి సంక్లిష్టమైన చారిత్రక పరిస్థితిలో  వసీలీ గ్రోస్మాన్ నవలలు మానవ చరిత్ర తత్వాన్ని, వ్యక్తులకు రాజ్య వ్యవస్థ మధ్య జరిగే ఎడతెగని సంఘర్షణను మదిని, హృదిని కదిలించేలా చిత్రీకరించాయి.


 వసీలీ గ్రోస్మాన్ (1905-64)  నాటి  రష్యన్ సామ్రాజ్యంలో యుక్రెయిన్ ప్రాంతంలో బెర్డిచేవ్ గ్రామంలో ఒక యూదు కుటుంబంలో జన్మించారు. మాస్కోలోని స్టేట్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత రచనా రంగానికి మారి సోవియట్ రచయిత, పాత్రికేయుడిగా ఖ్యాతి పొందారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రెడ్ స్టార్ పత్రికకు యుద్ధ విలేకరిగా పనిచేశారు. ఆయన యుద్ధానంతర కాలంలో రాసిన  ప్రఖ్యాత నవలలు Life and Fate( ‘జీవితం మరియు విధి), Everything Flows (ప్రతిదీ ప్రవహిస్తుంది ) అనేవి కృష్చేవ్ వచ్చిన తరువాత కూడా నాటి నిరంకుశ అధికారుల మూలానా ప్రచురణ కు నోచుకోలేదు. మొదట 1985 లో పాశ్చాత్య దేశాల్లో వెలుగు చూసి 1988 తర్వాత మాత్రమే రష్యాలో ముద్రితమయ్యాయి. “నా పుస్తకానికి స్వేచ్ఛ కావాలి అని కోరుతున్నా” అన్న గ్రోస్మాన్ 1964 లో కడుపులో కేన్సర్ వల్ల చనిపోయారు. 


వసీలీ గ్రోస్మాన్ రచించిన నవల “జీవితం మరియు  విధి” రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ ప్రజలు జర్మన్లకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన విజయానికి దర్పణం పడుతుంది. ఈ నవల టాల్స్టాయ్ “యుద్ధం   మరియు శాంతి” , షోలకోవ్ నవల  “ప్రశాంతంగా ప్రవహిస్తున్న డాన్’  లాంటి రచనల  తరహాలో ఐతిహాసిక రచన. ఈ నవల విశాలమైన కాన్వాస్ పై రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు,ప్రాంతాలు, జాతులు , దేశాల విధి ఏ విధంగా పెనవేసుకుపోయింది , మానవత, నాగరికతలు ఎలా మూల్యం  చెల్లించాయో చిత్రించింది. జర్మన్ దురాక్రమణ వాంఛ , బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల ' ' సంతృప్తి పరిచే విధానం',  తప్పని సరి పరిస్థితిలో జర్మనీతో రష్యా చేసుకున్న ఒప్పందం , తరువాత జరిగిన మహా మారణ హొమం, జాతుల పరాధీనత, నిర్బంధ శిబిరాల్లో జనహననం చరిత్రకెక్కాయి. అలాగే సోవియట్ యూనియన్ లో కొత్త తరం అధికారుల అతి చర్యల  వల్ల పాత తరం విప్లవకారులు, రచయితలు, శాస్త్రవేత్తల ఉత్థాన పతనాలు చోటుచేసుకున్నాయి.


