Sunday, 20 September 2026

నా స్వదేశానికి తిరిగి రాక లో కవితాఝరి

                     


    ఎమే సెజైర్ (1913-2008)  ఫ్రెంచ్ మార్టినీక్  దీవిలో బాస్-పాయింట్  లో  జన్మించారు. తను పారిస్ లో చదువుకుంటున్నపుడు సెంగార్, డమాస్ లతో కలిసి ‘నెగ్రిటూడ్’ ఉద్యమం ఆరంభించాడు. ఇది  1930లలో నల్ల జాతి రచయితలు ప్రారంభించిన సాహిత్య , సాంస్కృతిక ఉద్యమం. వలసవాద వ్యతిరేకంగా ‘ రిటర్న్ టు ది నేటివ్ లాండ్,’  ‘డిస్కోర్స్ ఆన్ కలోనియలిసం,’ ‘ఏ టెంపెస్ట్,’  ‘ఏ సీజన్ ఇన్ ది కాంగో,’  ‘ది ట్రాజెడీ ఆఫ్ కింగ్ క్రిస్టోఫే,’ ‘అండ్ ది డాగ్స్ వర్ సైలెంట్’ తదితర ప్రఖ్యాత రచనలు చేశాడు. ఈ నాడు దేశ దేశాల్లో అణచివేతను  వ్యతిరేకించే అందరికీ ఈయన రచనలు  స్ఫూర్తి కలిగిస్తాయి.

 

    సెజైర్ ఈ పుస్తకంలో అధికారాన్ని   తిరస్కరిస్తూ,తన పట్టణం గురించి, ఇంటి గురించి , నల్ల జాతి అణచివేత గురించి, ఐరోపా చెప్పిన అబద్ధాల గురించి, తిరిగి మేల్కొన్న నెగ్రిటూడ్ ఉద్యమం  గురించి , రేపటి రోజున తూర్పున ఉదయించే మార్పు గురించి అత్యంత ఉద్వేగాత్మక, కవితాత్మక, ఆలోచనాశీల  శైలిలో రాసిన రచన. మాటల్లో శక్తిని, నల్లవాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని, స్వేచ్ఛ కోసం అతని కలవరింతను చెబుతాడు. అర్థం లేని చావులు విమర్శిస్తూ ,జీవితం కోసం  ఆర్తిని , పట్నం గురించి కవి వర్ణిస్తూ  నిర్భయంగా, బహిరంగంగా దాని కుళ్ళును  వర్ణిస్తాడు.


   సెజైర్ ‘ రిటర్న్ టు ది నేటివ్ లాండ్,’ లో  తన దేశం కోసం , దాని గాయాల ఒంటరి వికారం కోసం, దానికోసం పలికేందుకు తిరిగి వచ్చాడు.జీవితం ఒక దృశ్యం కాదని, ప్రేక్షకుడిలా నిస్సార దృక్పథం చూపక జాగ్రత్త పడమంటాడు. “నేను వచ్చాను” అని ప్రకటిస్తాడు. తాను చూసే  చావు అర్థం , పవిత్రత, గౌరవం లేనిదని, తనకు జీవితాన్ని అంచనా   వేసేందుకు హక్కు లేదని అంటాడు. కవి తన దేశం గురించి, తన జాతి  గురించి,  తమను  హేతువు  పేరు మీద అణచివేయడం గురించి చెబుతూ  తన అస్తిత్వాన్ని సమర్ధించుకుంటాడు. 


    తాను ఐరోపా నిరాశను, పిరికితనాన్ని విమర్శిస్తూ అందమైన ఇగోయిజం కోరతాడు .కవి తాను చిరు గంటల్లో జరిగిన, ఒరిగిన వస్తుజాలాన్ని, పాత గాయాలను, ఎముకలని, బందీ అయిన అగ్గి కొండల్ని అంగీకరిస్తానంటాడు.తన నెగ్రిటూడ్  సహనం. తమ నల్ల జాతిది ప్రకృతితో సామరస్యం. విజేత తెల్ల జాతిని చూసి జాలిపడాలి.


   తనకు మంత్రగాడి నమ్మకం , చేతులకు క్రియాశక్తి , ఆత్మకి కత్తి పదును ఇమ్మని ,దృఢంగా ఉంటానని , ప్రజా ప్రేమికుడిని కావాలని కోరుతాడు. గర్వానికి వ్యతిరేకంగా, శ్రామికునిగా చేయమంటాడు. ద్వేష మనిషిగా చేయొద్దని, విశ్వ ఆకలి ,దాహం తీరాలంటాడు. ఫలవంతమైన జాతి జనించాలంటాడు.కవి తన కొత్త పెరుగుదలను చుట్టూ కప్పుకోమంటాడు. తమ జాతిని ముద్దాడమంటాడు. 


 .

పట్నం చదునుగా,  నిర్జీవంగా , మూగగా


   తెల్లవారుజామున కవి పోలీసులు, అధికార దుస్తులు  ఆశగాలాన్ని ద్వేషిస్తాడు.   తెల్లవారుజాములో మార్కెట్ కు వెళ్లేందుకు మొలకెత్తిన చేతి సంచులు. సాక్ష్యం చెప్పని అమరవీరులు ,నిశ్శబ్దంలో బాధతో తెరిచే ముసలి పెదాలు.తన ఆకలి బాధ, తిరుగుబాటు  గొంతు తానే ఇవ్వని సందడి చేసే గుంపు. ఒంటరిగా ఉండే గుంపు.  


   ప్రతిదాన్ని , వ్యక్తీకరణను, విముక్తి ప్రదాతను,స్వేచ్ఛను తిరస్కరించే పట్నం. తన్నుతాను తిరస్కరించే పట్నం. కుష్టు, వినియోగం, కరువులు, ప్రకృతిలో భయాల దొంతర. ఎలా  పేలాలో మరిచిన,  విస్మరించబడిన  మోర్న్ పట్నం. దాని మలేరియా రక్తం, నిరోధించిన నిప్పు,  ఆకలి 

బాధలు, కరువు ఆత్మహత్యలు. ఆకలితో మతి పోయి, సగం నిద్రలోని, పనికిరాని నల్ల పిల్లవాడు గొంతు నుంచి ఒక్క మాట కూడా రాబట్టలేని టీచర్, ప్రీస్ట్ లు. అవినీతి, మూర్ఖత్వం, వ్యభిచారం, హిపోక్రసీ, దురాశ, వక్రత్వం , దిగజారిన తనంతో విరిగిన వారికి సాదా బీచ్.  నిజమైన  దుఃఖాన్ని  కవికి తెలిపే సుదూర ఆనందం .సముద్రం యొక్క గొప్ప హిస్టరీకల్  నాలుక. 


   కాలం గడిచి క్రిస్మస్ వచ్చింది. బాగా పండిన దానిమ్మ పండు లాంటి అకస్మాత్తు అందం. నిరంతర కలకలం. నల్ల వారి సర్వాంగాల సంగీతం. అవినీతి, మూర్ఖత్వం, వ్యభిచారం, హిపోక్రసీ, దురాశ, వక్రత్వం , దిగజారిన తనంతో విరిగిన వారికి సాదా బీచ్.  నిలబడి నిరసనతో ఆకాశాన్ని చీల్చే అత్యంత స్వల్ప కోరిక లేకుండా, మొహంపై బోర్లా పడిన జీవితం.


 క్రూరమైన చిన్న ఇల్లు  


   ఆరుగురు సోదరులు, సోదరీమణులు .తండ్రి  అనూహ్య  స్పందన. ఆకలి కోసం సదా సింగర్  మెషిన్ తొక్కే  అమ్మ కాళ్ళు. ఈ పాయూ వీధి ఈ పట్టణ మర్మ అవయవాల్లా  జుగుప్సాకరమైన తోక.సముద్ర చెత్తను వదిలే బీచ్ కు ఆనుకున్న వీధి… బాధ పడే మనిషిని.. ఎవరికీ జవాబుదారీ కాకుండా చంపవచ్చు… కానీ పశ్చాత్తాపాన్ని చంపగలమా?



నల్ల  జాతి  వీరుల  ప్రశంస


    టుసాన్ లూవెర్త్యూర్.  చావు అతని తల మీద తేజ వలయం / తార.  తన చేతుల చెరకు తోటలో వీచే పిచ్చి గాలి, తెల్ల గుర్రంలా జైల్లో పరిగెత్తుతూ, చీకటిలో పిల్లికళ్ళు లా మెరుస్తూ, సముద్రపు దిబ్బ కింద  నీటిలా గుటకలేస్తూ, గాయపడిన పక్షి, తగ్గుతూ, సందేహిస్తూ , నిశ్శబ్ద తెల్లగుంటలో మరణిస్తుంది.


   “మేము మాట్లాడాలి. మేము పాడాలి. మేము అరవాలి.”  చెట్టును చూసి చెట్టు అయ్యాను. కాంగో గురించి యోచించి అడవులలో నిద్రలో సవ్వడి చేసే కాంగోను అయ్యాను .

 నా నేరాలు ప్రకటిస్తా, నా తరఫున చెప్పేది ఏమీ లేదు.  చంపాను దేవుణ్ణి నా సోమరితనంతో నా మాటలు , సంజ్ఞలు ,నా బూతుపాటలతో… 


   వూమ్ రో వా. పాముల్ని ఆడించేందుకు, అలలు దాటు నిమిత్తం  వానను  ఆపేందుకు. రహదారిపై చెరుకు తినే కుర్రవాడిని, రక్తదారిపై గొంతు చుట్టూ ఉరితాడు మనిషిని, ఒక పెద్ద సర్కస్లో నిలబడిన  నా నల్ల నుదురుపై ఉమ్మెత్త పూల  కిరీటం…  


   వూమ్ రో వా.  ఎవరు నా గొంతు నొక్కింది? నీవే. నూరేళ్ల కొరడా.  నూరేళ్ల ఓర్పు.  నాకోసం నీవు సర్దుకో. నీకోసం నన్ను నేను సర్దుకోను. 


   శతాబ్దాల పాటు నల్ల వారిని జంతువులుగా,  నడిచే ఎరువుగా, బానిసలుగా చూశారు. పేదరికం  వారిని పరిమార్చింది.  రైలులో ఒక అలసి సొలసిన నీగ్రో ని చూసి నవ్వుతున్న ఆడవారితో కలిసి తాను చిరునవ్వు నవ్వినందుకు, నేరంలో భాగమైనందుకు  పిరికి తనంచూసి మొహంపై వుమ్మేయమని డిమాండ్ చేస్తున్నా..


నేను   అంగీకరిస్తా 


   చిమ్మిన రక్తం జామెట్రీ  తో రంగు వేయబడ్డ జాతి జాగ్రఫీని అంగీకరిస్తాను అని. నెగ్రిటూడ్ ఏమాత్రం శిరో సూచిక కాదు.  నిరాశామయ  చేతుల్లో క్షతగాత్రమైన దేశం. అకస్మాత్తుగా జవసత్వాలు  ఎద్దులా కుమ్మాయి. జీవన తరంగం మోర్న్  పట్న స్తనంపై పారింది. సిరల్లో కొత్త రక్తం.  తుఫానులా పెద్ద శ్వాస కోశాల్లో బ్రీతింగ్.


     శతాబ్దాలుగా ఐరోపా  చెప్పిన అబద్ధాలు. ఏ జాతికి అందం, తెలివి,  బలంపై లేదు ఏక స్వామ్యం. ఇక సూర్యుడు తిరగాలి తమ భూమి చుట్టూతా. ప్రతితార భూమిపై రాలేదీ,ఆగేది తమ ఆజ్ఞను బట్టి.  దేశం ప్రాచీన బాంబ్రాల రాత్రి బల్లెం.


     బహు మంచి ‘నీగ్రో’ అంటే విధిని ఎదిరించలేక, దయలేని దేవుడు విధించిన ఆంక్షలు పాటిస్తూ తన విలువ లేని తనాన్ని నిజాయితీగా నమ్మి చెరకు తోటలో పనిచేసేవాడు. అతని మీద గాయాలు. పాత నెగ్రిటూడ్  శవమే అయింది.  మాట్లాడేది ఎందుకంటే  మరో సాగరం తరించేందుకు,  ఊపిరి తిత్తులు నవకల్పనకు, మరో ఉన్మాదికి స్వేచ్ఛ కోసం,  ఆత్మ ప్రకాశించేందుకు. 


    సామ్రాజ్యవాద దురాక్రమణకు  ఇరాక్, ఇరాన్, వెనిజులా, క్యూబా మొదలగు దేశాల వారికే కాక కుల, మత, జాతి, లైంగిక అణచివేతకు బాధపడే  జనులకు నేటి తరుణంలో సెజైర్ రచన ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది.


