హాన్ కాంగ్ దక్షిణ కొరియాలో గ్వాంగ్జు ప్రాంతంలో జనించింది. తనకు పది ఏళ్ళ వయసులో రాజధాని సోల్ కు వలస వెళ్లింది. ఆమె తండ్రి కూడా ఒక రచయిత. మొదట కొన్ని కవితలు “లిటరేచర్ అండ్ సొసైటీ “ పత్రికలో వచ్చాయి.
ఆమె రచనలలో “ది వెజిటేరియన్”, “ది వైట్ బుక్” , “హ్యూమన్ యాక్ట్స్” , “వి డు నాట్ పార్ట్”, “గ్రీక్ లెసన్స్”, “ ది విండ్ బ్లోస్, గో” అనేవి ముఖ్యమైనవి .హాన్ కాంగ్ 2024 లో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని పొందారు.
ఆమె రచనలు చారిత్రకంగా బాధాకర పరిస్థితులు , అదృశ్య నియమాలతో ఘర్షించి మానవ జీవిత సున్నితత్వాన్ని బయటపెడతాయని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
దక్షిణ కొరియా గతంలో 1961 నుంచి 1987 దాకా సైనిక నియంతల అమానుష చర్యలలో నలిగిపోయింది. దేశాన్ని ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మార్చే పేరుతో మొదట పార్క్ చున్గ్ హి, తర్వాత వచ్చిన చున్ దు హాన్ లు తమ నిరంకుశ పాలన సాగించారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, పత్రికా స్వేచ్ఛను హరించి విశ్వవిద్యాలయాలను మూసివేసి ,రాజకీయ కార్యకలాపాలను నిషేధించారు .ఈ నేపథ్యంలో 1980లో గ్వాంగ్జు ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటులో ఎందరో విద్యార్థులు, సామాన్య పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు.
హాన్ కాంగ్ నవల “హ్యూమన్ యాక్ట్స్” శీర్షికలోనే ఎంతో అర్థముంది. ఆలోచనారహిత మనుష్యులు తమ తోటి దేశ వాసుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తారనేది రచయిత్రి గుండెను నలిపివేసే, కవితాత్మక శైలిలో రచించారు. నవలలో కథనం పలు పాత్రలు - ఒక విద్యార్థి నిరసనకారుడు, ఒక శవం ,ఒక పాత్రికేయులు, ఒక ఖైదీ, ఒక తల్లి, చివరగా రచయిత్రి స్వరాల నుంచి సాగుతుంది, గత జ్ఞాపకాలు ,వర్తమానం, కలలు , కవితలు, కవితాత్మక వర్ణనల ద్వారా నవల ముందుకు సాగుతుంది. భీకర సంఘటనలను రచయిత్రి వర్ణించిన తీరు పాఠకులను పూర్తిగా కుదిపివేసి ,ఒక చారిత్రక తాత్విక ఆలోచన విషాద సాగరంలో ముంచుతుంది. అయినా చివరకు జీవితం ఆగదు అనే భావన కలుగుతుంది.
కొరియన్ సంస్కృతిలో భౌతిక కాయానికి హింస జరిగితే దాని లోని ఆత్మకు కూడా భంగం జరిగినట్లే. రచయిత్రి తన నవలలో నిరసనకారుల భౌతిక కాయాల పట్ల సైనికుల నిర్లక్ష్యం, నిరాదరణలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది.
నవలలో డాంగ్ హో అనే హైస్కూల్ విద్యార్థి నిరసనకారుల శవాలను వారి వారికి అప్పగించేంతవరకు కాపలాగా ఒక జిమ్నాజియంలో ఉంటాడు. తనకు తెలిసిన, తన ఇంట్లోనే కొంతకాలం నివసించిన జాంగ్ డే, బుల్లెట్ దెబ్బకు కూలిపోవడం, తాను భయంతో కొయ్యబారి పోవటం ,అతని సోదరి జాంగ్ మీ ఒక శ్రామిక మహిళ గా తన తమ్ముడి చదువు కోసం సంపాదించడం, తాను కూడా చదువుకోవడానికి కష్టపడటం , తన తల్లి సోదరుడు ఇద్దరు వచ్చి ఇంటికి రమ్మనీ కోరినా డాంగ్ హో వెళ్లడు. తోటి విద్యార్థి నిరసనకారుల శరీరాలపై బాయినెట్ గాయాలు చూసి కలవరపడతాడు. జాంగ్ డే నీ కాపాడలేకపోవటంలోని పిరికితనానికి తన్నుతాను నిందించుకుంటాడు .అయితే తర్వాత డాంగ్ హో కూడా మరణించిన విషయం మనకు తెలుస్తుంది.
