Monday, 19 October 2026

నియంత నిఘా నీడలో

 

          


“రెండు  రెళ్లు నాలుగన్నందుకు

గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో 

క్షేమం అవిభాజ్యం అంటే 

జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో ” - శ్రీ శ్రీ 


     గ్వాటెమాల కి  చెందిన మిగెల్ ఆంజెల్ ఆస్టూరియాస్  కవి, నవలాకారుడు,నాటక కర్త , పాత్రికేయుడుగా ప్రఖ్యాతి చెందారు.  విద్యార్థి పోరాటాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1923లో లా  డిగ్రీ తీసుకున్నారు.  అర్బెంజ్ ప్రభుత్వ పాలనలో   పౌరసత్వం  పోయి  ప్రవాసం లో గడిపారు. పారిస్ లో ఉన్నపుడు సర్రియలిస్టు , ప్రయోగాత్మక ఉద్యమాలకు దగ్గరగా ఉన్నాడు.  ఎన్నికల్లో మోంటెనెగ్రో  గెలిచిన తర్వాత  స్వదేశం వచ్చి పౌరసత్వం పొంది రాయబారిగా పని చేశారు.  ఆస్టూరియాస్  జీవితంలో చాలా భాగం నియంతలైన కాబ్రేరా ,   ఉబికో అనే నియంతల పాలనలో గడిచింది. తన  పుస్తకం “ది ప్రెసిడెంట్” ను 12 ఏళ్ల పాటు రహస్యంగా కాపాడి అర్జెంటీనాలో ప్రచురించాడు.  తన నవలను  స్పానిష్ వలస, స్వాతంత్ర్యం తరువాత కాలంలో రాజకీయ నియంతృత్వానికి వ్యతిరేకంగా  రాశారు



  ఆస్టూరియాస్ తన నోబెల్ బహుమతి   స్వీకార  సందర్భంగా ఉపన్యాసంలో చెప్పినట్లు  లాటిన్ అమెరికా వస్తువుగా ఉన్న  నవల  ప్రతిదీ - వారి  చారిత్రక క్షణానికి మానవ సాక్షి గా తీసుకోబడింది.లాటిన్ అమెరికా   నవలలు ప్రజలను కాచేందుకు ప్రపంచం లోని  నైతిక  శక్తులను సమీకరించే యత్నం చేస్తాయి. లాటిన్ అమెరికా అత్యుత్తమ నవలలు రాసినట్లు కాక మాట్లాడుతున్నట్లు ఉంటాయి. నవలాకారులు తమ ప్రజల గొంతును శబ్ద, నీతి, అలంకార సంపన్నమైన భాషలో విశ్వ జనీనం చేయటంలో నిమగ్నమై ఉన్నారు.  లాటిన్ అమెరికా నవలలో ఏదీ మానవజాతి నుంచి  దృష్టిని మళ్ళించకుండా, దానిని సంపూర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. బహుశా దాని  వల్ల  పాఠకుని గెలిచి, మదిని కలవరపరుస్తుంది. ఇది సాహితీ కోణంలో నవలను భావ వాహకంగా, సాహితీ భాష ద్వారా  అనూహ్య మ్యాజికల్ విలువతో , లోతయిన మానవ అంచనాతో   జాతుల వ్యాఖ్యాతగా చేస్తుంది. 

  

   ఆస్టూరియాస్ నవల  "ది ప్రెసిడెంట్ " ఒక నిరంకుశ రాజ్యంలో పాలకుల ఇచ్ఛ, అనుచరుల విధేయత,  అవిధేయుల కష్టాలు, సామాన్యుల కడగండ్లు, అమాయకుల పై చిత్రహింసలు, తిరుగుబాటు యత్నాలు,  న్యాయ ,కారాగార వ్యవస్థల పద్మవ్యూహంలో చిక్కిన మనుష్యుల  వెతలు  గుండెకు  హత్తుకునేట్లు వర్ణించబడ్డాయి. ఈ నవల కవితాత్మకంగా ,అలంకారాలతో,  పదాల  అనూహ్య మిశ్రమంతో , చైతన్య స్రవంతి శైలిలో  సాగుతూ  మంచు  కురిసే వేళలో  లోయలు, కొండల్ని చూస్తుంటే వచ్చే అనుభూతి  కలిగిస్తుంది. నిజం ఎర్రటి ఎండలా  కాలిస్తే, చీకటి చిక్కగా నర నరాల్లో కమ్ముతుంది.  తెలుగు రచయితల్లో రా వి శాస్త్రి, బుచ్చిబాబు, అడవి బాపిరాజు  నవల లోని కవితాత్మక వర్ణనలు,   జార్జ్ ఆర్వెల్ డిస్టోపియన్ నవల “1984”  గుర్తుకు  వస్తాయి. రైలు ప్రయాణంలో మారిపోయే దృశ్యాలు, విమాన పయనంలో కాన వచ్చే విచ్చుకున్న పత్తి పంట లాంటి  మబ్బుల  మాయాజాలం  కనిపిస్తాయి. 