( Published on 17 August,2026,  Maha daily)

మృత్యు నిశీధిలో స్వేచ్ఛా తారలు (పుస్తక సమీక్ష )- -డా. జె. రవీంద్రనాథ్ Posted on August 5, 2026 by vihangapatrika

 

మారియో వర్గస్ యోసా  రచించిన ‘ఆండీస్ పర్వతాల్లో  మృత్యువు’ (’Death in the Andes)నవల  పెరూ లోని క్వెచువా ఆదిమవాసుల , సామాన్య ప్రజల, సైనిక అధికారుల, విప్లవకారుల అందరి జీవితం గురించిన ఆసక్తికరమైన నవల. యోసా తనదైన శైలిలో మూఢనమ్మకాలు, ఆచారాలు, తప్పుడు ప్రచారాలు , రాజ్య అభివృద్ధి యత్నాలు,  భిన్న సంస్కృతి పాయల, శృంగారం అన్నింటినీ మేళవించి       ఈ నవల రాసారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆండీస్  పర్వత శ్రేణి  దక్షిణ అమెరికా పశ్చిమ తీరం వెంబడి సుమారు 8,900 కిలోమీటర్లు దాకా   వెనిజులా, కొలంబియా, ఈక్వడార్, పెరూ, బొలీవియా, చిలీ మరియు అర్జెంటీనా అనే ఏడు దేశాలకి  విస్తరించి ఉంది.

   పెరూలో జన్మించిన  యోసా   2010 లో నోబెల్ బహుమతి గ్రహీత. ఈయనపై ఫ్లోబే, విలియం  ఫాక్నర్, జేమ్స్ జాయిస్, టాల్స్టాయ్, దాస్తొయెవ్‌స్కీ, ఇవాన్ బునిన్ మొదలైన ప్రఖ్యాత రచయితల ప్రభావముంది. ఆయన టైం ఆఫ్ ది హీరో’ , ‘ది గ్రీన్ హౌస్’,     ‘ది ఫీస్ట్ ఆఫ్ ది  గోట్’, ‘ఆంట్ జూలియా అండ్ ది స్క్రిప్ట్ రైటర్’ ,’ది వార్ ఆఫ్ ది వరల్డ్,’ ’ డెత్ ఇన్ ది ఆండిస్,’ అనే ప్రఖ్యాత నవలలు రచించారు.  తన్ను తాను “ వాస్తవికతతో మత్తుడై, చుట్టూ జరిగే చరిత్రతో,  నేటిపై మరింత భారాన్ని మోపే గతంతో ఆకర్షితుడైన నవలాకారుడిన”ని వర్ణించారు.

ఆధునిక యుగంలో పెరూ:

20వ శతాబ్దం మొదట్లో  పెరూ దేశంలో  గ్రామాల్లో భూస్వాములు,  తీరప్రాంతాలలో వాణిజ్య  ఫైనాన్స్ వర్గం వారు ప్రాబల్యం వహించారు. 1930 లో పుట్టిన ఏపీ ఆర్ఏ, కమ్యూనిస్టు పార్టీలు బలంగా లేకపోవడం వల్ల  అల్పజనాధిపత్యం (oligarchy) 1960 ల దాకా నడిచింది. తరువాత వచ్చిన పాపులర్ ఎలక్షన్ పార్టీ,  క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీలు కూడా రాజ్యంలో సంస్కరణలు తేవటంలో   విఫలం అయ్యాయి. 1968- 75 ల మధ్య అధికారం  చేపట్టిన జనరల్ అల్వరాడో రాజ్యం  పునాది పెంచేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు అని  జో మేరీ బర్ట్ పుస్తకం “పొలిటికల్ వయోలెన్స్ అండ్ ది ఆథారిటెరియన్ స్టేట్ ఇన్ పెరూ”లో  విశదీకరించారు. జనరల్ అల్వరాడో  తెచ్చిన లోతైన సామాజిక, ఆర్థిక,  వ్యవసాయ సంస్కరణలు వల్ల విదేశీ పెట్టుబడి ఆధీనంలోని  సహజ వనరులు తిరిగి వచ్చేందుకు  దారి ఏర్పడింది. అయితే  రుణదాతలు , వ్యాపారుల బ్లాక్ మెయిల్ వల్ల విప్లవానికి  అంత్యక్రియలు జరిగాయి అని ఎడ్వర్డో గాలియానో తన గ్రంథం ‘ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా’ లో రాశారు.

     జో మేరీ బర్ట్  రాసినట్లు 1974లో ప్రపంచ ఆయిల్ సంక్షోభం,  రాగి లాంటి పరిశ్రమలు  దెబ్బ తినటం వల్ల ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరిగాయి. 1975లో అధికారంలోకి వచ్చిన ఫ్రాన్సిస్కో  బెర్ముడేస్ , తర్వాత 1980లో  వచ్చినఫెర్నాండో బెలాండే  నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, ఆర్థిక పొదుపు లు వల్ల ప్రజలు, సమాజం మధ్య దూరం పెరిగింది.  1980-85 ల మధ్య జిడిపి స్తంభించి , ద్రవ్యోల్బణం రెండింతలు అయి ,  అప్పులు 70 శాతం పెరిగి, నిజ వేతనాలు 35 శాతం తగ్గాయి. రాజ్య హింస పెరిగి దేశంలో 1/3 వ వంతు, జనాభాలో సగం మంది  మిలటరీ పాలనలో  నానా కష్టాలు పడ్డారు.

సంధి యుగంలో సంఘర్షణ:

   పెరూ దేశం ప్రజాస్వామ్య  సంధి యుగంలో ఉండగా రాజ్యానికి , షైనింగ్ పాత్ గెరిల్లాల  మధ్య  సంఘర్షణలో 69 వేల మంది మృతిచెందగా , 12 వేల మంది అదృశ్యం  అయ్యారు. ఆరు లక్షల మంది తమ ప్రాంతం నుండి వలస పోయారు. 40  వేల మంది పిల్లలు అనాధలు అయ్యారు స్త్రీలపై అత్యాచారాలు, అసంఖ్యాక ప్రజల పై చిత్ర హింసలు  వందలాదిమంది కారాగారాల్లో బాధపడ్డారు. పెరూ లో ఆర్థిక, రాజకీయ, సంక్షోభం, అరాచక హింస, బలహీన రాజ్యం , అవినీతి మూలాన షైనింగ్ పాత్ పోరాటం సాగింది. 1992 లో గతంలో ఫిలాసఫీ ప్రొఫెసర్,  షైనింగ్ పాత్  నేత గుజ్మన్, ఇతర నేతల  అరెస్టుతో ఉద్యమం తగ్గుముఖం పట్టింది. 1990-97 చివర ఒక చిన్న ముఠా పాలన సాగి  రాజ్య శక్తి ” నిరంకుశత్వానికి లైసెన్స్” గా మారింది.

మారియో వర్గస్ యోసా  నవల “డెత్ ఇన్ ది ఆండిస్” లో   కథ ప్రధానంగా  నాకోస్  అనే  అవుట్ పోస్టులో  ఇద్దరు సైనికుల – కార్పొర ల్  లిటుమా ,సివిల్ గార్డ్ టొమాస్ ల మధ్య సంభాషణగా సాగుతుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు అదృశ్యం అవుతారు. వీరు  నరబలికి గురయ్యారని  అనుమానంతో  నిజం తెలుసుకొనేందుకు తీవ్రయత్నాలు చేస్తుంటాడు. వీరిద్దరే ఉన్న  ఆ అవుట్ పోస్టులో టొమాస్  తన జీవితంలోని ఆకస్మిక ఘటన  ప్రేమ,  తాను ‘రక్షించిన’ మెర్సిడెస్ తో కలిసి పలాయనం, చివరకు తన గాడ్ ఫాదర్ సాయంతో ఇక్కడకు  రావటం గురించి వివరిస్తాడు.ఇది  లిటుమాకు తన నిస్సారమైన జీవితంలో ఉపశాంతిగా ఉంటుంది.  ఇంకా  నవలలో  షైనింగ్ పాత్ గెరిల్లాల చర్యలు -ఫ్రెంచ్ పర్యాటక  యువజంటను, పర్యావరణ వేత్త, పరిశోధకురాలు సెనోరా డి హార్కోర్ట్, ఇంజినీర్ లను వర్గ శత్రువుగా భావించి చంపడం, ప్రజా కోర్టులో  ఇన్ఫార్మర్స్ ను చంపడం గురించి, రాళ్లు కొట్టే పని వారి జీవితాలు, కారణం తెలీని సంఘటనలు గురించి ఉంది.

అదృశ్య వ్యక్తులు:

   ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా మాయమైన ముగ్గురివి మూడు భిన్న కథలు. వీరిలో పెడ్రో టినోకో మూగగా, అమాయకుడిగా ఉండి బలవంతంగా సైన్యంతో చేర్చబడి, పారిపోయి కొండ ప్రాంతాల్లో తిరిగి చివరకు ప్రజలచే రక్షించబడతాడు. కొంతకాలం తరువాత వికూన్యా  జంతువులు  ఉండే ప్రాంతంలో స్థిరపడి వాటికి  మాలిమి అవుతాడు. అయితే అతన్ని నమ్మించిన విప్లవకారులు వికూన్యాలు ఉండే ప్రాంతం వచ్చి  అది బహుళ జాతి సంస్థల కుట్ర అని వాటిని   నిర్మూలిస్తారు. చివరకు అతడు  లిటుమా , తోమాస్ కర్రెన్యో ల  దగ్గర పనివాడుగా  ఉండగా మాయం అవుతాడు. మరో వ్యక్తి అల్బినో  కసిమీరో  ఇండియన్ తెగలతో వ్యాపారం చేస్తుంటాడు .అతను మత్తులో  తనను మోసం చేశాడని ఒక వనిత చెప్పినా ఆమెను  నిరాకరిస్తాడు. తర్వాత గుర్తుకొచ్చి ఎంత వెతికినా  ఆమె తిరుగుబాటులో చేరి  కనిపించకపోవడంతో  ఒకరోజు వారి చేతుల్లో  కాల్పుకు గురైన ఎలాగో బయటపడి నకో ప్రాంతం చేరి అక్కడ మళ్లీ మాయం అవుతాడు. మూడో వ్యక్తి డిమిట్రియో చాంకా ( గతం లో డాన్ మెదార్దో )  ఒకప్పుడు విప్లవకారులు  ఒక గ్రామంలో ప్రజాకోర్టు  పెట్టిన తరువాత దానికి సహకరించారని పేరుతో గ్రామస్తులను అంతం చేసినందుకు విప్లవకారుల కోపానికి  గురై  పారిపోయి  నాకో లో మేస్త్రీ గా   కొండమీద భార్యతో కలిసి ఒంటరిగా బతుకుతూ చివరకు కనపడకుండా పోతాడు. ఈ ముగ్గురిని కొండ ఆత్మలు బరి తీసుకున్నాయా లేక  గెరిల్లాలు  లు చంపారా అనేది  తెలియదు.

 స్వేచ్ఛా వనితలు:

    అయితే ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు డోనా అడ్రియానా, మెర్సిడెస్ అనేవి.

  అడ్రియానా వ్యక్తిత్వంలో  ధైర్యం, స్వతంత్రత, నిశ్చలత్వం అన్నీ ఉన్నాయి . లిటుమా  తన్ను పిలిపించి అదృశ్య వ్యక్తుల గురించి అడిగితే  అది కొండ ఆత్మలు పని ఉంటుంది.  ఆమె  మధ్య వయసులో  ఉంటుంది. రాత్రులు క్యాంటిన్ లో భర్తకు సాయంగా ఉండి ఖాతాదారులకు  మద్యం  అందిస్తుంది.పగలు కార్మికులకు వంట చేయడం, రాత్రులు వారికి హస్తసాముద్రికం, భవిష్యత్తు జోస్యం  చెప్పటం ఆమెకు రివాజు.  రాత్రిపూట మరోటి కూడా చేస్తుంటుందని లిటుమా  అనుమానం.ఆమె గురించి ఎన్నో కతలు. ఒక మంత్రగత్తె అని, ఒక గని పని వాని భార్యగా ఉన్నప్పుడు ఒక పిశాచాన్ని చంపినట్లు ప్రచారం.

