మారియో వర్గస్ యోసా రచించిన ‘ఆండీస్ పర్వతాల్లో మృత్యువు’ (’Death in the Andes)నవల పెరూ లోని క్వెచువా ఆదిమవాసుల , సామాన్య ప్రజల, సైనిక అధికారుల, విప్లవకారుల అందరి జీవితం గురించిన ఆసక్తికరమైన నవల. యోసా తనదైన శైలిలో మూఢనమ్మకాలు, ఆచారాలు, తప్పుడు ప్రచారాలు , రాజ్య అభివృద్ధి యత్నాలు, భిన్న సంస్కృతి పాయల, శృంగారం అన్నింటినీ మేళవించి ఈ నవల రాసారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆండీస్ పర్వత శ్రేణి దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి సుమారు 8,900 కిలోమీటర్లు దాకా వెనిజులా, కొలంబియా, ఈక్వడార్, పెరూ, బొలీవియా, చిలీ మరియు అర్జెంటీనా అనే ఏడు దేశాలకి విస్తరించి ఉంది.
పెరూలో జన్మించిన యోసా 2010 లో నోబెల్ బహుమతి గ్రహీత. ఈయనపై ఫ్లోబే, విలియం ఫాక్నర్, జేమ్స్ జాయిస్, టాల్స్టాయ్, దాస్తొయెవ్‌స్కీ, ఇవాన్ బునిన్ మొదలైన ప్రఖ్యాత రచయితల ప్రభావముంది. ఆయన టైం ఆఫ్ ది హీరో’ , ‘ది గ్రీన్ హౌస్’, ‘ది ఫీస్ట్ ఆఫ్ ది గోట్’, ‘ఆంట్ జూలియా అండ్ ది స్క్రిప్ట్ రైటర్’ ,’ది వార్ ఆఫ్ ది వరల్డ్,’ ’ డెత్ ఇన్ ది ఆండిస్,’ అనే ప్రఖ్యాత నవలలు రచించారు. తన్ను తాను “ వాస్తవికతతో మత్తుడై, చుట్టూ జరిగే చరిత్రతో, నేటిపై మరింత భారాన్ని మోపే గతంతో ఆకర్షితుడైన నవలాకారుడిన”ని వర్ణించారు.
ఆధునిక యుగంలో పెరూ:
20వ శతాబ్దం మొదట్లో పెరూ దేశంలో గ్రామాల్లో భూస్వాములు, తీరప్రాంతాలలో వాణిజ్య ఫైనాన్స్ వర్గం వారు ప్రాబల్యం వహించారు. 1930 లో పుట్టిన ఏపీ ఆర్ఏ, కమ్యూనిస్టు పార్టీలు బలంగా లేకపోవడం వల్ల అల్పజనాధిపత్యం (oligarchy) 1960 ల దాకా నడిచింది. తరువాత వచ్చిన పాపులర్ ఎలక్షన్ పార్టీ, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీలు కూడా రాజ్యంలో సంస్కరణలు తేవటంలో విఫలం అయ్యాయి. 1968- 75 ల మధ్య అధికారం చేపట్టిన జనరల్ అల్వరాడో రాజ్యం పునాది పెంచేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు అని జో మేరీ బర్ట్ పుస్తకం “పొలిటికల్ వయోలెన్స్ అండ్ ది ఆథారిటెరియన్ స్టేట్ ఇన్ పెరూ”లో విశదీకరించారు. జనరల్ అల్వరాడో తెచ్చిన లోతైన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ సంస్కరణలు వల్ల విదేశీ పెట్టుబడి ఆధీనంలోని సహజ వనరులు తిరిగి వచ్చేందుకు దారి ఏర్పడింది. అయితే రుణదాతలు , వ్యాపారుల బ్లాక్ మెయిల్ వల్ల విప్లవానికి అంత్యక్రియలు జరిగాయి అని ఎడ్వర్డో గాలియానో తన గ్రంథం ‘ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా’ లో రాశారు.