   ఈ నవలలో  కల్నల్  సోన్రియే ఒక మూర్ఖ యాచకుడి చేతిలో హతమైతే , ఆ నేరం తనకు నచ్చని వారిపై నెట్టి నియంత అతని  తొత్తులు తమ అధికార లాలస,  ప్రతీకార వాంఛలను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో ఎందరో అష్ట కష్టాల పాలై నిరాశా నిశిలో రాలి పోతారు.   ఈ నవలలో  తన విధేయులపై సైతం నిఘా కన్ను వేసే నియంత,  దేశం కోసం పోరాడినా అధ్యక్షుని ఆగ్రహానికి లోనై పారిపోయిన జనరల్ కెనాలే, మొదట విధేయుడుగా ఉండి తర్వాత జనరల్ కూతురుని అపహరించి,  ప్రేమలో పడి ,పెళ్ళాడి నియంత కోపానికి, వంచనకు గురై  ఏకాంత కారాగారంలో  రాలిపోయిన ఏంజెల్ ఫేస్ ,  అవకాశవాద రహస్య పోలీసులు, అన్యాయంగా చెరసాల పాలై పసికందును పోగొట్టుకొని వ్యభిచార గృహానికి అమ్మి వేయబడిన ,  కల్నల్  సోన్రియే హత్యా నేరం పై జైలు పాలై ఉరి శిక్ష పడ్డ లాయర్ కల్వరెజ్,  అతని విడుదల కి  తల్లడిల్లిన  అతడి  భార్య,  తన తండ్రి జనరల్ కెనాలే కి ,తరువాత  ప్రేమికుడు, భర్త   ఏంజెల్  ఫేస్ కు దూరమై  నిరీక్షణలో నీరసించిన కామీల లాంటి పాత్రలు ఉన్నాయి.


   నవలలో పోర్చు చర్చి లో అనూహ్యంగా హత్యకు గురైన  కల్నల్  సోన్రియే కేసు గురించి యాచకులను  చిత్ర హింసలు పెట్టి ఆ నేరం మరో జనరల్ కెనాలే , లాయర్ కల్వరెజ్ మీద తోస్తారు. ఇక్కడ  భార్యహీనుడి ఏడ్చిన బుగ్గలు " వర్షంలో తడిసిన బుగ్గలు" అని,  విచారణలో రాలిన దోమ గాడు " విరిగిన పెండ్యులం అని,  జడ్జి అడ్వకేట్ పేరు గల అధికారి బగ్గీ దీపాల్ని " మృత్యువు కన్నులలా వెలుగుతున్నాయి” అని రచయిత వర్ణిస్తాడు. కల్నల్ సోన్రియే ను చంపి పారిపోయిన  ఉన్మాది  "ఎముకల్లో పద్మవ్యూహం." లాంటి పదాలు ఉన్నాయి.


అధ్యక్షుడు అనుగ్రహిస్తే అందలం. ఆగ్రహిస్తే బొంద పెట్టడం. సైనిక ఆసుపత్రిలో పలు  చావులకు సోడా ఫ్యాక్టరీ  సల్ఫేట్ హేతువన్నందుకు డాక్టర్ బర్రెనో కు అరెస్టు భయంతో చుక్కలు కనిపిస్తాయి.