   కార్పోరల్  లిటుమా ఎంత గుచ్చి అడిగినా మనుషుల అదృశ్యం గెరిల్లాల పని మాత్రం కాదంటుంది. అయితే ఆమె,  ఆమె భర్త డియోనిసియో ఏదో దాస్తున్నారని లిటుమా కు తీరని అనుమానం. ఆమె టొమాస్  చేయి చూసి అతని  విఫల ప్రేమ గురించి చెబుతుంది.ఆ  మనుషుల అదృశ్య రహస్యం తెలుసుకునే క్రమంలో  ఒక  ప్రొఫెసర్  నుంచి పెరూ చరిత్ర లో   18వ శతాబ్ది

నుంచి ఇంకా జాతి వారు తమకు విధేయులు కాని  హువాంకాలు,  చంకాలను  మరో ప్రాంతంలోకి  చెదరగొట్టారని లిటుమా తెలుసుకుంటాడు . ఇంకాలకు వ్యతిరేకంగా స్పానియార్డులకు  హువాంకాలు సాయం చేసి నందున వారంటే ఆధునిక చరిత్రకారులకు సానుభూతి లేదని ప్రొఫెసర్ అంటాడు. అయితే స్పానియార్డులు  తమకు తోడ్పడిన హువాంకాలపై కూడా మరింత బానిసత్వం నెలకొల్పారు. ఆ   ప్రొఫెసర్ ద్వారా డోనా ఆడ్రియానా  జీవితం గురించి కూడా లిటుమా కు తెలుస్తుంది.

    అడ్రియానా గ్రామం అందమైనది, పాడి పంటల తో బాగుండేది.  చిల్లర వర్తకుడు సాల్సెడో ఒక ట్రక్కులో తిరుగుతూ ఏడ్రియానా తండ్రి కొట్టుకు మందులు బట్టలు పరికరాలు తెచ్చేవాడు. ఒకసారి వచ్చినప్పుడు  భీకరంగా కనిపించాడు. ఒకరోజు గ్రామస్తులు అతని శిథిలమైన ట్రక్కును చూసారు. అతను మాత్రం లేడు.  గ్రామం దగ్గర  కొండ గుహల్లో  ఉంటూ అకస్మాత్తుగా బాటసారులపై దాడి  చేసే నరమాంసభక్షకుడిగా మారాడు.  అతనికి ఒప్పందం ప్రకారం ఒక అమ్మాయిని వంట చేసేందుకు, ఇంకా  సహాయకులుగా యువతులను  గ్రామస్తులు పంపేవారు. ఈ పిశాచిని చంపటానికి అడ్రియానా తిమోటియో కి సాయం చేసింది. అయితే వారి వివాహానికి గ్రామం లో వ్యతిరేకత ఉండటంతో ఆమె గ్రామాన్ని కాదని నాకోస్  దగ్గర  కాపురం పెట్టింది . శాంటా రీటా  గని దగ్గర తిమోటియో పనికి కుదిరాడు.

   అడ్రియానా జీవితం సాదాగా సాగుతుండగా డియోనిసియో బృందం అక్కడికి వచ్చారు. ఆ బృందం లేని పండగ లేదు .అతడు అమ్మే పిస్కో కు, అద్భుతమైన నృత్య గానాలకు,వశీకరణ శక్తికి అందరూ ఫిదా. అతడి గురించిన కథలెన్నో. అతడు పిశాచి, ముఖి , వైద్యుడు, మంత్రగాడు, జ్యోతిష్కుడు ఎవరో తెలియదు.అడ్రియానా ఆ బృంద   సంచార , విశృంఖల జీవితం గురించి తెలుసుకుంది. ఒకసారి  డియోనిసియో తో నృత్యం చేసి ఆనందం పొందింది. ఆమె సహజీవనం చేస్తున్న టిమోటియో అసూయతో ఆమెను దండించాడు. ఆమె డియోనిసియో తో వెళ్లి మిక్కియాకో సమాజంలో పెళ్లి చేసుకుంది .అతని ప్రభావంతో సంగీతం , జోస్యం  నేర్చుకుంది. ఆమె గురించి రకాల పుకార్లు వచ్చాయి. టిమోటియో మృతికి ఆమె కారణమని , మంత్ర మనిషి అని  పిలిచేవారు. కాల క్రమంలో ఆమె, డియోనిసియో  నాకోస్  దగ్గర స్థిర పడ్డారు. అక్కడ రహదారి పనులు మొదలయ్యాయి. ఆ ఊరికి క్షీణ దశ, చావు సమీపించాయి. పిశాచాల నెలవు అయింది. పండుగ ఉత్సవాలులో ఒకరిని పెద్దగా ఎన్నుకుని చివరలో ఊరు బాగు కోసం అతన్ని వేటాడేవారు. 

   హువానిటా గానంలో, నృత్యంలో తన్మయమై, ఇతరులతో మిళితమై, స్వేచ్చగా ఉండటం, పాట , నృత్యం అదే నీవు గా భావించడం వివేక మార్గం . శరీరం అనే జైలును వదిలి ఆత్మల జగత్తులో ప్రవేశించడం.  అడ్రియానా తానే గానమై, నాట్యమై , ఆత్మగా మారేది. ఆ ప్రదర్శనలో తర తమ జాతి భేదాలు లేవు.  నాట్యం తానే అయిన మూగ , తెలివి తక్కువ పెద్రితో ను ఎవరూ చంపలేదని , అన్నీ ఉన్నా కార్పోరల్ లిటుమా వణుకుతున్నాడని , ఎపుడు టెర్రుకో లు లేదా విప్లవకారులు చంపుతారు అని జడుస్తున్నాడని అడ్రియానా అతడ్ని  విమర్శిస్తుంది.ఇక్కడ అడ్రియానా సహజాత జీవితం నుండి దూరమైన బలహీన, బానిసత్వ, నాగరిక , ఆధునిక జీవితాన్ని  తూర్పార బడుతుంది. ఈ పాత్రను స్వేచ్ఛ గా , ధైర్యంగా, రాజ్యానికి బెదరకుండా బ్రతికే తీరులో రచయిత చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం.

     ఈ నవలలో రెండో ప్రధాన  స్త్రీ పాత్ర మెర్సిడెస్. ఇప్పుడు లిటుమా తో ఉన్న తోమాసు గతంలో హాగ్ అనే అధికారికి అంగ రక్షకుడు.  టింగోమారియా ప్రాంతంలో తన గది లో మెర్సిడెస్ ను

మోకాళ్ళ మీద నగ్నంగా కూర్చుండ బెట్టి బాధిస్తుండడంతో ఆమె రోదన విన్న టొమాస్  తన యజమాని హాగ్ ను కాల్చివేస్తాడు . అది తెలిసి అతడి మిత్రుడు  ఇస్కారియోత్ సలహా మేరకు

ఆమెతో కలిసి పారిపోతాడు. ఆమె నన్ను ఎవరు కాపాడమన్నారు, నువ్వు నాశనం అయ్యి నన్ను నాశనం చేసావు అని టొమాస్ తో అంటుంది. తాను హాగ్ స్నేహితురాలిని అని, అతడు  తిడితే ఏడ్చానని, అది అతన్ని ఉత్తేజ పరచడానికి అని టొమాస్ కర్రెన్యో  కు ఏమీ తెలియదని మెర్సిడెస్ అంటుంది. పారిపోయే క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. తనను అతడు ప్రేమ, ఇష్టం వల్ల ఆ హత్య చేశాడని ఆమె అంటుంది.  ఆమె అతన్ని దగ్గరకు తీసుకుంటుంది.ఆమె స్వేచ్ఛగా మాట్లాడటం, తాను నిద్రలో పలవరించిన మాటలు ఆమె నోటి నుంచి విని అవి తన నిజమైన ప్రేమ  భావమంటాడు  టొమాస్. తాను ఇంకా అలా అనుకోవడం లేదని అబద్ధం చెప్పనని మెర్సిడెస్ అంటుంది. ఆమెను  లిమా నగరంలో పెళ్లి చేసుకుంటానంటాడు.  ఆమె తనతో  టొమాస్ స్నేహితుడు   ఇస్కారియోత్ అవమానకరంగా మాటాడితే   హెచ్చరిస్తుంది.

     మెర్సిడెస్ తన గురించి టొమాస్ కు చెబుతూ ఒకసారి తన కోసం ఒక క్లబ్బులో జూదం ఆడారని తాను అతన్ని ప్రేమించడం లేదని,  తనకు స్వేచ్ఛ అంటే ఇష్టమని  అంటుంది. ప్రయాణంలో తన గుర్తింపు పత్రాన్ని  కోల్పోయిన మెర్సిడెస్ కి ఆందోళన పెరుగుతుంది. తల్లి సలహా మేరకు టొమాస్ తన కమాండర్ గాడ్ ఫాదర్   ను కలుస్తాడు. టొమాస్ ఆమెను తన గాడ్ ఫాదర్ ని కలవమన్నప్పుడు ఆమె తన గౌరవాన్ని ఎవరూ ఏమీ చేయలేరని నిబ్బరంగా చెబుతుంది. ఆ గాడ్ ఫాదర్ ఆమెతో నిత్యం చేస్తూ ఆమె శరీరాన్ని  తాకుతూ ఆమె మనస్తత్వాన్ని పరీక్షిస్తుంటాడు. ప్రపంచంలో ఆ ముసలోడు కోసం తాను టొమాస్  ను ఎన్నటికీ మోసం చేయను అని మెర్సిడెస్ అంటుంది.టొమాస్ తన ప్రేమ జ్వరంలో ఆమెకు మియామీ లో వారిద్దరి జీవితం గురించి ఊహిస్తాడు.  ఆమె ఏడుపును ఆపేందుకు తాను దాచుకున్న  నాలుగు వేల డాలర్లు  ఇచ్చేసి ఆమెను స్వేచ్ఛగా జీవించమంటాడు. తాను గాడ్ ఫాదర్ సాయంతో నాకో సైనిక ఔట్పోస్ట్ లో కార్పోరల్ లిటుమా తో చేరతాడు. నవల చివరలో మెర్సిడెస్ అతడ్ని  వెతుక్కుంటూ వచ్చి  తాను కూడా అతన్ని  ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఈ పాత్రలో మెర్సిడెస్  జీవిత అనుభవాల నుంచి పొందిన పరిపూర్ణత,  స్వేచ్ఛా ప్రియత్వం, మాటల్లో నిజాయితీ,  సాహసం, నిజమైన ప్రేమకు చివరకు తాను ప్రతిస్పందించడం ఆమె వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి.

   లిటుమా విశ్వ  ప్రయత్నం చేసినా  అక్కడి ప్రజల మనసులో రహస్యం  తెలుసుకోలేక పోతాడు.  కొండ చరియలు విరిగి పడటం  నుంచి అదృష్టవశాత్తు బయటపడతాడు.  బ్యారక్స్ నుండి బయటికి వచ్చి మేఘాలు లేని ఆకాశంలో  తారలని, అర్థ చంద్రుడ్ని, అవి తమ  కాంతిని చిమ్ముతున్న ఆండీస్ పర్వత శిఖరాలను చూస్తాడు అని రచయిత నవలను ముగిస్తాడు.

ఏ దారిలో ముందుకు? :

    డెబోరా కోన్ అనే విమర్శకురాలు నవలా రచయిత యోసా దేశంలో రెండు పక్షాల హింసను వ్యతిరేకించాడని ,  గ్లోబలైజేషన్ లో సాంస్కృతిక భేదాల ఏకీకరణ ఆధునికీకరణ కు అనివార్య ఫలితంగా భావించాడు అని రాశారు. ఐతే యోసా నవల చదివినపుడు  లాటిన్ అమెరికాలో కాకుండా ప్రపంచంలో చాలా  చోట్ల  రాజ్యం లేని చోట, బలహీనంగా ఉన్న చోట విప్లవోద్యమం సాగుతుంది అనుకోవడం, చివరకు అది ఆధిక్యతా రాజ్యహింస వల్ల ముగియడం అనే చారిత్రక విషాదం గుర్తుకొస్తుంది.   పెట్టుబడి దారి విధానానికి సమాధి తవ్వే శ్రామిక  వర్గాల విశ్లేషణ , ఆ వర్గాలలో ప్రగతిశీల పార్టీలకు తగు పట్టు లేకపోవడం, వారి మధ్య సాలిడారిటీ నిర్మించలేకపోవడం, సాంకేతిక జ్ఞానం  పెంచిన   రాజ్య  నేపథ్యంలో  మార్పు దారిని కొత్తగా అన్వేషించాలి.

నీలి గుల్మోహర్ చెట్టు పిల్లలు (పుస్తక సమీక్ష) -డా.జె.రవీంద్రనాథ్ Posted on May 5, 2026 by vihangapatrika

 

సహర్ డెలిజార్నీ ఇరాన్ లోని టెహ్రాన్ నగరంలో 1983లో జన్మించారు. ఆమె కుటుంబం తరువాత కాలిఫోర్నియా నగరానికి వలస వెళ్లింది .ఆమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , బర్కిలీ లో చదువుకున్నారు. తన కుటుంబం రాజకీయ కార్యకర్తలుగా, ఖైదీలుగా ఇరాన్ లో ఎదుర్కొన్న అనుభవాల ఉత్తేజంతో తన తొలి నవల “చిల్డ్రన్ ఆఫ్ ది జకరండా ట్రీ ” అనే నవల రచించారు. ఈ ఇరానీ- అమెరికన్ రచయిత్రి రాసిన నవల 32 భాషల్లో ప్రచురితమైంది. ఆమె వ్యాసాలు ‘ది న్యూ యార్క్ టైమ్స్,’ ‘లిటరరీ హబ్,’ ‘బి బి సీ పర్షియన్’ తదితర పత్రికల్లో వచ్చాయి.

