ఒక జాతి తన అస్తిత్వాన్ని ప్రకటించడం, వలసపోవటమే ఒక నేరంగా,పాపం గా పరిణమించిన ఆధునిక అనాగరిక కాలం ఇది. యుద్ధాల పేరిట పౌరుల ప్రాణాలు నిర్లజ్జగా హరించే అగ్రరాజ్యం అమెరికా, దానిని సమర్ధించే విశ్లేషకులు కొల్లలుగా తయారైన కల్ల కాలం ఇది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తల్లి గర్భం నుంచి బయటపడటమే వలసగా, తన రక్తంలోనే వలస వేదన మూలాన కవి ముకుంద రామారావు గారు తన ఆవేదనను "ప్రవాసంలో ప్రతిఘటన : సమకాలీన టిబెట్ కవిత్వం" పుస్తకంలో వర్ణించారు.
ముకుంద రామారావు గారు తెలుగులో తొమ్మిది కవిత్వ పుస్తకాలు , పదిహేను తెలుగు అనువాదాలు , రెండు ఇంగ్లీషులో,ఒకటి కన్నడంలోకి , ఆరు కథలు/ వ్యాసాల పుస్తకాలు రాశారు. ఐదు పుస్తకాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. వివిధ గ్రంథాలలో పదకొండు పరిచయ వ్యాసాలు వచ్చాయి. అగ్ర రాజ్య వలసవాద చరితలో భారతీయ వలస కార్మికుల దోపిడీని బయట పెట్టిన “అగమ్య గమ్యాలు” 2025 లో వెలువడింది. అజో- విభో- కందాళం ఫౌండేషన్ వారి 2024- ప్రతిభామూర్తి జీవిత కాల సాధన పురస్కారంతో పాటు ఎన్నో ఇతర పురస్కారాలు పొందారు. ఆయన అనువాద గ్రంథాలు–అదే ఆకాశం, అదే గాలి, అదే నేల,అదే కాంతి, అదే నీరు, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ బహుమతి గ్రహీతల కవిత్వం, భరత వర్షం, చర్యా పదాలు, మిణుగురులు, ఇసుక నురగ, మియా కవిత్వం, బెంగాలీ బౌల్ కవిత్వం, వలస హోద మందహాస, The Smile That Migrated and Other Poems మొదలగునవి.
టిబెట్లో ప్రకృతి, కుటుంబం, బౌద్ధమత సంప్రదాయాలకు చారిత్రకంగా ఎంతో విలువ ఉంది. చైనా తన అవసరాల రీత్యా టిబెట్ ను ఆక్రమించడంతో 1959 మార్చిలో లాసా లోని బౌద్ధ మఠాలు దెబ్బతిని, వేలాదిమంది సన్యాసులు మరణించారు. దలైలామా , ఆతని అనుచరులు భారతదేశానికి
పారిపోయి వచ్చారు .1960లో Khampa తిరుగుబాటుదారులు హింస వదిలి బౌద్ధ బోధనలకు అనుగుణంగా శాంతి మార్గం పట్టారు. టిబెట్ దేశం ఇతర నేపాల్, ఆఫ్ఘనిస్తాన్లలాగా "ల్యాండ్ లాక్డ్ " దేశం.
టిబెట్ ప్రవాస కవిత్వం కవితాత్మక రాజకీయ సాధనం. తరాలు గడిచినా తమ దేశం స్వేచ్ఛకు నోచుకోనందున కవుల కలాలు అనే మేఘాల నుంచి జారిన కన్నీటి కవితలు ప్రజలను ఆలోచింపచేస్తాయి. ఒక జాతి సమస్యను లేదా సంప్రదాయం పట్టును అర్థం చేసుకోవడంలో మార్క్సిజం వెనుకబడితే అది అమెరికా లాంటి అగ్రరాజ్యానికి వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. తరాల జగడం, ప్రవాస కష్టాల తరువాత నేడు టిబెట్ ప్రవాసులు కోరుతూ ఉంది స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి ,తమ అస్తిత్వానికి గుర్తింపు మాత్రమే.
ప్రవాసంలోని టిబెట్ జాతి కవుల్లో మూడు తరాలు ఉన్నాయి. అక్కడే పుట్టి చాలాకాలం ఉండి 1959 తర్వాత వలస వచ్చినవారు మొదటి తరం. ఇక రెండవ తరంలో మొదట ఉన్న ఉత్సాహం స్థానంలో ప్రవాస వాస్తవాలతో సర్దుబాటు చేసుకున్న కవులు ఉన్నారు. మూడోతరం కవులు తిరిగి వెళ్ళే కలలు పట్ల నిరాసక్తత , చేదు వాస్తవాలను ఎదుర్కొంటున్నారు. వీరందరి కవిత్వంలో తమ మూలాల పట్ల ఆకాంక్ష, స్వేచ్ఛ పట్ల ఉద్వేగం, జన్మభూమి పట్ల మమకారం ఉన్నాయి.
