Monday, 19 October 2026

నియంత నిఘా నీడలో

 

          


“రెండు  రెళ్లు నాలుగన్నందుకు

గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో 

క్షేమం అవిభాజ్యం అంటే 

జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో ” - శ్రీ శ్రీ 


     గ్వాటెమాల కి  చెందిన మిగెల్ ఆంజెల్ ఆస్టూరియాస్  కవి, నవలాకారుడు,నాటక కర్త , పాత్రికేయుడుగా ప్రఖ్యాతి చెందారు.  విద్యార్థి పోరాటాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1923లో లా  డిగ్రీ తీసుకున్నారు.  అర్బెంజ్ ప్రభుత్వ పాలనలో   పౌరసత్వం  పోయి  ప్రవాసం లో గడిపారు. పారిస్ లో ఉన్నపుడు సర్రియలిస్టు , ప్రయోగాత్మక ఉద్యమాలకు దగ్గరగా ఉన్నాడు.  ఎన్నికల్లో మోంటెనెగ్రో  గెలిచిన తర్వాత  స్వదేశం వచ్చి పౌరసత్వం పొంది రాయబారిగా పని చేశారు.  ఆస్టూరియాస్  జీవితంలో చాలా భాగం నియంతలైన కాబ్రేరా ,   ఉబికో అనే నియంతల పాలనలో గడిచింది. తన  పుస్తకం “ది ప్రెసిడెంట్” ను 12 ఏళ్ల పాటు రహస్యంగా కాపాడి అర్జెంటీనాలో ప్రచురించాడు.  తన నవలను  స్పానిష్ వలస, స్వాతంత్ర్యం తరువాత కాలంలో రాజకీయ నియంతృత్వానికి వ్యతిరేకంగా  రాశారు



  ఆస్టూరియాస్ తన నోబెల్ బహుమతి   స్వీకార  సందర్భంగా ఉపన్యాసంలో చెప్పినట్లు  లాటిన్ అమెరికా వస్తువుగా ఉన్న  నవల  ప్రతిదీ - వారి  చారిత్రక క్షణానికి మానవ సాక్షి గా తీసుకోబడింది.లాటిన్ అమెరికా   నవలలు ప్రజలను కాచేందుకు ప్రపంచం లోని  నైతిక  శక్తులను సమీకరించే యత్నం చేస్తాయి. లాటిన్ అమెరికా అత్యుత్తమ నవలలు రాసినట్లు కాక మాట్లాడుతున్నట్లు ఉంటాయి. నవలాకారులు తమ ప్రజల గొంతును శబ్ద, నీతి, అలంకార సంపన్నమైన భాషలో విశ్వ జనీనం చేయటంలో నిమగ్నమై ఉన్నారు.  లాటిన్ అమెరికా నవలలో ఏదీ మానవజాతి నుంచి  దృష్టిని మళ్ళించకుండా, దానిని సంపూర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. బహుశా దాని  వల్ల  పాఠకుని గెలిచి, మదిని కలవరపరుస్తుంది. ఇది సాహితీ కోణంలో నవలను భావ వాహకంగా, సాహితీ భాష ద్వారా  అనూహ్య మ్యాజికల్ విలువతో , లోతయిన మానవ అంచనాతో   జాతుల వ్యాఖ్యాతగా చేస్తుంది. 

  

   ఆస్టూరియాస్ నవల  "ది ప్రెసిడెంట్ " ఒక నిరంకుశ రాజ్యంలో పాలకుల ఇచ్ఛ, అనుచరుల విధేయత,  అవిధేయుల కష్టాలు, సామాన్యుల కడగండ్లు, అమాయకుల పై చిత్రహింసలు, తిరుగుబాటు యత్నాలు,  న్యాయ ,కారాగార వ్యవస్థల పద్మవ్యూహంలో చిక్కిన మనుష్యుల  వెతలు  గుండెకు  హత్తుకునేట్లు వర్ణించబడ్డాయి. ఈ నవల కవితాత్మకంగా ,అలంకారాలతో,  పదాల  అనూహ్య మిశ్రమంతో , చైతన్య స్రవంతి శైలిలో  సాగుతూ  మంచు  కురిసే వేళలో  లోయలు, కొండల్ని చూస్తుంటే వచ్చే అనుభూతి  కలిగిస్తుంది. నిజం ఎర్రటి ఎండలా  కాలిస్తే, చీకటి చిక్కగా నర నరాల్లో కమ్ముతుంది.  తెలుగు రచయితల్లో రా వి శాస్త్రి, బుచ్చిబాబు, అడవి బాపిరాజు  నవల లోని కవితాత్మక వర్ణనలు,   జార్జ్ ఆర్వెల్ డిస్టోపియన్ నవల “1984”  గుర్తుకు  వస్తాయి. రైలు ప్రయాణంలో మారిపోయే దృశ్యాలు, విమాన పయనంలో కాన వచ్చే విచ్చుకున్న పత్తి పంట లాంటి  మబ్బుల  మాయాజాలం  కనిపిస్తాయి. 


   ఈ నవలలో  కల్నల్  సోన్రియే ఒక మూర్ఖ యాచకుడి చేతిలో హతమైతే , ఆ నేరం తనకు నచ్చని వారిపై నెట్టి నియంత అతని  తొత్తులు తమ అధికార లాలస,  ప్రతీకార వాంఛలను ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో ఎందరో అష్ట కష్టాల పాలై నిరాశా నిశిలో రాలి పోతారు.   ఈ నవలలో  తన విధేయులపై సైతం నిఘా కన్ను వేసే నియంత,  దేశం కోసం పోరాడినా అధ్యక్షుని ఆగ్రహానికి లోనై పారిపోయిన జనరల్ కెనాలే, మొదట విధేయుడుగా ఉండి తర్వాత జనరల్ కూతురుని అపహరించి,  ప్రేమలో పడి ,పెళ్ళాడి నియంత కోపానికి, వంచనకు గురై  ఏకాంత కారాగారంలో  రాలిపోయిన ఏంజెల్ ఫేస్ ,  అవకాశవాద రహస్య పోలీసులు, అన్యాయంగా చెరసాల పాలై పసికందును పోగొట్టుకొని వ్యభిచార గృహానికి అమ్మి వేయబడిన ,  కల్నల్  సోన్రియే హత్యా నేరం పై జైలు పాలై ఉరి శిక్ష పడ్డ లాయర్ కల్వరెజ్,  అతని విడుదల కి  తల్లడిల్లిన  అతడి  భార్య,  తన తండ్రి జనరల్ కెనాలే కి ,తరువాత  ప్రేమికుడు, భర్త   ఏంజెల్  ఫేస్ కు దూరమై  నిరీక్షణలో నీరసించిన కామీల లాంటి పాత్రలు ఉన్నాయి.


   నవలలో పోర్చు చర్చి లో అనూహ్యంగా హత్యకు గురైన  కల్నల్  సోన్రియే కేసు గురించి యాచకులను  చిత్ర హింసలు పెట్టి ఆ నేరం మరో జనరల్ కెనాలే , లాయర్ కల్వరెజ్ మీద తోస్తారు. ఇక్కడ  భార్యహీనుడి ఏడ్చిన బుగ్గలు " వర్షంలో తడిసిన బుగ్గలు" అని,  విచారణలో రాలిన దోమ గాడు " విరిగిన పెండ్యులం అని,  జడ్జి అడ్వకేట్ పేరు గల అధికారి బగ్గీ దీపాల్ని " మృత్యువు కన్నులలా వెలుగుతున్నాయి” అని రచయిత వర్ణిస్తాడు. కల్నల్ సోన్రియే ను చంపి పారిపోయిన  ఉన్మాది  "ఎముకల్లో పద్మవ్యూహం." లాంటి పదాలు ఉన్నాయి.


అధ్యక్షుడు అనుగ్రహిస్తే అందలం. ఆగ్రహిస్తే బొంద పెట్టడం. సైనిక ఆసుపత్రిలో పలు  చావులకు సోడా ఫ్యాక్టరీ  సల్ఫేట్ హేతువన్నందుకు డాక్టర్ బర్రెనో కు అరెస్టు భయంతో చుక్కలు కనిపిస్తాయి.