డెలిజార్నీ నవల “చిల్డ్రన్ ఆఫ్ ది జకరండా ట్రీ” ( ‘జకరండా’ అంటే తెలుగులో ‘నీలి గుల్మోహర్’) ఇరాన్ లో1983 నుంచి 2010 దాకా సాగిన చరిత్రకు దానిలోని వైరుధ్యాలకు, నిరసనలకు , పర్యవసానాలకు సాహిత్య రూపం. ప్రతిభావంతమైన శైలిలో రచయిత్రి ఇరాన్ లోని సామాన్య పౌరుని స్థితిని చిత్రించారు. మొదట కథలుగా రాద్దామని ఆమె అనుకున్నా అది నవలగా మారింది. జైలు లోనే జన్మించిన ఆమె తన తల్లి దండ్రుల కు న్యాయం చేయాలని భావించి, భిన్న దృక్పథాలు కల పాత్రల ద్వారా నవలా రచన చేశారు.

ఇరాన్ చరిత్రలో షా రెజా పహ్లావికి అమెరికా చాలాకాలం మద్దతు ఇచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన తిరుగుబాటులో అతడు ఇరాన్ విడిచి పారిపోయాడు. ఈ తిరుగుబాటు ఉద్యమంలో ఉదారవాదులు, మార్క్సిస్టులు, ఇస్లామిక్ మతవాదులు అందరూ ఉన్నారు . కానీ 1979 విప్లవానంతర దశలో అనతి కాలంలోనే దేశ నాయకత్వం ఉదారవాదుల, లౌకికవాదుల నుంచి మతవాదుల చేతుల్లోకి పోయింది. దీనికి తోడు పక్కనున్న ఇరాక్ తో పది ఏళ్లపాటు ఇరాన్ చేసిన యుద్ధంలో అమెరికా ఇరాక్ కి సాయం చేసింది. 1991లో ఇరాక్ కువైట్ ను ఆక్రమించినప్పుడు అమెరికా రంగంలోకి దిగి సద్దాం హుస్సేన్ ఇరాక్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసి విఫలం అయింది. మరలా 2003 లో అణ్వస్తాలు తయారీ ఇరాక్ చేసిందనే సాకుతో యుద్ధం చేసి సద్దాం ను ఉరి తీసింది. నేడు కూడా అదే సాకుతో, ఆయిల్ రాజకీయాలతో ఇరాన్ పై అగ్ర రాజ్యం దురాక్రమణ కు దిగింది. మధ్య ప్రాచ్యంలో అమెరికా అనవసర జోక్యం వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల, ఇజ్రాయిల్ కు కొమ్ము కాయడం వల్ల ఆ ప్రాంతంలో ఇరాక్, లెబనాన్, పాలస్తీనా, సిరియాలు అంతర్యుద్ధాల్లో మునిగి ఇతర దేశాలకు వలస పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అమెరికా చలవ వల్లే ఇస్లామిక్ మతోన్మాదం పెరిగి అనర్థం జరిగింది.

ఇరాన్ చరిత్రలో ఇస్లామిక్ మతోన్మాద పాలన పాలనను వ్యతిరేకించిన పలువురు స్త్రీ, పురుషులు చెరసాలల పాలయ్యారు. కొందరు స్త్రీలకు జైలులోనే పిల్లలు జనించారు. వారిని తరువాత వారి కుటుంబాలలోని ఇతరులు పెంచవలసిన దుస్థితి ఏర్పడింది. ఆ పిల్లలు ఎదుర్కొన్న సమస్యలు అదృశ్యమైన బాల్యం,అభద్రతాభావం, ప్రవాసం, వారు పెరిగిన తరువాత కుటుంబ, సామాజిక, మానసిక సర్దుబాటులో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటిని డెలిజార్నీ తన నవలలో చిత్రించారు. ఈ నవల చదవడం సున్నితంగా, మధురంగా, ఆహ్లాదకరంగా ఉండదు. దీనికి ఇరాన్ బాధామయ గాథలే కారణం.

ఈ నవలలో అజర్ , ఇస్మాయిల్ దంపతులు తమ నిరసన వల్ల జైలు పాలవుతారు. అలాగే ఇస్మాయిల్ సోదరుడు బెహ్రూజ్ , సిమిన్ మరో జంట, మార్క్సిస్టు అయిన అమీర్ లు సైతం కారాగార కష్టాలు అనుభవిస్తారు.

మామన్ జీనాట్, అఘాజన్ ల సంతానం పారిసా సోదరీమణులు. వీరిలో పారిసా, సిమిన్ లు ఖైదుకాగా , పరిసా పిల్లలు ఓమీద్, సారాలను , సిమిన్ కూతురు ఫోరూగ్ ను కుటుంబంలో చిన్న చెల్లెలు లైలా పెంచాల్సి వస్తుంది. వీరితో పాటు ఇలాగే అనాథ పిల్లలు గా మారిన డాంటే , దాన్యా లు కూడా లైలా దగ్గర నీలి గుల్మోహర్ చెట్టు నీడలో పెరుగుతారు.

1983 లో ఎవిన్ జైలులో అజర్ ,ఇస్మాయిల్ దంపతులు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులు ఉంటారు .తమ కుటుంబాలకు దూరంగా అజ్ఞాత వాసంలో ఉంటారు. వారు కోరిన మార్పు రాలేదని , దాని కోసం చేసిన పోరాట క్రమంలో జైలు పాలు అవుతారు. నిండు గర్భిణిగా ఉన్న అజర్ ను సిస్టర్ (మతరాజ్య వ్యవస్థలో జైలు వార్డెన్ ) ఆసుపత్రికి తీసుకొని వస్తుంది. అజర్ కన్న బిడ్డను కూడా మొదట ఆమెను చూడనివ్వరు. కానీ ఆమె పట్టు బట్టి ఎంతో నీరసంగా ఉన్నా బిడ్డతో సహా ఆసుపత్రి నుంచి తిరిగి జైలుకు వెళుతుంది. మహిళా ఖైదీలు అందరూ ఆ పాపను అపురూపంగా చూసుకుంటారు. మరో వనిత ఫిరూజా జైలు కష్టాలను తట్టుకోలేక అధికారులకు అనుకూలంగా, అజర్ కు శత్రువులా మారుతుంది. కొన్నాళ్ల తర్వాత అజర్ కూతుర్ని అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తారు. తన కూతురు దూరమైన అజర్ కు చనుబాలు ఆగనప్పుడు గతంలో శత్రువులా ఉన్న ఫిరూజా కూడా ఆమెకు దగ్గరై ఆమెను ఓదారుస్తుంది.

నాలుగేళ్ల తర్వాత పరిసా , ఆమె భర్తను రక్షకభటులు తీసుకెళ్తారు. వారి పిల్లలు లైలా పెంపకంలోకి వెళతారు. రోజురోజుకు పెరుగుతున్న నిర్బంధ వాతావరణం పిల్లలకు సైతం అర్థమవుతుంది. లైలా ముసలి తల్లి దండ్రులపై భారం మోపలేక పిల్లల పెంపకం కోసం ఉద్యోగం మానేస్తుంది. ఆ భయంకర వాతావరణంలో నిశ్శబ్దంగా రోజులు గడుస్తుంటాయి. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడే పరిస్థితి లేదు. లైలా తను ప్రేమించిన అహ్మద్ కు కూడా పిల్లల కోసం దూరం అవుతుంది. పెరుగుతున్న నిర్బంధ , యుద్ధ వాతావరణం వాతావరణం తట్టుకోలేక జీనత్, ఆగాఖాన్ , లైలా, పిల్లలు అందరూ టెహ్రాన్ నగరం విడిచి వెళతారు.

అదే కాలంలో మార్క్సిస్టు నిరసనకారుడు అమీర్ జైలు పాలై ఎన్నో హింసలు ఎదుర్కొంటాడు. అతని నాస్తికత్వం అధికారులకు గిట్టదు. ఇరాక్ తో యుద్ధం మొదలైనప్పుడు అధికారులు అమీర్, అతని తోటి ఖైదీ బెహ్రౌజ్ (సిమిన్ భర్త) లను వేలాది మంది తో పాటు ఉరి తీస్తారు.

కాలక్రమంలో మామన్ జీనాట్, ఆగా ఖాన్ లు మరణిస్తారు. లైలా సంరక్షణలో ఎందరో అనాథలు పెరుగుతారు. ఫోరూగ్ తల్లి సిమిన్, రెండవ భర్త నాజర్ తో కలిసి జర్మనీ వెళుతుంది . తల్లి దండ్రుల మరణం తర్వాత లైలా ఒంటరి మహిళగా మిగులుతుంది. పిల్లలకు మామన్ జీనాట్ , నీలి గుల్మోహర్ చెట్టు జ్ఞాపకాలు అపురూపంగా ఉంటాయి. పిల్లలకు తమ అసలు తల్లిదండ్రుల గురించి తెలిసినపుడు అప్పటికే పెరిగిన మానసిక దూరం వల్ల ఇబ్బంది పడతారు.

విప్లవానంతరం దాదాపు 20 ఏళ్లలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మర్యామ్ తన భర్త అమీర్ మృతి గురించి కూతురు షీదాను ఇటలీలో టురిన్ నగరానికి పంపి చదివిస్తుంది. ఒకరోజు షీదా కు తన పరిశోధనలో తండ్రి అమీర్ గురైన మరణశిక్ష గురించి తెలిసి ఇరాన్ వెళ్లి తల్లి నిజం దాచినందుకు కినుక చూపిస్తుంది. చివరకు తల్లి బాధను గుర్తించి ఇద్దరికి సామరస్యం కుదురుతుంది. ఫిరూజా కూతురు దాన్యా , ఓమీద్ లమధ్య దూరం పెరిగి అమెరికాలో ఉన్న ఓమీద్ కు వివాహం జరిగిందని తెలిసిన దాన్యా విచారగ్రస్తురాలు అవుతుంది.

1979 లో జరిగిన తిరుగుబాటు చరిత్ర దాదాపు ముప్పయి ఏళ్ల తర్వాత పునరావృతమవుతుంది. తల్లిదండ్రుల వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తారు. కానీ రాజ్య వ్యవస్థ బల ప్రయోగంలో మార్పు రాదు. ఇటలీ లోని టురిన్ నగరంలో పెరిగిన నెదా గతంలో జైలు వార్డెన్ గా పనిచేసిన మేశామ్ తనయుడు, రాజకీయ శరణార్థీ అయిన రెజాకు దగ్గరవుతుంది. అయితే తన తండ్రి మరణం గురించి నిజం తెలిసిన తర్వాత ఆమెకు ,అతడికి మధ్య దూరం. కానీ రెజా తండ్రి తర్వాత నిరసనకారుడిగా మారాడని తెలుసుకున్న నెదా మనసు మారుతుంది. ఏదో ఒకనాడు అతడికి ఇరాన్ కు వెళ్ళి నీలి గుల్మోహర్ చెట్టును చూపిస్తానని అంటుంది.

ఒక దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు, నియంతృత్వం వల్ల ప్రజలకు భౌతికంగా , మానసికంగా బాధలు, వలసలు అనివార్యమవుతాయి. నూతన వాతావరణం లో ఇమడటం పిల్లలకు పెద్ద సమస్య. తల్లిదండ్రులు ఎవరు అనేది, వారి చరిత్ర పిల్లలకు తెలియక పోవడం, జైలులో పెరగటం మూలంగా ఇబ్బందులు, మత నిరంకుశత్వ నీడలో భయానక వాతావరణం అన్నింటిని ఈ నవల చిత్రించింది. పెరిగిన పిల్లలు ఎదిగిన తరువాత తమ గత జ్ఞాపకాలతో, వర్తమానంతో సర్దుబాటు చేసుకుని భవిష్యత్తు వైపు ఆశగా చూస్తారు. వారిలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరిగి జీవనోల్లాసం కలుగుతుంది.