వసీలీ గ్రోస్మాన్ నవలలో  షాపోష్నికోవ్ సోదరీమణులు ఆయన ల్యుడ్మిల్ల మరియు ఎవ్జీనియాల జీవితాల్లోని విధివిలాసం కనిపిస్తుంది. ల్యుడ్మిల్ల భర్త విక్టర్ ష్రూమ్ ఒక అణుశాస్త్రవేత్త. పై అధికారుల పక్షపాత ధోరణి, చలవ మూలానా తన కెరీర్ లో కీర్తి, అపకీర్తులు రెండూ మూటగట్టుకున్నాడు. లుడ్మిల్ల తన కుమారుడు తోల్యాను యుద్ధంలో పోగొట్టుకుంది.అయినా భర్త   కష్ట నష్టాల్లో అండగా ఉంటుంది. ఈ అక్క చెల్లెళ్లలో మరింత  సాహసమున్న యెవ్జీనియ తన నివాస పత్రం కోసం అధికారులతో పోరాడుతుంది.ఆమె తన మొదటి భర్త ఎర్ర సైన్యంలో కొమిసార్ గా ఉన్న  క్రిమోవ్  ఒకే దారి మనస్తత్వం నచ్చక అతనికి దూరమై కల్నల్ నోవికోవ్ కు దగ్గర అవుతుంది.


విక్టర్ సహచరుల్లో అన్ని రకాల వాళ్ళు ,  సోకోలోవ్,  అన్నా లోశ్కోవా లాంటి మిత్రులు, షిషాకోవ్ లాంటి శత్రువులు, అవకాశవాదులు, చెపిజిన్ లాంటి నిరసనకారులు ఉంటారు. మాస్కోకి దూరంగా ఉన్న తరుణంలో  విక్టర్ , అతని మిత్రుల స్వేచ్ఛాయుత సంభాషణను వారిలో  ఎవరో అధికారులకు చేరవేయడం వల్ల విక్టర్ తన స్థానం కోల్పోతాడు . ఆ పరిస్థితిలో అతడి స్నేహితుడి  భార్య  మార్య ఇవనోవా సోకోలోవా విక్టర్ పట్ల సానుభూతి చూపిస్తుంది. ఆ క్రమంలో ఇద్దరూ దగ్గరైనా వారి బంధం వివాహ బంధం బయట ఉండటంతో విక్టర్ అపరాధ భావనకు లోనవుతాడు. విక్టర్ భార్య ల్యుడ్మిల్ల తన సొంత బాధలో ఉన్నప్పటికీ భర్త అంతర్గత సంఘర్షణను అర్థం చేసుకుంటుంది. ఆమె సోదరి అయిన యెవ్జీనియ మొదటి భర్త క్రిమోవ్ ద్రోహం ఆరోపణపై జైలుకు వెళ్లి, ఇంటరాగేషన్, చిత్రహింసలకు గురవుతాడు.అతడ్ని చూడటానికి యెవ్జీనియ వెళ్ళటం, ఉత్తరం రాయటం కల్నల్ నోవికోవ్ కు నచ్చదు.


    విక్టర్ పాత్ర తన తల్లి మృతి తర్వాత అపరాధ భావనకు గురవడం, స్టాలిన్ వ్యతిరేక డాక్టర్లు కుట్ర కేసులో లేఖపై వారికి వ్యతిరేకంగా సంతకం చేయడం, స్నేహితుడి భార్య పట్ల ప్రేమ విషయాల్లో రచయిత  వ్యక్తిగత జీవితానికి కూడా సామ్యముంది.


    ఈ నవలలో జర్మన్, రష్యన్ నిర్బంధ శిబిరాల్లో బానిసత్వ జీవిత చిత్రణ విపులంగా ఉంది. విభిన్న  వృత్తుల,జాతుల, మతాల ప్రజల  మానవత, ఆత్మగౌరవం భగ్నమై, వారి సమాధులు వారే తవ్వుకునే దయనీయ స్థితికి లోనై, వారిలో కొందరు  తెగించే చేసే తిరుగుబాట్లు నిర్దయగా అణచివేతకు గురయిన ఘటనల వర్ణన ఉంది. నేతల ఉన్మాదం ,జాతీయ దురహంకార ఫలంగా సామాన్యులు బలి అయిన విషాద ఘట్టం. అట్టి వారిలో పాత  బోల్షెవిక్ మోసోవ్కోయ్, మాజీ టాల్స్టాయ్ అనుయాయి ఇకిన్నికోవ్ మెర్జ్,  పాత మెంషివిక్క్కు చెర్నిసోవ్,  జర్మన్ల చేత చిక్కిన రష్యన్ ఆఫీసర్లు ఉంటారు. ఇక రష్యన్ నిర్బంధ శిబిరాల్లో అబర్చుక్ ( నవల్లో ల్యుడ్మిల్ల మొదటి భర్త), రూబ( మెడికల్ ఆర్డర్లీి), బర్కతోవ్ అనే నేరస్తుడు, మగర్ ( పాత బోల్షెవిక్ మరియు అబర్చుక్ టీచర్), మార్మికవాది ప్రిన్స్ డాల్గోర్కి, మాజీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ స్టెపనోవ్ మొదలగువారు ఉంటారు.క్రూర రాజ్యం చేత చిక్కి దీర్ఘకాలిక శిక్షలు, బలవంత నేరాంగీకారాలతో సాలెగూడులో చిక్కిన కీటకాలు పోలిన మానవులు.