 తాను సంతకం పెట్టే పత్రంపై పొరపాటున  సిరా పడేసిన నేరానికి రెండు వందల కొరడా దెబ్బలు తిని కూలిన ఉద్యోగి. 


   అధ్యక్షుడు తనకు ఇష్టమైన ఏంజెల్ ఫేస్ (సైతాన్ అంత అందగాడు, క్రూరుడు) ను పిలిచి జనరల్ కెనాలే కు పారి పొమ్మని సలహా ఇచ్చి , ఆ క్రమంలో అంతం చేయాలని కోరతాడు. ఈ ప్రయత్నంలో ఏంజెల్ ఫేస్ ఆ జనరల్ కూతురు కమీలా  ప్రేమలో పడతాడు. జనరల్ కెనాలే ఇల్లు రహస్య పోలీసులు   లూటీ చేస్తుండగా, జనరల్ పారిపోతుండగా ,అతని కూతుర్ని అపహరించి ఒక చోట దాస్తాడు. ఆమెకు ఎవరూ, పిన తండ్రులు సైతం నియంతకు  భీతిల్లి ఆశ్రయం ఇవ్వరు. తన బిడ్డకు   గాడ్ మదర్ గా ఉన్న  కమీలా కోసం  ఆమె ఇంటికి వెళ్ళిన  నిన్యా ఫెదీన ఇల్లంతా  గందరగోళంగా ఉండటం చూస్తుంది.అక్కడ దొరికిన ఉత్తరం దాచి అనుమానితురాలుగా అరెస్టు అవుతుంది. నియంత అధ్యక్షుని  హయంలో జీవితం ఒక లాటరీ. అమాయకత్వం, నేరాల మధ్య తేడా ఉండదు.నేరం చేస్తేనే మేలు . ముందు జైలు,  కొంత కాలం తర్వాత విడుదల, పదవీ.


    ఆస్టూరియాస్ జైలు గోడల్లో తాండవించే  దానవత్వాన్ని హృదయ విదారక వర్ణన చేస్తాడు. కాసా న్యూవా లో నిన్యా ఫెదీన  పలు మార్లు కూర్చొని, నిల్చొని  అలసిపోయింది.  ఖైదీల గుండెల్లో  బాధలు.  గొంతుల్లో పాటలు.  నిద్రలో కూని రాగాలు. ఆర్త నాదాలు.గాయకుల దైవ దూషణలు.  అవమానాలు బూతులు. జైలు నుంచి వేశ్య గృహానికి దూరం ఒకే ఒక్క అడుగు అన్న  పాట విన్న  నిన్యా ఫెదీన  తన చర్మం సజీవంగా వలిచినా కానీ పడని బాధపడింది. ఇతర ఖైదీలకు వేశ్యా గృహం ఒక స్వేచ్ఛ , వెచ్చని  ఆశలు కల్పిస్తుంది. ఆమె తాను జైలు నుంచి బయటపడగానే పిల్లవాడికి బాప్టిజం చేయాలని  భావిస్తుంది. జైలులో గోడలపై తేదీలు, రాతలు ,బూతు బొమ్మలు, దేవుడి పేరు పక్కనే .రేకుల బదులు వేళ్ళతో పువ్వులు ,  జడ్జిల ,మెజిస్ట్రేట్ ల వ్యంగ్య చిత్రాలు.   విచారణలో ఆమెకు  ఒళ్లంతా వణుకు. జనరల్ కెనాలే ఎటుపోయాడు అనే ప్రశ్నకు  ఆమె దగ్గర జవాబు లేదు.  పసికందుకు  పాలు పడతానంటే  తన్నులు.  తల్లి ఒడిలో గుడ్డ బొమ్మలా పిల్లడు. పాలు తాగబోయి సున్నంలా  రుచి తగిలి  మాని ఏడ్చిన పసి పిల్లవాడు. ఆ దీనురాలికి ఏ దేవత, ఏ దేవుడు , ఏ సెయింట్ రాలేదు తోడు. శారీరక, మానసిక హింస.రాలిన పసి మొగ్గ.