రచయిత్రి తాను కేవలం జైలు అనుభవాలే కాక కుటుంబాలు, స్నేహితులు, పిల్లలు, జ్ఞాపకాలు గురించి రాశానని, చివరగా వర్తమానం, భావి అనేవి గతం లేకుండా ఉండవు. యుద్ధం సిరియా, అర్జెంటీనా, బర్మా , ఇరాన్ ఎక్కడ జరిగినా జనానికి స్వేచ్ఛ కావాలి.అందరి బాధ ఒకటే. అంతరంగం అట్టడుగున అందరూ మానవులే సందేశం నవలలో ఉందని ఇంటర్వ్యూలలో తెలిపారు. దేశము యొక్క అసలు దుస్థితి మతోన్మాదం చేసే హింస ,అది పోగానే ఇజ్రాయిల్ -అమెరికా బాంబుల దాడిలో జరిగే హింస అని చెప్పారు. ఇరాన్ ప్రాచీన నాగరికత, పట్టుదల, పర్షియన్ పరాక్రమం అగ్ర రాజ్య ఆధిపత్య ధోరణిని సహించవు.


 

 ఇథియోపియన్- అమెరికన్ రచయిత్రి  మాజా మెంగిస్తే  ఇథియోపియా రాజధాని  అడిస్  అబాబా లో 1974లో జన్మించారు. ఆనాటి విప్లవ  పరిస్థితుల కారణంగా తనకు నాలుగేళ్ల  వయసులో ఆమె కుటుంబం దేశాన్ని విడిచి  మొదట నైజీరియా, కెన్యా లలో ఉండి చివరకు అమెరికాలో స్థిరపడ్డారు. మాజా మెంగిస్తే న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సృజనాత్మక రచనలో  మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ ని పొందారు .  ఆమె ముఖ్య రచనలు- “బెనీత్  ద లయన్స్ గేజ్,“  “ది షాడో కింగ్” అనేవి.  ఆమె ప్రముఖ పాత్రికేయురాలుగా, మానవ హక్కుల కార్యకర్తగా,  డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత గా  చేశారు. ప్రస్తుతం  వేస్లేయన్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులుగా  పనిచేస్తున్నారు. 

   మాజా మెంగిస్తే  నవల “ద షాడో కింగ్” ( ‘‘ప్రచ్ఛన్న ప్రభువు’’ )బుకర్ ప్రైజ్ తుది జాబితాలో చోటు సంపాదించింది .ఈ నవల ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని చిత్రించింది. దీనిలో జ్ఞాపకం యొక్క ప్రాముఖ్యత,  “యుద్ధంలోని నిజమైన అసమానతల్లో చరిత్ర మరియు ఆధునికత పక్కనే చోటు చేసుకోవడం” చూడవచ్చు అని విమర్శకులు అభిప్రాయపడ్డారు.ఆమె  రచనలపై టోనీ మారిసన్,  జేమ్స్ బాల్డ్విన్, ఎడిత్  వార్టన్ ల ప్రభావం ఉంది. 

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో  అక్టోబర్ 2, 1935 న ఇథియోపియా పై ఇటలీ దురాక్రమణ ఆరంభమైంది. చక్రవర్తి హైలీ సెలాసి 2 మే, 1936 న దేశం.విడిచి ప్రవాసం వెళ్ళాడు. బ్రిటన్ సహకారంతో  తిరిగి మే 5 , 1940 న స్వదేశం వచ్చాడు. యుద్ధ కాలంలో ఫాసిస్టుల వల్ల మొట్ట మొదట దేశం నుంచి  వెళ్లి , మరలా మొట్ట మొదటిసారి తిరిగి వచ్చిన చక్రవర్తి హెయిలీ సెలాసీ అని చర్చిల్  రెండవ ప్రపంచ యుద్ధం పై  తాను రాసిన ఉద్గ్రంధం నాలుగో భాగం 

” ది గ్రాండ్  ఎలయెన్స్” లో రాశాడు. యుద్ధం చివరలో స్థానికులు  అడిస్ అబాబా లోని ఇరవై వేలమంది ఇటాలియన్ పౌరులను ఊచకోత కోస్తారని చర్చిల్ భయ పడ్డాడు.  ఇటాలియన్ ఫాసిస్ట్ ఓటమితో “ఆక్రమణ, వలసల ద్వారా   ప్రాచీన రోమ్ స్పూర్తితో ఆఫ్రికన్ సామ్రాజ్యాన్ని నిర్మించాలని  ముస్సోలీని కల అంతమైంది” అని రాశాడు. 1936 -41 ల మధ్య ఇటాలియన్ ఫాసిస్ట్  అధీనంలో తప్ప మరి ఎన్నడూ  వలసకు గురి కాని దేశం  ఇథియోపియా ఒక్కటే. 

మాజా మెంగిస్తే నవల “ది షాడో కింగ్” ఇథియోపియా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటన – ఫాసిస్ట్ ఇటలీ ఇథియోపియా ఆక్రమణ కు వ్యతిరేకంగా ఇథియోపియన్లు,  ముఖ్యంగా మహిళల పోరాటాన్ని చిత్రిస్తుంది.   20వ శతాబ్దం లో ఇథియోపియా చరిత్రలో ఒక దశను రచయిత్రి వర్ణించిన  తీరు నవలను ఏక బిగిన చదివిస్తుంది.   యుద్ధ కాలం లో ఆఫ్రికాలో  లిబియా, ఇథియోపియా లలో ఇటాలియన్ ఫాసిస్ట్ లు చేసిన  దురాగతాల్లో పోలిక ఉంది. స్త్రీలను ఆక్రమించుకోవాల్సిన ప్రాంతంగా చూసి  ఒక దేశ  సమాజ నాశనానికి ఒడిగట్టటం రివాజు అయింది అని, న్యాయం దొరకనిదే క్షమాపణ ఉండదని మాజా మెంగిస్తే ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.  ఈ నవల ఒక  దృశ్యకావ్యం.గ్రీకు నాటకంలోగా కోరస్ మధ్యలో తన గొంతు ను  వినిపిస్తుంటుంది. రచయిత్రి కథనం మూడు భాగాల్లో  (‘దురాక్రమణ,’ ‘ప్రతిఘటన,’ ‘తిరిగి రావడం’) పలు గొంతుల ద్వారా,   చలన చిత్రం లోని  మాంటేజ్  టెక్నిక్, జ్ఞాపకాల ద్వారా  ముందుకు వెనక్కు సాగుతుంది. 

ఈ నవల లో రెండు ప్రవాహాలు కనిపిస్తాయి ఒకటి  ఇథియోపియన్ల ఫాసిస్టు వ్యతిరేక  పోరాటం,  మరొకటి  పోరాటకారుల్లోనే అంతస్తుల వైరుధ్యం.    తొలుత కిదానే,  అతని భార్య ఆస్టర్ తమ సేవకులపై అధిపత్యం చలాయిస్తారు .తల్లిదండ్రులను కోల్పోయి తమ దగ్గరకు చేరిన హీరుట్ ఆస్టరు   అనుమానంతో  కొరడా దెబ్బలు కొడుతుంది. దీనికి నిరసనగా హీరోట్  ఇంట్లో చిరు  వస్తువులు తీసి గుర్రపు శాలలో పాతిపెడుతుంది.  ఆస్టర్ తనను గాయపరిచిన తరువాత హిరూట్  తన సొంత ఇంటికి వెళదామనుకుంటుంది. ఆమె వేదన చూసి గుర్రాలు సైతం సంతాపం క్రోధం చెందుతాయి. తాను  గీతే, ఫాసిల్l ల కూతురు .పంట బాగా పండిన కాలంలో పుట్టింది . ఇప్పుడు చుట్టూ చీకటి . మధ్యలో ఆమె గాయం. చీకటి గదిలో ఒంటిగా ప్రసరించే వేదన .ఆమెకి తల, పదాలు, జ్ఞాపకం పేరు ఏమీ లేవు . 

ఆస్టర్ తన  భర్త కిదానే ఇతర వీరులతో మాట్లాడుతుండగా తన పుత్ర శోకం, భర్త పట్ల అసంతృప్తి నుంచి బయటకొచ్చి ఓ పత్రికలో ఇటాలియన్  సమర వనిత  మారియా యువ ఫోటో చూస్తుంది.  వంట గదిలోకి వచ్చి తన వంట మనిషితో “వారు మన ఇంటిలోకి కవాతు  చేస్తుంటే మనం ఊరికే  కూర్చోము”  అని అంటుంది.  ఆస్టర్ ఇంటి నుంచి వెళ్లి తన గుర్రం  మీద  ఒక వారం పిచ్చిగా తిరిగి ఇతర స్త్రీలను రణరంగానికి సిద్ధం చేసింది.రేడియోలో రాణి మేనేను మాటలు ఆమెలో వీరత్వాన్ని రగిలించాయి.ఆమెను భర్త కిదానే నిరుత్సాహపరచ ప్రయత్నిస్తే “ఇది నీ ఒక్కడి దేశమా?”  అని ప్రశ్నిస్తుంది .1935 అక్టోబర్ 3 న లక్ష మంది విదేశీయులు మారెబ్ నది దాటారు.

ఆస్టర్ తోటి మహిళలను సమర సన్నద్ధం  చేసేటప్పుడు ఒక మహిళ “ఇది మా దేశమా? మేము కష్టపడితే ,ఆమె తీసుకుంటుంది ” అంటుంది. ” ఇటాలియన్లను రానీయండి.వారే ఈ దురాశాపరుల కన్నా మేలు” అని కూడా అంటుంది.  మరో స్త్రీ “ఎవరికి కావాలి మీ రాజు ? ఇటాలియన్లు రానియ్యండి”  అనగా ఆస్టర్ కోపంతో ఇష్టం లేని వారిని  పొమ్మంటుంది. తాము ఓడిపోతే ఈ మూర్ఖులకు ఏమవుతుందో తెలియదు అంటుంది .

   ఆస్టర్, హిరూట్ లు  యుద్ధంలో సహాయక పాత్ర కాక  ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్ధమవటం కిదానే కి నచ్చదు కానీ వారి సంకల్ప బలం శక్తి ముందు అతనికి  దిక్కు తోచదు. చనిపోతున్న డావిట్ నుంచి తనకు వారసత్వం గా వచ్చిన తుపాకీని  తీసుకుందని కినిసిన  కిదానే హిరూట్ ను నేల మీదకు తోసిపడేస్తాడు. రచయిత్రి దేశంలోని ఉన్నత, లేని వర్గాల మధ్య వైరుధ్యాన్ని ఇక్కడ చూపించారు. ఫాసిస్టులు  ఇథియోపియాకు  ఇటలీ , ముస్సోలీనిలే దిక్కు అంటారు.

  మరో వైపు  రాజు తన కూతురు జేన్బ్వర్ కు  వివాహం చేస్తే అల్లుడు ఇటాలియన్లతో చేతులు కలుపుతాడు. కిదానే  సైన్యంపై విమానాలు. పొలాలపై, నదుల పై  వదిలారు  గ్యాస్. పిల్లలు,  స్త్రీలు చనిపోయారు .ఘోరమైన యుద్ధ  క్రమంలో ఒక సారి హిరూట్  చనిపోతున్న బెనియంను వదిలి పారిపోతుంది .కానీ ఈ జ్ఞాపకం ఆమెను వెంటాడుతుంది. గాయపడ్డ వారికి  కట్టు కడుతూ దాన్ని మరిచేందుకు ప్రయత్నం చేస్తుంది.  అందరూ ఆమె సేవను  పొగుడుతారు.

ఫాసిస్టు యుద్ధ విమానాలు తెచ్చే విధ్వంసం ఎలా ఉందంటే : ” కాలే నగరాలు, మండే పర్వతాలు ఇళ్ళ శిథిలాలు , కూలిపోయే చర్చిలు,  మసిబారే  పొలాలు మరిగే నదులు ,విషపూరిత ఆత్మ   పడిపోయే చెట్లు , పేలే బాంబులు, ఊపిరాడని జనాలు ముక్కలైన కాయాలు, లోయల్లో   సాగే అసంఖ్యాక యూనిఫాం లోని సైనికుల బారులు , పేలే తుపాకులు , ఊగే బాయినెట్లు, లేచే గొంతులు”  ఫాసిస్టు యుద్ధ గీతం పాడుతూ.