  నాజీల నిర్బంధ శిబిరాల్లో మానవత మట్టి కలిసే  అత్యంత దయనీయ దృశ్యాలు గోచరిస్తాయి.పునరావాసం కల్పిస్తామని నమ్మించి లక్షలాది మందినీ వధ్యశాలలకు తీసుకెళతారు నాజీలు. బాధితుల వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలు , విలువైన వాటిని అన్నింటినీ చివరకు వారి జుత్తును కూడా తీసుకుని  వారి ఆత్మ గౌరవాన్ని ధ్వంసించి గ్యాస్ ఛాంబర్లలోకి పంపి  గత చరిత్రను రక్తం, కన్నీటితో తడిపారు నాజీ ముష్కరులు. రచయిత ఆ దృశ్యాలు వర్ణించిన తీరు పాఠకుల మదిని స్తంభింప చేసి , హృదిని నలిపివేస్తుంది. నాజీల  మస్తిష్క వల్మీకంలో  దాగిన ఆ సుప్త భుజంగాల  ద్వేష విషపూరిత  చర్యలను  గ్రోస్మాన్   మనకు  కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు.


దీనితో పాటు రష్యన్ యుద్ధ విమాన పైలట్ల, ఒక యుద్ధరంగంలో 6/1 ఇంట్లో చిక్కుకున్న 

సైనికుల, స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో రష్యన్ ప్రజల, సైనికుల, అధికారుల సాహస కృత్యాలను కూడా రచయిత వొళ్ళు గగుర్పొడిచేలా  వర్ణిస్తాడు. యుద్ధం మధ్యలో ఆహారం , నీరు కోసం ఘోరమైన వెతుకులాట, బంకర్లలో జీవితం, అంతటి సమరంలో పాల్గొనే యువజనుల మధ్య చిగురించే ప్రేమ , వారి త్యాగశీలత, హాస్య సన్నివేశాలు,  శతృ యుద్ధ ఖైదీ వైపు ఇటుక ముక్క కాకుండా రొట్టె ముక్క విసిరే ముసలి అవ్వ జాలి హృదయం, దేశంలో కొన్ని ప్రాంతాలు నాజీలతో చేతులు కలపడం, గత చెడు అనుభవాలతో కొందరి ద్రోహం ఇవన్నీ మన మెదళ్లలో సంకిష్ట ఆలోచనావేశాల మిశ్రమాన్ని కల్పిస్తాయి.


ఇంతే కాక ఈ నవలలో  జర్నలిస్టు మరియు  రచయిత అయిన  గ్రోస్మాన్ కవి హృదయంతో   చేసిన అద్భుత  యుద్ధ, ప్రకృతి వర్ణనలున్నాయి.

బైరోజ్కిన్ కాలికింద మెషిన్ గన్ పేలి “ నెల నుంచి అకస్మాత్తుగా పిచ్చుకల దండు దూసుకొచ్చినట్లుంది" ( పే.43)


 విమానం నడుపుతున్న లెఫ్టినెంట్ విక్టరోవ్ చూసిన దృశ్యాలు కదిలిస్తాయి.