మొదటి తరం కవుల్లో ఒకరైన రబ్ గై భసంగ్ మాతృభూమి కౌగిలింత తీయదనం ప్రపంచంలో దేనికి లేదని రాస్తే , మరో కవి చోగ్యాం ట్రున్గ్ పా "ధ్యానంలో అనుభవ శూన్యుడు / చెడు కల కన్నా / వేట కుక్కని పోలి ఉంటాడ”ని ఒక హైకూ రాశాడు. శాంతి, కరుణ ల కోసం దలైలామా హృదయాభివృద్ధిని ఎప్పుడు వదులుకోవద్దని సందేశం ఇచ్చారు. మరొక కవి Dondhup Gyal తన కవిత 'యువ జలపాతం ' లో అద్భుతమైన ఇమేజరీ ఇచ్చారు. స్వచ్ఛమైన , తెల్ల కిరణాలు " జరీ పట్టు మీద/ నామీద/ చిలుక రెక్కల నమూనాల / నెమలి పింజంలా విచ్చుకొని ” ఉన్నాయని రాశారు.
రెండవ తరం కవుల్లో చరిత్రకారుడు, రాజనీతిజ్ఞుడు అయిన సోల్టిమ్ షకబ్బా తన కవితల్లో ఒక దేశం కీర్తి ప్రజల్లో , దాని నాశనం పాలకుల్లో, సంపద దాని విలువలలో, జాతి హృదయం వీధుల్లో, నమ్మకాలు నిశ్శబ్ద ప్రార్ధనలో ,భవిష్యత్తు దాని సంకల్పంలో చూడవచ్చు అని అంటారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన "ఐ హావ్ ఎ డ్రీమ్" లో రాసినట్లు చైనీయుల, టిబెట్ పిల్లలు ఒక స్నేహ బల్ల దగ్గర కూర్చోవడం చూడాలని అనుకుంటారు. మరో కవితలో ఏడవటానికి సిగ్గు వలదని, చనిపోవటానికి భయపడద్దని చెబుతారు. మరో కవిత ‘నా టిబెట్’ లో తన దేశాన్ని "ఆకాశంలో వజ్రాల్లా/మంచులో మెరుస్తుంది అంటూ దలైలామాను ప్రశంసిస్తారు. తన ఆత్మ అజేయమని
పదునైన మాటల్లో రాశారు.
బౌద్ధ సన్యాసిగా , టిబెట్ అధ్యయనాల సహాయ ఆచార్యుడిగా ఉన్న మరొక కవి పాల్జోర్ ‘ప్రపంచ మార్గాలు’ కవితలో " నా వెదురు వేణువు ధ్వని /గాఢంగా ఉన్నప్పుడు/ ఆహ్వానం లేకుండా/ పక్షులు నా చుట్టూ తిరిగాయి/ ఈ విరిగిన వేణువు నిస్సార ధ్వని ఇప్పుడు /సముద్ర కాకుల దృష్టినైన ఆకర్షించడం లేదు” అన్నారు . ఇంకో కవి స్వాతంత్రం కోసం వేచి ఉండటం శరణార్థ స్త్రీ కి తప్పదని , ఒంటరితనం గురించి రాస్తూ శరీరం ఎక్కడ ఉంది అని కాక "మన హృదయం, మనసు ఎక్కడ లేవో / నిజమైన ఒంటరితనమదే" అని అంటారు. కే . తొండప్ అనే చరిత్రకారుడు మరియు పాత్రికేయుడు రాస్తూ " జీవన సాగరంలో తుఫానులో ఒంటరి ఓడ కోసం "గొప్ప వాగ్గేయ కారుని ఖజానాలో / ఏ స్వర సమ్మేళనం ఎవరికి తెలుసు" అంటారు.
మూడవ తరం కవుల్లో జైలు పక్షిగా మారిన టెన్జిన్ సుండూ తన ధిక్కార స్వరం వినిపించారు .తాను పుట్టు కాందిశీకున్ని అంటూ , టిబెట్ను చూడకుండా కలలు కంటాను అక్కడే చనిపోదామని అని రాశారు. అహింస కోసం శత్రువులను క్షమించానని, కానీ తన ఇంటిని కాచేందుకు చనిపోయిన నాన్నకు ద్రోహం చేశానని కొన్ని సార్లు అనుకుంటాను అని పలికారు. నా ‘"టిబెటనత్వం’ కవిత లో "ఒక లక్ష, అనేక వేల వివిధ సమ్మేళన సాంస్కృతిక ఆధిపత్యాలలో/ చక్కగా కలిసిపోయి నానిన టిబెటన్లమ్/ప్రపంచ సానుభూతి రాశులం" అని రాశారు.