జో మేరీ బర్ట్ రాసినట్లు 1974లో ప్రపంచ ఆయిల్ సంక్షోభం, రాగి లాంటి పరిశ్రమలు దెబ్బ తినటం వల్ల ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరిగాయి. 1975లో అధికారంలోకి వచ్చిన ఫ్రాన్సిస్కో బెర్ముడేస్ , తర్వాత 1980లో వచ్చినఫెర్నాండో బెలాండే నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, ఆర్థిక పొదుపు లు వల్ల ప్రజలు, సమాజం మధ్య దూరం పెరిగింది. 1980-85 ల మధ్య జిడిపి స్తంభించి , ద్రవ్యోల్బణం రెండింతలు అయి , అప్పులు 70 శాతం పెరిగి, నిజ వేతనాలు 35 శాతం తగ్గాయి. రాజ్య హింస పెరిగి దేశంలో 1/3 వ వంతు, జనాభాలో సగం మంది మిలటరీ పాలనలో నానా కష్టాలు పడ్డారు.
సంధి యుగంలో సంఘర్షణ:
పెరూ దేశం ప్రజాస్వామ్య సంధి యుగంలో ఉండగా రాజ్యానికి , షైనింగ్ పాత్ గెరిల్లాల మధ్య సంఘర్షణలో 69 వేల మంది మృతిచెందగా , 12 వేల మంది అదృశ్యం అయ్యారు. ఆరు లక్షల మంది తమ ప్రాంతం నుండి వలస పోయారు. 40 వేల మంది పిల్లలు అనాధలు అయ్యారు స్త్రీలపై అత్యాచారాలు, అసంఖ్యాక ప్రజల పై చిత్ర హింసలు వందలాదిమంది కారాగారాల్లో బాధపడ్డారు. పెరూ లో ఆర్థిక, రాజకీయ, సంక్షోభం, అరాచక హింస, బలహీన రాజ్యం , అవినీతి మూలాన షైనింగ్ పాత్ పోరాటం సాగింది. 1992 లో గతంలో ఫిలాసఫీ ప్రొఫెసర్, షైనింగ్ పాత్ నేత గుజ్మన్, ఇతర నేతల అరెస్టుతో ఉద్యమం తగ్గుముఖం పట్టింది. 1990-97 చివర ఒక చిన్న ముఠా పాలన సాగి రాజ్య శక్తి ” నిరంకుశత్వానికి లైసెన్స్” గా మారింది.
మారియో వర్గస్ యోసా నవల “డెత్ ఇన్ ది ఆండిస్” లో కథ ప్రధానంగా నాకోస్ అనే అవుట్ పోస్టులో ఇద్దరు సైనికుల – కార్పొర ల్ లిటుమా ,సివిల్ గార్డ్ టొమాస్ ల మధ్య సంభాషణగా సాగుతుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు అదృశ్యం అవుతారు. వీరు నరబలికి గురయ్యారని అనుమానంతో నిజం తెలుసుకొనేందుకు తీవ్రయత్నాలు చేస్తుంటాడు. వీరిద్దరే ఉన్న ఆ అవుట్ పోస్టులో టొమాస్ తన జీవితంలోని ఆకస్మిక ఘటన ప్రేమ, తాను ‘రక్షించిన’ మెర్సిడెస్ తో కలిసి పలాయనం, చివరకు తన గాడ్ ఫాదర్ సాయంతో ఇక్కడకు రావటం గురించి వివరిస్తాడు.ఇది లిటుమాకు తన నిస్సారమైన జీవితంలో ఉపశాంతిగా ఉంటుంది. ఇంకా నవలలో షైనింగ్ పాత్ గెరిల్లాల చర్యలు -ఫ్రెంచ్ పర్యాటక యువజంటను, పర్యావరణ వేత్త, పరిశోధకురాలు సెనోరా డి హార్కోర్ట్, ఇంజినీర్ లను వర్గ శత్రువుగా భావించి చంపడం, ప్రజా కోర్టులో ఇన్ఫార్మర్స్ ను చంపడం గురించి, రాళ్లు కొట్టే పని వారి జీవితాలు, కారణం తెలీని సంఘటనలు గురించి ఉంది.