" ప్రాచీన శిలలు ఈ సరస్సుల, వనాల మధ్య పరువులెట్టాయి; పొడవైన, నిటారు చెట్ల నుంచి చర్చిలు నిర్మితమయ్యాయి; వాటి నుంచి పడవల తెరచాపలు తయారయ్యాయి. ఈ వనాల మధ్య నుంచి బూడిద రంగు తోడేలు పరిగెత్తింది…నశించిన గతం సాదాగా, యవ్వనవంతంగా , అమాయకంగా గోచరించింది. అంతస్తుల్లోని కన్యలే కాకుండా బూడిద రంగు గడ్డాల వర్తకులు, మత పరిచారకులు, పెద్దలు అందరూ           మర తుపాకులు, డీసెల్ ఇంజన్లు, సినిమాల వేగవంత ప్రపంచం నుంచి వచ్చిన లౌక్యం గల యువ పైలట్ల కన్నా యవ్వనంతో కనిపించారు. వేగంగా, సన్నగా ,ఎత్తయిన బహుళ రంగుల కరకట్ల మధ్య , హరిత అరణ్యాల మధ్య,తేలికపాటి నీలి,ఎరుపు రంగుల అల్లిక నడుమ పారుతున్న వోల్గా ఈ నశించిన గతానికి ప్రతీకగా ఉంది.”

మరో  వర్ణనలో “ వనం కాలి కింద నుంచి లేచి చూపరిని  మింగేస్తుంది. జలాశయం అడుగు నుంచి నీటి పొర ద్వారా చూస్తూ భిన్న రకాల పురుగులు , పక్షులు, మంచు బిందువులు కప్పిన నాచును చూసి కొత్తగా, అసౌకర్యంగా భావిస్తాడు.వెలుగులోకి రాగానే స్వేచ్ఛా భావం,ప్రకృతిలో భాగమైన ఆశావాదాన్ని  అనుభూతి చెందుతాడు.”


 గ్రోస్మాన్ తత్వం మానవ జీవితం పట్ల అతని లోతైన అవగాహన తెలుపుతుంది. ప్రజలు పర ద్వేష భావనకు రెచ్చగొట్టబడి, ఏకగ్రీవంగా ఓటేసి, తమ ఇళ్లల్లోకి  రాబీస్ రానిచ్చి, హత్యాకాండ పట్ల మౌనం వహించి , జైళ్లలో కుక్కబడి అమిత విధేయంగా మారారు. కొందరు మాత్రం తిరగబడ్డారు. నిరంకుశ హింస మూలాన మానవ ఆత్మ పక్షవాత బారిన పడింది.

జన్మ భూమి పేరుతో, సంకుచిత అసిత్వాల పేరుతో ఆత్మ రక్షణ సహ జాతం సమర్థన కు గురయింది. నిరంకుశ రాజ్య హింస మార్మిక ఆరాధనా వస్తువయింది. అంధ ఆశావాదం, తెగించి తిరుగుబాట్లు, మరణ శిక్షలకు నిరీక్షణ, తలారుల పలుకులపై  నమ్మకం చోటు చేసుకున్నాయి.


  రచయిత వార్సా మురికి వాడల్లో తిరుగుబాట్లు, ట్రిబ్లింకా ఇతర శిబిరాల్లో , అణచివేతకు గురయిన దేశాల్లో ఉద్యమాలు,  స్వేచ్ఛకోసం విద్యార్థుల తిరుగుబాట్లు ప్రస్తావిస్తారు. 


 సోవియట్ చరిత్రలో ఉక్రెయిన్ ను బాధలకు గురిచేసిన సామూహిక వ్యవసాయం, మేధావుల మౌనం, వీరుల సాహసం, యూదు వ్యతిరేకత పెరగటం, స్వేచ్ఛ, స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో దేశభక్తి వెల్లువలను రచయిత గొప్పగా  చిత్రించారు.  రచయిత పుస్తకం చాలా కాలం అరెస్టుకు గురై  అతన్ని  కుంగదీసింది.చివరకు 1985 లో పాశ్చాత్య దేశాల్లో వెలుగు చూసింది. అతని తత్వం వ్యక్తులు మనుష్యులుగా జీవించడం, మనుష్యులుగా మరణించడం.  ఈ నవల ఆంగ్ల అనువాదకుడు రాబర్ట్ చాండ్లర్  మాటల్లో ఈ నవల “మానవ స్వభావం గురించిన   ఛేకొవియన్ ఇతిహాసం.’’


