Sunday, 20 September 2026

ఇహలోక రాజ్యం లోనే మానవ ఘనత

                                             “


     అలెహో కార్పెంటియా (1904-80) క్యూబన్ నవలాకారుడు ,వ్యాస, నాటక, ఓపెరా, లిబ్రెటో   సృష్టికర్త గా, సంగీత శాస్త్రజ్ఞుడుగా  విఖ్యాతి చెందాడు. తాను ఒక ఫ్రెంచ్ వాస్తుశిల్పి   జూలియన్ జార్జ్ కార్పెంటియా  కి  , రష్యన్  భాష ఉపాధ్యాయురాలు లేనా వెల్మోంట్ కు స్విట్జర్లాండ్ లోనీ లోజాన్ లో జన్మించాడు.  తర్వాత  కుటుంబంతో అంతా తరలి పోయిన క్యూబా   రాజధాని హవానాలో  పెరిగాడు .ఫ్రాన్స్, దక్షిణ అమెరికా, హైతీ, వెనిజులా ,మెక్సికోల్లో విస్తృతంగా పర్యటించాడు . క్యూబన్  సంగీతం ,ఆఫ్రో క్యూబనిజంపై  విస్తృత అధ్యయనం చేశాడు . నియంత    మొరాలెస్ పై వ్యతిరేకత వల్ల 1927లో జైలు పాలయ్యాడు.1959 లో జరిగిన క్యూబా విప్లవానికి ,

 ఫిడెల్ కాస్ట్రో కుమద్దతు ఇచ్చాడు. 1966లో క్యూబా రాయబారి గా ఫ్రాన్స్ లో ఉన్నాడు


    కార్పెంటియా పారిస్ లో ఉన్నపుడు సర్రియలిజం ప్రభావంలో పడ్డాడు. కార్పెంటియా రచనల్లో  మ్యూజిక్ ఇన్ క్యూబా,ది కింగ్డమ్ ఆఫ్ దిస్ వల్డ్, ది లాస్ట్ స్టెప్స్, ఎక్స్ప్లోజన్ ఇన్ ది క్యాతెడ్రల్, రీజన్స్ ఆఫ్ ది స్టేట్, ది హార్ప్ అండ్ ది షాడో ముఖ్యమైనవి. ఆయన రచనా శైలి ప్రభావం గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ ,  మారియో వర్గాస్ లోసా, కార్లోస్ ఫ్యూంటెస్,  ఇసాబెల్ అల్లెండ్ తదితరులపై కూడా ఉంది. కార్పెంటియా తన రచనల్లో ’బరోక్’ (  క్లిష్టమైన భాష, సంస్కృతుల సమ్మేళనం ,నాటకీయ, అలంకారిక )  శైలి ఉపయోగించాడు. స్థానిక యాసలను కవితాత్మకంగా , ఐరోపా,ఆఫ్రికా, క్యూబా సంగీత  మిశ్రమాన్ని  ఉపయోగించాడు. అతని రచనలో “రియల్ మార్వలిసో” తర్వాత  మ్యాజిక్ రియలిజం ధోరణికి   దారి వేసింది.  గెరార్డ్ మార్టిన్  రాసినట్లు తాను నల్లజాతి అనుభవాన్ని క్యూబా జాతీయవాద వ్యక్తీకరణలో భాగంగా చేయ యత్నించాడు.