   రెండో భాగం ‘లో  హిరూట్ ,  అక్లిలు లు దగ్గరవుతారు.  జీవనోల్లాస భరిత నాట్యం చేస్తారు. కొడుకు లేని కిదానే లో కామ ఫలితంగా  హీరోట్ ను బలవంతంగా అనుభవిస్తాడు. ఆమె దేశం కోసం పోరాటంలో  కిదానే నాయకత్వాన్ని ఆమోదించినా, తాను   స్వయంగా తన తండ్రి నుంచి పోరాడి తీసుకున్న తుపాకీ  వుజిగ్ర ను  కిదానే బలవంతంగా తీసుకోవడం ఆమకు  కోపం తెప్పిస్తుంది.  తనపై అతడు చెందిన  లైంగిక అత్యాచారానికి వ్యతిరేకంగా ఆమెలో రేగిన క్రోధంగా మారి యుద్ధ సాహసాలకు  దారితీస్తుంది.  కోరస్ చెబుతుంది నిస్సహాయత వదిలి నిలబడి పోరాటం చేయమని . దయ కోసం యాచించకు  అని. ఆమె తల్లికి తానే పెళ్లి చేశానని,  గుడిసె ఇచ్చాను  అని కిదానే  అంటాడు .ఇది గుర్తుపెట్టుకో  నీవు పోయే రోజు అంటుంది ఆమె. అక్లిలు దగ్గరకు   వస్తాడు. ఆమెను ఓదారుస్తాడు .ఆహారం ఇస్తాడు ఆమె ఉనికి గౌరవం. ఆమె  ప్రేమించబడింది. తర్వాత రోజు ఆస్టర్  ఆమెదే తప్పంటుంది . అతన్ని చంపితే నా చేతుల్లో నీవు  చస్తావు  అంటుంది ఆస్టర్. కిదానే  మరోసారి హిరూట్ దగ్గరికి వెళ్తాడు .ఆమెలో  నిర్లిప్తత.  అతడిలో అశక్తత.  ఆమెకు  యోధురాలుగా మారటమే మార్గం.  సీఫు కొడుకు తారీకు ను ఫాసిస్టులు ఉరి వేస్తారు. అతని శరీరం తీసుకొచ్చారు  తండ్రి, ఇతరులు కలిసి. ఫాసిస్టు  కల్నల్ ఫ్యూసెలి చావు తప్పింది. వాడి  మగతనం పోవాల్సింది. అడిస్ అబాబా లో వైస్రాయ్ పై హత్యాయత్నం.  ప్రతీకారంగా నోళ్లు తెరిచే జైళ్లు. ఊచకోత. తగలబడుతున్న నగరం.

 నవలలో  మరో పాత్ర వంట మనిషి.  గతంలో  ఆస్టర్ కు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని తెలిసి ఆమె పారిపోయే యత్నంలో  సాయం చేస్తుంది. ఫలితంగా ఆస్టర్ తండ్రి నుంచి చావు దెబ్బలు తింటుంది.  ఆస్టర్ హింసకు  గురైన హిరూట్ తో కన్నీరు  కళ్లలోనే కుక్కుకోమంటుంది. తర్వాత యుద్ధ క్రమంలో పరిస్థితి  నచ్చక రంగం నుంచి వెళ్లి, చివరకు ఫాసిస్టు సైనిక అధికారి  కల్నల్ ఫ్యూసెలి దగ్గర స్నేహితురాలుగా ఉన్న ఫైఫీ దగ్గర చేరుతుంది. చివరలో   శత్రు రహస్యాలు కిదానే బృందానికి చేరవేసి విజయాన్ని తోటి దేశీయులకు సుగమం చేస్తుంది.

  నవలలో మూడో భాగం లో  ఫోటోల ద్వారా చరిత్ర కథనం సాగుతుంది.  చిత్రహింసలతో, అడుక్కుంటూ, నిరసిస్తూ, ఆశలతో ,క్రోధంలో,  వణుకుతూ చేతులు వెనక కట్టబడి, దెబ్బలతో వాచిన మొహాలతో ఎందరో ఇథియోపియన్లు.   నిర్బంధ శిబిరంలో క్రూరమైన అదుపులో.  ఫోటోగ్రాఫర్ నవరో తండ్రి   యూదు వ్యతిరేకత వల్ల అతన్ని తిరిగి   రావద్దని రాసిన లేఖ.  కల్నల్ పుసిలో చేతుల్లో కొండ మీద నుంచి లోయ లోకి  తోయబడి చనిపోయే వారిలో  భయం లేకుండా  కుక్  ఒక పొడి ఇచ్చి వారి పేర్లు తెలుసుకొని , సైనికాధికారి స్నేహితురాలు ఫైఫీకి ఇచ్చి ఆ పేర్లన్నీ రికార్డు చేసి దాచిపేడతారు. 

  హిరూట్  తనను ఒకప్పుడు భౌతికంగా హింసించిన ఆస్టర్, తాను    ఖైదీలుగా ఉన్నప్పుడు, శత్రువులు వారి నగ్న ఫోటోలు తీసినప్పుడు అచలంగా   ఉండి, ఆస్టర్ కు మనోధైర్యం ఇస్తుంది. తాను ఆశాక్షితిజం వైపు నిత్యం చూస్తూ ఉంటుంది. ఫాసిస్టు సైనిక అధికారి  కల్నల్ ఫ్యూసెలి  ఆమె ప్రవర్తన అర్థం కాక    ఫోటోగ్రాఫర్  నవారో ను పంపి ఆమె మాతృ భాషలో మాట్లాడి విషయం కనుక్కోమంటాడు . అతడు  తన తల్లిదండ్రుల ఫోటో చూపి ఏదో చెబుతాడు .ఆమెకు తన తల్లిదండ్రులు యాదికొస్తారు. చనిపోయేందుకు  అమ్హారిక్ భాషలో చావు కు సంబంధించి  ఓ పదం చెబుతాడు. తర్వాత “నేను /అతడు /మేము చస్తాం” అని అంటాడు. హిరూట్. అమ్హారిక్ భాషలో “మేము చావము”  అంటుంది. ఫోటోగ్రాఫర్  తన తండ్రి ఉత్తరాలు,  ఫోటోలు దాచిన  స్థలం చూస్తుంది హిరూట్. జైలు నుంచి ఇద్దరు  వీర వనితలు తప్పించుకుంటారు. యుద్ధం ముదిరింది.   కల్నల్ ఫ్యూసెలి చస్తాడు. చనిపోయే  కిదానే  తల హిరూట్ తన వొడిలో తీసుకుని “నేను యోధురాల్ని .నిన్ను మర్చిపోతారు. నన్ను   గుర్తుంచుకుంటారు”  అంటుంది. 

   యుద్ధానంతరం హెయిలీ సెలాసీ తిరిగి దేశం వస్తాడు. దశాబ్దాల తరువాత 1974లో అతడికి   వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు. ఫోటోగ్రాఫర్ హిరూట్ ను కష్టపడి కలిసి తన జ్ఞాపకాల పేటికను ఇమ్మంటాడు. ఆమె  అది అతడికి ఇచ్చి దురాక్రమణదారుడు వెళ్ళి పోవాలి అంటుంది. ఆమె రాజును  కలిసి ఇటాలియన్ ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో  అమరవీరుల పేర్లు చదివి వినిపిస్తుంది.వారే  నిజమైన షాడో కింగ్స్. దురాక్రమణదారులు చరిత్ర హీనులు. 

  ఒక సామాన్య సేవకురాలైన హిరూట్  గొప్ప యోధురాలిగా  ఎదగటం,  ఖైదీగా ఉన్నప్పుడు ఆమె చూపిన పట్టుదల, మానవతా గుణం దీనిలో ఉన్నాయి. ఇటలీ దురాక్రమణ సమయంలో ఇథియోపియా రాజు  హెయిలీ సెలాసీ దేశం విడిచి లండన్ వెళ్ళిపోతాడు. రాజు స్థానంలో  అదే పోలిక గల  మెనిం (అర్థం ‘శూన్యం’)ను రాజుగా నటింపజేసి సామాన్యులను ఉత్తేజ పరచమని ఆమె ఇచ్చిన  సలహా  అమలు చేసిన ఇథియోపిన్లు  కిదానే   నేతృత్వంలో ఫాసిస్టులకు  వ్యతిరేకంగా పోరాడుతారు. ఈ పోరాటంలో కిదానే  భార్య ఆస్టర్, సేవకురాలైన హిరూట్ వీర మహిళలుగా  ఎదిగి జనుల పాటల్లో కీర్తించబడతారు. ఈ నవల ఇథియోపియా వీర మహిళలకు   ఒక కవితాత్మక అక్షరనివాళి.

 

ఓ ‘ జీవన చందమామ’ కథ

     


   లాటిన్ అమెరికా కి చెందిన ప్రఖ్యాత  నవలా రచయిత్రి ఇసాబెల్   అయిన్దే  1942 లో  పెరూ రాజధాని లిమాలో  జన్మించారు. తనకు రెండేళ్ల వయసులో దౌత్య అధికారి అయిన  తండ్రి టొమాస్  అయిన్దే విడాకుల వల్ల కుటుంబానికి దూరమైనందున  తల్లి ఫ్రాన్సీస్కా యోనా బారోస్ తో కలిసి తన మాతామహుల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చింది. ఆమె అమ్మమ్మ కథనా శక్తి  భావి రచయిత్రి ఇసాబెల్ పై అపార ప్రభావం చూపించింది. తర్వాత మారు తండ్రితో కలిసి  కుటుంబం కొంతకాలం  బొలీవియా, లెబనాన్ లలో ఉండి తిరిగి 1958 లో   చిలీ దేశానికి  వచ్చారు.  1973లో ఆమె బంధువు,  సోషలిస్టు ప్రధాని సాల్వడార్ అయిన్దే  ప్రభుత్వం  అమెరికా దన్నుతో  జరిగిన  అగుస్టో పినోఛే  సైనిక  తిరుగుబాటు  తర్వాత ఇసాబెల్  చిలీని వీడారు. కొంత కాలం వెనిజులా లో,  చివరకు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె పాత్రికేయురాలుగా, టీవీ జర్నలిస్టుగా పనిచేశారు. 


 ఇసాబెల్   సంప్రదాయ  సంకెళ్లు  తెంచుకొని స్త్రీవాద  రచయిత్రిగా కొనసాగారు. ఆమె పై 

రష్యన్ సాహిత్యం,  డిటెక్టివ్ సాహిత్య రచయితలైన అగాథ క్రిస్టీ, ఆర్థర్ కానన్ డోయల్ లతో పాటు తోటి లాటిన్ అమెరికా రచయితలు మార్క్వెజ్, లోసా, బోర్జెస్ ల ప్రభావముంది. చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా ,ఊహాశక్తి , కథన  నైపుణ్యం వల్ల ప్రపంచ సాహితీ చరిత్రలో ఒక గొప్ప స్థానం సంపాదించారు. ఆమె సాహిత్యంలో  “ది హౌస్ ఆఫ్ ది స్పిరిట్స్,” “ఇన్స్ ఆఫ్ మై సోల్,” “డాటర్ ఆఫ్ ఫార్చ్యూన్,” “పోర్ట్రైట్ ఇన్ సెపియా,” “పౌలా.” “ది సోల్ ఆఫ్ ఎ విమెన్” మొదలగు ముఖ్యమైన రచనలు ఉన్నాయి. ఆమె రచనలు ఇరవై ఏడు భాషల్లో అనువాదం అయ్యాయి. ఆమె 2004 లో అమెరికా అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో సభ్యత్వం పొందారు.


   స్టీఫెన్ హార్ట్ అనే విమర్శకుడు  ఆమె నవలలో కథనం స్త్రీ కేంద్రకంగా ఉంటుందని , ఆమె నవలలపై గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ ప్రభావంఉన్నా ,అది ఒకటే ఆధారం కాదని అన్నారు. ఆమె యూరోపియన్ దృక్పథాన్ని తిరస్కరించి ,నూతన అమెరికన్ వాస్తవికత రూపాంతరాన్ని  ను ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్లారు.స్త్రీ శరీరాలపై పితృస్వామ్య , రాజ్య అణచివేత ఆమె నవలలో  కనిపిస్తుంది అని స్టీఫెన్ హార్ట్ రాశారు. 


     ఎడ్వర్డో గాలియానో తన “ఓపెన్ వీన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా” పుస్తకంలో నాటి పరిస్థితి వివరించారు. 1888 బ్రిటీష్ వారు చిలీ అధ్యక్షుడు బాల్మసేడ ను నైట్రేట్ ప్రాంతాలను జాతీయం చేస్తానని ప్రకటించిన పిదప అంతర్యుద్ధంలో ముంచి పదవీచ్యుతుని చేశారు. 1929 నుంచి దాదాపు యాభై ఏళ్లలో రాగి గనుల నుంచి ప్రవేటు కంపెనీలు అనకొండ, కేన్నికాట్  4 బిలియన్ డాలర్లను అమెరికాకు పంపాయి. 1973లో రాగి గనుల జాతీయం అని ప్రకటించగానే సోవియెట్ దురాక్రమణ జరగనున్నట్లు విష ప్రచారం చేశారు.  సాల్వడార్ అయిన్దే    ప్రభుత్వం కూలిపోయిన తర్వాత   ప్రజలపై  హత్యలు, అపహరణలు, అదృశ్యం చేయటం అనే రూపాల్లో  తీవ్ర అణచివేత సాగింది. నియంతృత్వ పాలనలో జాతీయ పరిశ్రమల్లో సగం మళ్ళీ పాత యాజమానుల పరం కావడం, పౌర హక్కులు మృగ్యం కావడం జరిగింది. 