 తాను సంతకం పెట్టే పత్రంపై పొరపాటున  సిరా పడేసిన నేరానికి రెండు వందల కొరడా దెబ్బలు తిని కూలిన ఉద్యోగి. 


   అధ్యక్షుడు తనకు ఇష్టమైన ఏంజెల్ ఫేస్ (సైతాన్ అంత అందగాడు, క్రూరుడు) ను పిలిచి జనరల్ కెనాలే కు పారి పొమ్మని సలహా ఇచ్చి , ఆ క్రమంలో అంతం చేయాలని కోరతాడు. ఈ ప్రయత్నంలో ఏంజెల్ ఫేస్ ఆ జనరల్ కూతురు కమీలా  ప్రేమలో పడతాడు. జనరల్ కెనాలే ఇల్లు రహస్య పోలీసులు   లూటీ చేస్తుండగా, జనరల్ పారిపోతుండగా ,అతని కూతుర్ని అపహరించి ఒక చోట దాస్తాడు. ఆమెకు ఎవరూ, పిన తండ్రులు సైతం నియంతకు  భీతిల్లి ఆశ్రయం ఇవ్వరు. తన బిడ్డకు   గాడ్ మదర్ గా ఉన్న  కమీలా కోసం  ఆమె ఇంటికి వెళ్ళిన  నిన్యా ఫెదీన ఇల్లంతా  గందరగోళంగా ఉండటం చూస్తుంది.అక్కడ దొరికిన ఉత్తరం దాచి అనుమానితురాలుగా అరెస్టు అవుతుంది. నియంత అధ్యక్షుని  హయంలో జీవితం ఒక లాటరీ. అమాయకత్వం, నేరాల మధ్య తేడా ఉండదు.నేరం చేస్తేనే మేలు . ముందు జైలు,  కొంత కాలం తర్వాత విడుదల, పదవీ.


    ఆస్టూరియాస్ జైలు గోడల్లో తాండవించే  దానవత్వాన్ని హృదయ విదారక వర్ణన చేస్తాడు. కాసా న్యూవా లో నిన్యా ఫెదీన  పలు మార్లు కూర్చొని, నిల్చొని  అలసిపోయింది.  ఖైదీల గుండెల్లో  బాధలు.  గొంతుల్లో పాటలు.  నిద్రలో కూని రాగాలు. ఆర్త నాదాలు.గాయకుల దైవ దూషణలు.  అవమానాలు బూతులు. జైలు నుంచి వేశ్య గృహానికి దూరం ఒకే ఒక్క అడుగు అన్న  పాట విన్న  నిన్యా ఫెదీన  తన చర్మం సజీవంగా వలిచినా కానీ పడని బాధపడింది. ఇతర ఖైదీలకు వేశ్యా గృహం ఒక స్వేచ్ఛ , వెచ్చని  ఆశలు కల్పిస్తుంది. ఆమె తాను జైలు నుంచి బయటపడగానే పిల్లవాడికి బాప్టిజం చేయాలని  భావిస్తుంది. జైలులో గోడలపై తేదీలు, రాతలు ,బూతు బొమ్మలు, దేవుడి పేరు పక్కనే .రేకుల బదులు వేళ్ళతో పువ్వులు ,  జడ్జిల ,మెజిస్ట్రేట్ ల వ్యంగ్య చిత్రాలు.   విచారణలో ఆమెకు  ఒళ్లంతా వణుకు. జనరల్ కెనాలే ఎటుపోయాడు అనే ప్రశ్నకు  ఆమె దగ్గర జవాబు లేదు.  పసికందుకు  పాలు పడతానంటే  తన్నులు.  తల్లి ఒడిలో గుడ్డ బొమ్మలా పిల్లడు. పాలు తాగబోయి సున్నంలా  రుచి తగిలి  మాని ఏడ్చిన పసి పిల్లవాడు. ఆ దీనురాలికి ఏ దేవత, ఏ దేవుడు , ఏ సెయింట్ రాలేదు తోడు. శారీరక, మానసిక హింస.రాలిన పసి మొగ్గ.


   ప్రకృతి , ఖైదీ బాధలు వర్ణించటం లో  రచయిత ప్రతిభ కనిపిస్తుంది . "స్వర్గం లాంటి  నీలి ఉదయ ఆకాశంలో స్వర్గ సంగీత స్మర సమ్మేళనం మొదలైంది. అదే సమయంలో విరిసిన గులాబీలు , మోగే   గంటలు దేవుడికి శుభోదయం అంటూ ఉండగా,   మరో వైపు కసాయి అంగళ్లలో సున్నితంగా వినవచ్చే మాంస ఖండాల శబ్దం."  నిన్యా ఫెదీన భర్త హెనారో రోడాస్ అనుభవించే చిత్రహింసను  "తన బాధ ఏమిటో పూర్తిగా తెలియకుండా చనిపోయే జంతువు  అణచబడిన అరుపు అతని చివరి నిరసన"  అని వర్ణిస్తాడు.


     జడ్జి అడ్వకేట్ కాసులకు కక్కుర్తి పడి  నిన్యా ఫెదీన ను  పదివేల పేసోలకు  ఒక వేశ్యా గృహానికి అమ్మేస్తాడు . ఆ నేరం సైతం ఆమె భర్త  హెనారో రోడాస్  చేసినట్లు వంచనతో సంతకం పెట్టేశాడు. వేశ్యా గృహంలో ఇతర స్త్రీలు  నిన్యా ఫెదీన చేతిలో శిశువును చూసి  పడిన ఆనందం అంతలో మృత శిశువు అని తెలిసి  ఆవిరి అవుతుంది . వేశ్యా గృహం ఒక సజీవ సమాధి. అక్కడ యజమానురాలు నిన్యా ఫెదీన  వ్యాపారానికి  పనికిరాదని భావించి తాను ఇచ్చిన డబ్బు కోసం ప్రయత్నిస్తుంది.  ఈ  గృహంలో ఏంజెల్ ఫేస్   మేజర్  ఫర్ఫాన్ ను కలిసి అతడు తన తాగిన మైకంలో  విప్లవం అన్నాడని భయపెట్టీ, జైలుకెళ్తే బయటకు వస్తే పదవి వస్తుందని,  అదే బతుకు మార్గమని అంటాడు .ఈ మేజర్  ఫర్ఫాన్ నవల చివరలో అధ్యక్షుడి ఆదరణ కోల్పోయిన ఏంజెల్  ఫేస్ ను నరక కూపం లాంటి జైలు కి పంపిస్తాడు.


      కల్నల్ సోన్రియే హత్య కేసులు ఉన్నాడనే నెపంతో లాయర్   కర్వాహల్ కు ఉరిశిక్ష ఖాయం చేసింది మిలిటరీ కౌన్సిల్. లాయర్  భార్య తన భర్త ప్రాణం కోసం అధ్యక్షుడు దగ్గరికి వెళుతుంది ఆమెది అరణ్య రోదన.  మనిషే మనిషికి అరి. తన తోటి మనుషులను తన లాంటి వారిని, అదే రంగు, అదే  చర్మం , అదే  గొంతు,  అవే  జీవ వ్యాపారాలు. ఎవరైనా ఎలా కాలుస్తారు అనేది ప్రశ్న. తన భర్త విడుదలకై పెట్టిన పిటిషన్ పై ఆమె సంతకం తప్ప వేరే ఎవరు సంతకం చేయరు. ఏవో కొన్ని  ఉత్తరాలు ఆమె భర్తను పొగుడుతూ వస్తాయి.


