ప్రఖ్యాత
రచయిత, ఎన్నో అవార్డుల స్వీకర్త సడ్లపల్లె
చిదంబర రెడ్డి రచించిన “లేపాక్షి” నవల రాయల వారసుల కాలం నాటి పెనుగొండ పరిసర ప్రాంతాల సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను,
హేతువాద పద్ధతిలో గ్రామీణ శ్రమజీవుల కోణం నుంచి
చిత్రించింది. చారిత్రక నవలల్లో వాస్తవం ఊహలు
కలిసి ఉండటం మామూలు కానీ, వాస్తవం ప్రశ్నార్ధకంగా, ఊహ పుక్కిటి పురాణంగా ఉంటే దానికి
మన్నన ఉండదు. చారిత్రక రచనలో వస్తుగత వాస్తవికత
అనేది వ్యక్తిగత అంశం లేకుండా ఉండదు. చరిత్రకారుల,
నవలా రచయితల అనివార్య పక్షపాతం తెలిసిందే. అయితే చరిత్ర సారం శ్రీశ్రీ అన్నట్లు
“ఆ రాణి ప్రేమ పురాణం , ఈ ముట్టడి కైన ఖర్చులు” మాత్రం కాదు అని “లేపాక్షి” నవల నిరూపిస్తుంది. ఈనాడు హిందుత్వ వాదులు హిందూ రాజులను పొగుడుతూ,
బ్రిటీష్ వ్యతిరేకంగా పోరాడిన టిప్పు సుల్తాన్, మత సామరస్యాన్ని చెప్పిన అక్బర్ లను కూడా విచక్షణా రహితంగా విమర్శ చేయడం
చూస్తున్నాం. నేటి ప్రజాస్వామ్యంలో
చరిత్రను రాజుల మధ్య రణాలుగా కాకుండా పీడకుల, పీడితుల మధ్య కుల, వర్గ వైరుధ్యాల అనివార్య ఘర్షణగా వ్యాఖ్యానించటం అవసరం.
చరిత్రకారుడు
ఏ ఎల్ భాషం “ది వండర్ దట్ వాజ్ ఇండియా” లో విజయనగర సామ్రాజ వైభవం గురించి ఇటాలియన్
నికొలో డా కాంటి, పోర్చుగీసు యాత్రికులు పేస్ ,న్యూనిజ్ లు పొగడటం, బలహీనుడైన అచ్యుత రాయల ఉద్యోగులు ప్రజలను అణచివేయడం, 16వ శతాబ్ది విజయనగర
సామ్రాజ్యంలో బానిసల సంత, కృష్ణదేవరాయలు పెద్ద చెరువుని విజయవంతంగా నిర్మించడానికి
20,000 మంది శ్రామికులను వాడటం, దేవతల మెప్పుకోసం
ఖైదీలను నరబలి చేయటం, ఆనాటి శిల్ప కళలో పాండ్య , హోయసల శిల్పకళ లక్షణాలు, మండపాల గోడలు స్తంభాలపై అపురూపమైన బొమ్మలు చెక్కడం . తెలుగు ఆస్థాన భాషగా మారటం ప్రస్తావించారు.
“లేపాక్షి” నవలలో ఊళ్ళ పేర్లు ( మడకశిర, పావగడ, హిందూపురం,
లక్ష్మీపురం, సజ్జల పల్లి మొదలగునవి ఎలా వచ్చింది)
అచ్యుతరాయల కాలంలో అతనిని దించి అధికారానికై అళియ రామరాయలు చేసే కుట్ర,
అంతఃపుర కుట్రలు, చేనేత పని వారి గురించి,
ధాన్యం ఏ విధంగా దాచేవారు, రాజ్యాలు ఏ విధంగా కోశాగారం మీద ఆధారపడతాయో, రాజుల సంపద సామాన్య ప్రజలపై , సానులపై వేసే పన్నులపై ఉంటుందో( ఈనాడు మద్యం పైన ఆధారపడినట్లు) , తిప్పే
గౌడ, క్రిస్టప్ప లాంటి అధికార కామాంధుల దౌర్జన్యాలు, శిల్పకళాచార్యుల, శిల్పుల
ఏకాగ్రత, సమాజంలో అణగారిన , నర్తకి
స్త్రీలు రంగాజమ్మ, కుప్పాయమ్మ, ఆమె తనయ పద్మిని,
తిమ్మక్క ఆవేదన, సమాజ హితం కోసం ప్రగతి కోసం పరితపించే పద్మిని రాయల కోట రక్షణ కి కందకాలలో తాను ఒక్కో
సారి మొసళ్ళ ఆహారం కోసం ఖైదీలను, రోగిస్టులను వేయడం వల్ల తన కొడుకు వీరభద్రం అనారోగ్యం పాలయాడని విరూపణ్ణ బాధ, గుడి నిర్మాణానికి పూనుకోవడం, కుట్ర వల్ల విరూపణ్ణ ను
పదవి నుంచి దింపి కటకం క్రిస్టప్ప పెనుగొండ మండలాధీశుడు కావటం , విరూపన్న
కొడుకు వీరభద్రం, అతడ్ని ప్రేమించిన పద్మినీ ఇద్దరూ కామాంధుడు అయిన క్రిస్టప్ప
, అతడి అనుచరుల దాడిలో మరణించడంతో నవల విషాదాంతం
గా మారింది.