శవాలకు , ఆత్మలకు మాటలు వస్తె అవి కూడా కథను వర్ణిస్తాయి . జాంగ్ డే ఆత్మ శవాల కుప్పలను, పురుగులు పట్టిన వారి దేహాలను గుర్తు చేసుకుంటుంది. శవాలగుట్ట అట్టడుగున పడి ఉండి మధనపడుతుంది. తనను, తన సోదరిని ఎందుకు చంపావు అని ప్రశ్నిస్తుంది. కడిగిన శవాన్ని చూసి మురికి శవం సిగ్గుపడుతుంది . ఆ ఆత్మకు తన అక్కతో గడిపిన పాత రోజుల జ్ఞాపకాలు,తను పెరగటం, పెళ్ళి , అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం లాంటి ఊహలు . జాతీయగీతం పాడుతూ విరిగిన వారి శవాల గుట్టను సైనికులు దహనం చేయగానే జాంగ్ డే ఆత్మ తన ఇంటికి ఎగిరిపోదామనుకుంటుంది .కానీ అక్కడ అక్క లేదు . డాంగ్ హో శరీరం నుంచి ఆత్మ వేరైనట్లు కూడా దానికి తెలిసి వెళ్లాలనుకుంటుంది. కానీ కదలలేక పోతుంది.
కథనం ముందు ముందుకు సాగినప్పుడు ఓ పాత్రికేయురాలు తాను తిన్న చెంప దెబ్బలని గుర్తు చేసుకుంటుంది .అది 1985 వ సంవత్సరం. ఒక అజ్ఞాత అనువాదకుడిని కలిసినందుకు కానీ కిమ్ యూన్ సోక్ చెంప దెబ్బలు తింటుంది .అంతకు ముందు యూనివర్సిటీ క్యాంటీన్లో మఫ్టీ పోలీసులు ఆమె చేతిలో పోస్టర్ను చూసి జుట్టుబట్టి ఈడ్చినపుడు, సెన్సార్ ఆఫీసులో రచయితకు ప్రచురించకుండా పారితోషికం ఇవ్వటం, పత్రికలపై సెన్సార్షిప్, అధికారుల దౌర్జన్యం పుస్తక ప్రచురణకు అడ్డంకులు ,సంపాదకుల లౌక్యం, విద్యార్థుల వీరోచిత పోరాటం, వారి సంక్షేమానికై కుటుంబ సభ్యుల ఆరాటం ,శవాలను చెత్త బండ్లలో తరలింపులో సైనికులు ప్రదర్శించే ఉదాసీనత కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని చూసిన పాత్రికేయురాలి మదిలో మానవత్వం పై సందేహాలు చెలరేగుతాయి. నాటికను చూస్తున్న ఆమెకు డాంగ్ హో గుర్తుకొస్తాడు. కాల్చే కన్నీరు ఆమె బుగ్గల పై నుంచి కారుతుంది.
తరువాత చిత్రహింసల పాలైన ఖైదీ ద్వారా కథనం సాగుతుంది. విద్యార్థులు పడిన చిత్ర హింసలు, తాను కిమ్ జిన్ సూ ఇద్దరూ ఇరుకు గదిలో పిడికెడు ఆహారం కోసం పరస్పరం ఆబగా చూసుకోవడం , కోర్టులో సైతం ఖైదీలు తల దించుకొని ఉండటం, కిమ్ యాంగ్ చే అనే బాలుడు పిచ్చివాడు అవుతాడు. మనిషి ప్రాధమికంగా క్రూరుడా, ఆత్మగౌరవం ఒక మిధ్యనా,మనిషి ఒక కీటకమా, మృగమా లేక మాంసం ముద్ద అనే ప్రశ్న . తన సొంత మానవత కోసం సత్యంతో పోరాటం. చావు ఒకటే విముక్తి మార్గమా?
లిమ్ సోన్ జూ అనే వనిత డాక్యుమెంట్ రక్షణ ఉద్యోగంలో ఉంటుంది. గత చేదు అనుభవాల.వల్ల
ఆమెది ముభావ స్వభావం .ఒక పరిశోధనా గ్రంథంలో ఎనిమిదవ సాక్షిగా ఉండమని ఒక పరిశోధకుడు ఆమెను అడుగుతాడు .ఆమె అయస్టంగానే అంగీకరించి ఆ గ్రంథంలో అదివరకే నమోదైన సాక్షాలను చదువుకతుంది.వాటిలో నిరసనకారులపై జరిగిన దౌర్జన్యాల సాక్ష్యం , కార్మిక హక్కుల కోసం పోరాడే బాలికలపై జరిగిన దాడి గురించిన సమాచారం కూడా ఉంటుంది.