    అధ్యక్షుడు ఏంజెల్ ఫేస్ ను దౌత్యాధికారి గా పంపిస్తున్నట్లు నమ్మించి వంచనతో ఒక సుదూరమైన జైలులో పెట్టిస్తాడు. ఈ నవలలో ఏంజెల్ ఫేస్ అధ్యక్షుని వీడి పోయేముందు రచయిత   కిఛే   మాయా ఇండియన్ దేవుడు 'టోహీల్ ' మిత్ ను ప్రవేశపెడతాడు. మాయా  సంస్కృతిలో టోహీల్ ఎండ, వాన, యుద్ధానికి దేవత. అతడికి కావలిసింది నర బలి. బదులుగా ఆరాధకులకు   నిప్పు ను  ఇస్తాడు. ఏంజెల్ ఫేస్ కు గిరిజనుల నృత్యం,  రక్త దాహం గల దేవుడు టోహీల్  ను వారు ప్రార్థించే దృశ్యం కనిపిస్తుంది. ఇది ఆధునిక ,అనామక, నియంత కూడా రక్షణ , సామాజిక భద్రత   పేరుతో  తన ఇచ్చ వచ్చినట్లు పాలిస్తూ  పౌరుల బలి కోరుతాడు. తొలుత ఈ నవలకు రచయిత  'టోహీల్' అని పేరు పెట్టడం గమనార్హం.


    గతంలో  కమీలా తన తండ్రికి  మొదట దూరమై, జబ్బు పడి , ఏంజెల్ ఫేస్ సాయంతో కోలుకుని అతడ్ని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె  తన భర్తకు దూరమై ఉత్తరం కోసం అనంతంగా నిరీక్షిస్తుంది.  తన కూతురు పెళ్లిలో అధ్యక్షుడు సాక్షిగా ఉన్న వార్త ,ఫోటో చూసి విప్లవ నేత జనరల్  కెనాలే  కుప్పకూలిపోతాడు. ఏ హక్కుతో సైనికులు తమ భావాలకు, ప్రపంచానికి, జాతికి ద్రోహం చేసే పాలనలకు విధేయంగా ఉండాలని  బలవంతానికి గురవుతారు అని జనరల్ కెనాలే ప్రశ్న.  దోపిడీ దారుల, అధికారంలో  అతిశయంతో ద్రోహం చేసే వారి సేవలో సైనికుడు కావడం కన్నా ప్రవాసంలో మరణం మిన్న అని అతడు అనుకుంటాడు. నియంత అధ్యక్షుడు తిరిగి ఎన్నిక కావటానికి అతడి  భక్త బృందం  విజ్ఞప్తులు చేస్తారు. కామిల్లా  తన భర్త  ఏంజెల్ ఫేస్ జాడ ఎప్పటికీ తెలియక నగరం విడిచి ఒక పల్లెలో కొడుకుతో ఉంటుంది.  


   నరక కూపం లాంటి జైలులో  ఏంజెల్ ఫేస్ కు  నిద్ర కరువు. జైలు గదులలో చీకటిలో, నిశ్శబ్దంలో, మాటల కోసం  ఖైదీల అర్థింపు.  ప్రార్ధనలు. పోరాడే వారికి నమ్మకం, స్వేచ్ఛ ,ఆశ లేదు. వారికి నిద్రాహారాలు  అన్ని అపురూపమే.  "మన పాలరాతి భవనాలు అమాయకుల రక్తంలో  తడిగా ఉన్నాయి .ఒకరు స్వేచ్ఛ కోసం ఎటువైపు చూడగలరు?”  ఒక విద్యార్థి ఖైదీ అందరికీ కావలిసింది ప్రార్థన కాదు.గోడలు బద్దలు కొట్టి విప్లవం లో కలవడం అంటాడు 


 ఖైదీ నంబర్ 17 గా ఉన్న ఏంజెల్ ఫేస్ నానాటికి కృంగి, కృశించి పోతాడు. ఏదో  ఆశ. కొంతకాలానికి పథకం ప్రకారం వచ్చిన మరొక ఖైదీ అతని నమ్మకం  గడిస్తాడు తాను ఖైదీ అవ్వటానికి అధ్యక్షుడి  వనితతో దగ్గరవుదామని ప్రయత్నించానని ,ఆమె ఒక జనరల్ కూతురని , ఆమె  భర్త జాడ లేకుండా పోయాడని చెబుతాడు . ఆమె పేరు విన్న ఏంజెల్ ఫేస్ " తన శరీరమంతా గీరుకున్నాడు అక్కడ ఏమి స్పందన లేకున్నా;  కన్నీరు తుడిచేందుకు మోమును పీక్కున్నాడు, అక్కడ పొడి చర్మం  తప్ప ఏమీ లేకున్నా ; తన చేయి ఎత్తి  రొమ్ము  మీద పెట్టుకున్నాడు , అక్కడ ఏమీ  లేకున్నా;  తేమ దుమ్ముతో కూడిన  సాలెగూడు నేలరాలింది."   నియంత రాజ్యంలో "నోటికి తాళం వేసుకోని వారందరూ సంకెళ్లు వేసుకోవడం మేలు." ఇది  నిన్నటి నియంత పాలనలో  గ్వాటిమాలా. నేడు ప్రతి అప్రజాస్వామిక  రాజ్యంలో  పౌరుడు నిలిచిన నేల. 


    ప్రముఖ విమర్శకుడు గెరాల్డ్ మార్టిన్ దృష్టిలో   " ది ప్రెసిడెంట్"  నవల లాటిన్  అమెరికా జీవితాన్ని అవినీతి సాలెగూడు,  పద్మవ్యూహం లా  చిత్రించి , దానిని విడమర్చాల్సిన బాధ్యత పాఠకునిపై  పెట్టింది. ఇది యాచకుల దీన, హీన, హింసాభరిత  జీవితానికి అద్దం పట్టి పాఠకుని నుంచి జీవన, ఉద్వేగ, నైతిక రాజకీయ  పరంగా తీవ్ర నిబద్ధతను కోరిన తొలి నవల. రచయితకు ప్రజా సంస్కృతి,  దాని సైకాలజీ పట్ల ప్రేమ,  స్త్రీ విముక్తి పట్ల సానుభూతి తెలియజేస్తుంది.  "దేశాలు నగరాలు,  చివరకు నియంతృత్వ  వ్యవస్థలోని టెర్రర్,  అణచివేతలు అంతర్గతమై మానవ చైతన్యమే జైలుగా మారవచ్చు"  అని చూపిస్తుంది.


     గెరాల్డ్ మార్టిన్ రాసినట్టు ఈ నవల రచయిత బాల్యం , యవ్వనాన్ని అత్యంత నిర్దిష్టరూపంలో ప్రతిఫలిస్తుంది. యూరోపియన్  సర్రియలిజం, లాటిన్  అమెరికన్ మ్యాజికల్ రియలిజం కు మధ్యగల ముఖ్యమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. లాటిన్ అమెరికన్ చరిత్రలో అతి ముఖ్య నియంత నవలగా ఉండి  పాఠకుని చైతన్యంపై   బ్లాక్ అండ్ వైట్ నిశ్శబ్ద మూవీ లాంటిది. ప్రగతి , అభివృద్ధిలపై పరోక్షమైన విమర్శ. నియంతల క్రింద ఆధునికీకరణ ఒక ఎలైట్ వర్గానికి మాత్రమే   ఉపయోగపడే ఐడియాలజీ.  ఈ నవల  మిత్,భాషల మధ్య ఆ రెండింటికి ,  అచేతన ల మధ్య బంధాన్ని తెలిపేందుకు  సాహితీ భాషలో ఒక విప్లవం . సామాజిక, రాజకీయ జీవితంలో భాషా సాహిత్యాలలో విప్లవానికి పిలుపునిచ్చి లాటిన్  అమెరికన్ పితృస్వామ్య విధానాన్ని సవాల్ చేసింది. మూడవ ప్రపంచ దేశాలు గుడ్డిగా ఐరోపాను ఎండమావి వెంట  పరుగు  అని తెలిపింది. 


    ఆస్టూరియాస్   రచనల్లో “లెజెండ్స్ ఆఫ్  గ్వాటెమాల,”   “ది ప్రెసిడెంట్,” “మెన్ ఆఫ్ మైజ్” అనే రచనలు ముఖ్యమైనవి..మాయా జాతి బైబిల్” గా పేరున్న “Popol Vuh” అనే గ్రంథ అనువాదానికి  నాలుగు దశాబ్దాలు శ్రమించారు. “స్ట్రాంగ్ విండ్,”  “ద గ్రీన్ పోప్,” “ది ఐస్ ఆఫ్ ది ఇంటర్డ్, ” అనే పుస్తక త్రయంలో   అమెరికన్ యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ   దోపిడీకి వ్యతిరేకంగా  రచించారు. ఆస్టూరియాస్ ను   లెనిన్ శాంతి బహుమతి (1966),   నోబెల్ బహుమతి (1967) వరించాయి. 

