బిడ్డా, నీవు పుట్టి పెరిగింది నా ఒడిలో
తప్పటడుగులతో నడకలు నేర్చి, గంతులు, పరుగులు తీసే దశకు చేరావు
నీచిన్నతనంలో నీవు ఆడుకుంటూ ఎన్నోసార్లు క్రింద పడినా
అదే నాఫై ఆడుకుంటూనప్పుడు, నేనెప్పుడూ నిన్ను అంతగా గాయపరచలేదు
దెబ్బలు తగలకుండా ఎన్నోసార్లు నేనే నిన్ను కాపాడుకుంటూ వచ్చాను
నీ తల్లి-దండ్రులు నీకు దూరంగా వున్నప్పుడు నీసర్వసంరక్షకురాలిని నేనే
నిన్నే కాదు నాఫై నీలా జన్మించిన కోటానుకోట్ల జీవులకు నేనే ఆధారం
ఎండా- నీడ, ఫలం-జలం ఇలా ఒకటేమిటి నాఫై లభించనిదంటూ ఏదీ లేదు
నేనొకప్పుడు తీవ్రంగా మండుతుండే కటికరాయిని, కాలక్రమాన చల్లబడి,
ఇప్పుడు రుతువులున్న సస్యస్యామలమయిన చల్లని భూదేవిని
ఆ సూర్యుడి ప్రభావంతో నేనెంతో సంపన్నురాలినిగా మారాను
నన్ను వ్యాపారవస్తువులా అమ్మటం కొనటం అనేది నీ హద్దుమీరిన స్వార్ధం, ధనదాహం
ఇంగ్లీషు రిజిస్ట్రేషన్ కాగితాలతో, అధిక ధరలతో నన్ను మీపేరున
విచ్చలవిడిగా మార్చుకోవద్దు, తాకట్టు పెట్టొద్దు, తక్కువ ధరతో తెగనమ్మవద్దు
గనులు-క0పెనీలు, బాంబులు-భవనాలు అంటూ నా రూపం వికృతంగా మార్చవద్దు
మూర్ఖుడా, నా విలువెంతో తెలుసా? నీవు అంచనా వేయలేనంత
ఎందుకంటే ఈ సృష్టిలో జీవం కలిగియున్న విశాలమయిన గ్రహాన్ని నేనే
నా ధర నీవు నిర్ణయించేవాడివా ! నేనే ధరను నా విలువ అమూల్యం
నా పదిలం నీ జీవం, నా హాని నీ అంతం, తేల్చుకోవలసినది నీవే.
----డెక్కా నారాయణ రావు, 09406254940
No comments:
Post a Comment