 (Published on 12 January,2026 in Maha Daily)




  












జీవిత ‘శిశిరంలో నిరంకుశుడు’

                                                   

                                        

     

గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్  ప్రపంచ ఖ్యాతి గడించిన , 1982లో  నోబెల్ బహుమతి పొందిన రచయిత. కథలు, నవలలు, పాత్రికేయ వ్యాసాలు ,డాక్యుమెంటరీ నవలా రచనలు చేశారు. సర్రియలిజం, మేజికల్ రియలిజం శైలిలో   ఆయన రాసిన నవల ‘నియంత యొక్క శిశిరం’ ( ది ఆటమ్ ఆఫ్ ది  పాట్రియార్క్) లాటిన్ అమెరికా కు చెందిన పలు   నియంతల జీవిత చరిత్రల అధ్యయనం పై  ఆధారపడి రూపొందించిన అద్భుతమైన  ఊహా చిత్రం. విమర్శకుడు జాన్ కింగ్ రాసినట్లు  లాటిన్ అమెరికా సాహిత్యంలో  అస్తిత్వ అన్వేషణ, మేజికల్ రియలిజానికి  గుండె లాంటి “ఉన్నత” మరియు కింది సంస్కృతుల సమ్మేళనం, బరోక్ (అలంకార సహిత , నాటకీయ, క్రమ రహిత ) శైలిలోని భాష ఉంటుంది.


   లాటిన్ అమెరికాలో డయాజ్ ( మెక్సికో), కబ్రెల్ల (గ్వాటిమాలా), గోమెజ్, జెనేమేజ్ ( వెనిజువేలా), ట్రుజిల్లో ( డొమినికన్ రిపబ్లిక్), సోమోజా( నికరాగువా), Batista ( క్యూబా), ఇంకా  ఫ్రాంకో (స్పెయిన్)లాంటి ఎందరో. ఒక్కొక్కడు ఒక మహా హంతకుడు.తర్వాత కాలంలోప్రజాస్వామ్య రిపబ్లిక్ లు కూలి బ్రెజిల్(1964),  చిలీ, ఉరుగ్వే (1973)అర్జెంటీనా (1976) లు  నియంతృత్వంలో కుమిలిపోయాయి.


   తన రచనల్లో   ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్  సోలిట్యూడ్,’ ‘నో వన్ రైట్స్ టు ది కల్నల్,’ ‘ లవ్ ఇన్  ది టైమ్ ఆఫ్ కలరా,’ ‘ది జనరల్ ఇన్ హిస్ లేబీరింత్,’ ‘ఇన్ ఈవిల్  అవర్,’ ‘క్రానికల్ ఆఫ్ ఏ డెత్ ఫోర్టోల్డ్,’ ‘ఐస్ ఆఫ్ ఎ బ్లూ డాగ్’, ‘లీఫ్ స్టార్మ్’,’ స్ట్రేంజ్ పిల్గ్రిమస్, ‘ఆఫ్ లవ్ అండ్ ఆదర్ డిమన్స్,’ ‘మెమోరీస్ ఆఫ్ మెలంఖలి   హోర్స్’, ‘న్యూస్ ఆఫ్ కిడ్నాపింగ్’  మొదలగునవి ఉన్నాయి.