   

  ( published in Prajasahithi, October, 2026)      

                 


సంతోషం గెలుచుకోవడం ఎలా?

    బెర్ట్రాండ్ రస్సెల్ (1872-1970)ఆధునిక, హేతుబద్ధ ఆలోచనకు విఖ్యాతి గన్న బ్రిటీష్ గణిత శాస్త్రవేత్త,తత్వవేత్త,  సామాజిక విమర్శకుడు, శాంతి ఉద్యమ నేత. 1952లో నోబెల్ బహుమతి పొందిన ఆయన  రచనల్లో “ప్రిన్సిపియా మాథెమాటికా,” ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ,” “మ్యారేజ్ అండ్ మోరల్స్,”  “ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషల్ రికన్స్ట్రక్షన్,” “ది హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ,” “పవర్,” “అథారిటీ అండ్ ఇండివిడ్యుయల్,” “రోడ్స్ టు ఫ్రీడమ్” తదితర గ్రంథాలున్నాయి.


     బెర్ట్రాండ్ రస్సెల్ “సంతోష స్వాధీనం” (The Conquest of Happiness) గురించి రాసిన ఈ పుస్తకం సామాన్యులకు, మేధావులకు రెండు తరగతుల వారికి తగు సలహా, ఆచరణలో ఉపయోగపడే క్లాసిక్. ఈ పుస్తకం రచనా శైలి అందమైనది మాత్రమే కాక విశాలమైన మది అలవర్చుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ పుస్తకంలో మొదటి భాగంలో సంతోషలేమి కారణాలు , రెండో భాగంలో సంతోష కారకాలు ఉన్నాయి.  మనుష్యులలో సంతోష లేమికి హేతువుల్లో  –బైరానిక్ అసంతృప్తి, పోటీ , అలసట, అసూయ, పాప భావన, ఆత్మ పీడన  భావం, ప్రజాభిప్రాయం అంటే భీతి ఉన్నాయి.


సంతోషం సాధించాలంటే మనిషికి ఉత్సాహం, ప్రేమ, కుటుంబం ,పని ,  వస్తుగత ఆసక్తులు , ప్రయత్నం - వదిలివేయటం అవసరం.


   బైరానిక్ అసంతృప్తి (ఉద్వేగ భరిత చర్యలకు తహతహపడటం ) అనేది ఒక మార్మిక విషయం .ఇది పోవాలంటే మనుషులు తమకు లోతుల్లోని కోరికలు తీర్చుకోవాలి. తాము ఉద్వేగ భరితంగా చేయాలనుకునేది  చేయగలగాలి.రచయితలు ఇక తాము రాయలేకుండా ఉండలేము అని భావించినప్పుడు మాత్రమే రాయాలి.  పోటీని సద్గుణంగా , విజయాన్ని లక్ష్యంగా చూసి ఇతర విషయాలు వదిలేస్తే విజయం సాధించిన తర్వాత విసుగు  కలుగుతుంది. అతి పోటీ అనేది  పని, విరామాల్ని రెండింటిని విషమయం చేస్తుంది. అలసట ఎన్నో కారణాలు ఉన్నా నిరంతరం ఆందోళన,  అనిశ్చితత్వం వల్ల అది కలుగుతుంది. మన చర్యలు, విజయాలు ,పరాజయాలు మనం అనుకున్నంత ముఖ్యమైనవి కావు. చేతన అచేతన లోని  భయాల వల్ల  నరాల అలసట సంభవిస్తుంది. మరింత ధైర్యం పెంచుకోవడం మూలాన   అలసటను పోగొట్టుకోవచ్చు.


    అసూయను మానసిక క్రమశిక్షణ ఇతర విజేతరతో పోల్చుకోకుండా ఉండటం ద్వారా తప్పించుకోవచ్చు స్వేచ్ఛకు నాగరిక మానవుడు తన హృదయాన్ని , మదిని విశాలం చేసుకొని 'సొంత ' భావన దాటి విశ్వజనీన స్వేచ్ఛను పొందవచ్చు. పాప భావన పోవడానికి అపరాధ భావన నుంచి స్వేచ్ఛ నిచ్చే హేతుబద్ధతను అలవరుచుకోవాలి.ఆత్మ పీడన భావం  పోయేందు కు  కారణాలు గా  వస్తుగత దృక్పథం లేకుండా ఉండటం, తన బలాలపై అతి అంచనా ,ఇతరులు తన పట్ల ఎక్కువ ఆసక్తి చూపారని భావించటం, తన్ను   వేధించాలని చూస్తున్నారనుకోవడం.  దీనికి విరుగుడు భ్రాంతి నీ వదిలి ,నిజాన్ని చూసి అంగీకరించే జీవితాన్ని కొనసాగించడమే. ప్రజాభిప్రాయం పట్ల భయం పోవాలంటే  తన లాంటి ఆలోచన ఉన్న వారితో కలవడం , స్వీయ, లోతైన సహజతాలను అనుసరించడం చేయవచ్చు.


ఇక సంతోష కారకాలను గురించి ఆలోచిస్తే మనుషులకు ఉండే సహజమైన జీవనోల్లాసం కొన్ని దురదృష్ట ఘటనలు, స్వేచ్ఛపై ఆంక్షలు, 'గౌరవం' పట్ల తప్పుడు అభిప్రాయం వల్ల దెబ్బతింటుంది. ఉత్సాహం అదనపు శక్తి పైన , మానసిక యంత్ర పనితీరుపై ఆధారపడి ఉంటుంది. 

ప్రేమ భద్రతను,  స్వీయ జైలు నుంచి విముక్తిని ఇస్తుంది. అది పరస్పర ఆధారితం. వ్యతిరేక జెండర్ తో ఆత్మీయత లేకపోవడం వల్ల ఉత్సాహం నశించి అంతర్ముఖత్వం పెరుగుతుంది. బాల్యంలో తక్కువగా  తల్లిదండ్రుల ప్రేమ లభించినట్లయితే  ఆలోచన, తత్వం , మతశాస్త్రం బాట తీసుకుంటారు.


    పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ కుటుంబానికి మూలాధారం. స్నేహితులు మన గుణాలను , ప్రేమికులు మన ఆకర్షణలను ఇష్టపడతారు .కానీ కష్టాల్లో తల్లితండ్రులు మనతో నిలుస్తారు. తల్లిదండ్రులు తమ ఆనందం  పిల్లల  విషయంలో రక్షణ - నిరంకుశత్వాల మధ్య కోల్పోవడం జరుగుతుంది.మాతృత్వం అనేది ఇతర ఆసక్తుల  నుంచి జీవితాన్ని దూరం చేయరాదు.



   పని  మితంగా ఉంటే  అది ఖాళీ గా ఉండటం కన్నా మిన్నగా  ఉండి సెలవుల్ని ఆనందిస్తాం. పనిచేయటం ఒక  స్థిర లక్ష్యాన్ని , సృజనాత్మక మైన నైపుణ్యం సంతోషాన్ని  ఇస్తాయి. నిర్మాణాత్మక, సమగ్ర దృక్పథం  ఉన్నవారు మిగిలిన వారి కన్నా సంతోషంగా ఉంటారు. వస్తుగత ఆసక్తులు కూడా ఆనందాన్ని  ఇస్తాయి. ప్రపంచం గురించి , వ్యక్తిగతం  గురించి వాస్తవిక ఆలోచన ఉండాలి. మంచి లక్ష్యం వైపు చేసే చిన్న పని అయినా ఎక్కువ ఆనందం ఇస్తుంది ప్రయత్నం , వదిలివేయటం మధ్య సమతూకం , వ్యక్తి- సమాజాల మధ్య సమన్వయం అవసరం.


