ప్రముఖ చరిత్రకారుడు పర్యావరణవేత్త, రచయిత, లిబరల్ డెమొక్రాట్, విదేశీ విద్యాలయాలలో ఉపన్యాసకుడు, క్రికెట్ ప్రేమికుడు అయిన రామచంద్ర గుహా పుస్తకం “ఎన్విరాన్మెంటలిజం” ఈ భూమాత రక్షణ కోరే ప్రతి హృదయంలో స్పందన కలిగిస్తుంది. పర్యావరణం పై గుహా ఇతర రచనల్లో వెరియర్ ఎల్విన్ అండ్ హిస్ ట్రైబల్స్, “ది అన్క్వైట్ వుడ్స్,” “ఇకాలజీ అండ్ ఈక్విటీ” , “దిస్ ఫిస్సర్డ్ ల్యాండ్” ముఖ్యమైనవి. గాంధీ పై రాసిన “గాంధీ బిఫోర్ ఇండియా,” “ఇండియా ఆఫ్టర్ గాంధీ” కూడా ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. “మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా,” “పేట్రియాట్స్ అండ్ పార్టిజన్స్,” మరియు “డెమోక్రాట్స్ అండ్ డిసెంటర్స్” సైతం అతని ఉదారవాద ప్రజాస్వామ్య భావాలకు తార్కాణంగా నిలిచాయి.
ప్రకృతిని జయించి, సహజ వనరులపై ఆధిపత్య యుద్ధాల లో ధ్వంసించి, వినియోగవాద సుడిగుండంలో మానవాళి గిరికీలు కొడుతూ తన మనుగడకే ఎసరు పెడుతోంది. మానవ ప్రధాన, లాభార్జన లక్ష్యం తో కూడిన ఆర్థిక, రాజకీయ జీవన శైలి వదిలి ప్రకృతితో సామరస్యం నెరపవలసిన తరుణమిది. ఈ సందర్భంలో గుహా పర్యావరణ ఉద్యమం పుట్టుక, పెరుగుదల, ప్రపంచంలో దాని ప్రభావాన్ని “ఎన్విరాన్మెంటలిజం: ఏ గ్లోబల్ హిస్టరీ “పుస్తకంలో వివరించారు. రాచెల్ కార్సన్ రాసిన “నిశ్శబ్ద వసంతం” (సైలెంట్ స్ప్రింగ్) లో అమెరికా, జర్మనీ స్వీడెన్ లాంటి పలు దేశాల్లో క్రియాశీల ఉద్యమాలను ఎలా ఉత్తేజపరిచిందో వివరించారు. ఆమె ప్రాణి కోటికి హాని కలిగించే డిడిటి లాంటి పురుగు మందులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. ఫలితంగా పురుగుమందుల నియంత్రణ చట్టం (1972), విష పదార్థాల చట్టం (1974) ఉనికిలోకి వచ్చాయి.
రాచెల్ కార్సన్ కన్నా ముందుగా జార్జి పెర్కిన్స్, జాన్ మూర్, ఆల్డో తెపాల్డ్ లాంటి వారు ఉన్నారు. రాచెల్ కార్సన్ తో పాటు రేమండ్ దాస్మాన్, పాల ఎర్లిచ్ , హార్డిన్ లాంటి మొక్కల శాస్త్రవేత్తలు , గిల్బర్ట్ , బయో కెమిస్ట్ పామ్ స్టీర్మా,ఇంగ్లాండ్ లో అష్బీ, డార్లింగ్, వాడింగ్టన్, జూలియన్ హక్స్లీ వంటి వారు ఉద్యమాన్ని ముందుకు కొనిపోయారు.
గుహా దృష్టిలో పర్యావరణవాదులను పెట్టుబడిదారులు ఏమో స్వేచ్ఛా మార్కెట్ నుంచి, వర్గ పోరాటం నుంచి ప్రజల దృష్టినీ మళ్లించేవారుగా సోషలిస్టులు విమర్శించారు. పర్యావరణ ఉద్యమం 1960 లలో పాలన వ్యవస్థలను మార్చే మిలిటెంట్ ఉద్యమంగా, 1990 లలో, 21 వ శతాబ్దం తొలి ఏళ్లలో వీధి పోరాటాలుగా మారింది. ఆర్నె నాస్ మొదలెట్టిన ‘డీప్ ఇకాలజీ’ ఉద్యమం అడవుల పైన కేంద్రీకరించింది. పర్యావరణ ఉద్యమం మానవ ఆవాసాలపై, న్యూయార్క్ లోని లవ్ కెనాల్ ప్రక్షాళన, నల్ల వారు అధికంగా ఉండే హ్యూస్టన్ నగరంలో చెత్త కుప్పల పోగు కు వ్యతిరేకంగా దృష్టి సారించింది.
జర్మనీలో పర్యావరణ వాదులు పార్లమెంటులో స్థానాలు సంపాదించగలిగారు. యాభై శాతం పైగా స్త్రీలకు స్థానాలు కల్పించారు. వారు తృతీయ ప్రపంచ దేశాలను ఆర్థికంగా, పర్యావరణపరంగా దోపిడీ చేయడంలో పశ్చిమ ఐరోపా పాత్రను గుర్తించారు. అంతర్జాతీయ రుణాల రద్దుకు, పర్యావరణ విధ్వంసక వస్తువుల నిషేధానికి, పేద దేశాల నుంచి ధనిక దేశాలకు మరింతగా స్వేచ్ఛ వలసను కోరారు. అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు సైతం గ్రీన్ పార్టీ డిమాండ్లు అయిన అణుశక్తి అంతం , ఏకపక్ష నిరాయుధీకరణ, అన్ని రంగాలలో స్త్రీల ప్రాతినిధ్యానికి అంగీకరించాల్సి వచ్చింది అని రచయిత తెలిపారు.