   ప్రకృతి , ఖైదీ బాధలు వర్ణించటం లో  రచయిత ప్రతిభ కనిపిస్తుంది . "స్వర్గం లాంటి  నీలి ఉదయ ఆకాశంలో స్వర్గ సంగీత స్మర సమ్మేళనం మొదలైంది. అదే సమయంలో విరిసిన గులాబీలు , మోగే   గంటలు దేవుడికి శుభోదయం అంటూ ఉండగా,   మరో వైపు కసాయి అంగళ్లలో సున్నితంగా వినవచ్చే మాంస ఖండాల శబ్దం."  నిన్యా ఫెదీన భర్త హెనారో రోడాస్ అనుభవించే చిత్రహింసను  "తన బాధ ఏమిటో పూర్తిగా తెలియకుండా చనిపోయే జంతువు  అణచబడిన అరుపు అతని చివరి నిరసన"  అని వర్ణిస్తాడు.


     జడ్జి అడ్వకేట్ కాసులకు కక్కుర్తి పడి  నిన్యా ఫెదీన ను  పదివేల పేసోలకు  ఒక వేశ్యా గృహానికి అమ్మేస్తాడు . ఆ నేరం సైతం ఆమె భర్త  హెనారో రోడాస్  చేసినట్లు వంచనతో సంతకం పెట్టేశాడు. వేశ్యా గృహంలో ఇతర స్త్రీలు  నిన్యా ఫెదీన చేతిలో శిశువును చూసి  పడిన ఆనందం అంతలో మృత శిశువు అని తెలిసి  ఆవిరి అవుతుంది . వేశ్యా గృహం ఒక సజీవ సమాధి. అక్కడ యజమానురాలు నిన్యా ఫెదీన  వ్యాపారానికి  పనికిరాదని భావించి తాను ఇచ్చిన డబ్బు కోసం ప్రయత్నిస్తుంది.  ఈ  గృహంలో ఏంజెల్ ఫేస్   మేజర్  ఫర్ఫాన్ ను కలిసి అతడు తన తాగిన మైకంలో  విప్లవం అన్నాడని భయపెట్టీ, జైలుకెళ్తే బయటకు వస్తే పదవి వస్తుందని,  అదే బతుకు మార్గమని అంటాడు .ఈ మేజర్  ఫర్ఫాన్ నవల చివరలో అధ్యక్షుడి ఆదరణ కోల్పోయిన ఏంజెల్  ఫేస్ ను నరక కూపం లాంటి జైలు కి పంపిస్తాడు.


      కల్నల్ సోన్రియే హత్య కేసులు ఉన్నాడనే నెపంతో లాయర్   కర్వాహల్ కు ఉరిశిక్ష ఖాయం చేసింది మిలిటరీ కౌన్సిల్. లాయర్  భార్య తన భర్త ప్రాణం కోసం అధ్యక్షుడు దగ్గరికి వెళుతుంది ఆమెది అరణ్య రోదన.  మనిషే మనిషికి అరి. తన తోటి మనుషులను తన లాంటి వారిని, అదే రంగు, అదే  చర్మం , అదే  గొంతు,  అవే  జీవ వ్యాపారాలు. ఎవరైనా ఎలా కాలుస్తారు అనేది ప్రశ్న. తన భర్త విడుదలకై పెట్టిన పిటిషన్ పై ఆమె సంతకం తప్ప వేరే ఎవరు సంతకం చేయరు. ఏవో కొన్ని  ఉత్తరాలు ఆమె భర్తను పొగుడుతూ వస్తాయి.


    అధ్యక్షుడు ఏంజెల్ ఫేస్ ను దౌత్యాధికారి గా పంపిస్తున్నట్లు నమ్మించి వంచనతో ఒక సుదూరమైన జైలులో పెట్టిస్తాడు. ఈ నవలలో ఏంజెల్ ఫేస్ అధ్యక్షుని వీడి పోయేముందు రచయిత   కిఛే   మాయా ఇండియన్ దేవుడు 'టోహీల్ ' మిత్ ను ప్రవేశపెడతాడు. మాయా  సంస్కృతిలో టోహీల్ ఎండ, వాన, యుద్ధానికి దేవత. అతడికి కావలిసింది నర బలి. బదులుగా ఆరాధకులకు   నిప్పు ను  ఇస్తాడు. ఏంజెల్ ఫేస్ కు గిరిజనుల నృత్యం,  రక్త దాహం గల దేవుడు టోహీల్  ను వారు ప్రార్థించే దృశ్యం కనిపిస్తుంది. ఇది ఆధునిక ,అనామక, నియంత కూడా రక్షణ , సామాజిక భద్రత   పేరుతో  తన ఇచ్చ వచ్చినట్లు పాలిస్తూ  పౌరుల బలి కోరుతాడు. తొలుత ఈ నవలకు రచయిత  'టోహీల్' అని పేరు పెట్టడం గమనార్హం.