 బెర్ట్రాండ్ రస్సెల్ పుస్తకం మొదట్లోనే అసంతృప్తి లేదా సంతోష లేమి అనేది ప్రపంచం పట్ల తప్పుడు దృక్పథం,  తప్పుడు నీతి , అలవాట్లు వల్ల కలిగి సంతోషానికి మూలమైన  జీవన ఉల్లాసాన్ని నాశనం చేస్తుంది  అని రాశాడు. అయితే ఈ “సంతోష స్వాధీనం”లో సామాజిక, ఆర్థిక , రాజకీయ వ్యవస్థ లో అవసరమైన మౌలిక మార్పులు, విలువలు , హక్కులు మొదలగు  వాటి  ప్రభావం గురించి లేకపోవటం   ఒక లోటు.

( PRAJATANTRA DAILY, 1 OCTOBER, 2016 )


 


“మంచు” స్ఫటికం లో సత్యం

        ఓర్హాన్ పాముక్ (1952- ) సాహిత్యంలో 2006 లో నోబెల్ బహుమతి గ్రహీత. తను 1952లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో  జన్మించాడు. తన విఖ్యాత రచనల్లో- “ది వైట్ కాజిల్,” “ది బ్లాక్ బుక్, ది న్యూ లైఫ్,” “మై నేమ్ ఈజ్ రెడ్,” “స్నో,” “ఇస్తాంబుల్: మెమోరీస్ ఆఫ్ ది సిటీ,” “ది మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్” ఉన్నాయి.  విమర్శకుడు ఊల్కెర్ గ్యుక్-బైర్క్  చెప్పినట్లు పాముక్ రచనలలో ప్రధాన వస్తువుగా తూర్పు-పడమరల, దాని ఒట్టోమన్ గతం- పాశ్చాత్య తరహా వర్తమానాల మధ్య , విశ్వాసం- మతయేతర జీవన విధానాల మధ్య  తలెత్తే ఘర్షణలు ఉన్నాయి.


      ఓర్హాన్ పాముక్ నవల “స్నో”  లో నాయకుడు కా లేక కరీం అలక సోగ్లు ఒక కవి. జర్మనీ లో ఫ్రాంక్ఫర్ట్ లో రాజకీయ ప్రవాసంలో ఉంటూ టర్కీ- ఆర్మేనియా సరిహద్దు వద్ద ఉన్న కార్స్ అనే చిన్న నగరానికి వస్తాడు. అక్కడ   అటాతుర్క్  రాజ్య ఒత్తిడికి లొంగి తమ బురఖాలు తీయటానికి ఇష్టపడని బాలికల ఆత్మహత్యల పరంపర గురించి  చేసుకుంటుంటారు.సత్యాన్ని తెలుసుకుని ఒక వ్యాసం రాయాలని అనుకుంటాడు. దానితో పాటు తను కోల్పోయిన కవితా స్వర్గాన్ని, తన ఒక నాటి ప్రేయసి, విడాకులు తీసుకుని ఉన్న ఇపెక్ హృదయాన్ని తిరిగి గెలుచుకోవాలని  తపన అతడిలో ఉంది.


   టర్కీ ప్రభుత్వం  రాజ్యం యొక్క ఆధునికీకరణ, పాశ్చాత్య కూటమి అహంకారాన్ని   ఎదు ర్కొంటున్న రాజకీయ ఇస్లామిస్టులను అణచివేతకు సిద్ధమవుతుంది.కా   తన నగర పర్యటనలో ఇస్లాం  వాదులు ,తీవ్రవాదులు , కుర్దిష్ జాతీయవాదులు ,నటులు ఆత్మహత్య చేసుకున్న బాధితుల చుట్టాలను ,పోలీసు అధికారులు, చిన్నస్థాయి వార్తాపత్రిక సంపాదకులను కలుసుకుంటాడు. 


    కా  తన్నుతాను పాశ్చాత్య ప్రపంచానికి,  తిరుగుబాటుతో బాధపడుతున్న టర్కీ కి  మధ్యవర్తిగా చూస్తాడు . చిరకాల ఏకాంత రాజకీయ ప్రవాసం తర్వాత   దుస్సాహస రాజకీయాలు, మత  పిడివాదానికన్నా సంతోషమే మిన్న అని తెలుసుకున్నాడు. అయితే కార్స్ నగరం కా ను ఒక కవిగా మాత్రమే ఆహ్వానిస్తుంది. వాస్తవానికి కా యొక్క మిశ్రమ అస్తిత్వం ఒకవైపు హేతువాదిగా, వ్యక్తి వాదిగా చేస్తే, మరోవైపు అతనిలోని మూలాలు తన బాల్యం కోసం, స్వదేశీయులను అర్థం చేసుకోవడం, ఇపెక్ ప్రేమ కోసం తపించేలా చేస్తాయి.


    అతడికి తర్వాత  ఇపెక్ కు   గతంల్ బ్లూ అనే తీవ్రవాది పట్ల కల  భావోద్వేగం గురించి తెలిసి బాధ కలుగుతుంది. ఆమెను ప్రశ్నించగా  ఇపెక్ అతడి అసూయ ను విమర్శిస్తుంది. అయితే ఫ్రాంక్ఫర్ట్ లో తన ప్రేమ వ్యవహారాలు గురించి  కా బయటకు చెప్పడు. స్కార్ఫ్ బాలికల నాయకురాలి సోదరి  కాడిఫ్ తో కా అబద్ధాలు చెప్పి నగరంలో చిల్లర రాజకీయాలకు అదే విరుగుడు అనుకుంటాడు. తర్వాత  బ్లూ నుంచి ఒక ఉత్తరం తెచ్చి కాడిఫ్ రంగ స్థలం పై తన బురఖా తీసివేత యత్నం నుంచి తప్పించాలని ప్రయత్నిస్తాడు.


    కా, ఇపెక్ తండ్రి టర్గాట్ బే, బ్లూ ల మధ్య ఒక మీటింగ్ జరుగుతుంది. బ్లూ  మాటాడుతూ మతం అనేది  జీవితం యొక్క అర్థం, మరణాంతర జీవితం గూర్చి కుతూహల ఫలితం అంటాడు. పాశ్చాత్యులు తనకు భీమా రూపంలోని ప్రజాస్వామ్యాన్ని భరించగలరా అని ప్రశ్నిస్తాడు. 1970 లలో చిలీ, 1980 లలో నికరాగువాలలో అమెరికా  జోక్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇదిలా ఉండగా కా ద్వంద్వ వైఖరి - మానవ హక్కులు అంటూ తీవ్రవాద నేతలతో ఒప్పందం, స్త్రీ వాదం అని చెబుతూ స్త్రీ ల తలలపై  బురఖాలు సమర్థించడం _ గురించి తిరుగుబాటు నేత జడ్ 


డిమిర్కల్ విమర్శిస్తాడు. కా తపన మాత్రం అటు  పాశ్చాత్య వ్యతిరేక  ఇస్లాం వాదులను ,  పాశ్చాత్య టర్కిష్ ప్రతినిధి అయిన తన్ను తాను అర్థం చేసుకోవడం కోసమే.నెసిప్ అనే యువ ఇస్లాంవాది 

తాను సైన్స్ ఫిక్షన్ రచయిత కావాలని కోరిక వెలిబుచ్చుతూ కా  నాస్తిక వాదం పట్ల అపనమ్మకం చూపిస్తాడు.


ఒక రోజు కా నగరంలో కురిసే మంచును చూసి తన కవితా సృజనాత్మకత, దేవుడు, స్వర్గం పట్ల నమ్మకాన్ని తిరిగి పొందుతాడు. మంచును, దాని మార్మిక అందాన్ని, ఆనందాన్ని, సృష్టికర్త పట్ల ఆశ్చర్యం ప్రకటిస్తాడు.ఇదిలా ఉండగా బ్లూ పట్ల కా ద్రోహం తెలిసి ఇపెక్ అతడ్ని తిరస్కరిస్తుంది. కా చింతన లో మునిగి ప్రతివానికి సొంత మంచు శకలం ఉంటుంది అని , వ్యక్తిగత జీవితాలు దూరం నుంచి ఒకేలా కనిపించినా స్వీయ అపూర్వత ను అర్థం చేసుకోవడానికి తనదైన మంచు శకలం గమనాన్ని చూడాలంటాడు.పాఠకుడికి  నవల చివరలో కా మృతి గురించి తెలుస్తుంది. అయితే 

దానికి కారణం ఇస్లామిస్టులు, టర్కీ రహస్య పోలీసులు, ఆర్మేనియన్లు, జర్మన్  స్కిన్హెడ్ లు లేదా కుర్దిష్/ టర్కిష్ జాతీయవాదులు అనేది తెలియదు.