గ్వాంగ్జూ ప్రాంతంలో తిరుగుబాటు జరిగిన మూడు దశాబ్దాల తరువాత ఒక తల్లి కళ్ళ ద్వారా, రచయిత్రి ద్వారా ఆనాటి సైనికుల గురించి ,కాలం అడుగుజాడల్లో ఇంకిన రక్త చారికలను, హింసా కాండను కవితాత్మక శైలిలో హాన్ కాంగ్ రచించారు.
కొడుకు కోసం మార్కెట్ సందుల్లో అలుపెరగకుండా తిరిగిన అమ్మ. అతన్ని పూడ్చి వేసే ముందు తర్వాత తట్టుకోలేక అక్కడి గడ్డి తిని కక్కేసిన అమ్మ . పాలి పోయిన తమ్ముడి మోము చూసి పగతో రగిలిన అన్న. పర్యవసానం గురించి భీతితో తల్లి. తమ్ముడిని రక్షించలేదని అపరాధ భావనతో తన్నుకునే సోదరులు. చూసినా చలించని తల్లి . ప్రాంతీయ ఆఫీసు ముందు చావుకు తెగించి నిలిచిన విద్యార్థులు. కనిపించని పిల్లల కోసం , వారిని పూడ్చిన స్థలం కోసం విరామ మెరుగక తిరిగే తండ్రి. గ్వాంగ్జూ ప్రతి దేశంలో ఉంది.చనిపోయిన పిల్లల కోసం తల్లుల ధిక్కారం. వారిని బంధించి ఊరికి దూరంగా వదిలేసే అధికార మదం. తన పాలు తాగిన కుర్రాడి మాటలు వచ్చిన, నడక నేర్చిన జ్ఞాపకాలు. దూరం నడకలో ఎండలోనే ఉందామని మారాం చేసే బాలుడు డాంగ్ హో. ఒక తల్లి అనంత శోకాన్ని అక్షరాలలో అందించిన ఈ నవల కళాత్మక వలకు చిక్కని పాఠకులు ఎవరూ ఉండరు!
రచయిత్రి హాన్ కాంగ్ మానవత సరిహద్దుల్లో వడలి రాలిపోయిన కుసుమాల గురించి, దౌర్జన్యాల పట్ల కొందరు సైనికుల అయిష్టత గురించి కూడా రాశారు. ఈ బాధామయ జ్ఞాపకాల వల్ల ఒక తల్లికి కాలం ఆగింది. మరొకరికి కాలం సాగుతూనే ఉంది .బాధితులు నిరంకుశ పాలనకు ఎదురుగా నిలబడ్డారు వారి కళ్ళు చివరి క్షణాల్లో చూసాయి దాడులు చేసే వారిని. క్షణాలు కళ్ళు తెరిస్తే హింస పుట్టింది.ఒకేసారి పోయినవారిది అదృష్టం. నవల చివరలో రచయిత్రి మంచులో కూరుకుపోయిన సమాధుల ముందర కొవ్వొత్తులు వెలిగిస్తుంది. నవల లో చివరి వాక్యం: “ నేను చూశాను మూగగా చరిస్తున్న జ్వాల అంచుల వైపు, ఒక పక్షి కాంతిమయ రెక్కల్లా వెలుగుతున్న దాని వైపు.”
హాన్ కాంగ్ తన నోబెల్ ఉపన్యాసంలో ప్రేమ, హింసల గురించి తనలో సదా రేకెత్తిన ప్రశ్నలు గురించి చెప్పారు. ప్రేమ మన హృదయాల్ని కలిపే బంగారు దారమని చెప్పారు.తాను రాసేటపుడు మొత్తం శరీర భావనలు, అనుభూతుల తో తాదాత్మ్యం చెంది రాస్తానని , ఆ విద్యుత్ తరంగం పాఠకులను తాకినపుడు తాను కదిలిపోతానని హాన్ కాంగ్ చెప్పటం ఆమె విశిష్ట రచనా శైలి రహస్యం చెబుతుంది.
(published on 27 April, 2026 in Aneka in Telugu Prabha Daily)
No comments:
Post a Comment