అదృశ్య వ్యక్తులు:
ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా మాయమైన ముగ్గురివి మూడు భిన్న కథలు. వీరిలో పెడ్రో టినోకో మూగగా, అమాయకుడిగా ఉండి బలవంతంగా సైన్యంతో చేర్చబడి, పారిపోయి కొండ ప్రాంతాల్లో తిరిగి చివరకు ప్రజలచే రక్షించబడతాడు. కొంతకాలం తరువాత వికూన్యా జంతువులు ఉండే ప్రాంతంలో స్థిరపడి వాటికి మాలిమి అవుతాడు. అయితే అతన్ని నమ్మించిన విప్లవకారులు వికూన్యాలు ఉండే ప్రాంతం వచ్చి అది బహుళ జాతి సంస్థల కుట్ర అని వాటిని నిర్మూలిస్తారు. చివరకు అతడు లిటుమా , తోమాస్ కర్రెన్యో ల దగ్గర పనివాడుగా ఉండగా మాయం అవుతాడు. మరో వ్యక్తి అల్బినో కసిమీరో ఇండియన్ తెగలతో వ్యాపారం చేస్తుంటాడు .అతను మత్తులో తనను మోసం చేశాడని ఒక వనిత చెప్పినా ఆమెను నిరాకరిస్తాడు. తర్వాత గుర్తుకొచ్చి ఎంత వెతికినా ఆమె తిరుగుబాటులో చేరి కనిపించకపోవడంతో ఒకరోజు వారి చేతుల్లో కాల్పుకు గురైన ఎలాగో బయటపడి నకో ప్రాంతం చేరి అక్కడ మళ్లీ మాయం అవుతాడు. మూడో వ్యక్తి డిమిట్రియో చాంకా ( గతం లో డాన్ మెదార్దో ) ఒకప్పుడు విప్లవకారులు ఒక గ్రామంలో ప్రజాకోర్టు పెట్టిన తరువాత దానికి సహకరించారని పేరుతో గ్రామస్తులను అంతం చేసినందుకు విప్లవకారుల కోపానికి గురై పారిపోయి నాకో లో మేస్త్రీ గా కొండమీద భార్యతో కలిసి ఒంటరిగా బతుకుతూ చివరకు కనపడకుండా పోతాడు. ఈ ముగ్గురిని కొండ ఆత్మలు బరి తీసుకున్నాయా లేక గెరిల్లాలు లు చంపారా అనేది తెలియదు.
స్వేచ్ఛా వనితలు:
అయితే ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు డోనా అడ్రియానా, మెర్సిడెస్ అనేవి.
అడ్రియానా వ్యక్తిత్వంలో ధైర్యం, స్వతంత్రత, నిశ్చలత్వం అన్నీ ఉన్నాయి . లిటుమా తన్ను పిలిపించి అదృశ్య వ్యక్తుల గురించి అడిగితే అది కొండ ఆత్మలు పని ఉంటుంది. ఆమె మధ్య వయసులో ఉంటుంది. రాత్రులు క్యాంటిన్ లో భర్తకు సాయంగా ఉండి ఖాతాదారులకు మద్యం అందిస్తుంది.పగలు కార్మికులకు వంట చేయడం, రాత్రులు వారికి హస్తసాముద్రికం, భవిష్యత్తు జోస్యం చెప్పటం ఆమెకు రివాజు. రాత్రిపూట మరోటి కూడా చేస్తుంటుందని లిటుమా అనుమానం.ఆమె గురించి ఎన్నో కతలు. ఒక మంత్రగత్తె అని, ఒక గని పని వాని భార్యగా ఉన్నప్పుడు ఒక పిశాచాన్ని చంపినట్లు ప్రచారం.
