హాబ్స్ బామ్ ఆత్మకథలో ఒక చరిత్రకారుడు చరిత్ర
అర్థాన్ని సాధారణంగా , ప్రత్యేకంగా 20వ శతాబ్ది గురించి తెలుసుకునే అన్వేషణ కనిపిస్తుంది.
తన జీవితాన్ని 20వ శతాబ్ది చరిత్ర రూపొందించినదానిగా చూశాడు. చరిత్రను విశాల కాన్వాసు పై చూపడంలో జర్మన్
సమగ్రతను ప్రదర్శించాడు. తాను ఎదుటివారి అంగీకారం, తిరస్కారాలతో నిమిత్తం లేకుండా లోతు
అయిన జ్ఞానం, హేతుబద్ధ వివరణ, చారిత్రక అవగాహనలను తన ఆత్మకథ ద్వారా ఇచ్చాడు. మతకలహాలు ఉగ్రవాదం , హింసలతో
కూడిన ఈ శతాబ్దంలో చరిత్రకు ప్రత్యేక అర్థం ఉందా లేక మానవ జీవితం గౌరవాన్ని తొక్కేసే అంధ శక్తియా అనేది తెలుసుకోవడం ఎంతో అవసరం.
హాబ్స్ బామ్ 1917 ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా నగరంలో
జన్మించాడు తన తండ్రి పేరు లీయోపాల్డ్ హాబ్స్
బామ్ . తల్లి నెల్లీ జర్మనీకి చెందిన యూదు జాతీయురాలు.తాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డిగ్రీ
పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధం లో సేవ తరువాత
తిరిగి వచ్చి 1947లో యూనివర్సిటీ ఆఫ్
లండన్ కు చెందిన బిర్క్బెక్ కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరాడు. తన వృత్తిలో ఎదిగి అక్కడే
ఆచార్యుడిగా కూడా పనిచేశాడు. బహుభాషా కోవిదుడు.
అతని రచనలలో ప్రిమిటివ్ రెబల్స్, బ్యాండిట్స్,
ది ఏజ్ ఆఫ్ క్యాపిటల్ ,ది ఏజ్ ఆఫ్ రెవల్యూషన్,
ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ , ది ఫ్రాక్చర్డ్ టైమ్స్ , ఆన్ ఎంపైర్ , గ్లోబలైజేషన్ డెమోక్రసీ అండ్ టెర్రరిజం
, హౌ టూ చేంజ్ ద వరల్డ్ అనే రచనలు ఎంతో ముఖ్యమైనవి.
తన ఆత్మకథ “ఆసక్తికర సమయాలు”లో
తాను ఏ విధంగా యువకుడిగా ఎదిగింది కమ్యూనిస్టుగా మారింది , చివరి దాకా పార్టీ విధేయుడుగా
ఉన్నది చెప్పాడు . సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ లో కృష్చేవ్ చెప్పిన
విషయాల తరువాత తాను స్టాలిన్ విమర్శకుడిగా
మారింది, ఇతర చరిత్రకారులతో పరిచయాన్ని ,మూడవ ప్రపంచ దేశాల వామపక్ష ఉద్యమాలతో తన అనుబంధాన్ని
కూడా వివరించాడు. ఇంకా ప్రపంచీకరణ, ఆ తరువాత
పరిణామాలు మనకు ఈ పుస్తకంలో గోచరిస్తాయి. అతడు తన్ను తాను రూసో లేక సెయింట్ అగస్టీన్ లాగా జీనియస్ గా భావించలేదు.
తన ఆత్మ కథలో ‘ఒప్పుకోళ్ళు’ లేక వ్యక్తిగత
ఆత్మీయ జీవితం కనిపించదు. తాను సమకాలీన బ్రిటిష్ మార్క్సిస్టు మేధావిగా చరిత్రను వీక్షించాడు.
హాబ్స్ బామ్ తన ఆత్మ కథలో ప్రజా వ్యక్తిత్వం వ్యక్తిగత
లేదా అంతరంగిక జీవితం కన్నా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఇతనికి, నెహ్రూకి
పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సొంత జీవితం కన్నా ప్రజా జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు
. ఇలా రాసే ఆత్మకథ రచయిత తన ఆత్మీయులను గాయపరిచే విధంగా సొంత జీవితాన్ని ప్రకటించడు.
తన జీవితంలో సాదా సంఘటనల వల్ల కాక తన పరిమితులను అధిగమించటం లోనే పాఠకులకు ఆసక్తి ఎక్కువనే
భావిస్తాడు. తన అంతర్గత జీవితం తెలిపే పనిని కూడా
తన జీవిత చరిత్రకారులకు వదులుతాడు.
