Tuesday, June 2, 2020



నల్లనాగు ల్లాగు మబ్బులు ముంచుకొచ్చె వేళ 
అంచుల్లొ చూద్దాం వెండి సూర్యుని దీప్తులు
అజ్ఞానం నెత్తి మీద కత్తి పెట్టిన కాలంలో
పదును పెడదాం వివేక ఖడ్గ అంచులు
అలజడి వాన ఆగక జోరుగా కురిసే కాళ రాత్రి 
ఎదురు చూద్దాం ఉదయం తెచ్చే హరివిల్లు కోసం 
 అబద్ధంకు అందరూ కరచాలనం ఇచ్చే గడియ 
నిబద్ధతతో చెలిమి చేద్దాం నివురు కప్పిన సత్యంతో
మార్పు గొంగళి పురుగులా పాకే వేళ 
అద్దుదాము ఊహా జగత్తుకి సీతాకోక చిలుక రంగులు
ఎవరూ మన వైపు తొంగి చూడని ఏకాంత క్షణంలో
ముచ్చట్లు పెడదాం నిశ్శబ్ద నిశిలొ ప్రియ తారకలతో 
దూరమే జీవన సారమైన దరి
స్మరిద్దాం ప్రాణికోటి గుణమైన ఐక్యజీవితం
చైతన్య హరిణాన్ని కొండ చిలువ హరించే సమయాన 
యక్ష ప్రశ్నించాలి  మానవ ప్రపంచ పాత రోత రీతులు
స్పృశించాలి  దివ్య భవిష్య లోక  సరిహద్దులు.
లోకం వేసింది ఒక అడుగు వెనక్కి 
మృత్యులోయ అంచుల్లో నుంచి
 హాయిగా ఆనందిస్తున్నాయి
తరువులు, చిరు ప్రాణులు, మూగజీవులు
చావు భయం లేక ఆటాడుకుంటున్నాయి 

ఆగామి తరాలను మరిచి
అంతరాలను పెంచి
అసుర సంపద సంచయంలొ
అమ్మ పాలు తాగి ఆ రొమ్ము గుద్దిన 
అంధ మానవ జాతికి 
అక్షులు తెరుచుకున్నాయి

శబ్దంలోనో , నిశ్శబ్దంలోనో
 శతకోటి యుగాల పూర్వం 
పురుడోసుకుని
పరిణమించిన ప్రపంచానికి 
మరణ శాసనం వ్రాసే హక్కు నీ కెక్కడిదని
నిలదీసి అడిగింది భూమాత. 

రోజూ మిల మిల మెరిసే సూర్యోదయం 
ఇచ్చే ఆనందాన్ని
మనసారా అనుభవించలే ని అర్భకుడవంది .

ముసిరిన భయజలద పటలి నిముషంలో చెదిరింది 
వెలుగు అంచులతో నిలిచింది వెంటనే
ఆ దృశ్యమూ అదృశ్యమై
నిర్మలాకాశాన నెలవంక వెలిగింది
ఎనలేని సంతోషం హృదయకలువలా విరిసింది.

 నిత్య పరివర్తన మన మతంగా, అభిమతంగా మారాలి
అరకొర  సిధ్ధాంతాలు, అనవసర రాధ్ధాంతాలు మానాలి
అమృతత్వమే మన పరమార్థమని ఎరగాలి

మనిషి లేకున్నా ప్రకృతి చిరకాలముండేను
ప్రకృతి వినా మనిషి క్షణకాలాన ఒరిగేను.


చెట్టు కిందనే ప్రాచీన రుషుల ధ్యానం 
చెట్టు కిందనే సిధ్ధార్థుడి జ్ఞానోదయం 
రాలిన ఆకుల్ని తిరిగి తెచ్చుకునే నిత్య జవ్వని చెట్టు
ఎండకీ, వానకీ, చలికీ నిలబడే స్థితప్రజ్నురాలు 
గీతా సారం దానికేనాడో తెలుసు
పూలు, పండ్లు, నీడలా నిచ్చి
కూలిన పిదప తనువును సైతం అర్పిస్తుంది 
తల్లిదండ్రులు, ప్రకృతి, సమాజాల నుంచి
పుచ్చుకోవడమే కాని ఇవ్వడం తెలీని మనిషి 
ఎప్పటికయ్యేను మనీషి!?

అర్థం లేని పరుగు సుడిగుండాన మునిగే మనం
నిత్యం ప్రకృతి సన్నిధిలో పొందగలం సంయమనం

తెల్ల, నల్ల, ఎర్ర  రంగుల రంగుల సీతాకోకచిలుకలు
మనోల్లాసాన్ని మోసుకొనితెస్తాయి
గులాబీ రేకులను చిదిమి
సిల్కు పురుగుల్ని చంపి
సుఖలాలసలో జనం
మారకం విలువ పిశాచి పూజలో మరిచాము నిజ మూల్యం 

ప్రతి రోజూ ఏదో కోయిల రాగం
తెలియని పిట్టల సంగీత స్వర సమ్మేళనం
ఆనంద క్షణాలు అందించి పోతాయి

సంపద కోసం సమరంలో శోకాన్ని ఇస్తారు మనుషులు
నాగరికత కడుపులో దాగుంది రాచకురుపు
అశేష ప్రజావళిని అష్ట దరిద్రంలో ఉంచేది 'ప్రగతి'

రోజూ చూసే దృశ్యంలోనే కనిపిస్తుంది  ఏదో కొత్త అందం 
రోజూ సాగే చరిత్రలోనే అన్వేషించాలి నవప్రగతి  చందం.