దీనితోపాటు
స్వప్రయోజన పరులైన స్వాములు, నంజుడప్ప అన్యాయాన్ని
ఎదిరించి అక్క కూతురు మాన రక్షణకు పెత్తందారును
శిక్షించి, వాని మనుష్యుల ప్రతీకార దాడిలో
భార్య, కూతురు పద్మిని నీ కోల్పోయి తత్వం చెప్పే
తిక్క సామి గా మారటం , సామాన్య జనంలోని భక్తి
భావాలు, జాతర్లలో నృత్య ప్రదర్శన సమయాలలో ఆకతాయిల చేష్టలు
రచయిత వివరించారు. 16వ శతాబ్దం నాటి భూస్వామ్య రాచరిక వ్యవస్థ విశేషాలు వివరించారు. చెరువుకు గండి పడితే దళిత బాలిక హొన్నమ్మ ను బలవంతంగా
సంప్రదాయం పేరిట ఆత్మార్పణ చేసేలా చేయటం, అంతకుముందు
హొన్నమ్మ పై అత్యాచారయత్నాన్ని చేసినందుకు తిప్పెగౌడ నుఎదిరించిన ఆమె బావ సత్తెప్ప
హత్య తదితర విషయాలున్నాయి.
నదులు
నుంచి తయారైన ఉప్పును మాత్రమే వాడమని ముస్లింలకు, స్థానిక వుప్పర్ల మధ్య తగాదా నిర్మూలనకు. విరూపణ్ణ శాసనం
చేస్తాడు. సంప్రదాయ మార్పు లో మార్పు అవసరం
గురించి ద్వారా అతడి మంత్రి తో రచయిత చెప్పిస్తున్నారు
.పద్మిని సలహా వల్ల ఆడ బిడ్డలకు రవికె, చీర
పెట్టే గౌరవం ఇచ్చే గౌరమ్మ పండగ ఎలా వచ్చింది,
తమపై పన్నులు వేసి రోగాలు వస్తే పట్టించుకోరని వాపోయే మేడసాని తిమ్మక్క, గిట్టుబాటు ధరల కోసం కాపుల్ని వర్తకులకు వరహా ఇవ్వమంటే
వారి బాధ, ఎద్దుల ప్రేమికుడు గవప్ప గవిరెడ్డిగా మారి పెత్తనం చేసే వైనం , శిలలు శిల్పాలుగా మారే క్రమం ఉన్నాయి.
రాతిగుండు చుట్టూ మొక్కల్ని తల్లిలా ఉన్నాయని, ఒకటి కాపు వనిత సద్ది మోసుకుపోతున్నట్లు , మరొకటి రాళ్ళు
తల్లి ఒడిలో బిడ్డలా ఉన్నాయనీ రచయిత పోల్చడం, పద్మినీ , వీరభద్రం ల సమాజ హితాభిలాష
వర్ణన చాలా బాగుంది. అలాగే ఆచార్యులు విరూపణ్ణ ను గుడి
కట్టించమని కోరటం , అది శివాలయం లేదా వైష్ణవాలయమా అనే ప్రభావితం చేసేందుకు చర్చలు , నిర్మాణానికి రాళ్ళు తెచ్చేందుకు జనం శ్రమతో
రహదారులు వేయటం, శిల్పులలో, పని వారిలో కుల బేధాలు, రాళ్ళు
మోసేందుకు ఏనుగులు లేకపోవడంతో ఎద్దులను,
ఎనుబోతులను వాడటం , ఆ క్రమంలో మరణించిన గొప్ప ఎద్దు గవిరాజు కు నివాళిగా ఒకే రాయి నుంచి బసవన్న నిర్మాణం కూడా ఉన్నాయి.
లేపాక్షి
పేరు ప్రచారంలో ఉన్న కథ ప్రకారం రాముడు జటాయువును " లేపక్షి " అనటం వల్ల వచ్చింది. కానీ శిల్పులు మండపాల పై కప్పుకు లేపేముందు రాళ్లపై బొమ్మలు చిత్రించి , వాటికి గుర్తించిన సంఖ్యల ప్రకారం పైకి చేర్చి ,
వాటిని పరిచినపుడు మధ్య ఖాళీల కు రంగులు
పూసే వారు. లేపుల అచ్చులు కలిసి లేపాచ్చులయి కాలక్రమంలో లేపాక్షిగా మారి ఉండవచ్చని రచయిత రాయటం
వాస్తవానికి దగ్గరగా ఉన్నది.
ప్రఖ్యాత
రచయిత సల్మాన్ రష్దీ నవల “విక్టరీ సిటీ” నవల సైతం వాస్తవాలు, ఊహల్ని మేళవించి మ్యాజికల్
రియలిసం శైలిలో విజయనగర చరిత్ర పుట్టుక, వైభవం, దాని విషాదాంతాన్నీ రికార్డు
చేస్తుంది. సామ్రాజ్యాలు లేచి, కూలినా భిన్న
కథనాలలో అక్షరాలు మాత్రమే బ్రతికాయి. నేడు
మానసిక విభజన పెరిగిపోయి, భిన్న మతాలు,
జాతుల మధ్య వైషమ్యాల కన్నా మానవత్వం మిన్న
అని చరిత్ర చెబుతుంది. “విక్టరీ సిటీ” లాగానే చిదంబరరెడ్డి
“లేపాక్షి” నవల పాఠకులను ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తుంది.
(Published on 05/10/2026 in Maha daily)
.
No comments:
Post a Comment