వీరనారులకు“ప్రచ్ఛన్న ప్రభువు” నివాళి (పుస్తక సమీక్ష )-డా.జె.రవీంద్రనాథ్
ఇథియోపియన్- అమెరికన్ రచయిత్రి మాజా మెంగిస్తే ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా లో 1974లో జన్మించారు. ఆనాటి విప్లవ పరిస్థితుల కారణంగా తనకు నాలుగేళ్ల వయసులో ఆమె కుటుంబం దేశాన్ని విడిచి మొదట నైజీరియా, కెన్యా లలో ఉండి చివరకు అమెరికాలో స్థిరపడ్డారు. మాజా మెంగిస్తే న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సృజనాత్మక రచనలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ని పొందారు . ఆమె ముఖ్య రచనలు- “బెనీత్ ద లయన్స్ గేజ్,“ “ది షాడో కింగ్” అనేవి. ఆమె ప్రముఖ పాత్రికేయురాలుగా, మానవ హక్కుల కార్యకర్తగా, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత గా చేశారు. ప్రస్తుతం వేస్లేయన్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులుగా పనిచేస్తున్నారు.
మాజా మెంగిస్తే నవల “ద షాడో కింగ్” ( ‘‘ప్రచ్ఛన్న ప్రభువు’’ )బుకర్ ప్రైజ్ తుది జాబితాలో చోటు సంపాదించింది .ఈ నవల ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని చిత్రించింది. దీనిలో జ్ఞాపకం యొక్క ప్రాముఖ్యత, “యుద్ధంలోని నిజమైన అసమానతల్లో చరిత్ర మరియు ఆధునికత పక్కనే చోటు చేసుకోవడం” చూడవచ్చు అని విమర్శకులు అభిప్రాయపడ్డారు.ఆమె రచనలపై టోనీ మారిసన్, జేమ్స్ బాల్డ్విన్, ఎడిత్ వార్టన్ ల ప్రభావం ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అక్టోబర్ 2, 1935 న ఇథియోపియా పై ఇటలీ దురాక్రమణ ఆరంభమైంది. చక్రవర్తి హైలీ సెలాసి 2 మే, 1936 న దేశం.విడిచి ప్రవాసం వెళ్ళాడు. బ్రిటన్ సహకారంతో తిరిగి మే 5 , 1940 న స్వదేశం వచ్చాడు. యుద్ధ కాలంలో ఫాసిస్టుల వల్ల మొట్ట మొదట దేశం నుంచి వెళ్లి , మరలా మొట్ట మొదటిసారి తిరిగి వచ్చిన చక్రవర్తి హెయిలీ సెలాసీ అని చర్చిల్ రెండవ ప్రపంచ యుద్ధం పై తాను రాసిన ఉద్గ్రంధం నాలుగో భాగం
” ది గ్రాండ్ ఎలయెన్స్” లో రాశాడు. యుద్ధం చివరలో స్థానికులు అడిస్ అబాబా లోని ఇరవై వేలమంది ఇటాలియన్ పౌరులను ఊచకోత కోస్తారని చర్చిల్ భయ పడ్డాడు. ఇటాలియన్ ఫాసిస్ట్ ఓటమితో “ఆక్రమణ, వలసల ద్వారా ప్రాచీన రోమ్ స్పూర్తితో ఆఫ్రికన్ సామ్రాజ్యాన్ని నిర్మించాలని ముస్సోలీని కల అంతమైంది” అని రాశాడు. 1936 -41 ల మధ్య ఇటాలియన్ ఫాసిస్ట్ అధీనంలో తప్ప మరి ఎన్నడూ వలసకు గురి కాని దేశం ఇథియోపియా ఒక్కటే.