లౌకిక వాదులుగా ఉన్న కా,  కుష్వంత్ సింగ్  ప్రఖ్యాత నవల ట్రైన్ టు పాకిస్తాన్ లో ఇక్బాల్ పాత్ర ఇద్దరూ రాజ్య హింస విషయంలో రాజీ, సందిగ్ధతలు చూపిస్తారు. స్నో నవలలోని బ్లూ, కుష్వంత్ సింగ్ సృజించిన జగ్గుత్ సింగ్ లు ఇద్దరూ అమరవీరులు గా కనిపిస్తారు. మనోమజ్ర కు వెళ్ళిన ఇక్బాల్  తన్ను తాను ఒక సంస్కర్త గా ,  లెఫ్టిస్ట్ గా  చెప్పుకున్నా మత కలహాలు నుంచి ముస్లిం లను రక్షించక అనామక త్యాగం వ్యర్థం అని తన పిరికి తనాన్ని సమర్థించుకుంటాడు. నేరస్తుడుగా ఉన్న  జగ్గుత్ సింగ్ తన ప్రేయసి నూరాన్, ఇతర ప్రయాణీకులు పాకిస్తాన్ కు సురక్షితంగా వెళ్ళేటట్లు చేసే  యత్నంలో  ప్రాణాలు కోల్పోతాడు. కార్స్, మనోమజ్ర రెండూ హేతువు -మతాల మధ్య చిక్కుకున్నాయి. ఇక్కడి లౌకిక వాదులు సైతం మతోన్మాదాన్ని, రాజ్య హింసను, అగ్ర రాజ్య ఉగ్ర వాదాన్ని  ఎదుర్కోవాలి. సృజనాత్మకంగా ఆలోచించి, మానవ హక్కులు పట్ల శ్రద్ధను నిర్భయంగా ప్రకటించాలి.

published in Saaranga web magazine on 1 october, 2026)


పర్యావరణ ఉద్యమాలకు అద్దం పట్టే ఎన్విరాన్మెంటలిజం

 

   

    ప్రముఖ చరిత్రకారుడు పర్యావరణవేత్త,  రచయిత, లిబరల్ డెమొక్రాట్,  విదేశీ విద్యాలయాలలో ఉపన్యాసకుడు, క్రికెట్ ప్రేమికుడు అయిన రామచంద్ర గుహా పుస్తకం “ఎన్విరాన్మెంటలిజం” ఈ భూమాత రక్షణ కోరే ప్రతి హృదయంలో స్పందన కలిగిస్తుంది. పర్యావరణం పై గుహా ఇతర రచనల్లో  వెరియర్ ఎల్విన్ అండ్ హిస్ ట్రైబల్స్, “ది అన్క్వైట్ వుడ్స్,”  “ఇకాలజీ అండ్ ఈక్విటీ” , “దిస్  ఫిస్సర్డ్ ల్యాండ్”  ముఖ్యమైనవి.  గాంధీ పై రాసిన “గాంధీ బిఫోర్ ఇండియా,”  “ఇండియా ఆఫ్టర్ గాంధీ” కూడా ఆయనకు ఎంతో  పేరు తెచ్చాయి. “మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా,” “పేట్రియాట్స్ అండ్ పార్టిజన్స్,”  మరియు “డెమోక్రాట్స్ అండ్ డిసెంటర్స్” సైతం అతని ఉదారవాద ప్రజాస్వామ్య భావాలకు తార్కాణంగా నిలిచాయి.   


   ప్రకృతిని జయించి, సహజ వనరులపై ఆధిపత్య యుద్ధాల లో ధ్వంసించి, వినియోగవాద సుడిగుండంలో మానవాళి గిరికీలు కొడుతూ  తన మనుగడకే   ఎసరు పెడుతోంది. మానవ ప్రధాన, లాభార్జన లక్ష్యం తో కూడిన ఆర్థిక, రాజకీయ జీవన శైలి వదిలి ప్రకృతితో సామరస్యం నెరపవలసిన తరుణమిది. ఈ సందర్భంలో     గుహా పర్యావరణ ఉద్యమం పుట్టుక, పెరుగుదల, ప్రపంచంలో దాని ప్రభావాన్ని  “ఎన్విరాన్మెంటలిజం: ఏ గ్లోబల్ హిస్టరీ “పుస్తకంలో వివరించారు. రాచెల్  కార్సన్ రాసిన “నిశ్శబ్ద వసంతం” (సైలెంట్ స్ప్రింగ్)  లో అమెరికా, జర్మనీ స్వీడెన్ లాంటి పలు దేశాల్లో క్రియాశీల ఉద్యమాలను   ఎలా ఉత్తేజపరిచిందో వివరించారు. ఆమె ప్రాణి  కోటికి హాని కలిగించే డిడిటి లాంటి పురుగు మందులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. ఫలితంగా పురుగుమందుల నియంత్రణ చట్టం (1972), విష పదార్థాల  చట్టం (1974) ఉనికిలోకి వచ్చాయి.  

  

    రాచెల్ కార్సన్  కన్నా ముందుగా జార్జి పెర్కిన్స్,  జాన్ మూర్, ఆల్డో  తెపాల్డ్ లాంటి వారు ఉన్నారు. రాచెల్ కార్సన్  తో పాటు రేమండ్  దాస్మాన్, పాల ఎర్లిచ్ ,  హార్డిన్  లాంటి మొక్కల శాస్త్రవేత్తలు , గిల్బర్ట్ ,  బయో కెమిస్ట్ పామ్  స్టీర్మా,ఇంగ్లాండ్ లో అష్బీ, డార్లింగ్, వాడింగ్టన్, జూలియన్ హక్స్లీ వంటి వారు ఉద్యమాన్ని ముందుకు కొనిపోయారు. 

    

      గుహా దృష్టిలో పర్యావరణవాదులను  పెట్టుబడిదారులు  ఏమో  స్వేచ్ఛా మార్కెట్ నుంచి,  వర్గ పోరాటం నుంచి  ప్రజల దృష్టినీ మళ్లించేవారుగా సోషలిస్టులు  విమర్శించారు. పర్యావరణ ఉద్యమం 1960 లలో పాలన వ్యవస్థలను మార్చే మిలిటెంట్ ఉద్యమంగా, 1990 లలో, 21 వ శతాబ్దం తొలి ఏళ్లలో వీధి పోరాటాలుగా మారింది.        ఆర్నె నాస్ మొదలెట్టిన ‘డీప్ ఇకాలజీ’ ఉద్యమం అడవుల పైన కేంద్రీకరించింది. పర్యావరణ ఉద్యమం మానవ ఆవాసాలపై, న్యూయార్క్ లోని లవ్ కెనాల్ ప్రక్షాళన, నల్ల వారు అధికంగా ఉండే హ్యూస్టన్ నగరంలో చెత్త కుప్పల పోగు కు వ్యతిరేకంగా దృష్టి సారించింది.   

 

    జర్మనీలో  పర్యావరణ వాదులు పార్లమెంటులో స్థానాలు సంపాదించగలిగారు. యాభై శాతం పైగా స్త్రీలకు స్థానాలు  కల్పించారు. వారు తృతీయ ప్రపంచ దేశాలను ఆర్థికంగా,  పర్యావరణపరంగా దోపిడీ చేయడంలో పశ్చిమ ఐరోపా పాత్రను గుర్తించారు. అంతర్జాతీయ రుణాల  రద్దుకు, పర్యావరణ విధ్వంసక వస్తువుల నిషేధానికి,  పేద దేశాల నుంచి ధనిక దేశాలకు మరింతగా స్వేచ్ఛ వలసను కోరారు. అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు సైతం గ్రీన్ పార్టీ డిమాండ్లు అయిన అణుశక్తి   అంతం , ఏకపక్ష నిరాయుధీకరణ,  అన్ని రంగాలలో స్త్రీల ప్రాతినిధ్యానికి  అంగీకరించాల్సి వచ్చింది అని రచయిత తెలిపారు.  