కార్పోరల్ లిటుమా ఎంత గుచ్చి అడిగినా మనుషుల అదృశ్యం గెరిల్లాల పని మాత్రం కాదంటుంది. అయితే ఆమె, ఆమె భర్త డియోనిసియో ఏదో దాస్తున్నారని లిటుమా కు తీరని అనుమానం. ఆమె టొమాస్ చేయి చూసి అతని విఫల ప్రేమ గురించి చెబుతుంది.ఆ మనుషుల అదృశ్య రహస్యం తెలుసుకునే క్రమంలో ఒక ప్రొఫెసర్ నుంచి పెరూ చరిత్ర లో 18వ శతాబ్ది
నుంచి ఇంకా జాతి వారు తమకు విధేయులు కాని హువాంకాలు, చంకాలను మరో ప్రాంతంలోకి చెదరగొట్టారని లిటుమా తెలుసుకుంటాడు . ఇంకాలకు వ్యతిరేకంగా స్పానియార్డులకు హువాంకాలు సాయం చేసి నందున వారంటే ఆధునిక చరిత్రకారులకు సానుభూతి లేదని ప్రొఫెసర్ అంటాడు. అయితే స్పానియార్డులు తమకు తోడ్పడిన హువాంకాలపై కూడా మరింత బానిసత్వం నెలకొల్పారు. ఆ ప్రొఫెసర్ ద్వారా డోనా ఆడ్రియానా జీవితం గురించి కూడా లిటుమా కు తెలుస్తుంది.
అడ్రియానా గ్రామం అందమైనది, పాడి పంటల తో బాగుండేది. చిల్లర వర్తకుడు సాల్సెడో ఒక ట్రక్కులో తిరుగుతూ ఏడ్రియానా తండ్రి కొట్టుకు మందులు బట్టలు పరికరాలు తెచ్చేవాడు. ఒకసారి వచ్చినప్పుడు భీకరంగా కనిపించాడు. ఒకరోజు గ్రామస్తులు అతని శిథిలమైన ట్రక్కును చూసారు. అతను మాత్రం లేడు. గ్రామం దగ్గర కొండ గుహల్లో ఉంటూ అకస్మాత్తుగా బాటసారులపై దాడి చేసే నరమాంసభక్షకుడిగా మారాడు. అతనికి ఒప్పందం ప్రకారం ఒక అమ్మాయిని వంట చేసేందుకు, ఇంకా సహాయకులుగా యువతులను గ్రామస్తులు పంపేవారు. ఈ పిశాచిని చంపటానికి అడ్రియానా తిమోటియో కి సాయం చేసింది. అయితే వారి వివాహానికి గ్రామం లో వ్యతిరేకత ఉండటంతో ఆమె గ్రామాన్ని కాదని నాకోస్ దగ్గర కాపురం పెట్టింది . శాంటా రీటా గని దగ్గర తిమోటియో పనికి కుదిరాడు.
అడ్రియానా జీవితం సాదాగా సాగుతుండగా డియోనిసియో బృందం అక్కడికి వచ్చారు. ఆ బృందం లేని పండగ లేదు .అతడు అమ్మే పిస్కో కు, అద్భుతమైన నృత్య గానాలకు,వశీకరణ శక్తికి అందరూ ఫిదా. అతడి గురించిన కథలెన్నో. అతడు పిశాచి, ముఖి , వైద్యుడు, మంత్రగాడు, జ్యోతిష్కుడు ఎవరో తెలియదు.అడ్రియానా ఆ బృంద సంచార , విశృంఖల జీవితం గురించి తెలుసుకుంది. ఒకసారి డియోనిసియో తో నృత్యం చేసి ఆనందం పొందింది. ఆమె సహజీవనం చేస్తున్న టిమోటియో అసూయతో ఆమెను దండించాడు. ఆమె డియోనిసియో తో వెళ్లి మిక్కియాకో సమాజంలో పెళ్లి చేసుకుంది .అతని ప్రభావంతో సంగీతం , జోస్యం నేర్చుకుంది. ఆమె గురించి రకాల పుకార్లు వచ్చాయి. టిమోటియో మృతికి ఆమె కారణమని , మంత్ర మనిషి అని పిలిచేవారు. కాల క్రమంలో ఆమె, డియోనిసియో నాకోస్ దగ్గర స్థిర పడ్డారు. అక్కడ రహదారి పనులు మొదలయ్యాయి. ఆ ఊరికి క్షీణ దశ, చావు సమీపించాయి. పిశాచాల నెలవు అయింది. పండుగ ఉత్సవాలులో ఒకరిని పెద్దగా ఎన్నుకుని చివరలో ఊరు బాగు కోసం అతన్ని వేటాడేవారు.