మాజా మెంగిస్తే నవల “ది షాడో కింగ్” ఇథియోపియా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటన – ఫాసిస్ట్ ఇటలీ ఇథియోపియా ఆక్రమణ కు వ్యతిరేకంగా ఇథియోపియన్లు, ముఖ్యంగా మహిళల పోరాటాన్ని చిత్రిస్తుంది. 20వ శతాబ్దం లో ఇథియోపియా చరిత్రలో ఒక దశను రచయిత్రి వర్ణించిన తీరు నవలను ఏక బిగిన చదివిస్తుంది. యుద్ధ కాలం లో ఆఫ్రికాలో లిబియా, ఇథియోపియా లలో ఇటాలియన్ ఫాసిస్ట్ లు చేసిన దురాగతాల్లో పోలిక ఉంది. స్త్రీలను ఆక్రమించుకోవాల్సిన ప్రాంతంగా చూసి ఒక దేశ సమాజ నాశనానికి ఒడిగట్టటం రివాజు అయింది అని, న్యాయం దొరకనిదే క్షమాపణ ఉండదని మాజా మెంగిస్తే ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. ఈ నవల ఒక దృశ్యకావ్యం.గ్రీకు నాటకంలోగా కోరస్ మధ్యలో తన గొంతు ను వినిపిస్తుంటుంది. రచయిత్రి కథనం మూడు భాగాల్లో (‘దురాక్రమణ,’ ‘ప్రతిఘటన,’ ‘తిరిగి రావడం’) పలు గొంతుల ద్వారా, చలన చిత్రం లోని మాంటేజ్ టెక్నిక్, జ్ఞాపకాల ద్వారా ముందుకు వెనక్కు సాగుతుంది.
ఈ నవల లో రెండు ప్రవాహాలు కనిపిస్తాయి ఒకటి ఇథియోపియన్ల ఫాసిస్టు వ్యతిరేక పోరాటం, మరొకటి పోరాటకారుల్లోనే అంతస్తుల వైరుధ్యం. తొలుత కిదానే, అతని భార్య ఆస్టర్ తమ సేవకులపై అధిపత్యం చలాయిస్తారు .తల్లిదండ్రులను కోల్పోయి తమ దగ్గరకు చేరిన హీరుట్ ఆస్టరు అనుమానంతో కొరడా దెబ్బలు కొడుతుంది. దీనికి నిరసనగా హీరోట్ ఇంట్లో చిరు వస్తువులు తీసి గుర్రపు శాలలో పాతిపెడుతుంది. ఆస్టర్ తనను గాయపరిచిన తరువాత హిరూట్ తన సొంత ఇంటికి వెళదామనుకుంటుంది. ఆమె వేదన చూసి గుర్రాలు సైతం సంతాపం క్రోధం చెందుతాయి. తాను గీతే, ఫాసిల్l ల కూతురు .పంట బాగా పండిన కాలంలో పుట్టింది . ఇప్పుడు చుట్టూ చీకటి . మధ్యలో ఆమె గాయం. చీకటి గదిలో ఒంటిగా ప్రసరించే వేదన .ఆమెకి తల, పదాలు, జ్ఞాపకం పేరు ఏమీ లేవు .
ఆస్టర్ తన భర్త కిదానే ఇతర వీరులతో మాట్లాడుతుండగా తన పుత్ర శోకం, భర్త పట్ల అసంతృప్తి నుంచి బయటకొచ్చి ఓ పత్రికలో ఇటాలియన్ సమర వనిత మారియా యువ ఫోటో చూస్తుంది. వంట గదిలోకి వచ్చి తన వంట మనిషితో “వారు మన ఇంటిలోకి కవాతు చేస్తుంటే మనం ఊరికే కూర్చోము” అని అంటుంది. ఆస్టర్ ఇంటి నుంచి వెళ్లి తన గుర్రం మీద ఒక వారం పిచ్చిగా తిరిగి ఇతర స్త్రీలను రణరంగానికి సిద్ధం చేసింది.రేడియోలో రాణి మేనేను మాటలు ఆమెలో వీరత్వాన్ని రగిలించాయి.ఆమెను భర్త కిదానే నిరుత్సాహపరచ ప్రయత్నిస్తే “ఇది నీ ఒక్కడి దేశమా?” అని ప్రశ్నిస్తుంది .1935 అక్టోబర్ 3 న లక్ష మంది విదేశీయులు మారెబ్ నది దాటారు.