   ఉత్తరార్థ గోళంలో పర్యావరణ ఉద్యమాలు నాణ్యమైన జీవితంపై,  జీవన ప్రమాణాలపై కేంద్రీకరించగా,  దక్షిణార్థ గోళంలో ఉపాధి ,సామాజిక న్యాయాల కోసం ప్రధానంగా జరిగాయి. బ్రెజిల్ లో  ఉద్యమం పట్టణాల్లో మురికివాడ వాసుల నుంచి , స్థానిక తెగలనుంచి వచ్చింది 

  భారత దేశంలో  గ్రామీణ సమాజాలు సమాజంలో సహజ వనరులను ప్రైవేటు కంపెనీలకు ఈయటంపై  వ్యతిరేకత వచ్చింది.    ఇక్కడ    మధ్యతరగతి ప్రజల్లో ఆదివాసి రైతు ఉద్యమాల పట్ల స్పందన తక్కువగా ఉండగా, బ్రెజిల్ లో  పట్నంలోని పేదలు, ఆదివాసీలు నిర్వాసితులకు మధ్యతరగతి నుంచి మెరుగైన మద్దతు దొరికింది.  ఇది లోతైన ప్రజాస్వామ్యం,  మరింత పారదర్శకతలకు  దారితీసింది అని రామచంద్ర గుహా వివరించారు.

     దక్షిణార్థ గోళంలో  సైతం మలేషియాలోని సరావాక్ వనాలలో  పెనాన్ సమాజం, భారత దేశంలో ‘నర్మదా బచావో’ ఆందోళన, థాయిలాండ్ లో నీటి స్థాయిని తగ్గించే యూకలిప్టస్ కి వ్యతిరేకంగా బౌద్ధ మతస్తుల  పోరాటాలు, నైజీరియాలో రాయల్ షెల్  కంపెనీ ఆయిల్ డ్రిల్లింగ్ కు వ్యతిరేకంగా కన్సారో వివా చేసిన పోరాటం, కెన్యాలో వంగరి  చేసిన గ్రీన్ బెల్ట్ పోరాటాలు  పెరుగుతున్న పర్యావరణ ఉద్యమ చైతన్యాన్ని ప్రతిబింబించాయి. మెగా ప్రాజెక్టులు, సున్నపురాయి గనులు ,హైటెక్ మరపడవలు, కాగితం కర్మాగారాలకు వ్యతిరేకంగా ఆదిమవాసులు, రైతులు,  జాలర్లు పోరాటాలు చేశారు. పెరూ లో మైనింగ్ కు వ్యతిరేకంగా, మెక్సికోలో  శాంజువాన్ డామ్ కు వ్యతిరేకంగా  ఇండియన్లు శాంతియుతంగానూ, మిలి టెంట్ గాను  పోరాటం సాగించారు.           


  గుహా దృష్టిలో  రహదారుల విస్తరణకు అమెజాన్ అడవుల విధ్వంసం ప్రపంచ చరిత్రలో జీవజాల నాశనంలో అత్యంత తీవ్రమైనది. ప్రజలు గాంధీజం , బుద్ధిజం, కేథలిక్ మతాల ప్రేరణతో  అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణ వికేంద్రీకరణలకు అనుకూలంగా తిరిగి నిర్వచించారు. చిన్న ఆనకట్టలు,  చెరువులు, బావుల వంటి సంప్రదాయ నీటిపారుదల పద్ధతులు, సహజ వనాలపై కమ్యూనిటీ నియంత్రణ వంటి ఆచరణాత్మక పద్ధతులు, భారీ ఆనకట్టలకు,  భారీ పరిశ్రమలు ప్రైవేటుపరం కావడానికి నిరసనగా ఉద్యమాలు వచ్చాయి. మలేషియాలో , భారతదేశంలో కార్పొరేట్ ,రాజ్య- బ్యూరోక్రాటిక్ శక్తులు పర్యావరణవాదులను అభివృద్ధి వ్యతిరేకులుగా వర్ణించారు. 


    ఈ నాడు  పర్యావరణవాదులు అధికారానికి సత్యంతో సమాధానం చెప్పి అభివృద్ధికి చెల్లించే మూల్యం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఎల్ నినో ప్రభావానికి,  రానున్న కరువులు , నేపాల్ లో లాగా, ఈశాన్య భారతంలో వచ్చే ఆకస్మిక వరదలు, భూకంపాలు, ఉత్తరాఖండ్ లో అసంఖ్యాక  ప్రాజెక్టులు వల్ల కలుగుతున్న  ఉత్పాతాలు,  అదృశ్యమవుతున్న వనాలు,  రసాయనిక, జల, వాయు, ప్లాస్టిక్ తదితర    కాలుష్య బాధితులు అయిన  ప్రజానీకం  ఎరుకతో మన  ఆర్థిక విధానాలు పర్యావరణ హితవుగా ఉండేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. 

(published on 16 October,2026 in Telugu prabha daily on harita prabhapage )


అట్టడుగున దాగిన కథల “లేపాక్షి”

 

                                   

 

 ప్రఖ్యాత రచయిత, ఎన్నో అవార్డుల స్వీకర్త  సడ్లపల్లె చిదంబర రెడ్డి రచించిన “లేపాక్షి” నవల రాయల వారసుల కాలం నాటి పెనుగొండ  పరిసర ప్రాంతాల సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను, హేతువాద పద్ధతిలో గ్రామీణ  శ్రమజీవుల కోణం నుంచి చిత్రించింది.  చారిత్రక నవలల్లో వాస్తవం ఊహలు కలిసి ఉండటం మామూలు కానీ, వాస్తవం ప్రశ్నార్ధకంగా, ఊహ పుక్కిటి పురాణంగా ఉంటే దానికి మన్నన ఉండదు. చారిత్రక రచనలో  వస్తుగత వాస్తవికత అనేది వ్యక్తిగత అంశం లేకుండా ఉండదు.  చరిత్రకారుల, నవలా రచయితల  అనివార్య పక్షపాతం  తెలిసిందే. అయితే చరిత్ర సారం శ్రీశ్రీ అన్నట్లు “ఆ రాణి ప్రేమ పురాణం , ఈ ముట్టడి కైన ఖర్చులు” మాత్రం కాదు అని “లేపాక్షి” నవల నిరూపిస్తుంది.  ఈనాడు హిందుత్వ వాదులు హిందూ రాజులను పొగుడుతూ, బ్రిటీష్ వ్యతిరేకంగా పోరాడిన టిప్పు సుల్తాన్, మత  సామరస్యాన్ని చెప్పిన అక్బర్ లను కూడా  విచక్షణా రహితంగా  విమర్శ చేయడం  చూస్తున్నాం. నేటి  ప్రజాస్వామ్యంలో చరిత్రను  రాజుల మధ్య రణాలుగా కాకుండా పీడకుల,  పీడితుల మధ్య కుల, వర్గ  వైరుధ్యాల అనివార్య ఘర్షణగా వ్యాఖ్యానించటం అవసరం.

 

   చరిత్రకారుడు ఏ ఎల్ భాషం “ది వండర్ దట్ వాజ్ ఇండియా” లో విజయనగర సామ్రాజ వైభవం గురించి ఇటాలియన్ నికొలో డా కాంటి, పోర్చుగీసు యాత్రికులు పేస్ ,న్యూనిజ్  లు పొగడటం, బలహీనుడైన అచ్యుత రాయల  ఉద్యోగులు ప్రజలను అణచివేయడం, 16వ శతాబ్ది విజయనగర సామ్రాజ్యంలో బానిసల సంత, కృష్ణదేవరాయలు పెద్ద చెరువుని విజయవంతంగా నిర్మించడానికి 20,000 మంది శ్రామికులను  వాడటం, దేవతల మెప్పుకోసం ఖైదీలను నరబలి చేయటం, ఆనాటి శిల్ప కళలో పాండ్య , హోయసల శిల్పకళ లక్షణాలు,  మండపాల గోడలు స్తంభాలపై అపురూపమైన  బొమ్మలు చెక్కడం .  తెలుగు ఆస్థాన భాషగా మారటం ప్రస్తావించారు.

