Tuesday, June 2, 2020



చెట్టు కిందనే ప్రాచీన రుషుల ధ్యానం 
చెట్టు కిందనే సిధ్ధార్థుడి జ్ఞానోదయం 
రాలిన ఆకుల్ని తిరిగి తెచ్చుకునే నిత్య జవ్వని చెట్టు
ఎండకీ, వానకీ, చలికీ నిలబడే స్థితప్రజ్నురాలు 
గీతా సారం దానికేనాడో తెలుసు
పూలు, పండ్లు, నీడలా నిచ్చి
కూలిన పిదప తనువును సైతం అర్పిస్తుంది 
తల్లిదండ్రులు, ప్రకృతి, సమాజాల నుంచి
పుచ్చుకోవడమే కాని ఇవ్వడం తెలీని మనిషి 
ఎప్పటికయ్యేను మనీషి!?

అర్థం లేని పరుగు సుడిగుండాన మునిగే మనం
నిత్యం ప్రకృతి సన్నిధిలో పొందగలం సంయమనం

తెల్ల, నల్ల, ఎర్ర  రంగుల రంగుల సీతాకోకచిలుకలు
మనోల్లాసాన్ని మోసుకొనితెస్తాయి
గులాబీ రేకులను చిదిమి
సిల్కు పురుగుల్ని చంపి
సుఖలాలసలో జనం
మారకం విలువ పిశాచి పూజలో మరిచాము నిజ మూల్యం 

ప్రతి రోజూ ఏదో కోయిల రాగం
తెలియని పిట్టల సంగీత స్వర సమ్మేళనం
ఆనంద క్షణాలు అందించి పోతాయి

సంపద కోసం సమరంలో శోకాన్ని ఇస్తారు మనుషులు
నాగరికత కడుపులో దాగుంది రాచకురుపు
అశేష ప్రజావళిని అష్ట దరిద్రంలో ఉంచేది 'ప్రగతి'

రోజూ చూసే దృశ్యంలోనే కనిపిస్తుంది  ఏదో కొత్త అందం 
రోజూ సాగే చరిత్రలోనే అన్వేషించాలి నవప్రగతి  చందం.

No comments:

Post a Comment