ఆస్టర్ తోటి మహిళలను సమర సన్నద్ధం చేసేటప్పుడు ఒక మహిళ “ఇది మా దేశమా? మేము కష్టపడితే ,ఆమె తీసుకుంటుంది ” అంటుంది. ” ఇటాలియన్లను రానీయండి.వారే ఈ దురాశాపరుల కన్నా మేలు” అని కూడా అంటుంది. మరో స్త్రీ “ఎవరికి కావాలి మీ రాజు ? ఇటాలియన్లు రానియ్యండి” అనగా ఆస్టర్ కోపంతో ఇష్టం లేని వారిని పొమ్మంటుంది. తాము ఓడిపోతే ఈ మూర్ఖులకు ఏమవుతుందో తెలియదు అంటుంది .
ఆస్టర్, హిరూట్ లు యుద్ధంలో సహాయక పాత్ర కాక ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్ధమవటం కిదానే కి నచ్చదు కానీ వారి సంకల్ప బలం శక్తి ముందు అతనికి దిక్కు తోచదు. చనిపోతున్న డావిట్ నుంచి తనకు వారసత్వం గా వచ్చిన తుపాకీని తీసుకుందని కినిసిన కిదానే హిరూట్ ను నేల మీదకు తోసిపడేస్తాడు. రచయిత్రి దేశంలోని ఉన్నత, లేని వర్గాల మధ్య వైరుధ్యాన్ని ఇక్కడ చూపించారు. ఫాసిస్టులు ఇథియోపియాకు ఇటలీ , ముస్సోలీనిలే దిక్కు అంటారు.
మరో వైపు రాజు తన కూతురు జేన్బ్వర్ కు వివాహం చేస్తే అల్లుడు ఇటాలియన్లతో చేతులు కలుపుతాడు. కిదానే సైన్యంపై విమానాలు. పొలాలపై, నదుల పై వదిలారు గ్యాస్. పిల్లలు, స్త్రీలు చనిపోయారు .ఘోరమైన యుద్ధ క్రమంలో ఒక సారి హిరూట్ చనిపోతున్న బెనియంను వదిలి పారిపోతుంది .కానీ ఈ జ్ఞాపకం ఆమెను వెంటాడుతుంది. గాయపడ్డ వారికి కట్టు కడుతూ దాన్ని మరిచేందుకు ప్రయత్నం చేస్తుంది. అందరూ ఆమె సేవను పొగుడుతారు.
ఫాసిస్టు యుద్ధ విమానాలు తెచ్చే విధ్వంసం ఎలా ఉందంటే : ” కాలే నగరాలు, మండే పర్వతాలు ఇళ్ళ శిథిలాలు , కూలిపోయే చర్చిలు, మసిబారే పొలాలు మరిగే నదులు ,విషపూరిత ఆత్మ పడిపోయే చెట్లు , పేలే బాంబులు, ఊపిరాడని జనాలు ముక్కలైన కాయాలు, లోయల్లో సాగే అసంఖ్యాక యూనిఫాం లోని సైనికుల బారులు , పేలే తుపాకులు , ఊగే బాయినెట్లు, లేచే గొంతులు” ఫాసిస్టు యుద్ధ గీతం పాడుతూ.