    సైమన్ కొలియర్,  విలియం ఎఫ్. సేటర్  తమ పుస్తకం “ఏ హిస్టరీ ఆఫ్ చిలీ 1808-1994”

 లో పేర్కొన్నట్లు సైనిక తిరుగుబాటు తర్వాత  సాల్వడార్  పార్టీ  కార్యకర్తలను వేటాడారు.  శాంటియాగో స్టేడియం లో ఏడు వేల మందిని ఇంటరాగేట్ చేశారు. జైళ్లు విస్తరించాయి. మజిలాన్ జలసంధి లోని డాసన్ దీవికి కేబినెట్ మంత్రులతో సహా, పిసాగువా, తల్కోహుఅనో బే లో  కీరీకీన దీవికి ప్రజల్ని పంపారు. లక్షలాది మంది దేశం నుంచి బహిష్కరించబడ్డారు. 1980 నాటికి లక్షలాది మంది ప్రవాసం వెళ్ళారు


    ఆమె రచనలలో ఒకవైపు వ్యక్తిగత ,కుటుంబ జీవితాలు, మరోవైపు చరిత్ర రెండు జమిలిగా నడుస్తాయి. జేన్ ఆస్టిన్ నవలలు చదివితే ఫ్రెంచ్ విప్లవం జరిగినట్లే తెలియదని ఒక విమర్శకుడు అన్నాడు. ఇసాబెల్ అయిన్దే నవలలు చదివితే చిలీ  రాజకీయ చరిత్ర  పరిణామాలు తెలియకుండా ఉండవు. 


    ప్రస్తుత నవల “ఇవా లూనా”  లో  ప్రధాన పాత్రధారి జీవన సాగరంలో  ఆటు  పోట్లని, చిలీలో 

 సైనిక పాలనకు ప్రతిగా విద్యార్థుల  ప్రజల తిరుగుబాటు రాజకీయ వ్యతిరేకుల అదృశ్యం, జైళ్లలో చిత్రహింసలు, గెరిల్లా పోరాటం చిత్రిస్తూ తన కథాకథన నైపుణ్యంతో తన నవలను  ఆపకుండా చదివిస్తారు. సమాజంలో అనాధ పిల్లల, పని పిల్లల పాట్లు ,కుటుంబ- సామాజిక- రాజకీయ వ్యవస్థలలోని  అంతర్గత అణిచివేతలను అవి మనుషుల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే సత్యాన్ని రచయిత్రి ఒక చలన చిత్రంలా పాఠకుల ముందు చూపించిన తీరు ప్రశంసనీయం.


   ఇవా తల్లి కాన్సులో ఒక ఉదాసీన  స్వభావం గల ప్రొఫెసర్ జేమ్స్ ను వివాహమాడుతుంది. ఒకరోజు ఆమె తన తోటలో పాము కాటు కు గురైన ఒక  ఇండియన్ తోటమాలిని కాపాడి అతనికి  సపర్యలు చేసే క్రమంలో సన్నిహితమై ఫలితంగా  ఇవాకు  జన్మనిస్తుంది . చిన్నతనంలో ఇవా కు  ఎన్నో కథలు చెప్తుంది .కాల క్రమంలో ఆహారం తీసుకునే క్రమంలో కాన్సులో గొంతులో ఎముక ఇరుక్కుని ఆమె మరణిస్తుంది. ప్రొఫెసర్ దగ్గర పనిచేసే స్త్రీ ఎల్విరా ఇవా లూనా కు గాడ్ మదర్ గా ఉంటుంది. ప్రొఫెసర్ మరణం తర్వాత అనాధగా మారిన ఇవా లూనా పని పిల్లగా మారుతుంది. 


     తనను తక్కువగా చూసి పని నుంచి ఉపశాంతి కోసం కనీసం తనకు ఇష్టమైన ఒక సముద్ర పెయింటింగ్ కూడా చూడనీయని యజమానురాలి  పట్ల కోపంతో ఆమె  విగ్ ను  లాగి ఇంటి నుంచి పారిపోయినా , మరో చోట యజమాని క్యాబినెట్ మంత్రి అశుద్ధ పాత్రను  అతడి నెత్తిమీద  కుమ్మరించినా,  చివరకు తనకు ఆశ్రయించిన వేశ్య గృహ యజమానురాలు పోలీసు దాడి సమయంలో  తన్ను వదిలి పారిపోయినా  ఇవా జీవితంలో భయపడక ముందడుగు వేస్తుంది. ఆమెకు మరో వీధి బాలుడు హుబెర్టో నారంజో సాయం చేస్తుంటాడు. కథలు చెప్పడంలో  ఇవా ప్రజ్ఞ  ప్రతిన అందరికీ ఆమెను  దగ్గర చేస్తుంది.  రహదారిపై దిక్కు లేక తిరిగే ఇవాను తన ఇంటికి తీసుకెళ్ళి రియాద్ తన  భార్య జులేమాను  పరిచయం చేస్తాడు. తన సొంత అంగడి ఉన్న రియాద్  తన కజిన్ కమల్ కు  ఆశ్రయం ఇస్తాడు.  రియాద్ భార్య జులేమా అనాకారి భర్తను సహించలేక  అసంతృప్తి చెంది, అతని కజిన్ కమల్ ను వశపరుచుకుని  ,అతడు  వెళ్లిపోవడం తట్టుకోలేక మానసిక  మాంద్యానికి గురవుతుంది.ఆమె  తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ నేరం ఇవాపై  పడి పోలీసులు ఆమెను చిత్రహింసలు పెడతారు. రియాద్ పోలీసులకు లంచమిచ్చి ఆమెను కాపాడుతాడు.


     లాటిన్ అమెరికా సమాజంలో స్త్రీలు పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ లో, సమాజంలో  అణిచివేతకు గురవటం, పోలీసులు వేశ్య గృహాల పట్ల లంచాలు మరిగినా ఒక్కోసారి దాడులు చేయటం , మూసపోసిన  సామాజిక లైంగిక పాత్రను తిరస్కరించిన ట్రాన్స్ సెక్సువల్ మెలిసియో/ మిమి ఎదుర్కొన్న కష్టాలు , వేశ్యల తిరుగుబాటు తరువాత పోలీసు దాడుల వల్ల  యజమానురాలు    హుబెర్టో నారంజో  సోదరిగా చూడమని ఉంచిన ఇవా లూనా ను వదిలి పారిపోవడం నవల్లో ఎన్నో  మలుపులు. 


మరోవైపు  రోల్ఫ్ కార్లె  తన  తల్లి కోరికపై తన పీడక తండ్రి నుంచి  తప్పించుకుని తూర్పు ఐరోపా నుంచి లాటిన్  అమెరికా లో దేశానికి  వస్తాడు. అక్కడ తన మామ రూపర్ట్ దగ్గర ఉండి, పని నేర్చుకుంటూ  తన కజిన్స్ తో స్వేచ్ఛా ప్రేమ కలాపాలు సాగిస్తాడు. తరువాత అరాబెనా సాయంతో ఒక పాత్రికేయుడుగా, ఫోటోగ్రాఫర్ గా మారి గెరిల్లా ఉద్యమ నేతగా మారిన హుబెర్టో నారంజో ను సైతం కలుస్తాడు

  

ఈ నవలలో రచయిత్రి సమాంతరంగా దేశ చరిత్రను కూడా వర్ణిస్తారు. నియంత చనిపోగానే సామాన్యులు  అతని ఎండాకాల భవనాన్ని ఆక్రమించడం, తోటల్లో , మేడ మెట్టపై , పాలరాతి కారిడార్లు లో మందిరాల్లో, స్నాన గదుల్లో సామాన్యులు తమ నెలవు  ఏర్పాటు  చేసుకుంటారు.ఇలాంటి ఘటనలు  తిరుగుబాటు సమయంలో  శ్రీలంకలో కూడా చోటు చేసుకోవడం చూశాం.

 


   రోల్ఫ్ కార్లె  ఫోటోగ్రాఫర్ గా మారి ఎదుగుతున్నప్పుడు బూటకపు  ఎన్నికల్లో ఒక జనరల్ ఎన్నికవుతాడు. ప్రతిపక్షాలు ,విద్యార్థులు, చర్చి సైనికులలో అసంతృప్తి పెరుగుతుంది .తిరుగుబాటు చేసిన విద్యార్థులపై కాల్పులు. అసంతృప్తి పెరిగి జైళ్లు  నిండుతాయి. రాజ్య పాశవికత విఫలమై అమెరికా ఎంబసీ  ఇచ్చిన విమానంలో జనరల్ పారిపోయి అధికారంలోకి నూతన అధ్యక్షుడు వస్తాడు . 


     గెరిల్లా నేతగా మారిన తన స్నేహితుడు  హుబెర్టో నారంజో  ఇవాకు మరలా కలిసి సన్నిహితమవుతాడు.  ఆమె సహకారంతో తన సహచరులను జైలు నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతడి  విప్లవ జగత్తులో కేవలం పురుషులకే కానీ స్త్రీలకు  చోటు లేదని ,సహాయక పాత్ర మాత్రమే అని తెలిసిన తరువాత ఇవా తన సొంత మార్గం ఎన్నుకుంటుంది.  తాను ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు చూసి తన వశపరచుకోవాలని ప్రయత్నించిన  సైనికాధికారి ప్రయత్నాలు ఫలించవు. ఇవా లూనా లో  గొప్పతనం ఏమిటంటే తనకు సహాయం చేసిన స్నేహితురాలు, ట్రాన్స్ సెక్సువల్ మిమిలో   తల్లి, చెల్లి ,సహచరిని చూడగలుగుతుంది .లోకానికి మాత్రం మిమి అందమే కావాలి. ఇవా  అందరికీ సాయంచేస్తూ తన మానసిక  స్వేచ్ఛను ఎవరికీ సరెండర్ చేయదు. ఇవా టీవీలో  ప్రదర్శన కి రచనలు  రాయడం, పేరు పొందడం, గెరిల్లా నేత నారంజో లొంగుబాటు కు సహకరించమని జనరల్ రోడ్రిగ్స్ కోరినా తిరస్కరించి  రోల్ఫ్ కార్లె తో స్థిరపడుతుంది .


ఈ నవలలో  ఇవా లూనా తన అనుభవాల నుంచి నేర్చుకుంటూ, తన వ్యక్తిత్వాన్ని, ఆస్తిత్వాన్ని కాపాడుకుంటూ ,పితృ స్వామిక వ్యవస్థ ,సామాజిక  అణచివేతలను అధిగమిస్తూ తనదైన దారిలో పురోగమిస్తుంది.  తాను  మొదట తండ్రిలా అనుకున్న రియాద్ తనను  పోలీసుల చిత్ర హింసలు నుంచి కాపాడినపుడు కృతజ్ఞతా భావం తో , సోదరి అని  చాలా సార్లు  ఆదుకున్న   హుబెర్టో నరేంజ లతో  ఆమె సన్నిహిత సంబంధం  నుంచి  కృతజ్ఞతాపూర్వక, ప్రేమ పూరిత,లైంగిక సంబంధంగా మారటానికి  సంప్రదాయ  భావనలు అడ్డురావు. వాటి నుంచి  బయటపడే దానికి చేసిన ఆమె  స్వేచ్ఛా ఆత్మకు చిహ్నాలు. 


    ఇవా లూనా అంటే 'జీవన చందమామ.' ఆమె పాత్ర  జీవిత ప్రవాహానికి , సానుభూతి కిరణ స్పర్శకు సంకేతం.  ఆమె ఊహా జగత్తులో  రచనా ప్రపంచంలో నియమాలు, పాత్రలు, ఘటనలు ఆమె సమకూర్చినవి , వాస్తవ ప్రపంచం కన్నా  బలవత్తరమైన ,మరింత కాలం ఉండే రూపురేఖలు.


(Posted on by )



మానవత్వ సరిహద్దుల్లో…

 


హాన్ కాంగ్ దక్షిణ కొరియాలో గ్వాంగ్జు ప్రాంతంలో జనించింది. తనకు పది ఏళ్ళ వయసులో రాజధాని సోల్ కు  వలస వెళ్లింది. ఆమె తండ్రి కూడా ఒక రచయిత. మొదట కొన్ని కవితలు “లిటరేచర్ అండ్ సొసైటీ “ పత్రికలో వచ్చాయి.


ఆమె రచనలలో “ది వెజిటేరియన్”, “ది  వైట్ బుక్” , “హ్యూమన్ యాక్ట్స్” , “వి డు నాట్ పార్ట్”, “గ్రీక్ లెసన్స్”, “ ది విండ్ బ్లోస్, గో” అనేవి ముఖ్యమైనవి .హాన్ కాంగ్ 2024 లో   సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని పొందారు.