ఉత్తరార్థ గోళంలో పర్యావరణ ఉద్యమాలు నాణ్యమైన జీవితంపై, జీవన ప్రమాణాలపై కేంద్రీకరించగా, దక్షిణార్థ గోళంలో ఉపాధి ,సామాజిక న్యాయాల కోసం ప్రధానంగా జరిగాయి. బ్రెజిల్ లో ఉద్యమం పట్టణాల్లో మురికివాడ వాసుల నుంచి , స్థానిక తెగలనుంచి వచ్చింది
భారత దేశంలో గ్రామీణ సమాజాలు సమాజంలో సహజ వనరులను ప్రైవేటు కంపెనీలకు ఈయటంపై వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ మధ్యతరగతి ప్రజల్లో ఆదివాసి రైతు ఉద్యమాల పట్ల స్పందన తక్కువగా ఉండగా, బ్రెజిల్ లో పట్నంలోని పేదలు, ఆదివాసీలు నిర్వాసితులకు మధ్యతరగతి నుంచి మెరుగైన మద్దతు దొరికింది. ఇది లోతైన ప్రజాస్వామ్యం, మరింత పారదర్శకతలకు దారితీసింది అని రామచంద్ర గుహా వివరించారు.
దక్షిణార్థ గోళంలో సైతం మలేషియాలోని సరావాక్ వనాలలో పెనాన్ సమాజం, భారత దేశంలో ‘నర్మదా బచావో’ ఆందోళన, థాయిలాండ్ లో నీటి స్థాయిని తగ్గించే యూకలిప్టస్ కి వ్యతిరేకంగా బౌద్ధ మతస్తుల పోరాటాలు, నైజీరియాలో రాయల్ షెల్ కంపెనీ ఆయిల్ డ్రిల్లింగ్ కు వ్యతిరేకంగా కన్సారో వివా చేసిన పోరాటం, కెన్యాలో వంగరి చేసిన గ్రీన్ బెల్ట్ పోరాటాలు పెరుగుతున్న పర్యావరణ ఉద్యమ చైతన్యాన్ని ప్రతిబింబించాయి. మెగా ప్రాజెక్టులు, సున్నపురాయి గనులు ,హైటెక్ మరపడవలు, కాగితం కర్మాగారాలకు వ్యతిరేకంగా ఆదిమవాసులు, రైతులు, జాలర్లు పోరాటాలు చేశారు. పెరూ లో మైనింగ్ కు వ్యతిరేకంగా, మెక్సికోలో శాంజువాన్ డామ్ కు వ్యతిరేకంగా ఇండియన్లు శాంతియుతంగానూ, మిలి టెంట్ గాను పోరాటం సాగించారు.
గుహా దృష్టిలో రహదారుల విస్తరణకు అమెజాన్ అడవుల విధ్వంసం ప్రపంచ చరిత్రలో జీవజాల నాశనంలో అత్యంత తీవ్రమైనది. ప్రజలు గాంధీజం , బుద్ధిజం, కేథలిక్ మతాల ప్రేరణతో అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణ వికేంద్రీకరణలకు అనుకూలంగా తిరిగి నిర్వచించారు. చిన్న ఆనకట్టలు, చెరువులు, బావుల వంటి సంప్రదాయ నీటిపారుదల పద్ధతులు, సహజ వనాలపై కమ్యూనిటీ నియంత్రణ వంటి ఆచరణాత్మక పద్ధతులు, భారీ ఆనకట్టలకు, భారీ పరిశ్రమలు ప్రైవేటుపరం కావడానికి నిరసనగా ఉద్యమాలు వచ్చాయి. మలేషియాలో , భారతదేశంలో కార్పొరేట్ ,రాజ్య- బ్యూరోక్రాటిక్ శక్తులు పర్యావరణవాదులను అభివృద్ధి వ్యతిరేకులుగా వర్ణించారు.
ఈ నాడు పర్యావరణవాదులు అధికారానికి సత్యంతో సమాధానం చెప్పి అభివృద్ధికి చెల్లించే మూల్యం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఎల్ నినో ప్రభావానికి, రానున్న కరువులు , నేపాల్ లో లాగా, ఈశాన్య భారతంలో వచ్చే ఆకస్మిక వరదలు, భూకంపాలు, ఉత్తరాఖండ్ లో అసంఖ్యాక ప్రాజెక్టులు వల్ల కలుగుతున్న ఉత్పాతాలు, అదృశ్యమవుతున్న వనాలు, రసాయనిక, జల, వాయు, ప్లాస్టిక్ తదితర కాలుష్య బాధితులు అయిన ప్రజానీకం ఎరుకతో మన ఆర్థిక విధానాలు పర్యావరణ హితవుగా ఉండేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
(published on 16 October,2026 in Telugu prabha daily on harita prabhapage )
No comments:
Post a Comment