మరో కవి చక్రిషర్ తన కవితలో మాతృభూమి కోసం "ప్రపంచ చట్టాలలో బంధించబడిన / పనికిరాని నా చేతులు నరకండి /మా అమ్మ దగ్గరికి నడవలేని/ సంకెళ్లు వేసున్న నా కాళ్ళను నరకండి" అని ఎంతో ఆవేదనతో, ఆగ్రహంతో రాశారు. భచుంగ్ డుమ్రా సోనం తన కవితల్లో తాను సాలీడు , తేనెటీగ నిశ్శబ్దంగా ‘ఏకాంతపు మడుగు’ ను పంచుకుంటారు .కవికి నిశ్శబ్ద విశ్రాంతి కావాలి. గమ్యం లేని గాలికి ఎగిరే అడవి పూల చెట్టులా కవి. అదృశ్యమైన గాయకుడు మోక్షం సాధించాడో లేదో తెలీదు కానీ మంటలు మండుతూనే ఉన్నాయి. మరో కవితలో ‘నేను ఎప్పుడు పుట్టాను’ అని తన తల్లిని అడిగితే , ఆమె అతడు పుట్టిన ఏడాది పంటలు పండక , ఆకలితో ఇల్లు, పశువులు పోయాయని, మతం హతమయిందని, తాతను జైలులో హీనమైన పనులకు వాడుకున్నారని, చౌరస్తాలో పవిత్ర గ్రంధాలు ఆహుతి , పొరుగు వారు శ్రమ శిక్షకు పోయిన ఏడాది అని, ఒకరి తర్వాత మరొకరు అదృశ్యమైన ఏడాది అని చెబుతుంది .
తొలి మహిళా కవయిత్రి వాంగ్మో ధోంపా బాగా అజ్ఞానంలో స్వేచ్ఛగా ఉండటం సాధ్యం కాదు అని పలికితే ,మరో కవయిత్రి లీడ్కర్ "అసాధ్యం ఎదురైనప్పుడు/ ఆచరించే సమయం ఆసన్నమవుతుంది/ అక్కడ సిద్ధాంతానికి ఎక్కువ సమయం ఏదీ ఉండదు " అని , ఆ క్షణంలో ప్రియమైన వారిని రక్షించాలి. ప్రార్థించాలి. పరిగెత్తాలి అని రాశారు.
కవయిత్రి డోల్కర్ ‘నీడలు' అనే కవితలో " రాత్రి చాలాసేపు ఉంటుంది.../ కానీ ఎలా పాడాలో మీరు మర్చిపోకూడదు/ పాటలు ఇలాంటి సమయాల కోసమే రూపొందాయి" అని రాశారు.
తన తల్లి మరణించిన "18వ రోజు" కవితలో సోనం అనే కవయిత్రి కుండపోత వర్షం గురించి ప్రస్తావిస్తూ "కన్నీళ్ళ నాపుకోకుండా భారంగా అలా/ బాధాకర కష్టాల భారీ మేఘాలను ఖాళీ చేసుకోవడం/ నన్ను క్షణికమైనా తేలిక పరుస్తుంది" అన్నారు.
మరో అజ్ఞాత కవి 'పీఠభూమి నా ఇల్లు' పర్యావరణ పరిరక్షణ కోసం రాస్తూ ఖనిజాల కోసం ఆమ్ని మాచక్ పర్వతాన్ని తొలగిస్తూ భూమిని నిర్వీర్యం చేసి, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తుంటే లక్షలాది ఏళ్ళు దాన్ని కాపాడిన జనం మౌనంగా , నిస్సహాయంగా ఉంటే "ఇకమీదట, మన పవిత్రమైన ఆమ్నీ మాచెన్ మీద/ తెల్లటి గొర్రెల మందలు మళ్లీ కనపడవు/
పశువుల కాపరుల మాట మళ్ళీ వినపడదు/ ఆ మురికి అత్యాశా పరులు త్వరలో నిన్ను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారు" అని రాయటం హృదయం కరిగిస్తుంది.
ముకుంద రామారావు గారి పరిశోధనాత్మక “ప్రవాసంలో ప్రతిఘటన" జాతి అస్తిత్వం గురించి, వలస సత్యం గురించి, వలస ప్రజలను, ముఖ్యంగా శ్రమ జీవులను అన్ని దేశాల వారు అనుమానంతో
కాకుండా ఆదరణతో చూడాలని కోరే హృదయ గీతం.
( Appeared on 6 April, 2026 in Maha Daily)
No comments:
Post a Comment