   హైతీ కరేబియన్ సముద్రంలో నేడు దాదాపు కోటి మంది ప్రజలు ఉన్న దేశం. దాని రాజధానీ పోర్ట్- ఓ- ప్రిన్స్. దాని పేరు పర్వత ప్రాంత భూమి అనే అర్థం ఉన్న ఆదిమ ఆరాక్  పదమైన “అయితి” నుంచి వచ్చింది. దాని సంస్కృతి లో ఆఫ్రికన్ , స్థానిక టైనో తెగల తో పాటు ఫ్రెంచ్, స్పానిష్  మిశ్రమ ప్రభావం ఉంది. స్వాతంత్ర్యం ముందు సెయింట్ డొమినిగ్ పేరుతో ఫ్రెంచ్ వలస గా ఉంది.  ఇక్కడ 1791-1804 ల మధ్య లూవెర్త్యూర్ , డెస్సాలీన్ ల  నేతృత్వంలో బానిసలుగా బాధ పడే హైతియన్లు, మిశ్రమ జాతులు కలిసి  ఫ్రెంచ్ వలస వ్యతిరేక పోరాటం చేశారు. 1804 లో  దేశం విముక్తి పొందింది.  గత శతాబ్దిలో అమెరికా  సైనిక జోక్యానికి వ్యతిరేకంగా 1915-34 ల మధ్య  పెరాల్ట్ , తర్వాత బాట్రావిల్ ల నాయకత్వంలో  గెరిల్లా   యుద్ధాలు జరిగాయి. అమెరికా కుట్రల వల్ల నేతలు అమర వీరులై ప్రజల దేశభక్తి పెరిగింది.  1929  లో పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థలో అమెరికా శైలికి వ్యతిరేక పోరు సాగింది. అమెరికా దన్నుతో అధికారం చేపట్టిన ఫ్రాంకోయిస్ డువాలియర్ ప్రజలను క్రూరంగా అణచివేసాడు. ఎన్నికల లేమి, ముఠా హింస ,ఆకలి కేకలు, మానవతా సంక్షోభం తో హైతీ బాధ పడుతోంది.ఈ నాటికీ అమెరికా రాజకీయ, ఆర్థిక పెత్తనం పై ప్రజలు పోరాడుతున్నారు

   

 విమర్శకుడు  పాబ్లో మెడినా ఈ నవల “ది కింగ్డమ్ ఆఫ్ దిస్ వల్డ్”  లో  “చరిత్ర ,గమ్యం ,ప్రకృతిలో పాత్రల ఆలోచనలను తీర్చిదిద్దుతాయ”ని చెప్పారు.ఈ నవల ప్రధానంగా హైతీ , కొంత క్యూబా నేపథ్యం లో సాగింది.ఈ నవల   ప్రారంభంలో బానిస టినోయెల్ తన యజమాని లెనోర్మాన్  డే మేజ్ తో  కలిసి ఒక   మంగలి షాపుకు వెళ్తాడు . అక్కడి మైనపు తలలు, పక్కన కసాయి  అంగడి 

లోని చర్మం వలచిన దూడల తలల సన్నివేశాలు చూసిన బానిసలోని తిరుగుబాటు భావాల సంచలనం.


    టినోయెల్ తన తోటి బానిస , పశ్చిమ ఆఫ్రికాకు చెందిన  మండింగో   జాతీయుడు అయిన మకాండల్ చెప్పే కథలు , వలసలు, యుద్ధాలు ,ఆఫ్రికా రాజుల వీరోచిత గాథలు తో ప్రభావితం అవుతాడు. మకాండల్  ఒక ప్రమాదంలో తన చేయి కోల్పోగా యజమాని అతనిని పశువుల కాపరిగా 


పంపుతాడు .టినోయెల్  అతడ్ని  రోజు కలుస్తూ ఎంతో నేర్చుకుంటాడు.  యజమాని నుంచి పారిపోయిన మకాండల్ తన అనుచర గణాన్ని తయారు చేసుకొని విప్లవానికి సిద్ధమవుతాడు. విషము తయారుచేసి టి నోయెల్ సాయంతో అంతటా వ్యాపింప చేస్తాడు. ఫలితంగా జంతువులు  మనుషులు అందరూ మరణిస్తుంటారు.  వెర్రెత్తిన ప్లాంటేషన్ యజమానులు బానిసలను చిత్రహింసలు పెడతారు . మకాండల్ ఒక  బల్లి, శీతాకోకచిలుక ఊర కుక్క, కీటకం ఇలా బహురూపధారణతో చాలా కాలం తప్పించుకుంటాడు. చివరకు యజమానులు అతన్ని  పట్టుకొని సజీవ దహనం చేస్తారు. లెనోర్మాన్  భార్య చనిపోగా విచారం లేకుండా పారిస్ లో  విలాసాలు సాగిస్తూ  ఒక నటి  ఫ్లోరిడార్ ను తన ప్లాంటేషన్ కు తీసుకుని వస్తాడు.  అతని కామ వాంఛలుకు, బానిసలను శిక్షించడానికి  హద్దులు ఉండవు.