హువానిటా గానంలో, నృత్యంలో తన్మయమై, ఇతరులతో మిళితమై, స్వేచ్చగా ఉండటం, పాట , నృత్యం అదే నీవు గా భావించడం వివేక మార్గం . శరీరం అనే జైలును వదిలి ఆత్మల జగత్తులో ప్రవేశించడం. అడ్రియానా తానే గానమై, నాట్యమై , ఆత్మగా మారేది. ఆ ప్రదర్శనలో తర తమ జాతి భేదాలు లేవు. నాట్యం తానే అయిన మూగ , తెలివి తక్కువ పెద్రితో ను ఎవరూ చంపలేదని , అన్నీ ఉన్నా కార్పోరల్ లిటుమా వణుకుతున్నాడని , ఎపుడు టెర్రుకో లు లేదా విప్లవకారులు చంపుతారు అని జడుస్తున్నాడని అడ్రియానా అతడ్ని విమర్శిస్తుంది.ఇక్కడ అడ్రియానా సహజాత జీవితం నుండి దూరమైన బలహీన, బానిసత్వ, నాగరిక , ఆధునిక జీవితాన్ని తూర్పార బడుతుంది. ఈ పాత్రను స్వేచ్ఛ గా , ధైర్యంగా, రాజ్యానికి బెదరకుండా బ్రతికే తీరులో రచయిత చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం.
ఈ నవలలో రెండో ప్రధాన స్త్రీ పాత్ర మెర్సిడెస్. ఇప్పుడు లిటుమా తో ఉన్న తోమాసు గతంలో హాగ్ అనే అధికారికి అంగ రక్షకుడు. టింగోమారియా ప్రాంతంలో తన గది లో మెర్సిడెస్ ను
మోకాళ్ళ మీద నగ్నంగా కూర్చుండ బెట్టి బాధిస్తుండడంతో ఆమె రోదన విన్న టొమాస్ తన యజమాని హాగ్ ను కాల్చివేస్తాడు . అది తెలిసి అతడి మిత్రుడు ఇస్కారియోత్ సలహా మేరకు
ఆమెతో కలిసి పారిపోతాడు. ఆమె నన్ను ఎవరు కాపాడమన్నారు, నువ్వు నాశనం అయ్యి నన్ను నాశనం చేసావు అని టొమాస్ తో అంటుంది. తాను హాగ్ స్నేహితురాలిని అని, అతడు తిడితే ఏడ్చానని, అది అతన్ని ఉత్తేజ పరచడానికి అని టొమాస్ కర్రెన్యో కు ఏమీ తెలియదని మెర్సిడెస్ అంటుంది. పారిపోయే క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. తనను అతడు ప్రేమ, ఇష్టం వల్ల ఆ హత్య చేశాడని ఆమె అంటుంది. ఆమె అతన్ని దగ్గరకు తీసుకుంటుంది.ఆమె స్వేచ్ఛగా మాట్లాడటం, తాను నిద్రలో పలవరించిన మాటలు ఆమె నోటి నుంచి విని అవి తన నిజమైన ప్రేమ భావమంటాడు టొమాస్. తాను ఇంకా అలా అనుకోవడం లేదని అబద్ధం చెప్పనని మెర్సిడెస్ అంటుంది. ఆమెను లిమా నగరంలో పెళ్లి చేసుకుంటానంటాడు. ఆమె తనతో టొమాస్ స్నేహితుడు ఇస్కారియోత్ అవమానకరంగా మాటాడితే హెచ్చరిస్తుంది.