    ప్రస్తుత నవల ‘నియంత యొక్క శిశిరం’   అధి వాస్తవిక, కవితా శైలిలో ప్రవాహంలా సాగుతుంది. వాక్యాలు లో కామా, ఫుల్ స్టాప్ లు అరుదుగా ఉంటాయి. సంభాషణ చేస్తున్న వారెవరు అనేది తెలుసుకోదలచిన పాఠకుని గ్రహణ శక్తికి  పరీక్ష. మార్క్వెజ్ నవల్లో అతడు, నేను, నీవు, జనరల్ సార్ అనే పదాలతో వాక్యాలను కలుపుతూ కథ  నడుస్తుంది. కథనం  మొదటి(‘నేను,’ ‘మనం’), రెండవ ( ‘నీవు,’ ‘జనరల్ సార్,’  ‘నా మాత’) ,  మూడవ వ్యక్తి (‘అతడు,’ ‘ఆమె,’ ‘వారు’)  కథనాల్లో మారుతూ  సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పద్ధతి ఉపయోగించాడు.కవితావేశం నయాగరా  జలపాతం . రచయిత ఏడేళ్లు శ్రమించి రచించిన   అక్షర  లావా ప్రవాహం. 


    పేరు లేని రాజ్యంలో(కొలంబియా కోస్టా లేక వెనిజువేలా కావచ్చు)పేరు చెప్పని సైనిక 

 నియంత తన ఇచ్చ వచ్చినట్లు పాలించి, అనుమానంతో తనలాగే ఉండే వ్యక్తిని, అంగ రక్షకుని, తిరుగుబాటు దారులను, ప్రజలను సంహరింప చేసే  విధానాలు, తాను మాత్రం ఈ చావును తప్పించుకుంటానని అవాస్తవిక ఊహలు చేస్తాడు. .  ఏనుగు కాళ్ళ లాంటి పాదాలతో , హెర్నియతో, నిరంతర సైనిక దుస్తులు, మెడల్స్ తో తిరుగుతూ  నియంత క్రూర పాలన,   చిత్త కార్తి కుక్క లాంటి కాముకత్వం, ఆత్మ వంచన, నిఘా కన్నులు, హింసా కాండకు రహస్య అనుమతి , అనివార్యమైన ఏకాంత విచారం,చివరకు శిశిరం లో చెట్టులా మిగిలి  ఒంటరిగా మృతి. అతని శవం రాబందుల పరం. నాటి దాకా భయ భ్రాంతులైన   ప్రజలకు వసంత కాలం.


నియంత   వంద నుంచి రెండు వందల   ఏళ్ళ పైన పాలన ఒక  ప్రతీక.   చర్చి, విదేశీయుల పట్ల వ్యతిరేకత,  మరలా వారికే దేశ వనరుల  అప్పగింత. వారి కనుసన్నల్లో  విలాస జీవనం. భవనం క్రింద ,లోపల మెట్లెక్కే ఆవులు , జంతువులు, పక్షుల పంజరాలు. తోటలో  కుష్టు రోగులు  అతడి సాయం కోసం. అతడికి నచ్చితే కరుణ. కోపమొస్తే  వ్యతిరేకుల,తిరుగుబాటుదారుల బహిష్కారం, దారుణ మరణం.తిరగబడితే  సందర్శనం.జాతి తనే. అన్ని కాలాలు, సర్వ శక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు తానే. తానే దైవాంశ సంభూతుడు. తాను తాకితే జనుల రోగాలు మాయం.వంది  మాగధుల పొగడ్త అతడి  ఆహారం. ‘చనిపోయి’ బ్రతుకుతాడు. బ్రతికుంటే ఇతరుల అంతం చూస్తాడు.తన భార్య, బిడ్డల దుర్మరణానికి ప్రతీకారంగా హింసా కాండ.



అధికారం మీద నియంత, ఇతడి మీద లొంగి ఆధారపడే జనం ఆత్మ న్యూనతా భావన పరస్పరం ప్రభావితం చేసుకుంటారు. అతడు పాపి లేదా కాకి లా  చిరాయువు. ఏకాకి జీవన శైలి. మృత్యు దర్శనం అనివార్యం. అపుడు అయినా అవుతుందా జ్ఞానోదయం? అయినా తిరిగి లేచేనా కూలిన స్వేచ్ఛా విగ్రహం?  ఇదే చరిత్ర విషాదం. వినోదం.