    టినోయెల్    తన పిల్లలకు మకాండల్ కథలు,  అతని కీర్తి పాటలు వినిపిస్తాడు .ఏదో నాటికి అతను తిరిగి వస్తాడని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా  ఉండగా  బౌక్మాన్ నేతృత్వంలో  బ్వా  కేయిమాన్ అడవుల్లో అగ్గి రాజుకుంటుంది . అనామక బానిసలు పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు . వారికి ఒక  వోల్టేర్ వాది, మరో    ప్రీస్ట్ సాయం చేస్తారు.నల్లజాతి  తిరుగుబాటులో యజమాని వర్గం లో వారు అంతం అవుతారు. టినోయెల్  మేడం ఫ్లోరిడార్ను బలాత్కరించడానికి  పరిగెత్తుతాడు. యజమాని లెనోర్మాన్  నల్ల బానిస తిరుగుబాటుదారుల  నిర్మూలనకు గవర్నర్ సాయం కోరుతాడు. లెనోర్మాన్ తన సమయాన్ని పేకాట లో  గడుపుతూ   తన బానిసలని  ఒకరొకర్ని అమ్మేసి జాదం,  వ్యభిచారంలో మునుగుతాడు. నల్లజాతి   తిరుగుబాటు నేత బౌక్మాన్     తెగిన తల ముందు  నిలిచి తిట్టిపోసి ఒక సత్రం కి వెళ్తాడు.అతనితో మిగిలింది  టినోయల్ ఒక్కడే.


    ఇదిలా ఉండగా వంటవాడు  హెన్రీ  క్రిస్టోఫే తన వ్యాపారం మాని సైన్యంలో చేరి చివరకు నల్ల జాతి రాజుగా మారతాడు. తిరుగుబాటు సమయంలో యజమాని వర్గం విలాసాలలో మునిగితేలుతుంది. కొందరు న్యూ ఓర్లీన్స్ ,క్యూబా లో ప్లాంటేషన్ యజమానులుగా పోతారు. పారిస్  యువతి పాలిన్  క్యాప్ సిటీ, ప్లెయిన్ డు నార్డ్  వస్తుంది.  తన వొళ్ళు పట్టే బానిస సోలిమాన్ ను  కనికరించినట్టు తన కాళ్ళను ముద్దాడేలా చేయటం ఆమెకు సరదా. ఇంతలో మహమ్మారి. ఆమె భర్త లీ క్లర్క్  మరణంతో ఆమె  హేతువును మరిచి   ఆఫ్రికన్ దేవతలను పూజిస్తూ , సోలిమన్ తో కలిసి ఆదిమ నృత్యాలు  చేస్తుంది.పాలిన్ నిష్క్రమణ తర్వాత ప్లాంటేషన్ యజమానులు  స్వైర విహారం చేస్తారు. నల్లవారిపై  కుక్కల్ని,  మార్టినిక్ నుంచి తెచ్చిన పాముల్ని  వదులుతారు. నల్లజాతీయులు వారి దేవత  వోగన్ బదాగ్రీ  సాయంతో హేతువు పై పోరాటం చేస్తారు. 