మెర్సిడెస్ తన గురించి టొమాస్ కు చెబుతూ ఒకసారి తన కోసం ఒక క్లబ్బులో జూదం ఆడారని తాను అతన్ని ప్రేమించడం లేదని, తనకు స్వేచ్ఛ అంటే ఇష్టమని అంటుంది. ప్రయాణంలో తన గుర్తింపు పత్రాన్ని కోల్పోయిన మెర్సిడెస్ కి ఆందోళన పెరుగుతుంది. తల్లి సలహా మేరకు టొమాస్ తన కమాండర్ గాడ్ ఫాదర్ ను కలుస్తాడు. టొమాస్ ఆమెను తన గాడ్ ఫాదర్ ని కలవమన్నప్పుడు ఆమె తన గౌరవాన్ని ఎవరూ ఏమీ చేయలేరని నిబ్బరంగా చెబుతుంది. ఆ గాడ్ ఫాదర్ ఆమెతో నిత్యం చేస్తూ ఆమె శరీరాన్ని తాకుతూ ఆమె మనస్తత్వాన్ని పరీక్షిస్తుంటాడు. ప్రపంచంలో ఆ ముసలోడు కోసం తాను టొమాస్ ను ఎన్నటికీ మోసం చేయను అని మెర్సిడెస్ అంటుంది.టొమాస్ తన ప్రేమ జ్వరంలో ఆమెకు మియామీ లో వారిద్దరి జీవితం గురించి ఊహిస్తాడు. ఆమె ఏడుపును ఆపేందుకు తాను దాచుకున్న నాలుగు వేల డాలర్లు ఇచ్చేసి ఆమెను స్వేచ్ఛగా జీవించమంటాడు. తాను గాడ్ ఫాదర్ సాయంతో నాకో సైనిక ఔట్పోస్ట్ లో కార్పోరల్ లిటుమా తో చేరతాడు. నవల చివరలో మెర్సిడెస్ అతడ్ని వెతుక్కుంటూ వచ్చి తాను కూడా అతన్ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఈ పాత్రలో మెర్సిడెస్ జీవిత అనుభవాల నుంచి పొందిన పరిపూర్ణత, స్వేచ్ఛా ప్రియత్వం, మాటల్లో నిజాయితీ, సాహసం, నిజమైన ప్రేమకు చివరకు తాను ప్రతిస్పందించడం ఆమె వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి.
లిటుమా విశ్వ ప్రయత్నం చేసినా అక్కడి ప్రజల మనసులో రహస్యం తెలుసుకోలేక పోతాడు. కొండ చరియలు విరిగి పడటం నుంచి అదృష్టవశాత్తు బయటపడతాడు. బ్యారక్స్ నుండి బయటికి వచ్చి మేఘాలు లేని ఆకాశంలో తారలని, అర్థ చంద్రుడ్ని, అవి తమ కాంతిని చిమ్ముతున్న ఆండీస్ పర్వత శిఖరాలను చూస్తాడు అని రచయిత నవలను ముగిస్తాడు.
ఏ దారిలో ముందుకు? :
డెబోరా కోన్ అనే విమర్శకురాలు నవలా రచయిత యోసా దేశంలో రెండు పక్షాల హింసను వ్యతిరేకించాడని , గ్లోబలైజేషన్ లో సాంస్కృతిక భేదాల ఏకీకరణ ఆధునికీకరణ కు అనివార్య ఫలితంగా భావించాడు అని రాశారు. ఐతే యోసా నవల చదివినపుడు లాటిన్ అమెరికాలో కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల రాజ్యం లేని చోట, బలహీనంగా ఉన్న చోట విప్లవోద్యమం సాగుతుంది అనుకోవడం, చివరకు అది ఆధిక్యతా రాజ్యహింస వల్ల ముగియడం అనే చారిత్రక విషాదం గుర్తుకొస్తుంది. పెట్టుబడి దారి విధానానికి సమాధి తవ్వే శ్రామిక వర్గాల విశ్లేషణ , ఆ వర్గాలలో ప్రగతిశీల పార్టీలకు తగు పట్టు లేకపోవడం, వారి మధ్య సాలిడారిటీ నిర్మించలేకపోవడం, సాంకేతిక జ్ఞానం పెంచిన రాజ్య నేపథ్యంలో మార్పు దారిని కొత్తగా అన్వేషించాలి.
No comments:
Post a Comment