    గతంలో  కమీలా తన తండ్రికి  మొదట దూరమై, జబ్బు పడి , ఏంజెల్ ఫేస్ సాయంతో కోలుకుని అతడ్ని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె  తన భర్తకు దూరమై ఉత్తరం కోసం అనంతంగా నిరీక్షిస్తుంది.  తన కూతురు పెళ్లిలో అధ్యక్షుడు సాక్షిగా ఉన్న వార్త ,ఫోటో చూసి విప్లవ నేత జనరల్  కెనాలే  కుప్పకూలిపోతాడు. ఏ హక్కుతో సైనికులు తమ భావాలకు, ప్రపంచానికి, జాతికి ద్రోహం చేసే పాలనలకు విధేయంగా ఉండాలని  బలవంతానికి గురవుతారు అని జనరల్ కెనాలే ప్రశ్న.  దోపిడీ దారుల, అధికారంలో  అతిశయంతో ద్రోహం చేసే వారి సేవలో సైనికుడు కావడం కన్నా ప్రవాసంలో మరణం మిన్న అని అతడు అనుకుంటాడు. నియంత అధ్యక్షుడు తిరిగి ఎన్నిక కావటానికి అతడి  భక్త బృందం  విజ్ఞప్తులు చేస్తారు. కామిల్లా  తన భర్త  ఏంజెల్ ఫేస్ జాడ ఎప్పటికీ తెలియక నగరం విడిచి ఒక పల్లెలో కొడుకుతో ఉంటుంది.  


   నరక కూపం లాంటి జైలులో  ఏంజెల్ ఫేస్ కు  నిద్ర కరువు. జైలు గదులలో చీకటిలో, నిశ్శబ్దంలో, మాటల కోసం  ఖైదీల అర్థింపు.  ప్రార్ధనలు. పోరాడే వారికి నమ్మకం, స్వేచ్ఛ ,ఆశ లేదు. వారికి నిద్రాహారాలు  అన్ని అపురూపమే.  "మన పాలరాతి భవనాలు అమాయకుల రక్తంలో  తడిగా ఉన్నాయి .ఒకరు స్వేచ్ఛ కోసం ఎటువైపు చూడగలరు?”  ఒక విద్యార్థి ఖైదీ అందరికీ కావలిసింది ప్రార్థన కాదు.గోడలు బద్దలు కొట్టి విప్లవం లో కలవడం అంటాడు 


 ఖైదీ నంబర్ 17 గా ఉన్న ఏంజెల్ ఫేస్ నానాటికి కృంగి, కృశించి పోతాడు. ఏదో  ఆశ. కొంతకాలానికి పథకం ప్రకారం వచ్చిన మరొక ఖైదీ అతని నమ్మకం  గడిస్తాడు తాను ఖైదీ అవ్వటానికి అధ్యక్షుడి  వనితతో దగ్గరవుదామని ప్రయత్నించానని ,ఆమె ఒక జనరల్ కూతురని , ఆమె  భర్త జాడ లేకుండా పోయాడని చెబుతాడు . ఆమె పేరు విన్న ఏంజెల్ ఫేస్ " తన శరీరమంతా గీరుకున్నాడు అక్కడ ఏమి స్పందన లేకున్నా;  కన్నీరు తుడిచేందుకు మోమును పీక్కున్నాడు, అక్కడ పొడి చర్మం  తప్ప ఏమీ లేకున్నా ; తన చేయి ఎత్తి  రొమ్ము  మీద పెట్టుకున్నాడు , అక్కడ ఏమీ  లేకున్నా;  తేమ దుమ్ముతో కూడిన  సాలెగూడు నేలరాలింది."   నియంత రాజ్యంలో "నోటికి తాళం వేసుకోని వారందరూ సంకెళ్లు వేసుకోవడం మేలు." ఇది  నిన్నటి నియంత పాలనలో  గ్వాటిమాలా. నేడు ప్రతి అప్రజాస్వామిక  రాజ్యంలో  పౌరుడు నిలిచిన నేల. 