అయితే దీనివల్ల ఆత్మకథకుడి వ్యక్తిత్వ రూపకల్పన
గురించి పాఠకులకు అంతగా తెలిసే అవకాశం లేదు.
అయితే వస్తుగత సత్యం వ్యక్తిగతాన్ని, వ్యక్తిత్వ
లోటుపాట్లను నిర్ణయిస్తుంది అని అనుకునే ఆత్మకథ రచయితలు జీవితాన్ని విడిగా కాకుండా
ఒక మ్యాప్ లాగా చూస్తారు.
హాబ్స్ బామ్ కుటుంబం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వియన్నాకు వచ్చింది.
అతని తండ్రి లియోపాల్డ్ ఒక ఆదర్శవాది కాగా ,తల్లి ఒక మేధావి మరియు రచయిత.
తన తండ్రికి లౌక్యం లేకపోవడం , ఆ తర్వాత అతని మృతి వల్ల వారి కుటుంబం ఆర్థికంగా కృంగిపోయింది. అతని తల్లి ట్యూషన్లు
చెప్పి, నవలా రచన, అనువాదాలు ద్వారా కుటుంబ పోషణకు కష్టపడింది. బ్రిటీష్ మూలాల వల్ల హాబ్స్ బామ్ కు పాఠశాలలో ఇతర విద్యార్థుల వలె జాతి
విచక్షణ ఎదురు కాలేదు.
అతడి తల్లి అతనికి “నీవు యూదు
అయినందున సిగ్గుపడవలసిన పని చేయటం కానీ, చేసినట్లు కనిపించడం కానీ తగద”ని బోధించింది
. హిట్లర్ పూర్వ వియన్నా లో పలువురు మధ్యతరగతి యూదులు ఎవరూ జియోనిస్టులు కాలేదని రచయిత
రాశాడు. ఒక నాడు ఉద్యోగాన్వేషణలో విఫలమై ఇంటికి
తిరిగి వచ్చిన తండ్రి హఠాత్తుగా చనిపోవడం,
ఆ బాధ వల్ల రెండేళ్ల తరువాత రచయిత తల్లి
కూడా మృతి చెందటం జరిగింది.
ఈ చరిత్రకారునికి వేర్పాటు వాదంపై ఆధారపడిన శకలాలైన
అస్తిత్వాల మీద నమ్మకం లేదు . తప్పొప్పులు, న్యాయ న్యాయాలు ఏమైనా జాతి బ్యాడ్జెస్
లేదా జాతీయ జెండాల ప్రదర్శన తగదు అని భావించాడు. తన తండ్రి గురించిన అస్పష్టమైన స్మృతులు
, తల్లి రోగము, తన పిన తల్లుల చెంత పెరగటం
గురించి రాశాడు. అతని తల్లి అతడికి మేధోపర
పరిణితి వచ్చినదాకా కమ్యూనిస్టు పార్టీలో చేరరాదని
తెలిపింది. తల్లిదండ్రుల తరువాత అతడు తన సోదరి నాన్సీ బాధ్యత తీసుకున్నాడు. మేధోపర
అన్వేషణలు సాగించాడు . ఆ కుటుంబం 1932లో బెర్లిన్
వచ్చినప్పుడు నాజీజం, కమ్యూనిజంల మధ్య ఘర్షణ నడుస్తోంది. తన ఉపాధ్యాయుల కొందరి ప్రభావంతో
అతడు కమ్యూనిజం వైపు వెళ్ళాడు. అక్టోబర్ విప్లవం యొక్క స్థిరమైన ప్రభావాన్ని గుర్తించాడు.
ఆనాటి చారిత్రక పరిస్థితుల మూలాన రాజకీయ నిబద్ధత కల భవిష్యత్తు వైపు సాగాడు.
ఈ ఆత్మకథలో రచయిత తన తోటి చరిత్రకారులు నాయకులు
ప్రముఖుల గురించి రాశారు.
1956 లో కృష్చేవ్ స్టాలిన్ పై చేసిన విమర్శ తర్వాత కూడా
పార్టీలోనే కొనసాగాడు. గతంలో కమ్యూనిస్టులుగా ఉండి తరువాత తీవ్ర వ్యతిరేకులుగా మారిన
పాత సహచరులకు దూరంగా ఉన్నాడు. ఆయన దృష్టిలో
మాజీలు "విఫలమైన దేవుని " సైతాన్ గా చూశారు .రెండవ ప్రపంచ యుద్ధ కాలం ఆ తరువాత
ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అటు కమ్యూనిజానికి బాధితుడు లేదా తీవ్ర విమర్శకుడు కాలేదు.