నియంత పేదరికంలో జనిస్తాడు. తల్లి బెండిసివోన్    ఆల్వరాదో పెంటకుప్ప మీద గొర్రె మాంసం  బాలుడి మధ్యాహ్న ఆహారం కోసం ఇచ్చి, తనువు ను అమ్ముకుని పెంచిన కుర్రవాడు రాజధాని

వచ్చి సీసాలు అమ్ముకుంటూ సైన్యంలో చేరి జనరల్ గా ఎదుగుతాడు. బ్రిటీష్ సాయంతో అధికారం  19 వ శతాబ్ది మధ్యలో ఫెడరలిస్ట్ యుద్ధం. అమెరికా మెరైన్స్ చేతిలో 20 వ శతాబ్ది తొలి నాళ్లలో ఓటమి. తన తొలి దశలో తన డూప్ గా  పాట్రిసియో అరగోనే ను పెట్టుకుని పాలన సాగిస్తాడు. అతడు చనిపోగానే తాను పోయినట్లు ప్రచారం చేసుకుని తన మృతి పట్ల ఆనందం పొంది అధికారం కోసం సమావేశమైన వారి పని పడతాడు. తనకు రక్షగా ఉన్న రోడరిగో దె  అగిలార్  తన్ను వంచించాడనే నెపంతో అతడ్ని  చంపి వండి వడ్డించేలా చేస్తాడు. మానువెలా సాంచెత్ అనే వనిత కు  దాసుడై, ఆమె ఆకస్మికంగా వెళ్ళిపోతే పగతో రగిలి ఆమె ఎక్కడా దొరక్క పోతే  వెర్రెక్కి పోతాడు.


తాను ఉన్నా లేనట్టు , లేకున్నా ఉన్నట్లు ప్రజానీకాన నమ్మించి, వంచించి, భయ పెట్టీ వారి కోసమే తన సర్వస్వం అని సృష్టించగలదు.ఇదే మాకీయవెల్లి సైద్ధాంతిక వల.  అధికారం పట్ల ప్రేమ అతడి అణువణువునా ఆవహిస్తుంది. అది నియంతృత్వ భావజాల మాయా జాలం.


నియంత  జీవన  శిశిరంలో తల్లి మృతి , ఆమెని సాధువుగా ప్రకటించాలని వ్యర్థ యత్నాలు, ధిక్కరించిన చర్చి వారిపై ప్రతీకార చర్యలు తీసుకుంటాడు.  సన్యాసినులను నగ్నంగా  పెరేడ్ చేయించి , నచ్చిన లెటిసియ నజరేనో ను అపహరించి, బలవంతంగా ఆక్రమించి , తర్వాత పెళ్లి చేసుకుని బిడ్డను కంటాడు.భార్య ఒత్తిడితో  మళ్లీ దొడ్డి దారిన  మత జనుల్ని తెస్తాడు. వారికి ఎన్నో ఇహ లోక లాభాలు సమకూరుస్తాడు.   ఆమె ప్రభావం పెరిగి, బజారులో నచ్చిన  వస్తువులన్నీ ప్రభుత్వ ఖర్చుతో అనుభవిస్తుంటే కినిసిన వారి కుట్రతో కొడుకుతో సహా వేటకుక్కల దాడిలో అంతమైతే,  నియంతలో  విషాద జనిత క్రోధం జ్వలించి , ఆమె హంతకులను వేటాడే క్రమంలో ఎందరో బలవుతారు. ఈ తరుణంలో నియంత  దరి చేరిన జోస్ ఇగ్నాసియో   సాన్స్ దె  లా బారా అనే యువకుడు అనధికారిక  చిత్ర హింసల భవనంలో నియంత వ్యతిరేకుల హింసించి వారి తలలు కొబ్బరి కాయల్లా  తరిగి సంచుల్లో సరఫరా చేస్తే అవి ఏమో అని తన సౌధంలో  దాచి కుళ్ళు కంపుతో నిజం  తెలిసినా తన బాధ్యత ఏమీ లేదని అందరూ అనుకోవాలని నియంత కోరిక. చివరకు జనం ఆగ్రహ జ్వాలల్లో జోస్ ఇగ్నాసియో సాన్స్ దె  లా బారా  అసువులు పోతాయి. 