    ప్రముఖ విమర్శకుడు గెరాల్డ్ మార్టిన్ దృష్టిలో   " ది ప్రెసిడెంట్"  నవల లాటిన్  అమెరికా జీవితాన్ని అవినీతి సాలెగూడు,  పద్మవ్యూహం లా  చిత్రించి , దానిని విడమర్చాల్సిన బాధ్యత పాఠకునిపై  పెట్టింది. ఇది యాచకుల దీన, హీన, హింసాభరిత  జీవితానికి అద్దం పట్టి పాఠకుని నుంచి జీవన, ఉద్వేగ, నైతిక రాజకీయ  పరంగా తీవ్ర నిబద్ధతను కోరిన తొలి నవల. రచయితకు ప్రజా సంస్కృతి,  దాని సైకాలజీ పట్ల ప్రేమ,  స్త్రీ విముక్తి పట్ల సానుభూతి తెలియజేస్తుంది.  "దేశాలు నగరాలు,  చివరకు నియంతృత్వ  వ్యవస్థలోని టెర్రర్,  అణచివేతలు అంతర్గతమై మానవ చైతన్యమే జైలుగా మారవచ్చు"  అని చూపిస్తుంది.


     గెరాల్డ్ మార్టిన్ రాసినట్టు ఈ నవల రచయిత బాల్యం , యవ్వనాన్ని అత్యంత నిర్దిష్టరూపంలో ప్రతిఫలిస్తుంది. యూరోపియన్  సర్రియలిజం, లాటిన్  అమెరికన్ మ్యాజికల్ రియలిజం కు మధ్యగల ముఖ్యమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. లాటిన్ అమెరికన్ చరిత్రలో అతి ముఖ్య నియంత నవలగా ఉండి  పాఠకుని చైతన్యంపై   బ్లాక్ అండ్ వైట్ నిశ్శబ్ద మూవీ లాంటిది. ప్రగతి , అభివృద్ధిలపై పరోక్షమైన విమర్శ. నియంతల క్రింద ఆధునికీకరణ ఒక ఎలైట్ వర్గానికి మాత్రమే   ఉపయోగపడే ఐడియాలజీ.  ఈ నవల  మిత్,భాషల మధ్య ఆ రెండింటికి ,  అచేతన ల మధ్య బంధాన్ని తెలిపేందుకు  సాహితీ భాషలో ఒక విప్లవం . సామాజిక, రాజకీయ జీవితంలో భాషా సాహిత్యాలలో విప్లవానికి పిలుపునిచ్చి లాటిన్  అమెరికన్ పితృస్వామ్య విధానాన్ని సవాల్ చేసింది. మూడవ ప్రపంచ దేశాలు గుడ్డిగా ఐరోపాను ఎండమావి వెంట  పరుగు  అని తెలిపింది. 


    ఆస్టూరియాస్   రచనల్లో “లెజెండ్స్ ఆఫ్  గ్వాటెమాల,”   “ది ప్రెసిడెంట్,” “మెన్ ఆఫ్ మైజ్” అనే రచనలు ముఖ్యమైనవి..మాయా జాతి బైబిల్” గా పేరున్న “Popol Vuh” అనే గ్రంథ అనువాదానికి  నాలుగు దశాబ్దాలు శ్రమించారు. “స్ట్రాంగ్ విండ్,”  “ద గ్రీన్ పోప్,” “ది ఐస్ ఆఫ్ ది ఇంటర్డ్, ” అనే పుస్తక త్రయంలో   అమెరికన్ యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ   దోపిడీకి వ్యతిరేకంగా  రచించారు. ఆస్టూరియాస్ ను   లెనిన్ శాంతి బహుమతి (1966),   నోబెల్ బహుమతి (1967) వరించాయి. 

   

  ( published in Prajasahithi, October, 2026)      

                 


No comments:

Post a Comment