   టినోయెల్  స్వేచ్ఛను సంపాదించి తిరుగుతూ  మీలో పట్నం చేరి నల్లజాతీయుల సామ్రాజ్యాన్ని చూస్తాడు. తాను రాజ భవనం  సాన్స్ సౌసి  చేరానని గ్రహిస్తాడు. తనకు రాజుహెన్రీ తెలుసని అన్నా ఎవరూ పట్టించుకోరు .తాను ముందు ఖైదీగా  తరువాత ఇటుకలు మోసే బానిసగా మారుతాడు .నల్ల బానిసల ప్రాణాలకు లెక్కలేదు. పన్నెండు  ఏళ్ల పాటు బానిసలతో  రాజు కొండమీద  ప్రసిద్ధ కోట  నిర్మాణం చేస్తాడు.  నిర్మాణం పూర్తయే సమయానికి టినోయల్ని విడిచిపెడతారు. అతడు తన పాత యజమాని   శిథిల గృహంలో నెలలపాటు దాక్కుని  బయటికి వస్తే మరల బానిస అవుతానని భయపడతాడు.


    రాజు హెన్రీ క్రిస్టోఫే  కార్నెర్ బ్రేవిల్  వ్యక్తిని సజీవ సమాధి చేస్తాడు. చివరకు తిరుగుబాటులో తన పరివారం అంతా పారిపోతే ,   ఆఫ్రికా నుంచి  సేవకులుగా తెచ్చిన ఐదుగురు నల్లజాతీయులు మాత్రమే మిగులుతారు.  హైతీ కి స్వాతంత్రం రాగానే ఆఫ్రికన్ మార్మిక వాదాన్ని కాదని యూరోపియన్ తరహాలో  తన ఆస్థానం ఉండాలని చూసిన హెన్రీ ఆత్మ హత్యకు పాల్పడతాడు. 


అంతిమగడియలో సత్య దర్శనం అవుతుంది.  టినోయెల్  పాత యజమాని ఇంటిని మృత రాజు హెన్రీ క్రిస్టోఫే సౌధం నుంచి దోచుకున్న వస్తువులతో అలంకరించి తానే రాజు లాగా భావిస్తాడు .ఒకరోజు  ఫ్రెంచ్ మాట్లాడే సర్వేయర్లు వచ్చి అతన్ని, అతని ఆజ్ఞలను  తీసివేసి ఆ ప్రాంతమంతా కొలతలు తీస్తారు. రిపబ్లికన్ మూలట్టో ల చేతిలోకి కొరడా వచ్చింది. 

  

    ముసలి టినోయెల్ రూపాలు మార్చి  చివరికి బాతుగా మారుతాడు. అయితే ఆ బాతుల సమాజంలో ఎవరూ ఎవరిని గొప్పగా చూడరు. ఆ బాతులు  ఇతడ్ని తన గుంపులో చేర్చుకోవు ఇది తన  పిరికితనానికి శిక్ష    అని టినోయెల్ భావిస్తాడు.టినోయెల్ లేచి బల్లమీద నిలబడి   మూలట్టో ల పై తిరుగుబాటుకు ఆదేశాలిస్తాడు .ఇంతలో వచ్చిన  పెనుగాలి.  అతడి జాడ  రాబందుకు మాత్రమే తెలిసింది.


  బానిసగా బ్రతికిన  టినోయెల్ కు  మనిషి ఎవరికోసం బాధపడతాడు అనేది తెలియదని, ఎప్పుడు అతను ఆనందానికి వెంపర్లాడతాడని సత్యం తెలిసి వచ్చింది. అయితే శ్రమించి అభివృద్ధి చేయడంలోనే గొప్పతనం ఉంది .మనిషి అంతా బాగా స్పష్టత ,  ఆనందం ఉండే  స్వర్గంలో కాక ఈతి బాధలు, శ్రమ ఉన్న ఇహలోక రాజ్యంలోనే గొప్పతనం కనుగొనగలడు.

(29 June,2026 , Maha Daily)

No comments:

Post a Comment