ఈ విఖ్యాత చరిత్రకారుని గ్రంథాలు వివిధ దేశాలలోని వామపక్ష వాదులు చదివారు.
హాబ్స్ బామ్ చరిత్ర రచనకు తీసుకున్న విశాల కాన్వాస్
, సంఘటనల ఖచ్చితమైన చిత్రణ ,తాను నమ్మిన సిద్ధాంతాలలోని లోపాలను ఒప్పుకోవటం, చరిత్ర అర్థం కోసం నిరంతర అన్వేషణ ల వల్ల కమ్యూనిస్టు
చరిత్ర యొక్క ఉత్థాన ,పతనాలను ఉద్యమం లోపలివానిగా
వివరించాడు .అక్టోబర్ విప్లవ ప్రభావంతో చివరిదాకా సోవియెట్ యూనియన్ అంతర్గత పరిణామాలు
ఏమైనా దానికి విధేయుడుగా ఉన్నాడు . ఆత్మ గర్వం తనను పార్టీ వ్యక్తిగా చరిత్రకారుడిగా
నిలబడేందుకు దోహదం చేసిందని చెప్పాడు .అయితే తన ఇగోఇజం ను అటు సమర్ధించనూ, లేదా కాదనను అని రాశాడు.సోవియెట్ కమ్యూనిజం విచ్ఛిన్నం
అవడం, సోషల్ డెమోక్రసీ బలహీనం కావడం వల్ల మతపరమైన, జాతి మూలవాసి వాదం తిరిగి జనించింది. వీటికి అమెరికా మద్దతు దొరికింది .చాలా
దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సంప్రదాయ అర్థంలో శ్రామిక వర్గం మాయమైందనీ , చరిత్ర దిశ అస్పష్ట రూపు దాల్చింది అని రచయిత రాశాడు.
టోనీ జూడ్త్ తన వ్యాసంలో హాబ్స్ బామ్ గురించి రాస్తూ అతని శైలిలో స్పష్టత ఉందని, ఇతర చరిత్రకారులైన ఈ. పీ .థామ్సన్, రేమండ్ విలియమ్స్,
క్రిస్టోఫర్ హిల్స్ లాగా ఇంగ్లీష్ వచనంపై మాస్టర్ గా ఉన్నాడని, అక్షరాస్యుల
కోసం అర్థమయ్యే చరిత్ర రాశాడని చెప్పాడు .అతని స్మృతులు సుదీర్ఘమైన 20వ శతాబ్దిని ప్రతిఫలిస్తాయి. ఈయన రష్యాలోని అంతర్గత, బాహ్య నిరసనల
పట్ల చూపిన నిశ్శబ్దాన్ని టోనీ విమర్శించారు.
అతడు అత్యంత సహజ ప్రతిభాశాలైన చరిత్రకారుడైనా కూడా మన యుగం చూసిన టెర్రర్ ,అవమానాలను పట్టించుకోలేదని టోనీ అభిప్రాయపడ్డాడు.
హాబ్స్ బామ్ తన ఆత్మ కథలో భావ ప్రపంచం గురించి అంతగా పట్టించుకోలేదని పెర్రి
అండర్సన్ అనే మార్క్సిస్టు అభిప్రాయపడ్డారు .మరో విమర్శకుడు మిలిబ్రాండ్ చరిత్రను
దంత మందిరాల నుంచి ప్రజా జీవితంలోకి హాబ్స్ బామ్ తీసుకుని వచ్చాడు అని రాశారు . ఈయన తన తన మొహంలోకి
తేరిపార చూస్తున్న చెడును , క్రూరత్వాన్ని చూడలేకపోయాడని పాల్ జాన్సన్ అనే చరిత్రకారుడు
భావించాడు.
ఐరోపా కేంద్ర దృక్పథంతో ప్రభావితం ఆయనహాబ్స్ బామ్ యొక్క చారిత్రక
అవగాహన రెండవ ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధాల పిదప నిరాశగా మారింది. అయితే అతడి అస్పష్టత , సందేహాలు గ్లోబలైజేషన్, వినియోగ వాదాల కాలంలో భారత్, చైనా, క్యూబా ప్రజలకు లేకపోవటంతో ఆ దేశాలు ఇంకా తమ ఆశావాదాన్ని
నిలుపుకున్నాయి. ఏది ఏమైనా చరిత్ర రచనలో హాబ్స్
బామ్ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది.
( Daarideepam , March, 2026)
No comments:
Post a Comment