 

 

  “లేపాక్షి”  నవలలో ఊళ్ళ పేర్లు ( మడకశిర, పావగడ, హిందూపురం, లక్ష్మీపురం, సజ్జల పల్లి మొదలగునవి  ఎలా వచ్చింది) అచ్యుతరాయల   కాలంలో అతనిని దించి అధికారానికై  అళియ  రామరాయలు  చేసే కుట్ర,  అంతఃపుర కుట్రలు,  చేనేత పని వారి గురించి, ధాన్యం ఏ విధంగా దాచేవారు, రాజ్యాలు ఏ విధంగా కోశాగారం మీద ఆధారపడతాయో,  రాజుల సంపద సామాన్య ప్రజలపై , సానులపై వేసే పన్నులపై  ఉంటుందో( ఈనాడు మద్యం పైన ఆధారపడినట్లు) , తిప్పే గౌడ, క్రిస్టప్ప లాంటి అధికార కామాంధుల దౌర్జన్యాలు, శిల్పకళాచార్యుల,  శిల్పుల  ఏకాగ్రత, సమాజంలో అణగారిన ,  నర్తకి స్త్రీలు  రంగాజమ్మ, కుప్పాయమ్మ, ఆమె తనయ పద్మిని, తిమ్మక్క  ఆవేదన,  సమాజ హితం కోసం ప్రగతి కోసం పరితపించే  పద్మిని రాయల కోట రక్షణ కి కందకాలలో తాను ఒక్కో సారి  మొసళ్ళ ఆహారం కోసం ఖైదీలను, రోగిస్టులను   వేయడం వల్ల తన కొడుకు వీరభద్రం  అనారోగ్యం పాలయాడని విరూపణ్ణ  బాధ, గుడి నిర్మాణానికి పూనుకోవడం, కుట్ర వల్ల  విరూపణ్ణ ను  పదవి నుంచి దింపి కటకం క్రిస్టప్ప పెనుగొండ మండలాధీశుడు కావటం ,  విరూపన్న  కొడుకు వీరభద్రం, అతడ్ని ప్రేమించిన పద్మినీ ఇద్దరూ కామాంధుడు అయిన క్రిస్టప్ప , అతడి అనుచరుల దాడిలో  మరణించడంతో నవల విషాదాంతం గా మారింది.

 

  దీనితోపాటు స్వప్రయోజన పరులైన స్వాములు,  నంజుడప్ప అన్యాయాన్ని ఎదిరించి అక్క కూతురు మాన రక్షణకు  పెత్తందారును శిక్షించి, వాని  మనుష్యుల ప్రతీకార దాడిలో భార్య, కూతురు పద్మిని నీ కోల్పోయి  తత్వం చెప్పే తిక్క సామి గా మారటం  , సామాన్య జనంలోని భక్తి భావాలు, జాతర్లలో నృత్య  ప్రదర్శన సమయాలలో ఆకతాయిల  చేష్టలు  రచయిత వివరించారు. 16వ శతాబ్దం నాటి భూస్వామ్య రాచరిక వ్యవస్థ విశేషాలు వివరించారు.  చెరువుకు గండి పడితే దళిత బాలిక హొన్నమ్మ ను బలవంతంగా సంప్రదాయం పేరిట  ఆత్మార్పణ చేసేలా చేయటం, అంతకుముందు హొన్నమ్మ పై అత్యాచారయత్నాన్ని చేసినందుకు తిప్పెగౌడ నుఎదిరించిన ఆమె బావ సత్తెప్ప హత్య తదితర విషయాలున్నాయి.

 

   నదులు నుంచి  తయారైన ఉప్పును మాత్రమే   వాడమని ముస్లింలకు, స్థానిక  వుప్పర్ల మధ్య తగాదా నిర్మూలనకు. విరూపణ్ణ శాసనం చేస్తాడు.  సంప్రదాయ మార్పు లో మార్పు అవసరం గురించి ద్వారా అతడి మంత్రి తో  రచయిత చెప్పిస్తున్నారు .పద్మిని  సలహా వల్ల ఆడ బిడ్డలకు రవికె, చీర పెట్టే గౌరవం ఇచ్చే  గౌరమ్మ పండగ ఎలా వచ్చింది, తమపై పన్నులు వేసి రోగాలు వస్తే పట్టించుకోరని వాపోయే మేడసాని తిమ్మక్క,  గిట్టుబాటు ధరల కోసం కాపుల్ని వర్తకులకు వరహా ఇవ్వమంటే వారి బాధ, ఎద్దుల ప్రేమికుడు గవప్ప గవిరెడ్డిగా మారి పెత్తనం చేసే వైనం , శిలలు  శిల్పాలుగా మారే క్రమం ఉన్నాయి.

 

    రాతిగుండు  చుట్టూ మొక్కల్ని తల్లిలా ఉన్నాయని,  ఒకటి కాపు వనిత సద్ది మోసుకుపోతున్నట్లు , మరొకటి  రాళ్ళు   తల్లి ఒడిలో బిడ్డలా ఉన్నాయనీ రచయిత పోల్చడం, పద్మినీ , వీరభద్రం ల సమాజ హితాభిలాష వర్ణన  చాలా బాగుంది.   అలాగే ఆచార్యులు విరూపణ్ణ  ను  గుడి కట్టించమని కోరటం , అది శివాలయం లేదా వైష్ణవాలయమా అనే  ప్రభావితం చేసేందుకు  చర్చలు , నిర్మాణానికి రాళ్ళు తెచ్చేందుకు జనం శ్రమతో రహదారులు వేయటం,   శిల్పులలో,  పని వారిలో కుల బేధాలు,  రాళ్ళు  మోసేందుకు ఏనుగులు లేకపోవడంతో  ఎద్దులను, ఎనుబోతులను   వాడటం , ఆ క్రమంలో  మరణించిన గొప్ప ఎద్దు గవిరాజు కు నివాళిగా  ఒకే రాయి నుంచి బసవన్న నిర్మాణం కూడా ఉన్నాయి.

 

 

   లేపాక్షి పేరు   ప్రచారంలో ఉన్న కథ ప్రకారం  రాముడు జటాయువును  " లేపక్షి "  అనటం వల్ల వచ్చింది. కానీ   శిల్పులు మండపాల పై  కప్పుకు లేపేముందు రాళ్లపై  బొమ్మలు చిత్రించి , వాటికి గుర్తించిన సంఖ్యల ప్రకారం  పైకి చేర్చి ,  వాటిని పరిచినపుడు మధ్య  ఖాళీల  కు రంగులు  పూసే వారు. లేపుల అచ్చులు కలిసి లేపాచ్చులయి   కాలక్రమంలో లేపాక్షిగా మారి ఉండవచ్చని రచయిత రాయటం వాస్తవానికి దగ్గరగా ఉన్నది. 

 

   ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీ నవల “విక్టరీ సిటీ” నవల సైతం   వాస్తవాలు, ఊహల్ని మేళవించి  మ్యాజికల్  రియలిసం శైలిలో    విజయనగర  చరిత్ర పుట్టుక, వైభవం, దాని విషాదాంతాన్నీ రికార్డు చేస్తుంది. సామ్రాజ్యాలు లేచి, కూలినా భిన్న  కథనాలలో అక్షరాలు మాత్రమే బ్రతికాయి. నేడు  మానసిక విభజన పెరిగిపోయి,    భిన్న మతాలు, జాతుల మధ్య  వైషమ్యాల కన్నా మానవత్వం మిన్న అని చరిత్ర చెబుతుంది.  “విక్టరీ సిటీ” లాగానే  చిదంబరరెడ్డి  “లేపాక్షి” నవల పాఠకులను ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తుంది.

 

(Published  on 05/10/2026 in Maha daily) 

.