రెండో భాగం ‘లో హిరూట్ , అక్లిలు లు దగ్గరవుతారు. జీవనోల్లాస భరిత నాట్యం చేస్తారు. కొడుకు లేని కిదానే లో కామ ఫలితంగా హీరోట్ ను బలవంతంగా అనుభవిస్తాడు. ఆమె దేశం కోసం పోరాటంలో కిదానే నాయకత్వాన్ని ఆమోదించినా, తాను స్వయంగా తన తండ్రి నుంచి పోరాడి తీసుకున్న తుపాకీ వుజిగ్ర ను కిదానే బలవంతంగా తీసుకోవడం ఆమకు కోపం తెప్పిస్తుంది. తనపై అతడు చెందిన లైంగిక అత్యాచారానికి వ్యతిరేకంగా ఆమెలో రేగిన క్రోధంగా మారి యుద్ధ సాహసాలకు దారితీస్తుంది. కోరస్ చెబుతుంది నిస్సహాయత వదిలి నిలబడి పోరాటం చేయమని . దయ కోసం యాచించకు అని. ఆమె తల్లికి తానే పెళ్లి చేశానని, గుడిసె ఇచ్చాను అని కిదానే అంటాడు .ఇది గుర్తుపెట్టుకో నీవు పోయే రోజు అంటుంది ఆమె. అక్లిలు దగ్గరకు వస్తాడు. ఆమెను ఓదారుస్తాడు .ఆహారం ఇస్తాడు ఆమె ఉనికి గౌరవం. ఆమె ప్రేమించబడింది. తర్వాత రోజు ఆస్టర్ ఆమెదే తప్పంటుంది . అతన్ని చంపితే నా చేతుల్లో నీవు చస్తావు అంటుంది ఆస్టర్. కిదానే మరోసారి హిరూట్ దగ్గరికి వెళ్తాడు .ఆమెలో నిర్లిప్తత. అతడిలో అశక్తత. ఆమెకు యోధురాలుగా మారటమే మార్గం. సీఫు కొడుకు తారీకు ను ఫాసిస్టులు ఉరి వేస్తారు. అతని శరీరం తీసుకొచ్చారు తండ్రి, ఇతరులు కలిసి. ఫాసిస్టు కల్నల్ ఫ్యూసెలి చావు తప్పింది. వాడి మగతనం పోవాల్సింది. అడిస్ అబాబా లో వైస్రాయ్ పై హత్యాయత్నం. ప్రతీకారంగా నోళ్లు తెరిచే జైళ్లు. ఊచకోత. తగలబడుతున్న నగరం.
నవలలో మరో పాత్ర వంట మనిషి. గతంలో ఆస్టర్ కు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని తెలిసి ఆమె పారిపోయే యత్నంలో సాయం చేస్తుంది. ఫలితంగా ఆస్టర్ తండ్రి నుంచి చావు దెబ్బలు తింటుంది. ఆస్టర్ హింసకు గురైన హిరూట్ తో కన్నీరు కళ్లలోనే కుక్కుకోమంటుంది. తర్వాత యుద్ధ క్రమంలో పరిస్థితి నచ్చక రంగం నుంచి వెళ్లి, చివరకు ఫాసిస్టు సైనిక అధికారి కల్నల్ ఫ్యూసెలి దగ్గర స్నేహితురాలుగా ఉన్న ఫైఫీ దగ్గర చేరుతుంది. చివరలో శత్రు రహస్యాలు కిదానే బృందానికి చేరవేసి విజయాన్ని తోటి దేశీయులకు సుగమం చేస్తుంది.
నవలలో మూడో భాగం లో ఫోటోల ద్వారా చరిత్ర కథనం సాగుతుంది. చిత్రహింసలతో, అడుక్కుంటూ, నిరసిస్తూ, ఆశలతో ,క్రోధంలో, వణుకుతూ చేతులు వెనక కట్టబడి, దెబ్బలతో వాచిన మొహాలతో ఎందరో ఇథియోపియన్లు. నిర్బంధ శిబిరంలో క్రూరమైన అదుపులో. ఫోటోగ్రాఫర్ నవరో తండ్రి యూదు వ్యతిరేకత వల్ల అతన్ని తిరిగి రావద్దని రాసిన లేఖ. కల్నల్ పుసిలో చేతుల్లో కొండ మీద నుంచి లోయ లోకి తోయబడి చనిపోయే వారిలో భయం లేకుండా కుక్ ఒక పొడి ఇచ్చి వారి పేర్లు తెలుసుకొని , సైనికాధికారి స్నేహితురాలు ఫైఫీకి ఇచ్చి ఆ పేర్లన్నీ రికార్డు చేసి దాచిపేడతారు.