 ఆమె రచనలు చారిత్రకంగా బాధాకర పరిస్థితులు , అదృశ్య నియమాలతో ఘర్షించి మానవ జీవిత సున్నితత్వాన్ని బయటపెడతాయని నోబెల్ కమిటీ ప్రశంసించింది.  


దక్షిణ కొరియా గతంలో  1961 నుంచి 1987  దాకా సైనిక నియంతల అమానుష చర్యలలో నలిగిపోయింది. దేశాన్ని ఆధునిక పారిశ్రామిక వ్యవస్థగా మార్చే పేరుతో మొదట పార్క్ చున్గ్  హి,  తర్వాత వచ్చిన చున్ దు హాన్ లు తమ నిరంకుశ పాలన సాగించారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, పత్రికా స్వేచ్ఛను హరించి విశ్వవిద్యాలయాలను మూసివేసి ,రాజకీయ కార్యకలాపాలను నిషేధించారు .ఈ నేపథ్యంలో 1980లో గ్వాంగ్జు ప్రాంతంలో  తలెత్తిన తిరుగుబాటులో ఎందరో విద్యార్థులు, సామాన్య పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. 


హాన్ కాంగ్ నవల “హ్యూమన్ యాక్ట్స్” శీర్షికలోనే ఎంతో అర్థముంది. ఆలోచనారహిత మనుష్యులు తమ తోటి దేశ వాసుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తారనేది రచయిత్రి గుండెను నలిపివేసే,  కవితాత్మక శైలిలో రచించారు. నవలలో కథనం  పలు పాత్రలు -  ఒక విద్యార్థి నిరసనకారుడు, ఒక శవం ,ఒక పాత్రికేయులు, ఒక ఖైదీ, ఒక తల్లి, చివరగా రచయిత్రి స్వరాల నుంచి సాగుతుంది, గత జ్ఞాపకాలు ,వర్తమానం,  కలలు , కవితలు,  కవితాత్మక వర్ణనల ద్వారా నవల ముందుకు సాగుతుంది. భీకర సంఘటనలను రచయిత్రి వర్ణించిన తీరు   పాఠకులను పూర్తిగా  కుదిపివేసి ,ఒక చారిత్రక తాత్విక ఆలోచన విషాద సాగరంలో ముంచుతుంది. అయినా చివరకు జీవితం ఆగదు అనే భావన కలుగుతుంది.


   కొరియన్ సంస్కృతిలో భౌతిక కాయానికి హింస జరిగితే దాని లోని ఆత్మకు కూడా భంగం జరిగినట్లే. రచయిత్రి తన నవలలో  నిరసనకారుల భౌతిక కాయాల పట్ల సైనికుల నిర్లక్ష్యం, నిరాదరణలను  కళ్లకు కట్టినట్లు  వర్ణిస్తుంది.



   నవలలో డాంగ్ హో అనే హైస్కూల్ విద్యార్థి నిరసనకారుల  శవాలను వారి వారికి అప్పగించేంతవరకు కాపలాగా ఒక జిమ్నాజియంలో ఉంటాడు. తనకు తెలిసిన, తన ఇంట్లోనే కొంతకాలం నివసించిన జాంగ్ డే, బుల్లెట్ దెబ్బకు కూలిపోవడం, తాను భయంతో కొయ్యబారి పోవటం ,అతని సోదరి జాంగ్ మీ ఒక శ్రామిక మహిళ గా తన తమ్ముడి చదువు కోసం సంపాదించడం, తాను కూడా చదువుకోవడానికి కష్టపడటం ,  తన తల్లి సోదరుడు ఇద్దరు వచ్చి ఇంటికి రమ్మనీ కోరినా  డాంగ్ హో వెళ్లడు. తోటి విద్యార్థి నిరసనకారుల  శరీరాలపై బాయినెట్ గాయాలు చూసి కలవరపడతాడు. జాంగ్ డే నీ కాపాడలేకపోవటంలోని పిరికితనానికి తన్నుతాను నిందించుకుంటాడు .అయితే తర్వాత డాంగ్ హో కూడా మరణించిన  విషయం మనకు తెలుస్తుంది. 


   శవాలకు , ఆత్మలకు మాటలు వస్తె  అవి కూడా కథను వర్ణిస్తాయి . జాంగ్  డే ఆత్మ శవాల కుప్పలను, పురుగులు పట్టిన వారి  దేహాలను గుర్తు చేసుకుంటుంది. శవాలగుట్ట అట్టడుగున పడి ఉండి మధనపడుతుంది. తనను, తన సోదరిని ఎందుకు చంపావు అని ప్రశ్నిస్తుంది. కడిగిన శవాన్ని చూసి మురికి శవం సిగ్గుపడుతుంది . ఆ ఆత్మకు  తన అక్కతో గడిపిన పాత రోజుల జ్ఞాపకాలు,తను పెరగటం, పెళ్ళి , అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం లాంటి ఊహలు .   జాతీయగీతం పాడుతూ విరిగిన వారి  శవాల గుట్టను  సైనికులు దహనం చేయగానే జాంగ్ డే ఆత్మ తన ఇంటికి ఎగిరిపోదామనుకుంటుంది .కానీ అక్కడ అక్క లేదు .  డాంగ్ హో శరీరం నుంచి ఆత్మ వేరైనట్లు కూడా దానికి తెలిసి వెళ్లాలనుకుంటుంది. కానీ కదలలేక పోతుంది. 


కథనం ముందు ముందుకు సాగినప్పుడు ఓ పాత్రికేయురాలు తాను తిన్న చెంప దెబ్బలని గుర్తు చేసుకుంటుంది .అది 1985 వ సంవత్సరం. ఒక అజ్ఞాత అనువాదకుడిని కలిసినందుకు కానీ కిమ్ యూన్ సోక్  చెంప దెబ్బలు తింటుంది .అంతకు ముందు యూనివర్సిటీ క్యాంటీన్లో మఫ్టీ పోలీసులు ఆమె చేతిలో పోస్టర్ను చూసి జుట్టుబట్టి ఈడ్చినపుడు, సెన్సార్ ఆఫీసులో రచయితకు  ప్రచురించకుండా పారితోషికం ఇవ్వటం, పత్రికలపై సెన్సార్షిప్, అధికారుల దౌర్జన్యం పుస్తక ప్రచురణకు అడ్డంకులు ,సంపాదకుల లౌక్యం, విద్యార్థుల వీరోచిత పోరాటం,  వారి సంక్షేమానికై కుటుంబ సభ్యుల ఆరాటం ,శవాలను చెత్త బండ్లలో తరలింపులో సైనికులు ప్రదర్శించే ఉదాసీనత కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని చూసిన పాత్రికేయురాలి మదిలో మానవత్వం పై సందేహాలు చెలరేగుతాయి. నాటికను చూస్తున్న ఆమెకు డాంగ్ హో గుర్తుకొస్తాడు. కాల్చే కన్నీరు ఆమె బుగ్గల పై నుంచి  కారుతుంది.


తరువాత చిత్రహింసల పాలైన ఖైదీ ద్వారా కథనం సాగుతుంది. విద్యార్థులు పడిన చిత్ర హింసలు,  తాను కిమ్ జిన్ సూ ఇద్దరూ ఇరుకు గదిలో పిడికెడు ఆహారం కోసం పరస్పరం ఆబగా చూసుకోవడం , కోర్టులో సైతం ఖైదీలు తల దించుకొని ఉండటం,   కిమ్ యాంగ్ చే అనే బాలుడు పిచ్చివాడు అవుతాడు. మనిషి ప్రాధమికంగా క్రూరుడా, ఆత్మగౌరవం ఒక మిధ్యనా,మనిషి ఒక కీటకమా, మృగమా లేక మాంసం ముద్ద అనే ప్రశ్న . తన సొంత మానవత కోసం సత్యంతో పోరాటం. చావు ఒకటే విముక్తి మార్గమా?


  లిమ్ సోన్ జూ అనే వనిత డాక్యుమెంట్ రక్షణ ఉద్యోగంలో ఉంటుంది. గత చేదు అనుభవాల.వల్ల 

 ఆమెది  ముభావ స్వభావం .ఒక పరిశోధనా గ్రంథంలో ఎనిమిదవ  సాక్షిగా ఉండమని ఒక పరిశోధకుడు ఆమెను అడుగుతాడు .ఆమె అయస్టంగానే అంగీకరించి ఆ గ్రంథంలో అదివరకే నమోదైన సాక్షాలను చదువుకతుంది.వాటిలో నిరసనకారులపై జరిగిన దౌర్జన్యాల సాక్ష్యం , కార్మిక హక్కుల కోసం పోరాడే బాలికలపై జరిగిన దాడి గురించిన సమాచారం కూడా ఉంటుంది. 


గ్వాంగ్జూ ప్రాంతంలో  తిరుగుబాటు జరిగిన మూడు దశాబ్దాల తరువాత ఒక తల్లి కళ్ళ ద్వారా,  రచయిత్రి ద్వారా  ఆనాటి సైనికుల  గురించి ,కాలం అడుగుజాడల్లో ఇంకిన రక్త చారికలను, హింసా కాండను  కవితాత్మక శైలిలో హాన్ కాంగ్ రచించారు.


కొడుకు కోసం మార్కెట్  సందుల్లో అలుపెరగకుండా తిరిగిన అమ్మ. అతన్ని  పూడ్చి వేసే ముందు తర్వాత తట్టుకోలేక అక్కడి గడ్డి తిని కక్కేసిన అమ్మ . పాలి పోయిన  తమ్ముడి మోము చూసి పగతో రగిలిన అన్న. పర్యవసానం గురించి భీతితో తల్లి.  తమ్ముడిని రక్షించలేదని అపరాధ భావనతో  తన్నుకునే సోదరులు. చూసినా చలించని  తల్లి . ప్రాంతీయ ఆఫీసు ముందు  చావుకు తెగించి నిలిచిన విద్యార్థులు. కనిపించని పిల్లల కోసం , వారిని పూడ్చిన  స్థలం కోసం విరామ మెరుగక తిరిగే తండ్రి. గ్వాంగ్జూ ప్రతి దేశంలో ఉంది.చనిపోయిన పిల్లల కోసం తల్లుల ధిక్కారం. వారిని బంధించి ఊరికి దూరంగా వదిలేసే అధికార మదం. తన పాలు తాగిన కుర్రాడి మాటలు వచ్చిన, నడక నేర్చిన జ్ఞాపకాలు. దూరం నడకలో ఎండలోనే ఉందామని మారాం చేసే బాలుడు డాంగ్ హో. ఒక తల్లి  అనంత శోకాన్ని  అక్షరాలలో  అందించిన  ఈ నవల కళాత్మక వలకు చిక్కని పాఠకులు ఎవరూ ఉండరు!


 రచయిత్రి హాన్ కాంగ్ మానవత సరిహద్దుల్లో వడలి రాలిపోయిన కుసుమాల గురించి, దౌర్జన్యాల పట్ల  కొందరు సైనికుల అయిష్టత  గురించి కూడా రాశారు. ఈ బాధామయ జ్ఞాపకాల వల్ల ఒక తల్లికి కాలం ఆగింది. మరొకరికి కాలం సాగుతూనే ఉంది .బాధితులు నిరంకుశ పాలనకు ఎదురుగా నిలబడ్డారు వారి కళ్ళు చివరి క్షణాల్లో చూసాయి దాడులు చేసే వారిని. క్షణాలు కళ్ళు తెరిస్తే హింస పుట్టింది.ఒకేసారి పోయినవారిది అదృష్టం. నవల  చివరలో రచయిత్రి మంచులో కూరుకుపోయిన సమాధుల  ముందర  కొవ్వొత్తులు వెలిగిస్తుంది. నవల లో చివరి వాక్యం: “ నేను చూశాను మూగగా చరిస్తున్న  జ్వాల అంచుల వైపు,  ఒక పక్షి కాంతిమయ రెక్కల్లా వెలుగుతున్న దాని వైపు.”


హాన్ కాంగ్ తన నోబెల్ ఉపన్యాసంలో ప్రేమ, హింసల గురించి తనలో సదా రేకెత్తిన ప్రశ్నలు గురించి చెప్పారు. ప్రేమ మన హృదయాల్ని కలిపే బంగారు దారమని చెప్పారు.తాను రాసేటపుడు మొత్తం శరీర భావనలు, అనుభూతుల తో తాదాత్మ్యం చెంది రాస్తానని , ఆ విద్యుత్ తరంగం పాఠకులను తాకినపుడు తాను  కదిలిపోతానని  హాన్ కాంగ్ చెప్పటం ఆమె విశిష్ట రచనా శైలి రహస్యం చెబుతుంది.


(published on 27 April, 2026 in Aneka in Telugu Prabha Daily)  

     


review of Ratri veestunna Gali by Mukunda Ramarao