   ఐరోపా, అమెరికా  దేశాలు, వాటి దౌత్యవేత్తలు నియంత నుంచి పలు ఆర్థిక రాయితీలు, లాభాలు పొంది అతడ్ని నామ మాత్రంగా చేస్తారు. అతడి భవన  సమీపంలోని  కరీబియన్ సముద్రంపై  హక్కులు అతడి మెడలు వంచి కాజేస్తారు. చివరి దశలో ఈ అధికార , కామినీ మహా  కాముకుడు పాఠశాల బాలికలపై అత్యాచారాలు చేస్తాడు. అతని తొత్తులు, ఆశ్రితులు అంగడి బొమ్మలకు అమ్మాయిల వేషాలు వేసిన వైనం తర్వాతతెలిసి మండిపోతాడు. తన అధికార సౌధంలో అనుమానంతో, ఒంటరి  ఒంటెల బ్రతుకుతూ, తన  కీర్తి తనే టాయిలెట్ గోడలపై రాసుకుంటూ,  పునర్ యవ్వన వాంఛతో తపిస్తూ, ఏకాంతంలో  దయనీయంగా ,అనివార్యంగా చనిపోతే  ఆ వార్త విని నమ్మక , నమ్మలేక చివరకు నమ్మిన జన సందోహ ఆనందోత్సవాలతో నవల ముగుస్తుంది.



   గెరాల్డ్ మార్టిన్ అనే విమర్శకుడు “ఇది అధికారం, కీర్తి, ఏకాంతం పైన లోతైన ఆలోచన " అని, మార్క్వెజ్ దృక్పథం "నిర్దాక్షిణ్య వాస్తవికత  కానీ నిరాశ కాదు"  అని రాశాడు. మరో నోబుల్ బహుమతి గ్రహీత ఆస్టూరియాస్ నవల ‘ది ప్రెసిడెంట్’ లో నియంత అధికారాలు కేంద్రీకృతం చేసుకునీ  సాలెగూడులో పెద్ద సాలెపురుగు లా దూరం నుంచి అదుపు చేస్తున్నట్లు చూపిస్తే  మార్క్వెజ్ నవల నియంత చేతన, ముఖ్య ఉద్దేశాలను ఎక్కువగా పట్టించుకుంటుంది అని  మార్టిన్ అభిప్రాయం.  మార్టిన్ భావనలో మార్క్వెజ్ నవల ‘నూరేళ్ళ ఒంటరితనం’ అతని జీవితానికి సాహితీ కేంద్రమైతే, ‘నియంత యొక్క శిశిరం’ నవల అతని సాహిత్యానికి కేంద్రం, ఇంకా మేలుగా ఇరుసుగా చెప్పవచ్చు.

 


 రెండు నవలల్లో కవితా శైలి ఉన్నా ఆస్టూరియాస్ నవల  అందమైన కట్టడం లాగా  ఆకర్షిస్తే,  మార్క్వెజ్ శైలి  ప్రవాహంలా కొనిపోతుంటుంది. ఈ నవలకు స్థల, కాలాలను దాటిన నిరంకుశ రాజ్యాలకు సంబంధించిన  విశ్వ జనీనత ఉంది. కాకుంటే ఆధునిక నియంతల సాంకేతిక జ్ఞానం, వ్యవస్థల స్వాధీనం, జాతి  ద్వేష భాష, అనుకూల మీడియా   ప్రచార హోరుకు  , మార్క్వెజ్ రచనా కాలం నాటి  స్థితికి  నియంతృత్వ స్థాయిలో  మాత్రమే తేడా కానీ స్వభావంలో కాదు. 

(Published on 31 August,2026, Maha Daily)