ప్రకృతి ఒడిలో నువ్వు
నీ కన్నుల్లో ఆమె నవ్వు
ఎప్పుడయింది ఆమె నీకు అరి
ఏ దవానలం, తుఫాను, మహమ్మారి
వేసింది మీ బంధానికి ఉరి!
నాడు కలిసి వేటాడావు
పశువులు మేపావు
వ్యవసాయం చేశావు
ఎప్పుడయింది ఆ సబల అబల?
ప్రాచీన యుగంలో సిలువవేసి
మధ్య యుగంలో అణిచివేసి
నవీన యుగంలో వేతన బానిసను చేసిన నీతో
వద్దు కరచాలనం.
పన్నులు లాగి ఆస్తులు పెంచి
అధికారం పట్టి శిష్ట రక్షణ , దుష్ట శిక్షణ అన్నావు
అందరం ఒకటే అంటూనే
తెరిచావు నీ డేగ కన్ను
మానెయ్ నీ నమస్కారం.
నీవు సదా అమ్ముతూ ఉంటే
నేను సదా కొంటూ
వస్తుజాలాన్ని వాడి పారేస్తుంటే
భావజాల ఉచ్చుబిగించి
వాదించావు నీకు చావు లేదని
సాగించావు మృత్యువ్యాపారం
తీసేయి నీ ఆషాఢభూతి వేషం
నీవంటె నాకు ఎనలేని ద్వేషం
నీవు త్యజించవు కొనుక్కున్న అధికారం
నే వదలను కనుక్కున్న ధిక్కారం
నీవు చూపించు అగ్రరాజ్య అహంకారం
నేను ఆపను సమతా సమరం
నీవు కూలినా , నేను రాలినా
ప్రకృతి గెలుస్తుంది నీ వికృత వ్యవస్థపై
సత్యం నిలుస్తుంది
సామ్రాజ్యవాద సమాధిపై.
No comments:
Post a Comment