హిరూట్ తనను ఒకప్పుడు భౌతికంగా హింసించిన ఆస్టర్, తాను ఖైదీలుగా ఉన్నప్పుడు, శత్రువులు వారి నగ్న ఫోటోలు తీసినప్పుడు అచలంగా ఉండి, ఆస్టర్ కు మనోధైర్యం ఇస్తుంది. తాను ఆశాక్షితిజం వైపు నిత్యం చూస్తూ ఉంటుంది. ఫాసిస్టు సైనిక అధికారి కల్నల్ ఫ్యూసెలి ఆమె ప్రవర్తన అర్థం కాక ఫోటోగ్రాఫర్ నవారో ను పంపి ఆమె మాతృ భాషలో మాట్లాడి విషయం కనుక్కోమంటాడు . అతడు తన తల్లిదండ్రుల ఫోటో చూపి ఏదో చెబుతాడు .ఆమెకు తన తల్లిదండ్రులు యాదికొస్తారు. చనిపోయేందుకు అమ్హారిక్ భాషలో చావు కు సంబంధించి ఓ పదం చెబుతాడు. తర్వాత “నేను /అతడు /మేము చస్తాం” అని అంటాడు. హిరూట్. అమ్హారిక్ భాషలో “మేము చావము” అంటుంది. ఫోటోగ్రాఫర్ తన తండ్రి ఉత్తరాలు, ఫోటోలు దాచిన స్థలం చూస్తుంది హిరూట్. జైలు నుంచి ఇద్దరు వీర వనితలు తప్పించుకుంటారు. యుద్ధం ముదిరింది. కల్నల్ ఫ్యూసెలి చస్తాడు. చనిపోయే కిదానే తల హిరూట్ తన వొడిలో తీసుకుని “నేను యోధురాల్ని .నిన్ను మర్చిపోతారు. నన్ను గుర్తుంచుకుంటారు” అంటుంది.
యుద్ధానంతరం హెయిలీ సెలాసీ తిరిగి దేశం వస్తాడు. దశాబ్దాల తరువాత 1974లో అతడికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు. ఫోటోగ్రాఫర్ హిరూట్ ను కష్టపడి కలిసి తన జ్ఞాపకాల పేటికను ఇమ్మంటాడు. ఆమె అది అతడికి ఇచ్చి దురాక్రమణదారుడు వెళ్ళి పోవాలి అంటుంది. ఆమె రాజును కలిసి ఇటాలియన్ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో అమరవీరుల పేర్లు చదివి వినిపిస్తుంది.వారే నిజమైన షాడో కింగ్స్. దురాక్రమణదారులు చరిత్ర హీనులు.
ఒక సామాన్య సేవకురాలైన హిరూట్ గొప్ప యోధురాలిగా ఎదగటం, ఖైదీగా ఉన్నప్పుడు ఆమె చూపిన పట్టుదల, మానవతా గుణం దీనిలో ఉన్నాయి. ఇటలీ దురాక్రమణ సమయంలో ఇథియోపియా రాజు హెయిలీ సెలాసీ దేశం విడిచి లండన్ వెళ్ళిపోతాడు. రాజు స్థానంలో అదే పోలిక గల మెనిం (అర్థం ‘శూన్యం’)ను రాజుగా నటింపజేసి సామాన్యులను ఉత్తేజ పరచమని ఆమె ఇచ్చిన సలహా అమలు చేసిన ఇథియోపిన్లు కిదానే నేతృత్వంలో ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతారు. ఈ పోరాటంలో కిదానే భార్య ఆస్టర్, సేవకురాలైన హిరూట్ వీర మహిళలుగా ఎదిగి జనుల పాటల్లో కీర్తించబడతారు. ఈ నవల ఇథియోపియా వీర మహిళలకు ఒక కవితాత్మక అక్షరనివాళి.
No comments:
Post a Comment